మన సంస్కృతి & వ్యాసాలు సోయి | 02 డిసంబర్ 2006 01:20 am
తెలంగాణ జానపద కళాకారుల ‘గణనాయక ప్రార్థనలు’
- రంగురాజు పాపయ్య
(కుల, మత, ప్రాంత, వర్గ, వర్ణ, దేశ, భాష, కలిమి, లేమి, సజ్జన, దుర్జన, స్వ, పర, తరతమ భేద భావనలు లేకుండా గణనాయకుడు కాపాడగలడనే నమ్మకంతో ప్రార్థనలు చేసే ఆయా జానపద కళాకారుల సహృదయతకు నమస్కరిస్తూ….)
జానపదవృత్తి కళాకారులు ఎందరో మన రాష్ట్రంలో, దేశంలో ఉన్నారు. ఏ మారుమూల గ్రామాల్లో ఉన్నా, ఆయా కళాకారుల కళాప్రదర్శనల్లో మొట్టమొద గణనాయక ప్రార్థన ఉంటుంది. అందరకూ శుభం జరగాలనే తపన కళాకారుల గళాల్లో కదలాడుతూ ఉంటుంది. ప్రజలందరూ అనుకున్న కార్యక్రమాలు నిర్విఘ్నంగా, నిరాటంకంగా కొనసాగాలని ఈ గణనాయక ప్రార్థనలు చేస్తుంటారు. భారతీయ సనాతన సంప్రదాయాల్లో భాగమైన గణనాయక ప్రార్థనతో ఏ పనినైనా ఆరంభించడం కనబడుతుందనేది, అందరకూ తెలిసిందే. లోకకళ్యాణ కాంక్షతో ఆయా కళాకారులు వినాయక లేదా గణనాయక ప్రార్థనలతో తమ కథలను, కథాగేయాలను, యక్షగానాలను ప్రారంభిస్తారు. ప్రతి సంవత్సరం భాద్రపద శుక్ల చవితి / చతుర్థినాడు గణనాయక ప్రార్థనలు లేదా పూజలు జరుపుకునే నేపథ్యంలో వినాయకుని గొప్పతనాన్ని గూర్చిన విషయాలు, జానపద కళాకారుల గళాల్లోంచి ఎలా జాలువారుతాయో, ఆయా కళాకారుల కాంక్ష ఏమిటో తెలియజేయటమే ఈ వ్యాసోద్దేశ్యం.
‘గౌడ జెట్టీలు’ అనే ఉపకులం వారు గౌడకులాన్ని ఆశ్రయించి కథలు చెపుతారు. యక్షగాన సరళిలో సాగే వీరి కథాగాన ప్రారంభంలో, ఈ క్రింది విధంగా గణనాయక ప్రార్థన చేస్తారు.
‘ఓ గణనాయకా, ఓ శుభదాయకా
బాగుగా నిన్నునే ప్రస్తుతి జేసెదా || ఓ ||
భోగు భూషణ సుధా బోవసుధా గుణయిత
సాగిలీ మొక్కెదా సవరించుముమము || భో ||
గజ్జెలందియలు ఘల్లునమ్రోయ -
బొజ్జయునను దయతో మము బ్రోవగా రావే
ఈ చరితంబును నెప్రకటించిన
సూచన చేయరా శుభకర జయమున
వెంకటేశ్వరుని మిత్రుని తనయా
సంకటముల నెడ పాపరా వినరా || ఓ ||
వీరి ప్రార్థనలో వేంకటేశ్వరునికీ, ఈశ్వరునికీ మిత్రత్వమనే గొప్పను ఆపాదిస్తూ, ఈశ్వరుని తనయా అనేబదులు, వేంకటేశ్వరుని మిత్రుని తనయా అంటూ సంబోధించడం విశేష విషయం. అందరి కష్టాల్నీ తీర్చమని వేడుకొనుట సశేష విషయం. ఇలా ఆయా కళాకారుల కళాప్రదర్శనకు ముందుగా పాడుతుంటారు. గణనాయక ప్రార్థన వింటూ, ప్రేక్షకులు, కథవినడానికీ, చూడడానికీ, సన్నద్ధులవుతారు.
మాదిగ కులస్తులను ఆశ్రయించి, కథాగానం చేసే ‘చిందువారి’ గణనాయక ప్రార్థన.
వ|| శ్రీ గణనాధుని దలతు శీఘ్రమె, నొసగు మీ యిష్ట సంపదల్
జాగులు సేయ బోకు మము జెందియు,
విద్యలయందు నిలిచియున్, భూగగనంబు మెచ్చగను
పుణ్యచరిత్రుడ దేవ భూజగమా బాగుగనెల్ల జూడు
బాంధవ, మెప్పుగా నిల్చిబ్రోవవే.
పా|| ఓ గణనాయక, ఓ శుభదాయకా
పార్వతి తనయా పరమ పావనా
మూడు లోకముల మునిజన వందిత
నాకలోకమును రక్షించినమము
కరుణ తోడుతా, కావుము దేవా || ఓ ||
శ్రీ గణనాధా! పురారి తనయ
మమ్ముబ్రోవుమా || 2 ||
రాగ ద్వేష రహిత నిన్ను
బాగుగా నామదిని గొలుతు || శ్రీ ||
కోటి సూర్య తేజ నిను కొనియాడెడు భక్తులకు
సాటిలేని వరములిచ్చి - ముజ్జగముల నుతి కెక్కిన
చక్కని విఘ్నేశ్వర నాదు - యక్కరతీర్చు,
మ్రొక్కెదను || శ్రీ ||
శ్రీకర కరుణాకరవో! ఏకదంతలంబోదర
ప్రాకటముగా నాదుమనవి
చేకొని నన్ను బ్రోవుమయ్యా || శ్రీ ||
రాగము, ద్వేషము, ఈర్ష్యా, అసూయలు, మానవులకే గాని, గణనాయక దేవునికి లేవని, కోటి సూర్య తేజస్సుగల వినాయకుడు, తన భక్తులకు అనేక వరములిచ్చి, సదా కాపాడుతాడని, ప్రార్థన చేస్తారు. గణనాయకుని సుగుణాల్ని పొగుడుతూ, సాగిలి మ్రొక్కుతూ సర్వజగాన్ని రక్షించమంటూ, ప్రార్థించే వారి విశాల హృదయాన్ని ప్రసాదించిన ఆ దేవునికి, మనమందరము నిండుమనస్సుతో సాగిలి మ్రొక్కుట సమంజసము.
చాకలి కులస్తులను ఆశ్రయించి కథాగానం చేసే `మాసయ్యలు’ అనే ఉపకులం వారి గణనాయక ప్రార్థన ఈ విధం.
గణేశా మిమ్ము వేడెదము గణింపకు
మాకు దోసెనుగా గణేశా || 2 ||
ఉండ్రాళ్ళన్ జేసి పెడుదుము
పార్వతి తనయుడావనుచు
ప్రార్థనలు బాగగా జేసెదమూ || 2 || గ ||
ఏనుగ తొండాము వట్టి ఏగమే
దీవెన లొసగు గణేశా || 2 || గ ||
గణనాయకునికి ఇష్టమైన ఉండ్రాళ్ళను చేసి, చాలా ప్రీతితో భక్షింపుమని వేడుకొనుట, పార్వతి తనయుడా అని పిలిచి ప్రార్థనలు చేస్తూ, దీవెనలిమ్మని అడుగుట, భక్త జనులకు సర్వసాధారణం. అలా సాధారణమైన విషయాలను, అసాధారణమైన రాగాలలో మేళవించి పాడుకొనుట కళాకారులకే చెల్లింది. ఇష్ట దేవతా స్తుతిలో భాగంగా, ఈ గణనాయకుని రూపాన్ని, ఆహారవిహారాలను, ఆయా కళాకారులు తమకున్న ఆధ్యాత్మిక తెలివితో, దైవీ భావనతో, ప్రార్థనలో భాగంగా ఆరాధించడం కనిపిస్తుంది.
గొల్ల లేదా యాదవ కులాన్ని ఆశ్రయించి, కథలు చెప్పే ‘మందెచ్చులవారు’ తమ బుట్ట బొమ్మల ప్రదర్శనలో మొదట, ఆదిగణనాయక ప్రార్థనాగీతం ఉంటుంది.
పా|| హర, హరమూర్తి వయ్య గణనాదా, ఓ లోకనాత
నువ్వు హరిహరి కొమారుడవు లోకనాయక || హ ||
శివ శివ మూర్తివయ్య గణనాదా, ఓ లోకనాత
నువ్వు శివుని కొమారుడవు లోకనాత || హ ||
వ || తొండముతో నీళ్లుదెచ్చి, దోరంపు బొజ్జాయిగడిగి
తల్లితోడ పూజలు గొన్న సామి గణనాయకా.
పా|| కోమట్లు నిన్నుగొలువ గణనాదా, ఓ లోకనాత
నిన్ను గొప్పదేవుడందురయ్య లోకనాత || కో ||
సాలోల్లు నిన్ను గొల్వ గణనాదా, ఓ లోకనాత
నిన్ను సర్వేశ్వరుడురందురయ్య లోకనాయక || సా ||
గొల్లోల్లు నిన్ను గొల్వ గణనాదా, ఓ లోకనాత
నిన్ను సిరికిట్టు డందురయ్య లోకనాయక || గొ ||
గౌండ్లోళ్లు నిన్ను గొల్వ గణనాదా, ఓ లోకనాత
నిన్ను కాటమయ్య అందురయ్య లోకనాయక
కుర్మోళ్లు నిన్ను గొల్వ గణనాదా, ఓ లోకనాత
నిన్ను బీరప్ప అందురయ్య లోకనాయకా || కు ||
బామ్మండ్లు నిన్ను గొల్వ గణనాదా, ఓ లోకనాత,
నిన్ను బగవంతుడందురయ్య లోకనాయకా || బా ||
వ || హహ … హహ … హహ
మిల మిల మీసకట్టు వచ్చి గణపతి మిరిమించి ఉన్నడు.
కత్తెర గడ్డమచ్చి గణపతి కడపదాటకున్నడు.
అంటూ, అన్ని కులాల వారికీ ఆరాధ్యదైవమేనంటూ, ఆది గణనాయకున్ని ప్రార్థిస్తారు. ఈ కళాకారులే రాత్రివేళల్లో కధాగానం చేసేటప్పుడు గణపతి ప్రార్థన ఈ విధంగా ఉంటుంది.
‘ఆది గణాధిపతి అమ్మమ్మరాణి, ఆదిగణాధిపతి ||2||
మెత్తటి మెత్తటి అరటిపండ్లు మేలైన ఖర్జూరపండ్లు||2||
ముంగివాహనమెక్కినావు, మూడు లోకాలు
దిరిగినవయ్యా || 2 ||
ఎలుక వాహనమెక్కినావు ఏడులోకాలు
దిరిగినవయ్యా || 2 ||
నందివాహన మెక్కినావు, నాకలోకం
దిరిగినవయ్యా || 2 ||
అంటూ, గణనాయకుని యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ, ప్రేక్షకుల్లో భక్తిభావన పెంపొందిస్తూ, దేవుని ఆశీర్వాదం అందరికీ అందేలాగా, గణనాయక ప్రార్థన చేసి, ప్రేక్షకుల్ని అలరింపజేసే, ఆయా జానపద కళాకారుల జీవితం దుర్భరం కాకుండా కాపాడమని ఈయేడున, గణపతిని మనం ప్రార్ధిద్దాం.




on 17 సెప్టెంబర్ 2007 at 2:05 am 1.raju itla …
రాజు చలభగునధి నకు అంథ
on 11 జులై 2008 at 5:44 am 2.sampath …
చాల బగుంది, మంచి సంచరము.