పోస్టులు అభిప్రాయాలు 17 March 2010

కథలు సోయి | 03 డిసంబర్ 2006 11:36 pm

ఆ ఇల్లు మూతవడ్డది

- పెద్దింటి అశోక్ కుమార్

‘బాపూ… మక్కప్యాలాలే…’ఇల్లు దిగూటి దీపం

‘వద్దు బిడ్డ కడుపు నొత్తది.’

‘ఏం నొయ్యదే… అబ్బ కొనియ్యే… అమ్మా .. కొనియ్యే… ఊ… ఊ…’

‘పాప్‌కార్న్… గరం గరం పాప్‌కార్న్… పోతే దొరుకయి…’ బస్సులో అటూ ఇటూ తిరుగుతున్నాడు పన్నెండేండ్ల పిల్లగాడు. చేతిలో బుట్ట. బుట్ట నిండా ఆలూ చిప్స్, పాప్‌కార్న్ పాకెట్లు, ఏడుపు విని అక్కడే నిలబడి మరోసారి `పాప్‌కార్న్’ అన్నాడు.

ఈసారి తల్లి వైపు తిరిగి, ‘అవ్వా… కొనియ్యే.. ఒక్కటేనే… మల్లడుగనే…’ సీటు మీద నిలబడి తల్లిని కుదుపుతున్నాడు కొడుకు.

‘వద్దు బిడ్డ…. ఇంటికి పోయినంక బుగ్గలేంచిపెడత’ తల్లి సముదాయించింది. కొడుకు వినలేదు. రాగం తీయడం మొదలెట్టి నాడు. ముగ్గురునీ చూసి నవ్వుకుంటూ దగ్గరగా వచ్చి నిలబడి, ‘పాప్‌కార్న్… గరం గరం’ అన్నాడు అమ్ముకునే పిల్లగాడు.

కొడుకు రాగం ఎక్కువయింది. ధర్మయ్యకు కోపమచ్చింది. అమ్ముకునే పిల్లగాని వైపు కోపంగా ఇరుగ జూసి బుట్టలోంచి ఒక పాకెట్ను మునివేళ్ళతో తీసి కొడుక్కు ఇచ్చాడు. అదే చేత్తో అంగిజేబులోంచి రూపాయి బిళ్ళను తీసి పిల్లగానికిచ్చాడు.

బిళ్లను అటూ ఇటూ తిప్పి చూసి జేబులో వేసుకుంటూ ‘ఇంకో రూపాయి’ అన్నాడు పిల్లగాడు.

‘ఏంది? ఈ పొట్లంకు రెండ్రూపాయలా…? చారెడు లెవ్వు! అడ్డికి పావు శేరు అమ్మవట్టి’ పొట్లంను ఒత్తి చూస్తూ అన్నది దేవవ్వ. తల్లి చేతిలోంచి పొట్లంను గుంజుకుని పండ్లతో చింపాడు కొడుకు.

‘రెండ్రూపాయలు కాదు. వట్టిగనే ఇత్తరు’ ఎక్కసంగా అంటూ చేతిని చాపాడు పిల్లగాడు. ధర్మయ్యకు రేషమచ్చింది. అంగి జేబు బనీను జేబు వెదికి రూపాయి బిళ్లను ఇస్తూ, ‘నా పెరట్ల మక్కకర్ర మీద ఒక్క చిలుక బుక్కినన్ని కాదు’ అన్నాడు నవ్వు ముఖంతో, అతడి మాటల్లో ఆత్మాభిమానం వినిపించినా గొంతులో మాత్రం ఏదో నొక్కిపెట్టి వదిలిన బాధ.

ఇంతకుముందు ఎన్నో సార్లు పాకెట్లను చూసాడు ధర్మయ్య, ఇప్పుడు మాత్రం మనసు దేవినట్టుగా అనిపిస్తుంది. తన మాంసపు ముక్కలనే కోసి గోలిచ్చి అమ్ముతున్నట్టుగా… బాధగా, అసహ్యంగా అనిపిస్తుంది. కొడుకునే దగ్గరగా జరుపుకుని భార్య వైపు చూసాడు. ఆమె కూడా పాప్‌కార్న్ పాకెట్లనే చూస్తుంది బాధగా.

‘చూసినవా…? మన చేన్లనే పండిన గింజలు… ఎక్కడెక్కడో తిరిగి మల్లా మన నోట్లెకే వచ్చినయి. కాకపోతే పైసలు పెడుతున్నం… గంతే!’ భార్య వైపు చూస్తూ అన్నాడు ధర్మయ్య.

‘ప్యాలాల మిషిని కొన్నడా…?’ కిటికీలోంచి బస్టాండ్లోకి చూస్తూ అడిగింది దేవవ్వ.

‘కొనలేదు. గుత్తకు పట్టుకున్నడట. యాడాది దాటింది. అక్కడ మిగిలిన మక్కలను ఇక్కడికే తెచ్చిండట’ చెప్పాడు ధర్మయ్య.

దిగులుగా చూసింది దేవవ్వ. కళ్లల్లో ఏ బాధ కదిలిందో! కరిగి నీరయింది. భర్త కంట పడకుండా కళ్లు తుడుచుకుంది. తుడుచు కుంటూ, ‘పల్లికాయ పంట వేసినోళ్లను గూడా మనలెక్కనే ఆగంజేత్తడు’ అన్నది పొలం యాదికి వచ్చి.

అప్పటికి ఇంకా బస్సు నిండలేదు. ప్లాట్ఫారం మీద నిలబడింది. ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు. దిగేవాళ్ళు దిగుతున్నారు. ఈగలు ముసురుకున్నట్టు `పల్లీలు’ `అంటూ, `కంకులు’ అంటూ, `దోస కాయలు’ అంటూ అమ్మేటోళ్ళు బస్సు చుట్టూ ముసురుకుంటున్నారు. పోటీపడుతున్నారు.

ఇద్దరూ సీటు మీద బీరిపోయి కూర్చున్నారు. ఇద్దరి మనుసుల్లో సుడి తిరిగే బాధ ఒక్కటే! ఒకరి నొకరు అడుగాలనుకుని ఇష్టంలేక ఆగిపోతున్నారు. చివరికి తనే బయటపడింది దేవవ్వ.

‘ఎట్ల…? ఊర్లెకు పోతున్నము గని మనను ఉండనిత్తరా…? ఆరు నెలల జీతం ముట్టి. ఇప్పుడు ఇయ్యిమంటే యాడ నుండి తెస్తం. వచ్చి వారమన్న గడువకపాయె’ భయం భయంగా అన్నది. ఊర్లెకు వెళ్ళాక జరిగే పరిస్థితులను ఊహించుకుంటేనే భయమేస్తుంది ఆమెకు. సగం ఊరు సేటు చేతి కిందే ఉంది.

ధర్మయ్యకు రేషమూ, కోపమూ రెండూ పొడుచుకచ్చాయి. మొహం బిరుసుకుపోయింది. ‘ఉండనియ్యక సంపుతడా…? సంపేదాకపురస్తు. దుకాణంల జీతముండుడు అంటే వచ్చినగనీ పెండ అమ్ముడుకు వచ్చిన్నా! అదీ నా ఎద్దు పెండను నాతోనే అమ్మిత్తడా? వట్టిగ కాదు. ఆవుపెండ అని అవద్దమాడి అమ్మాలెనట’ బిరుసుగా అన్నాడు.

‘ఔ… అమ్మాలె. తవ్వెడు కైకిలు ఇచ్చినంక తంగేళ్లు పీకుమన్నా పీకాలె…’ కొత్త గొంతు వినబడింది విసురుగా అప్పుడే ‘… నువ్వచ్చిందే కైకిలికి. బిచ్చాని కచ్చి అంబిల్లు గరుత్తవా.’

అది విన్న గొంతే! భార్యాభర్తలిద్దరూ ఉలిక్కిపడి భయం భయంగా పక్కకు తిరిగి చూసారు. ఎదురుగా లింగయ్య సేటు. బగ్గున మండుతున్నాడు. మొఖం నిండా కోపం. ఇద్దరినీ గుంజుకపోదామా అన్నట్టునాడు.

‘చెప్పక చెయ్యక బస్సెక్కిండ్రు. ఇదేనా మునాసం. ఇయ్యంగ కట్టలకు కట్టలు అందుకున్నరు. ఇసాంటోడు ఎందుకచ్చిండు. నడుమల నన్ను పరిషాన్ జేత్తండు’ గాయి కెత్తుకున్నట్టు అన్నాడు.

ఇద్దరూ భయపడ్డారు. నోట్లే తడారి పోయింది. ముందుగా ఏం మాట్లాడలో అర్థం కాలేదు. అసలు అట్లా వస్తాడని కూడా అనుకోలేదు. చూస్తే కదలనియ్యడని కనిపించకుండానే బస్సెక్కారు. ఎలా పసిగట్టిండో అర్థం కాలేదు. దేవవ్వ భయం భయంగా ముడుచుకుని కూర్చుంటే ధర్మయ్యనే అన్నాడు నసిగినట్టు.

‘పరిషాన్ అయింది నువ్వా నేనా…? ఏం పనికి తోలుకచ్చినవు? ఏం పని జేపిత్తన్నవు? నీకు అమ్ముడుపోయిన్ననుకుంటున్నవా…?

అతడు పూర్తిగా మాట్లాడనే లేదు. అందుకున్నాడు సేటు. ‘నాకు నీతి లేదు. సరే! నువ్వు నీతి ఉన్న మనిషివే గదా… ? ఆరు నెలలు జీతముంటనని ఆరు వెయిలు ముందుగనే అడక్కున్నవు. నాయి నాకు ఇయ్యి. నీ జోలికత్తే పాత చెప్పుతోని కొట్టు’ నిలదీసినట్టుగా అన్నాడు దగ్గరగా జరుగుతూ.

బస్సంతా బొబ్బ. అందరూ లేచి నిలబడి చూస్తున్నారు. ఆ జనం గుంపుగా తయారయింది. భార్యాభర్తలిద్దరూ కూర్చున్నారు. ఇద్దరి మధ్యన కొడుకు భయంతో ఒదిగిపోయాడు. సేటు వాళ్ళకు అడుగు దూరంలోనే నిలబడ్డాడు.

‘ఇత్త… ఇయ్యకపోతే ఎగవెడుతనా…? ఇప్పటికిప్పుడు ఇయ్యమంటే నడుముకు ముడేసుకున్ననా! ఇంటికిపోయినంక ఇత్త’ తనకు తాను ధైర్యం తెచ్చుకుంటూ చుట్టూ బిడియంగా చూస్తూ అన్నాడు ధర్మయ్య.

‘ఇత్తవు ఇత్తవు. ఇంటికాడ ముల్లెగట్టి మూలకు దాచినవు. పోంగనే ఇడిసి కట్టగట్టిత్తవు. గట్ల ఇచ్చేటోనివైతే బజార్ల చెప్పదెబ్బలు ఎందుకు తిన్నవు. అప్పుడు నేను ఆదుకోకపోతే అయ్యగాని ఆట ఏర్పడుతుండె. పాపమని దగ్గరికి దీత్తే నా కిందికే నీళ్ళు దెచ్చినవు. అవన్నీ జెప్పకు. ఇత్తవా…?? ఇంటికత్తవా?.. ఏదో ఒకటి జెప్పు’ కోపంగా అన్నాడు సేటు. సన్నగా వణుకుతున్నాడు కూడా.

అసలే బక్క పల్చటి మనిషి ధర్మయ్య. సేటేమో కుంభకర్ణుడిలా సీట్ల మధ్య ఇరుక్కుపోయినట్టున్నాడు. అతడి ఆకారం, కోపం, బొబ్బ చుట్టూ చూస్తున్న జనం గుండె దడను పెంచింది. దేవవ్వనైతే అవమానంతో తలెత్తడం లేదు.

‘చెప్పు… ఇత్తవా!… ఇంటికత్తవా? రెండే ముచ్చట్లు’ సేటు రెట్టించాడు.

చుట్టూ మూగిన జనానికి ఏదో కొద్ది కొద్దిగా అర్థమైనట్టుంది. ధర్మయ్యను పారిపోతున్న దొంగను చూసిన్టుగా చూస్తున్నారు. వెనుక నుండి ఎవరో… ‘ఏ… కొట్లాట. ఏం కొట్లాట… కిందికి దిగుండ్రి. ఎక్కేటోళ్ళను ఎక్కనిత్తలేరు’ అన్నారు గట్టిగానే.

సేటు అడుగు కూడా ముందుకు కదల లేదు. తీక్షణంగా ధర్మయ్యనే చూస్తున్నాడు. ధర్మయ్యకు ఏం చెయ్యాలో తోచటం లేదు. కానీ ఏదో ఒకటి చేయాల్సిన అవసరముంది. భార్య వైపు చూసాడు. గుడ్లల్ల నీళ్ళు తిప్పుకుని మొహం మాడ్చుకుంది. తనే ధైర్యం చేసాడు.

‘నేను నీ ఇంటికి రాను. మన ఊరికి పోతున్న ఇంటికి పోయినంక నీ పైసలు నీకు లెక్కగట్టి ఇస్త. ఇక్కడ నువ్వు ఒర్రకు ఇజ్జత్ తియ్యకు’ మొండిగానే అన్నాడు గట్టిగా ధర్మయ్య.

సేటు ధర్మయ్య మాటలు వింటూనే, అతడిని అదిలిస్తూనే తమ మధ్య కుదిరిన ఒప్పందం గురించి పక్కవాళ్ళకు చెబుతున్నాడు. వాళ్ళు ‘అరే నిజమే అట్ల జేసుడు మూనాసమేనా’ అంటున్నారు. ‘జర నోట్లెవట్టి ఊంచుండ్రి. నా మీదికే ఎగవడుతుండు’ అంటున్నాడు వారితో వారు ధర్మయ్యను తలో మాట అంటున్నారు.

దేవవ్వ గుండె కలుక్కుమంది. ధర్మయ్య ఇనరానట్టే ఉన్నాడు. ‘జీతమున్ననని వీడు చెప్పింది చెయ్యన్నట. రేపు నాలుగు ఇండ్లు దోసుకురమ్మంటే దోసుక రావాలె గద’ అంటున్నాడు తనను తాను బలపరుచుకున్నట్టు.

‘ఏయ్.. చెప్పు… ఇత్తవా! వత్తవా! నన్ను ఒర్రియ్యకు. నిన్ను నమ్ముకుని వెయిల మాలు గుత్తకు నట్టుకచ్చిన, సప్పతుగ బస్సు ఎక్కితే ఎవలు మునుగుతడనుకున్నవు…’ సేటు ఎగపోతుండు. చెమటలు కక్కుతుండు. మొఖం గండు పిల్లి లెక్కయింది. గావు వట్టే బైండ్లోని లెక్క ఉగ్రం మీదున్నది. కండ్లు ఎర్రగైనయి. అతని రూపం చూసి చాలామంది భయపడ్డరు. దేవవ్వ జడుసుకుంది.

ధర్మయ్యకు భయం కాలేదు. తెగింపు వచ్చింది. సూటిగా చూస్తూ నిలబడి అన్నాడు. ‘ఐదు పైసలియ్య. నీ దమ్మున్న జాగల చెప్పుకో… ఇట్లనే ఒర్రితె లావట్టి బస్సు కింద ఎత్తేత్త. ఇక్కడిదిక్కడ ఇయ్యమంటే యాడి నుంచి తెచ్చియ్యాలె’.

‘పెండ్లాన్ని కుదవెట్టాలె. అంత రేషమున్నోనివి ఎందుకు జీతమున్నవు… సేటు అంటనే ఉన్నాడు. అంతవరకూ మౌనంగా కుమిలిపోయిన దేవవ్వ పక్కుమన్నది. తల్లిని చూసి కొడుకు ఏడుపును అందుకున్నాడు.

‘నన్ను గల్లవడుతావురా… నీ తల్లి …. నీ దమ్మెంత? ఐసతెంత?…’ సేటు చెయ్యత్తాడు సీట్ల సందుల ఇద్దరూ కలెవడ్డారు. చుట్టూ ఉన్న జనం ఇద్దరినీ నవ్వుతూ చూస్తున్నారు.

డ్రైవర్ ఎక్కినట్టున్నాడు. బస్సు చాలయింది. ‘ఏయ్… వాళ్ళిద్దర్ని కిందికి నూకుండ్రి’ కండక్టర్ అరిచాడు. చుట్టుపక్కలోల్లు ఇద్దరినీ విడదీసారు.

సేటు ఆగకుండా ఎగపోస్తూ తిడుతూనే ఉన్నాడు. ఎవరో అతడిని ముందుకు నెట్టుక పోయారు. ధర్మయ్య అయాసంగా సీట్లో కూర్చున్నాడు. దేవవ్వ దించిన తల ఎత్తలేదు. ఎగవడుతుంది.

సేటు బస్సు దిగుతూ దిగుతూ మంది నందరిని దులుపరిచ్చుకుని రెండడుగులు ముందుకు వచ్చి ఆగి, ‘నువ్వు ఊర్లెకైతె నడువు. నిన్ను గావు వట్టి మమ్మాయుండుత బిడ్డా… నీకు నిలువ నీడ లేకుంట జేసి ఉప్పుగాళ్ళు పుట్టకుంట చెయ్యకపోతే నా పేరు లింగమే కాదు’ చూపుడు వేలుసు ఊపుతూ అంటూ బస్సు దిగి పోయాడు.

ఇద్దరూ చాలా సేపటివరకు తేరుకోలేదు. అందరూ తమనే చూస్తూ నవ్వుతున్నట్టుగా అనిపించింది. చాలా సేపటివరకూ ఒకరినొకరు చూసుకోలేదు. మాట్లాడుకోలేదు. కిటికీలోంచి బయటకు చూస్తుండి పోయారు. బస్సు స్టేజి స్టేజికి ఆగుతూ సాగిపోతుంది.

‘వాడు ఊర్లెకు పోయినంక పంచాది పెట్టిత్తడు. బస్సు కంటే ముందే ఊర్లె చేరుతడు. మనం ఇంటికి చేరకముందే పంచాది బలిత్తడు. నన్నే కొట్టిండని తప్పుదీత్తడు. అగ్గెరగాండ్ల ఆరువెయిలు యాడ తెత్తాము? ఎట్లనన్న కాలిపోని… ఆరు నెలలు ఉందామా మరి? ఇప్పుడు ఉన్నా వద్దంటడు గని’ గొంతు పెకిలిచ్చుకుని అన్నది దేవవ్వ.

మొదటి నుంచి సేటును తిట్టిపోత్తనే ఉంది ఆమె. వాని అంటుకుపోవద్దని హెచ్చరిస్తనే ఉంది. పోగూడదనుకుంటూనే ఉచ్చులో చిక్కుకున్నట్టు సేటు వద్దకే పోతున్నాడు ధర్మయ్య. పరిస్థితులు అట్లా తయారవుతున్నాయి. చివరకు తనకు తాను అమ్ముడుపోయేవరకు, ఎప్పటికప్పుడు ఇదే ఆఖరుసారి అనుకుంటూ సాలీడు గూళ్ళో చిక్కుకున్నట్టయింది.

‘వాడు వద్దన్నా ఉండ. ఉండుమన్నా ఉండ. ఇయ్యల్ల పెండ అమ్ముమన్నడు. రేపు రోత తినుమంటడు. పాపపు ముండకొడుకు’ తెగాయింపుగా అన్నాడు ధర్మయ్య.

ఏదో స్టేజి, బస్సు ఆగి మళ్ళీ కదిలింది. కొడుకు జోగుతుంటే తొడ మీద పండుకోబెట్టుకుంది. ఊరు దగ్గరవుతుంటే ఇద్దరిలో భయం ఎక్కువైతనే ఉంది.

‘ఎట్ల మరి? మా అన్న దగ్గరకి పోదామా? ఇంతగాకున్నా ఇంతనన్న సదురుతడు. ఏదన్న పని జూపిత్తడు’ దేవవ్వ అన్నది.

‘అన్న లేదు. తమ్ముడు లేడు. ఎవ్వడు గాడు. వాల్లే పొక్కగాని పాములెక్క తిరుగుతుండ్రు. ఎకురం మడికట్టు ఉంటే అమ్మెదాక పట్టుపట్టె. నాగటి మీది ఎడ్లుంటే అవ్విటినీ కొనె. ఇగేముంది నా దగ్గర. ఏం జేసుకుంటడో చేసుకోని. పాణం తీత్తడేమో తియ్యని’ విరక్తిగా అన్నాడు.

దేవవ్వకు మరోసారి కళ్ళల్ల నీళ్ళు తిరిగినయి. మొదటి నుంచి ధర్మయ్య మొండి ధైర్యంతో ఉన్నాడు. ఆమెనే ఉండలేకపోతుంది. పొయ్యి మీది నుంచి మొదలైన గుత్తాధిపత్యం మెల్లెమెల్లెగా చేనుమీదికి… మనుషుల మీదికి ఎలా ముసురుకున్నదో ఆలోచిస్తుంది. పొయ్యిల బొగ్గులు, పండిన పంట, చేసిన పిడుకలు కూడా ఎలా అమ్ముడు సరుకయిందో ఆలోచిస్తుంది.

చెరుకు గండమాల తరిగి చెరుకు రసాన్నంతా పీల్చినట్టు మనుషుల్లో జీవశక్తి కోల్పవడం ఎప్పుడు, ఎక్కడ మొదలయిందో గుర్తుకు తెచ్చుకుంటుంది దేవవ్వ.

* * *

నాగటి సాళ్ళల్లో అడుగులు కూరుకుపోతున్నాయి. ఆయిటి మూనంగనే వాన. ఇరువాలు మూడు సాల్లు. మడికట్టు అల్లం లెక్కన పొతమయింది. దేవవ్వ గడ్డిపరుకలేరి కుప్పపోస్తుంటే ధర్మయ్య ఎత్తిపోత్తున్నాడు. భూమి కాక తీరినా వేడి తగ్గలేదు. దుక్కిలో కాళ్ళు సర్రుమంటున్నాయి.

‘ఇంకో వారం పది రోజులు ఆగుదాం తియ్యి. ఎవ్వలు దున్నుత లేరు. మన మొక్కలమే మక్క ఏత్తే క్కుకలు నక్కలకు సాలది’ నలేరుతూ అన్నది దేవవ్వ. రోణికార్తి. రోకండ్లు పలిగే ఎండ తల దిగసార చెమటలు.

‘నీకు తెల్వది మొత్తుకోకు. రోణిల మక్కలేస్తే రోకలి బండలోలె కంకులు పెడుతయి. ఇప్పుడు ఎంత ముందుగేస్తే అంత నయం. లేటుగా కాలమైతే చెరువు నిండే వరకు మక్కపంట కోత కత్తది’ ధర్మయ్య అన్నాడు.

దేవవ్వకి నిజమే అనిపించింది. ఒకసారి ఇట్లనే తన బలవంతం మీద పెసర అలికింది. వర్షాలు పడి చెరువులు నిండేవరకు పెసర పంట చేతి కచ్చింది. కానీ అంతలోకే ఒక అనుమానం. అది మడికట్టు బూమి వట్టి సాటకట్టు. రెండు వానలు లగాయించి కొడితే ఊటలు పుట్టి కుప్పలు గుడ్లు వెడతయి. వరుసగా వారం రోజులు ఎం కొడితే పర్రెలు వాసి చెక్కలు వడ ఎండిపోతది. వానలు ఎక్కువైనా, ఎండలు ఎక్కువైనా కష్టమే! ఎట్లా…? అనుకుంది. అదే మాట భర్తతో అన్నది.

‘నమ్ముకం తక్క సుట్టానికి సుఖం లేదట. నీకు అన్నీ అనుమానాలే. చేసినోడు చెడిపోతాడే! అటీటు జూసేవరకు తల జుట్టు కత్తది. రేపు కాలమైనా కాకున్నా వడ్లు పండినా పండకున్నా పొట్ట మందం ముక్కలు పండుతయి’ అన్నాడు కుప్పలు ఎత్తుతూ.

కొత్తగా అచ్చుకట్టిన పొలం. అద్దెకురానికి ఒక మడి చొప్పున చెరువులోలె రెండే మట్లు. ఎక్కడ గడ్డిపోస లేకుంటా చేసారు. మరునాడే సేటు దగ్గర ఇత్తునాలు తెచ్చాడు ధర్మయ్య. భూమి పదన తేలిపోకముందే ఇత్తనం పడాల.

‘నాలుగు రోజులు ఆగుదాం తియ్యి. మల్లొక్క వాన పడని పరం ఇత్తునాలు భూమిల పోసినంక ఎండలు మండిపోతే మొలుకులు మాడిపోతయి’ మరోసారి చెప్పింది దేవవ్వ అనుమానంగా.

ధర్మయ్య వినలేదు. ‘వాన పడితే భూమి గరిపడుతది. మళ్ళీ రెండు సాల్లు దున్నాలె. ఇప్పటికే ఎడ్లు కునుకుతున్నయి. నోరు లేని పశి కలగంటది’ నవ్వుతూ నాగలి కట్టాడు ధర్మయ్య.

ఒడిలో మక్కలు పోసుకుని వెంట నడిచింది దేవవ్వ. పురిసిట్లో గింజలు సాలులో పడుతున్నాయి. గింజ గింజనూ చేతివేళ్ళు తడుముతున్నాయి. చంటి పిల్లకు స్నానం చేయించి కాళ్ళు చేతులు తడి పెయ్యంతా తడిమినట్టు వేళ్ళ సందుల్లో ముక్క గింజలు తిరుగుతున్నాయి. చెమటను అద్దుకుంటున్నాయి. సృష్టికార్యంలో కొత్త సృష్టి కొరకు తండ్రి నుంచి తల్లిలోకి రాలిన భీజపు చుక్కల్లా మక్క గింజలు మట్టి పొరల్లోకి కూరుకుపోతున్నాయి.

సాలెనుక సాలు. సాలు సాలును కప్పుతుంది. కప్పని సాలును కాలుతో కప్పుతుంది దేవవ్వ.

‘ఇత్తులు బలే ఉన్నయి. బిళ్ళలకు బిళ్ళలు. బరువు గూడా బాగానే ఉన్నయి’ సాలెంట నడుస్తూ అన్నది.

‘మనమిచ్చిన పైసలు గూడా… రూపాయి తక్కువుంటే తీసుకోలేదు లింగయ్య సేటు’ నవ్వుతూ అన్నాడు ధర్మయ్య.

పైన ఎండ, కింద భూమి పెంకలా కాలుతున్నాయి. అటు భూమిలోంచి ఇటు శరీరాల్లోంచి తేమను బయటకు తియ్యాలని సూర్యుడు మండుతున్నాడు.

చెమటను కొంగుతో తుడుచుకుని బేలగా నవ్వుతూ ‘ఎండ పాడుగాను ఏ మెండ పాడైంది. కాళ్ళు సర్రుమంటున్నయి. లేచిన మొలుక లేచినట్టే మాడిపోయేట్టున్నది. మొలుగులు మీదే మచ్చు మైల లేదు’ ఎండమీది కోపంతో ఎండతోనే అన్నట్టుగా తన అనుమానాన్ని మరోసారి బయట పెట్టింది దేవవ్వ.

అది గ్రహించి ఎండతో అన్నట్టుగానే అన్నాడు ధర్మయ్య - ‘ఎండెనుక వాన, కుండెనుక గూన, మొగ లిడిసిన ఎండ మొగుడు లేని ముండ. ఇవన్నీ ఉన్నయే నాయె’ నవ్వుతూనే.

చుట్టూ చెట్టూ చేమ లేని బీడు భూములు మధ్యన దీక్షగా కదులుతున్న నాగలి. మట్టి పాదాలను ముద్దాడుతూ… పాదాల మట్టెలను ముద్దాడుతూ… నట్టింట్లో రాశులమై మొలుస్తామని మట్టిలో మాయమవుతున్న మక్క గింజలు. ఇది పోశమ్మ గింజ. ఇది మైసమ్మ గింజ… ఎల్లమ్మ గింజ అంటూ దేవతల పేర్లు పెట్టి భయం భయంగానే అయినా నమ్మకంగా జారవిడుస్తుంది దేవవ్వ.

పొద్దుగూకింది. మక్కేసుడయింది. మొగులు గుడ్డు కమ్ముకుంది. అది చూసి ధర్మయ్యకు బుగులు మొదలయింది. దేవవ్వకు దిగులు పట్టుకుంది. అటు ఇత్తనాలెయ్యంగనే ఇటు వాన కొడితే భూమి భరకట్టి ఇత్తును మొలువది.

వాళ్ళ బుగులుతో, దిగులుతో పనిలేకుండా రాత్రికి రాత్రే కుండపోత వాన కొట్టింది. ఇద్దరూ నెత్తికి చేతులు పెట్టారు. మూడు రోజులు గడిచింది. భూమి కయ్యలు గొట్టింది. పుండు మీద పక్కు గట్టినట్టు దుక్కమీద మట్టి పాద గడుసువారింది. ఎక్కడా భూమి పొక్కలేదు. మొలుక మొలువ లేదు. ఇద్దరి నాడులు సల్లవడ్డాయి. సేటు దగ్గరికెళ్ళాడు ధర్మయ్య.

‘ఆగం అక్కగాదు. కుడుంబుక్కగాదు. మొగులుకే నోరు తెరిచినట్టు అటు వాన పడ్డదో లేదో ఇటు ఇత్తున మేత్తివి. ఎట్ల మొలుత్తది. ఇత్తునాలు మంచియే! ఇంక నయమైంది. నేను గూడా దున్నిపిచ్చి ఏపిద్దామనుకున్న’ అన్నాడు సేటు మందలిస్తూ.

ధర్మయ్య పొలం పక్కనే పావు బిగెడు శీరుకుంది సేటుకు. గాండ్లోళ్లది బాకీ కిందికి మలుపు కున్నాడు. నంబరేకు ఇత్తునాలని మల్లా తీసుకుపోయి దున్ని అలుకుమని సలహా ఇచ్చాడు.

ధర్మయ్య వినలేదు. ‘పండితే పండె.. .ఎండితే ఎండే మల్లా ఏసేది లేదు’ అన్నాడు.

మట్టిలో రాలిన మక్క గింజల మీద నమ్మకం పోలేదు దేవవ్వకు. ఆనవాళ్ళు వెతుకుతున్నట్టు కెలుకుతూ ఆశగా చూస్తుంది. ధర్మయ్యనైతే ఆశను వదులుకున్నాడు.

వారం దాటింది. యుద్ధరంగంలోంచి పోరాడి కత్తి డాలు పట్టుకుని బయటకు వచ్చిన సైనికుల్లా ఒక్కొక్క మొలుక. భూమిలోనే వంకలు తిరిగి బయటకు వచ్చినయి. ఇచ్చిన మాట తప్పకుండా మొలకెత్తిన ప్రతీ మొక్కను చూపులతోనే తడిమి కొంకను అందుకుంది దేవవ్వ. తప్పిపోయిన బిడ్డ ఇంటికి వచ్చినంత సంబూరంగా ఉంది ఆమెకు. మొక్కలు లేని చోట తవ్వి మక్క లేసింది. లేచిన కర్ర చుట్టూ తవ్వింది.

మక్క లేచిన సంగతి వీళ్ళద్దరికంటే సేటునే ఎక్కువ సంతోషపెట్టింది. ‘అన్ని కాలాలను తట్టుకుని అన్ని రకాల భూముల్లో నీళ్ళు ఉన్నా లేకున్నా మొలిచే కొత్తరకం ఇత్తునం ఇది’ అని ప్రచారం చేస్తూ అప్పటికప్పుడు ధరను పెంచాడు. ఇచ్చిన ధర ఎవరికీ చెప్పకూడదని చెప్పడానికి ధర్మయ్య ఇంటికి వచ్చాడు.

దేవవ్వ పొయ్యి ముందు కూసుంది. పొయ్యి లంకలా మండుతుంది. చెప్పేది చెప్పినంక సేటు కన్ను మండుతున్న పొయ్యి మీద, కుప్ప జేసిన నిప్పుల మీద పడింది.

‘ఏందే దేవా… అడవినంత పొయ్యిలనే పెడుతున్నట్టున్నవు. సల్లార్పిన బొగ్గులను ఏంజేత్తవు’ అడిగాడు.

‘అంత బూడిదతైది. ఎత్తి అవుతల పారవోత్త’ నవ్వుతూ అన్నది దేవవ్వ.

‘నీ ఇగురమిచ్చుకపోను. బొగ్గులను సల్లార్పవు…? రేపటి నుంచి నీకు రోజుకొక్క రూపాయి ఇత్త. బొగ్గులను సల్లార్పి సంచిల పొయ్యి’ అన్నాడు.

తలూపింది దేవవ్వ. అప్పటికప్పుడు ఎట్ల సల్లార్పాలే… ఎట్ల తోడాలే… ఎక్కడ దాయాలేనో చేసి చూపించాడు. కాయకో ఏ కూరకో అయితయనుకుంది దేవవ్వ. పొద్దుమాపు బొగ్గులు సల్పార్పి సంచిల పోస్తుంది.

మక్కతో పోటీపడి గడ్డిగాదం లేచింది. ఎండలో ఎండి ఎండలోనే తడిసి పోటీపడి మునుములు పెట్టుకున్నారు. మునిగాళ్ళ మీద దుక్కనంతా తవ్వి గడ్డిని ఏరేసారు. మునుము మునుముకూ పంటను అమ్మి ఏం చేయాలో ముచ్చట పెట్టుకున్నారు. దేవవ్వ పాత బాకీలు తీసెయ్యాలంది. ధర్మయ్య ఒప్పుకోలేదు. పుస్తెలతాడు కొనాల్సిందే అన్నాడు.

‘కాలం ఇప్పుడైతే పునాస కాలమే ఐతుంది. కాని ముందట మురిపిచ్చి ఎనుక ఏడిపిచ్చినట్టు ఆఖరికి ఏం జేత్తదో! అసలు మక్కకు మగకు పగ. అయితే జాకేత్తది. లేకుంటే ఎండ గొడుతది’ బెగగా అంది దేవవ్వ.

‘ఏమన్నగాని, నశివనారాయణ. రెక్కలిరుగ కట్టం జేత్తున్నం. ముంచితె మునుగుతం. లేకుంటి పైకి వత్తం’ ధర్మయ్య అన్నాడు.

రెండు వారాలు గడిచాయి. మక్క మోకాలు ఎత్తయింది. ఎండకు ఎండ. సానుపు తడుపు వాన. మక్కకు తగిన కాలం. చుట్టు పక్కలోళ్ళు పునాస కాలమే అని తెలుసుకుని ముక్కలు వేసే లోపే ధర్మయ్య మక్క దున్నకాని కచ్చింది.

‘పండడుకో ఎండుడుకోగాని నీ మక్క మర్రనిత్తలేదురా! ఒక్కొక్క కర్ర మోకాలు దొడ్డుంది. ఈ పంటకు నీ దరిద్రం పోతది. రేటు కూడా బాగానే ఉంది’ ఒకనాడు ఇంటికి వచ్చి అన్నాడు సేటు, అప్పుడప్పుడు బొగ్గుల సంచి చూసిపోతున్నాడు.

‘మరి నీ పావు శీరుకల మక్కెయ్యవా సేటూ…’ అడిగాడు ధర్మయ్య.

‘గా దోతి బట్టంత శేరుకల ఏమెయ్యాలెరా! మీలెక్క ఎకురాల భూమి ఉందా! ఎన్నడన్న కాల్చుక తినడానికి ఇయ్యరా మీరు’ అంటూ పొయ్యి దిక్కు చూసాడు సేటు.

అన్నం కుతకుత ఉడుకుతుంది. నిప్పులు పొయ్యిలనే ఉన్నాయి. సేటు కండ్లు నిప్పులయ్యాయి.

‘ఏమాయెనే దేవా… మిమ్ముల్ని నమ్మి రోజు రూపాయి ఇత్తున్న. తట్టెడు బొగ్గులన్న జమ చెయ్యలేదు. ఇట్ల జేసినంక యాడైతయి’ అంటూ చెంబుతో నీళ్ళందుకుని పొయ్యిల పోసాడు. సుయ్యిమని పొయ్యి సల్లారింది. నీళ్ళు మడుగు గట్టినయి. పొయ్యి మీది అన్నం నామునాలు వడ్డది. పొయ్యిల బూడిది అన్నంల వడ్డది.

దేవవ్వ నోరెత్తలేదు. ధర్మయ్య గూడా నోరెత్తలేదు. బొగ్గుల పేరు జెప్పి రోజుల ఎనిమిది బీడీల కాతా పెట్టుకున్నాడు. ‘రూపాయి ఏంది? రోజు ఎనిమిది బీడీలు తీసుకుపో. బయట కూడా కొనుడే గదా!’ అని సేటే ధర్మయ్యతో ఖాతాపెట్టించాడు.

ఆ రోజు నుండి ఎన్నడూ మరిచినట్టు ఉండలేదు దేవవ్వ. పొయ్యి, పొయ్యిల అగ్గి తనది కాదని తెలిసినాక ఒక కొత్త బావన కలిగింది ఆమెకు. అగ్గినీ బొగ్గునూ తక్కట్లపెట్టి జోకినట్టు పొయ్యి మొత్తం సల్లారే దాకా వేరే పని చేసేది కాదు.

మక్క దున్నుకమయింది. వేర్లు తెగి వాడిపోయేలా దున్నాడు ధర్మయ్య. ఆడుకుంటున్న బిడ్డను చెంప పిండి, ఏడిపించి ఎత్తుకుని లాలించిన తల్లిలా ఇరిగిన కర్రలను, పెరిగిపోయిన కర్రలను ఎత్తి పట్టి చుట్టూ మన్ను కప్పింది దేవవ్వ. యాకాషి ముసుర్లకు కనుపులకాడ ఏర్లు పుట్టి మొద్దులోలె కర్రలు లేచినయి. దానితో గడ్డి పాయిలి కూర కూడా లేచింది.

‘తల జుట్టుయాళ. గడ్డి పీకాలె. మందు వెయ్యాలె. లేకుంటే కర్ర బలువది’ భర్తకు చెప్పింది దేవవ్వ. ఆమె మనసు నిండా మక్క కర్రలే! కర్రల చుట్టూ ఎన్నో ఆశలు గూడు కట్టుకున్నాయి.

‘ఈ ముసుర్ల మన ఇద్దరితో అయ్యే పనిగాదు. కైకిళ్ళు పెడుదాం’ అన్నాడు ధర్మయ్య.

చేతుల ఒక్క పైస లేదు. తిరిగి తిరిగి సేటు దగ్గరికే పోయాడు. దేవవ్వ సెయ్యి మీది నగలు పంటకొక్కటి మాయమైనంక కుదవెడుదామన్నా గురిజెత్తు మాలు లేదు.

సేటు అప్పు ఇయ్యననలేదుగానీ యూరియా బస్తాలు తన దగ్గర కొంటేనే అప్పు ఇస్తానన్నాడు. అవి కూడా ఉద్దెరనే కాబట్టి సరేనన్నాడు ధర్మయ్య. మక్క పంట మీద ఖాతా తెరిచాడు సేటు.

వారంలో గడ్డి పీకుడయింది. మందేసుడయింది. కర్రలను చూస్తుంటే ఇద్దరికీ కడుపు నిండుతుంది. ఏదో ఒక పని ఓదిచ్చకుని పొద్దుమాపు మక్కలోనే ఉంటున్నారు. కర్ర కర్రనూ తడిమి చూస్తున్నారు. తల జుట్టు మొలువగానే ఇరిసి కుప్ప వేశారు. మల్లోసారి మొలిచిన గడ్డిని కైకిల్లు పెట్టి పీకించారు.

వెన్నులోంచి మక్క పీసులు ఎలినయి. మరోసారి దుక్కిమసాల అందుకున్నారు. కర్ర కర్రకూ తమ కథను చెబుతూ, వెతను చెబుతూ వంగి మొదట్లో మసాలా వేత్తున్నారు. ఎన్ను దగ్గరి పీసును బూరును తడుముతున్నారు. చెట్టు లెక్కన మక్క పెరిగింది. సేటు దగ్గర ఖాత పెరిగింది. మనసులో ధైర్యం కూడా పెరిగింది. పంట పండుతుందన్న ఆశ కూడా పెరిగింది.

చుట్టూ మక్కలు మోకాలెత్తు కాలేదు. ధర్మయ్య మక్క కైలువారి కర్రకు రెండేసి మూరెడు మూరెడు పీసుల ఎల్లినియి. `అబ్బ ధర్మయ్యది మక్కనే మక్క’ అన్నరు. కాకులు చిలుకలు చేనుచుట్టూ సుట్టుకున్నయి. మక్కల రెండంతురాల మంచె వేసి జిట్టి బొమ్మను బెదురుపెట్టాడు ధర్మయ్య. అక్కడనే పొద్దుగూకి అక్కడనే తెల్లారుతుంది.

వానలు బందయి మెల్లె మెల్లగా కాలం గుంజుకున్నది. ఎండలు మండుతున్నయి. కర్రలు బీరిపోయినయి. దానికి తోడు పగటి పూట చిలకలు … కాకులు… రాత్రి పూట నక్కలూ… అడివి పందులు. నిద్ర లేదు. ఆగారం లేదు. అయినా రోజు గంపెడు పేసుల్ని ఏరి పోత్తుంది దేవవ్వ.

‘ఎట్ల…? కాలంల మన్నువడ. ఎంతపనిజేసే! నప్పుతుగ బొండిగె ఇరిసినట్టు జేసె. నీళ్లు లెవ్వని ఏడుద్దామా నిద్ర లేదని ఏడుద్దామా? చిలుకలు పాడుగాను కర్రలకే యాల్లాడుతున్నయి. పందులకు గత్తర్రాను కావలి గాత్తనే ఉంటిమి. యానంగ వత్తన్నయో! పొట్టు పొట్టు జేత్తున్నయి. చేను ఒంటిదయింది. తరువాయికి నాలుగుంటే ఇట్లగాకపోవును’ ఏడుస్తూ అన్నది దేవవ్వ.

వాన కొరకు ‘ఎట్ల… ఎట్ల’ అని ఇద్దరూ తొక్కులాడుతుండంగ సేటు శీరుకల బోరు బండి వచ్చి ఆగింది. తెల్లారే సరకల్లా బోరు, మోటరు, టెంపరరీ కరెంటు కనెక్షన్ … అన్నీ పూర్తయ్యాయి. పావు శీరుకలో సేటు బోరును ఎందుకేసిండో అర్థం కాకపోయినా ఏదో ఆశ మొదలయింది ధర్మయ్యకు.

మరునాడు రెండు తట్టల బొగ్గులైతే జమ చేసుకుని సేటు ఇంటికి నడిచాడు ధర్మయ్య. సేటు ముందుగా నీళ్ళు ఇయ్యనే ఇయ్యనన్నాడు. తరువాత బలవంతాన ఒప్పుకుంటున్నట్టు చెరిసగం పంట అన్నాడు. ధర్మయ్య గుండెల రాయి వడ్డట్టయింది. మనాదితో ఇంటికచ్చాడు. భార్యతో విషయం చెప్పాడు.

మరో రెండ్రోజులయింది. వాన జాడ లేదు. మక్క తెట్టె గీలేసింది. కనపడ్డోల్లంతా ఏదో ఒకటి అంటున్నారు. చుట్టు పక్కల మక్క చేనులున్నాళ్ళు సేటుతో ఏదో ఒప్పందం చేసుకుని నీళ్ళను తీసుకుంటున్నారు. క్షణం తీరిక లేకుండా బోరుకు గిరాకీ పెరిగింది.

‘ఏం జేద్దాం! నోట్లెకచ్చిన మక్క ఎండిపోవట్టె. వట్టిగ ఎండిపోతే ఏమత్తది. చెరిసగమైతే చెరిసగమేగాని. సగమన్నా మిగులుతయి. నీళ్ళు ఇయ్యిమను’ మక్కను సూడలేక తెగాయించి అన్నది దేవవ్వ. అప్పటికి అదే నిర్ణయానికి వచ్చాడు ధర్మయ్య. సేటు వాటం చూసి బోరును ఎందుకు వేసాడో అర్థమైంది.

భార్యాభర్తల్ని ఇద్దరినీ కూర్చోబెట్టాడు సేటు. ఇద్దరు ముగ్గురు రైతుల్ని కూడా జమ చేసాడు.

‘ఇగో… ధర్మా… నాకు ఎవుసం కొత్త. చేను మీదే అనుకోండ్రి. ఇప్పుడు ఎట్ల కావలి గాసిండ్రో అయిపోయేదాక అట్లనే కావలి కాయాలె. నేను సగమే పొత్తు. నేనెందుకపోతా… అంటే నడువది. ఏదో నీ గోస జాడలేక ఇస్తున్నగనీ నీ పంటనే రావాలె. నేనే బతుకాలె అని కాదు. అట్ల ఒప్పుకుంటేనే సరి. ఇంత వరుదాక అయిన లాగోడి … కట్టుకోవాలె’ అన్నాడు.

చేసేదేం లేక ఇద్దరూ తలూపారు. ఒప్పందం ఒకటికి పదిసార్లు చెప్పాడు సేటు. గవాయిలను కూడా పెట్టాడు. నీళ్ళను ఇడిసి పారిచ్చు కోమన్నాడు.

రెండు తడులు తిరిగినయి. మక్క మల్ల మొదటిలెక్కయింది. సోంటలోలె కంకులు. జొన్నిత్తులేసినయి. ఆడివి పందులు, నక్కలు ఎక్కువైనయి. చిలుకలు, కాకులు వశమైతలెవ్వు. పొలమంతా తాళ్ళు కట్టి ఊపుతున్నారు. డబ్బను అందుకుని ‘లే… లే… ఖడే… ఖడే….’ అంటూ కాకుల్ని, చిలుకల్ని తరుముతుంది దేవవ్వ.

కర్రలన్నీ తనయనుకున్నాక… కలిగిన భావన, ఇప్పుడు సగం కర్ర తనయి కావని తెలిసినాక కలిగిన భావన పొయ్యితో కలుపుకుంటే ఏదో దూరపు తనం ఏర్పడుత్నుట్టనిపించింది దేవవ్వకు. ఇంట్లో పొయ్యిని చూసినా, అడవిలో పొలంను చూసినా ఏదో అంటరాని వస్తువుని చూసినట్టుగానే అనిపిస్తుంది. పొలంలో తిరుగుతూంటే తనకు తాను ఒంటరిగా తెలియని జాగలో తిరుగుతున్నట్టనిపించింది.

ఈ భావన రోజురోజుకు ఎక్కువైతుంటే కావలి కాయడం మానేసింది ఒకనాడు దేవవ్వ. అదే రోజు సేటు మక్కలోకి వచ్చాడు. కాకులు, చిలుకలు వాలడం చూసి నలుగురినీ పిలిచి చూపించాడు. ఇంటికి పోయి లొల్లి లొల్లి జేసాడు. రెండు మూడు సార్లు రాత్రిపూట గూడా కావలి పోతుండా లేడా చూసాడు. ఇంట్లో పడుకుంటే అదిలిచ్చాడు.

కంకులు ముదిరినయి. బుక్కే తట్టయినయి. భయానికి రాత్రి పగలు కావలి కాస్తున్నారు భార్యాభర్తలు. రాత్రిపూట ఒకనాడు ఒడ్డు మీది నుంచి జారి పడ్డడు ధర్మయ్య. దవాఖాండ్లకు పైసలు గావలె. ఆడుగకముందే అప్పు ఇచ్చాడు సేటు, డెబ్బ చిన్నదే కాబట్టి రెండు మూడు రోజుల్లోనే కోలుకున్నాడు.

ధర్మయ్యను ఒకనాడు పిలిపిచ్చి లెక్క జూసాడు సేటు. కైకిళ్ళ పైసలు, మందు బస్తాలు దవాఖాన పైసలు… అప్పుడప్పుడు చేపోయి పైసలు.. . ఇంట్లకు చిల్లర ఖాతా… మొత్తం మూడు వెయిల బాకీ జమయింది. పద్దు పద్దుకూ పేరు జెప్పి ధర్మయ్యతోనే జమ చేయించాడు.

‘అరే ధర్మా… మన చేను మంచిగ పండితే ఎన్ని ముక్కలైతయో చెప్పరా’ లెక్క తర్వాత అడిగాడు సేటు. పక్కన ఇద్దరు ముగ్గురు రైతుల్ని కూడా కూసోబెట్టుకున్నాడు. అట్లా ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాలేదు ధర్మయ్యకు.

‘పన్నెండు పదమూడు కింటల్లు అయితయి’ లెక్క గట్టి చెప్పాడు ధర్మయ్య.

‘పదమూడు అనుకుందాం. నువ్వు చెప్పిందే ఇంటున్న. నీ వంతుకు ఎన్ని కింటళ్ళు వత్తయిరా’ అడిగాడు.

అప్పటిగ్గాని ధర్మయ్యకు పూర్తి విషయమేంటో అర్థం కాలేదు. బాధతో గుండె బరువెక్కింది.

‘ఆరున్నర’ అన్నాడు గొంతును పెంచింది.

‘ఇప్పుడు కింటలుకు నాలుగు యాభయే నడుత్తంది. గరీబు గానివి. ఐదు వందల లెక్క కడుదాం. ఆరు కింటాళ్ళ సరుకు ఎంతయితయి’ సేటు అడిగాడు.

ధర్మయ్య సమాధానం చెప్పలేదు. నేల గీతలు గీస్తూ బీరిపోయాడు. పక్కనున్న రైతు మాత్రం టక్కన లెక్కగట్టి,’ మూడు వెయిల రెండు వందల యాభై… ఇంకేంది మంచిగనే కట్టినవు’ అన్నాడు.

‘వారీ ధర్మా…. చెరిసగం పంట నువ్వు ఒప్పుకున్నదే! ఇండ్ల అవద్దం ఉంటె చెప్పు. రేపు కోత కోపియ్యాలె. మక్కలు ఒలిపియ్యాలె. నాలుగైదు వందల కైకిళ్ళు అయితయి. అందులో సగం నువ్వు పెట్టుకోవాల్సిందే. కానీ నేను అడుగుత లేను. మూడు వెయిలు నాకు బాకీ ఉన్నవు. ఎవ్వీటికవ్వి తేరిపోంగ రెండు వందల యాభై తేలిన. ఇగో తీసుకో….’ మూడు నోట్లను అందించాడు సేటు.

ధర్మయ్యలో ఏ భావమూ లేదు. దించిన తల ఎత్తలేదు. లెక్క సరిగానే ఉన్నదనిపిస్తుంది. ఎక్కడో మోసం జరిగినట్టనిపిస్తుంది. నాలిక సందుల ముల్లు ఇరికినట్టు ఎటు మాట్లాడుదామన్నా సందు దొరకుతలేదు. నోట్లను అందుకొని ఇంటికి వచ్చాడు. లెక్కనంత దేవవ్వకు చెప్పి ముడుసుక పన్నాడు. దేవవ్వ మనసు కలికలయింది. అట్లనే మడుసుక పన్నది. కన్నీళ్ళతో మెత్త నానింది. సగమే పోయిందనుకున్న మక్క చేను ఇప్పుడు మొత్తం పోయింది.

మరునాడు పొద్దుగూకే ముందు ఇంటికి వచ్చాడు సేటు. భార్యాభర్తలిద్దరూ మాట్లాడలేదు. కావలి పోలేదని అడుగుతడేమో నాలుగు దులుపుదామనుకుంది దేవవ్వ. కాని అట్లా అడుగలేదు సేటు.

‘రేపు ఒక కైకెలి మనిషి గావాలె. నలుపై రూపాయలిత్త. కంకుల కాల్చి అమ్మాలె. రమ్మంటే మత్తుగత్తరు. మీరు రానంటే వేరోల్లకు చెబుదామనుకుంటున్న’ అన్నాడు పొయ్యి దిక్కు బొగ్గుల సంచి దుక్కు చూస్తూ.

ఎవరూ బదులు చెప్పలేదు. సేటు బొగ్గుల సంచితో వెళ్ళిపోయాడు. చాలా సేపటికి ‘వట్టిగ ఉండి ఏం జేత్తవుపో’ అన్నది దేవవ్వ.. ‘నువ్వే పో’ అన్నాడు ధర్మయ్య. నువ్వంటే నువ్వననుకొని చివరికి ధర్మయ్యనే వెళ్ళాలని నిశ్చయించుకుని పోయి చెప్పివచ్చాడు. ఆగమైన పిల్లి కూనల్లా ఇద్దరు అటూ ఇటూ తిరుగుతున్నారు.

ఇద్దరికీ రోజూ ఉండే ఆగం లేదు. చేను ఏమైపాయెనో అన్న రందిలేదు. కర్రల మీద ప్రేమ లేదు. తెల్లారంగనే సేటుతో మక్కలకు పోయాడు. మక్కను చూస్తుంటే తుపాకి గొట్టాలను చూస్తున్నంత భయమేసింది. సేటు ఒడ్డు మీద కూసుంటే సంచి నిండా కంకులు ఇరిసాడు. భూమి తనదే. కష్టం తనదే.. పంట మాత్రం తనది కాదు. ఏడుపచ్చింది.

తట్టెడు బొగ్గులు… సంచెడు కంకులు. మూడు తొవ్వల కాడ కూసున్నాడు ధర్మయ్య. చిట్ట చిట్ట ఏగుతున్న కంకులు పట్టపట్ట అమ్ముడుపోతున్నాయి. కంకుల్ని లెక్క జేసి ఎంతెంతకు అమ్మాలో ముందుగల్లనే లెక్క జెప్పాడు సేటు. పైస ఫరకు రాకుండా కాల్చి అమ్ముతున్నాడు ధర్మయ్య. పది పైసలు ధర తగ్గిస్తలేడు.

బజారు ముంగటనే తన ఇల్లు. కొడుకు కంకులని ఏడుస్తున్నాడు. తల్లి కొడుతుంది ఆ కంకులు ఋక్కే బదులు ఇసం తిని సావు అంటుంది. తల్లిని ఇడిపిచ్చుకొని కొడుకు బయటకు ఉరికత్తుండు. ఉరికచ్చిన కొడుకును లోపలికి తీస్కపోయి తలుపేసుకుంటుంది దెవవ్వ. కాలుస్తున్న కంకుల వైపు కన్నెత్తి చూస్త లేదు.

ధర్మయ్యకు కాటికాపరికి అమ్ముడుపోయిన హరిశ్చంద్ర మారాజు యాది కచ్చిండు. కాలే బొగ్గు నాది. కాల్చే కంకి నాది. అమ్మేది నేను. సేటు ఎక్కడ సొచ్చిండు…? ఎక్కడ ఎల్లిండు? ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తుంటే మంట పుట్టుకచ్చింది. అర్ధరాత్రి పూట దొంగతనంగా పదిరువై కంకుల్ని ఇరుసకుని ఇంటికి పోయాడు అదే రోజు.

కంకి వైపు కాదు గదా… దాని వాసన కూడ చూడలేదు దేవవ్వ. పాముల బుట్టను చూసినట్టుగా చూసి దరిదాపులకు పోలేదు. ధర్మయ్యనే దొంగతనంగా కాల్చుకుని కొడుక్కు ఇచ్చి తను బుక్కాడు. ఇవి బుక్కాలంటే కూడా భయం. కొడుకునే అర్రలతోలి బుక్కినంక గాని బయటకు పంపలేదు. కంకులు అయిపోయేదాకా దడదడ తగ్గలేదు.

సేటు మక్క చేన్లో దుకాణమే పెట్టాడు. పచ్చి కంకులను కాల్చి అమ్మడమే కాదు. సిరిసిల్ల, కామారెడ్డి మార్కెట్లకు సరఫరా చేసాడు. కల్లు దుకాణం ముందు, మార్కెట్లో పొద్దు మాపు కంకుల తౌటు పెట్టించాడు.

ధర్మయ్యకు వారం కూలీ దొరికింది. చూస్తుండగానే మక్క ఖాళీ అయినది. పచ్చి కంకులు అడ్డికి పోవుశేరు అమ్ముడు పోయినయి. అడికొకటి ఈడికొకటి ముదిరిన కంకులుంటే బూరుదీసి ఒలిపిచ్చి పాప్‌కార్న్ మిషనికి పంపించాడు సేటు.

ఎడ్లకు గడ్డి లేదు. కంకులన్నీ అయిపోయినాక సొప్ప కోసుకుందామని సేటుకు కలిసాడు ధర్మయ్య.

‘సొప్పల నాది సగం ఉండదారా… నా సగం నా కియ్యి’ అన్నాడు సేటు కానూన్గా.

‘అదిగోజలు తినేది. నాకు రెండు ఎడ్లున్నయని అడుగుతున్న. నువ్వేం చేసుకుంటవు?’ అడిగాడు ధర్మయ్య.

‘తీసుకుంటె తీసుకోగని… ఆ ఎడ్ల పెండ ఇయ్యి’ అన్నాడు సేటు.

ధర్మయ్యకు కోపం ఆగలేదు. ‘పెండ ఎందుకు? తింటవా?’ అన్నాడు బిరుసుగా.

సేటు పకపక నవ్వి ‘పిడుకలురా… పిడుకలు చేసుకుంటం’ అన్నాడు. పెండనే కదా అని ధర్మయ్య `సరే నన్నాడు. రోజూ పొద్దున ఎడ్ల పాకల కచ్చి సానుపుకు మిగిలియ్యకుంట తీసుకుపోయేవాడు. ఎన్నడైనా తట్టకు తక్కువైతే మీరే తీసుకున్నారని లొల్లి చేసేవాడు. పొయ్యి మీద నుంచి పంట మీదికి, పంట మీది నుంచి పెండ మీదికి మారింది సేటు చూపు.

ఒక రోజు పొలంలో మళ్ళీ పల్లి పంట వేసుకొమ్మని సలహా ఇచ్చాడు సేటు. ధర్మయ్య వినలేదు.

‘ఏం పని జెయ్యక ఎట్ల బతుకుతవురా… పల్లీ ఏసుకో. మంచి పంటస్తది’ అన్నాడు సేటు సముదాయిస్తూ.

‘నా యిష్టం. గోటీలాడుకుంట. నీ కెందుకు?’ ధర్మయ్య ఎక్కసంగా అన్నాడు. సేటు నవ్వుకున్నాడు.

మరునాడే పాత బాకీలోళ్ళు ధర్మయ్యను ఒత్తిడి చేసారు. కాదు కక్కుసం బాకీ కట్టాలన్నారు. వాళ్ళ వెనుక సేటు ఉన్నాడన్న నిజం తెలిసిపోయింది ధర్మయ్యకు. పొలంను వాళ్ళకే కుదువపెట్టాడు. ఎడ్లను మాత్రం అంగడికి కొట్టాడు.

‘అరే ఎడ్లను ఎట్లమ్ముతవు. మన పెండ పొత్తులేదా?’ అంగట్లకు ఎదురచ్చి యాది జేసాడు సేటు.

‘అయితే నువ్వే కొను. బజారు ధర’ చెప్పాడు ధర్మయ్య.

ఎడ్లను కొని పొలం రైను పెట్టుకున్నోళ్ళకు ఇచ్చాడు సేటు. మరునాడే పల్లీ ఇత్తునం పడింది ధర్మయ్య పొలంలో.

‘మనల్ని ఇడిసిండు. వాళ్లను పట్టిండు. రక్తం తాగుతడు పిచాచి ముండకొడుకు. వాని మొదలార’ దేవవ్వ సొపెన పెట్టి సోకం పెట్టింది. ధర్మయ్యకు కూడా ఏడుపచ్చింది. దొంగతనంగా వెళ్ళి పొలాన్ని చూసి వచ్చాడు.

అన్నీ ఉన్నయె! తన చేతుల మీది నుండి జరిగినయే! ఎక్కడా మోసం జరుగలేదు. కానీ ఎక్కడో ఏదో జరిగింది. ఒక్కొక్కటీ తన నుండి దూరమైనవి. తను మెల్లెమెల్లెగా ఆక్రమించబడ్డాడు ఎట్లా…? అన్న ఆలోచనల్లో పడ్డాడు. ఇక్కడ బతుకు దెరువు లేదు. ఎటన్న పోవాలె అనుకున్నంతలనే మల్లా సేటు నుండి పిలుపు.

వద్దనుకుంటూనే వెళ్ళాడు ధర్మయ్య. ఇంట్లోకి అడుగు పెడుతుంటే సాలెగూడు యాది కచ్చింది.

‘వారీ.. ధర్మా నీ పెండ్లాం అందరితోని సేటు మమ్ముల్ని ముంచిండు అంటుందట. ఏం ముంచినమురా….? నీ దేమన్న గుంజుక తిన్నమా…?’ బీడి కట్ట అగ్గిపెట్టె అందిస్తూ అన్నాడు సేటు.

వద్దనుకున్నా మనసు బీడి పైకి గుంజింది. కట్టను అందుకుని మౌనంగా బీడీ ముట్టిచ్చాడు.

‘కామారెడ్డిల మాకు దుకాణముంది. దుకాండ్ల పనుంటది. నెలకు వెయ్యి రూపాయలిత్త. ఆరు నెల్ల జీతం ముందుగల్లనే ఇత్త. వస్తనంటే జెప్పు. అక్కడ చెప్పిన పని జెయ్యాలె మరి’ అన్నాడు.

ధర్మయ్యకు మంచిగనే అనిపించింది. ఇప్పుడే గాదు. ఎప్పుడైనా సేటు ముచ్చట జెప్పుతుంటే న్యాయమే అనిపిస్తది. చివరికి ఏదో కిరకాట్కముంటది. ఇందులో గూడా ఏదన్న మోసముందా అని ఆలోచించాడు.

ధర్మయ్య మౌనంగా ఉండడం చూసి, ‘ఇప్పుడు గాకపోతే రేపు జెప్పు. ఇంట్ల గూడా ఆరుసుకో. ఎనుకశీరి ఇట్లనా అట్లనా అంటే నడువది’ అన్నాడు సేటు ఖచ్చితంగా.

ఇంటికి వచ్చి భార్యతో చెప్పాడు ధర్మయ్య. ఆరు నెలల జీతం అడ్వాన్సుగా ఎందుకిస్తున్నాడో అర్థం కాలేదు.

‘వాని కంట్లె మన్ను వాడ. ఆఖరికి మనం మిగిలినమేమో… అట్ల గూడా కొంటనన్నాడా? బాగా మండుతుందని పొయ్యిని గొన్నడు. మంచిగ పండుతుందని పంటను గొన్నడు. ఇంటి ముంగిట పచ్చ గుందని పెండగొన్నడు. ఇప్పుడు నిన్ను గొంటడు. రేపు నన్ను కొంటడు…’ పక్కున పలిగింది దేవవ్వ.

భార్యను సముదాయించి ఆరు వెయిలు తీసుకున్నాడు ధర్మయ్య. పాక లాంటి ఇంటి గూనను ఉరువకుంటా సదిరిచ్చాడు. ఆరు నెలల గాసం కొనిపెట్టాడు. చిల్లర ఖర్చులకు భార్యకు కొంత ఇచ్చాడు. అక్కడిక్కడ చేతి బదల్లుంటే తీర్చేసాడు. వారానికొకసారి వచ్చి చూసి పోతానని భార్యకు చెప్పి సేటుతో కామారెడ్డి బస్సు ఎక్కాడు.

వారం రోజులు వట్టిగనే ఉన్నాడు. తెల్లారితే డ్యూటీ మీదికి ఎక్కుడు. ముంగట పిడుకల రాశి ఉంది. అది తన ఎడ్ల పెండనే అని తెలుసు ధర్మయ్యకు. ఏం జెయ్యాలో ముందుగా అర్థం కాలేదు. చిన్న రేకుల షెడ్డు ఉంది. ముంగట బ్యానరు ఉంది.

‘ఏం లేదురా… ఈ పిడుకల్ని నీళ్ళతో తడిజేసి పెండ జెయ్యాలె. ఇప్పుడు కార్తీక నోములున్నయి. కోటి కుంకుమార్చన పండుగుంది. నెల్లాల్ల సీజను. ఇక్కడ ఆవు పెండ దొరుకది. దీనినే ఆవు పెండ అని నువ్వు అమ్మాలె. ఈ పని మా కొడుకో, మనుమడో జేత్తుండె. వాళ్ళు రైతుల్లెక్క ఉండరు గదా… వాళ్ళ మాటలు జనం నమ్మరు. నువ్వుయితే ఇది నా దొడ్లె పెండనే అని చెప్పచ్చు’ సేటు వివరంగా చెప్పాడు.

ధర్మయ్య తల తిరిగపోయింది. `చివరికి వీడు నా రైతుతనాన్ని కూడా అమ్మకానికి పెట్టాడే’ అన్న విషయం జీర్ణించుకోలేకపోయాడు. ఆరు నెలల జీతం అడ్వాన్సుగా ఎందుకు ఇచ్చాడో అర్థమయిందిప్పుడు. తనను గుత్తకు కొని ఆరు నెలలు నోరు మూయించి ఇష్టమున్న పని చేయించాలనుకున్నాడు.

‘నీకు నీతి లేకపోవచ్చు. నా కుంది. ఎండిన పిడుకల్ని ఆవు పెండని అమ్మలేను. అవద్దమాడలేను. ఒకలను మోసం జెయ్యలేను’ ధర్మయ్య అన్నాడు ఖచ్చితంగా.

‘నువ్వు నా మనిషివి. ముందుగల్లనే చెప్పిన. అప్పుడు సై అన్నవు. ఇప్పుడు కిర్ కిర్ వెడుతున్నవు’ అన్నాడు బెదిరిస్తూ సేటు.

వారం దాటినా రాని భర్తను చూడడానికి అదే రోజు కామారెడ్డి వచ్చింది దేవవ్వ కొడుకుతో. ధర్మయ్య భార్యకు విషయమంతా చెప్పాడు. చెప్పాచెయ్యకుండ ఇద్దరూ బస్సెక్కారు.

* * *

బస్సు ఆగింది. కుదుపుకు ఇద్దరూ ఉలిక్కిపడి చూసారు. మతనూరే! ఎప్పుడు ఎక్కడ దిగిపోయారోకాని… బస్సు పూర్తిగా ఖాళీ అయింది.

కొడుకును భుజాన వేసుకుని కిందికి దిగాడు ధర్మయ్య. వెంట దేవవ్వ దిగింది. చీపురు నెత్తి. ఉబ్బిన కండ్లు. ఏండ్ల కొద్ది జరమచ్చి పన్నట్టయింది. ఎక్కడానికి చాలామందే ఉన్నారు.

కిందికి దిగుతుంటే గుండెల దప్పు లేగినయి.

‘ఆగో… పని దొంగ ధర్మడు రానే వచ్చిండురా’ మందిలోంచి ఎవరో అన్నారు.

‘వీడు యాడ పోగు వొయ్యడు. రేపు ఆరు వెయిలు ఎట్లగడుతడో’ ఇంకెవరో.

‘ఒక్క ఆరు వేయిలేనా? చెప్పుదెబ్బలు.. దండుగు, జురుమాన లేదు’ జనంలోంచి మాటలు.

‘ఎంత కావురంగాకపోతే అన్నం బెట్టినోనికి సున్నం బెడతాడురా… సేటునే కొట్టిండట’

ధర్మయ్య ఎటూ చూడలేదు. మందిని పాపుకుంటూ విననట్టే బయటకు వచ్చి ఇంటి వైపు నడిచాడు. విషయం తన కంటే ముందే ఊరు చేరుతుందని ఊహించినదే.

తొవ్వ పొంట పోతుంటే నలుగురు నాలుగు రకాల మాటలు. భార్యాభర్తలిద్దరూ పులుకాశులోలె మొకం చూసుకున్నరు. దొంగతనం చేసినట్టు భయం భయంగా ఇల్లు చేరుకున్నారు.

దేవవ్వకు ఇప్పుడు భర్త ఎక్కడ బెంగటిల్లి మనసు సెంచరిల్లుతడో అని కొత్త భయం మొదలయింది. అతడిని మాటల్లోకి దింపడానికి ప్రయత్నించింది. ధర్మయ్య పెదవి కూడా విప్పలేదు. రాయి లెక్కనే కూసున్నాడు. దేవవ్వకు ఇంకింత భయమేసింది.

పొద్దు గూకింది. బయట రకరకాల మాటలు వినపడుతున్నాయి. సేటు పెద్దమనుషులను జమచేస్తున్నాడని ఒకరు, పోలీస్ ఠాణాకే పట్టిత్తడట అని ఒకరు… నానా రకాల మాటలు. మొత్తం మీద అందరి గొంతుక ఒక్కటే!

‘ధర్మానికి కావురమా! కరువుల కాలంల ఊరును ఆదుకునే సేటునే కొడుతడా! ఇంకొకనికి బుద్ధి వచ్చేటట్టు గట్టి శిక్షనే ఎయ్యాలె గాడిది కొడుక్కు’ అని.

తెల్లారింది.

ఊరు పంచాదికి తయారయింది. చిన్న పెద్దను సేటు ఎగేత్తున్నాడు.

ధర్మయ్య ఇంటికి మాత్రం తాళం కప్ప యాలాడతుంది. ఎప్పుడూ పచ్చగా సానుపు జల్లి ముగ్గులేసే వాకిట్ల పొక్కిలి లేచింది.

2 అభిప్రాయాలు

  1. on 08 జులై 2009 at 8:39 am 1.రాజేశ్

    అన్న అశోకన్న! నీ కత మంచిగుంది. తెలంగాణను కాలం మోసం చేసే, కోమట్లు జనాన్ని ఎట్లా మెల్లిగ, సప్పుడు కాకుండా మోసం చేస్తరో కరక్టుగా కండ్లకు కట్టెటట్లు వివరించినవే.

  2. on 13 జనవరి 2010 at 3:42 am 2.ramnarsimhareddy

    మస్తుగు0ది.

    08680-275125

Trackback This Post | Subscribe to the comments through RSS Feed

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో