నివాళి సోయి | 01 డిసంబర్ 2006 10:10 pm
గతానికి వర్తమానానికి వంతెన గడియారం
- సంగిశెట్టి శ్రీనివాస్ (కవిలె తెలంగాణ రీసెర్చ్ అండ్ రెఫరల్ సెంటర్)
తెలంగాణ పునర్వికాసోద్యమానికి ఊపిరులూది, ఉద్యమ స్ఫూర్తితో చరిత్ర, సంస్కృతి, సాహిత్య రంగాల్లో ఆరు దశాబ్దాలపాటు తెలుగువారు గర్వించే కృషి చేసిన గడియారం రామకృష్ణశర్మ గతానికి-వర్తమానానికి వంతెన. సుజాత పత్రికా సంపాదకులుగా, సంస్కర్తగా, సాహితీవేత్తగా, సమరయోధునిగా, పరిశోధకునిగా, సారస్వత పరిషత్తు నిర్వాహకునిగా, గ్రంథాలయోద్యమ నిర్మాతగా తెలుగు జాతికి, తెలంగాణకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. కరువు జిల్లా అనంతపురం నుంచి చిన్నప్పుడే నడిగడ్డకు వచ్చి ఆలంపురంలో నివాసం ఏర్పర్చుకున్న రామకృష్ణశర్మ, అదే ప్రాంతానికి చెందిన ప్రథమాంధ్ర మహాసభ అధ్యక్షుడు, గోలకొండ పత్రికా సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి సాన్నిహిత్యం, ప్రోత్సాహంతో ఆయనతో పాటుగా తెలంగాణంతా తిరిగి ప్రజాచైతన్యాన్నికి పాదులు వేశాడు. 1953లో అంతకుముందెన్నడు జరుగని రీతిలో ఆలంపూరులో సారస్వత పరిషత్తు మహాసభలు నిర్వహించి అందుకు సాహిత్య ఆకాడెమీ మన్ననలందుకున్నాడు. ఈ సభలకు అప్పటి భారత ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ముఖ్యతిథిగా హాజరయ్యాడు. ఈ సభల అనంతరమే తెలంగాణ ప్రతిభను ఢిల్లీలో గుర్తించి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డును సురవరం ప్రతాపరెడ్డికి ప్రకటించడం జరిగింది.
అనివార్య కారణాల వల్ల గోలకొండ పత్రిక సంపాదకత్వం నుంచి తప్పుకున్న సురవరం ప్రతాపరెడ్డి ప్రోత్సాహం, ఆశీస్సులతో 1950 ఆగస్టులో తెలంగాణ వారి సాహిత్య మాస పత్రిక `సుజాత’ ఆరంభమయింది. ఇదే పేరుతో 1927-30ల మధ్యన ప్రతాపరెడ్డి తొలి తెలంగాణ సాహిత్య మాస పత్రిక నిర్వహించాడు. రామకృష్ణశర్మ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినప్పటికీ ప్రతి సంచికను ప్రామాణికమైన వ్యాసాలు, కథలు, పద్యాలు, గేయాలు, పరిశోధక అంశాలతో వెలువరించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. మూడేళ్ళు నడిచిన ఈ పత్రికలో సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, పొట్లపల్లి రామారావు, కాళోజి నారాయణరావు, నందగిరి ఇందిరాదేవి రచనలతో పాటు ఎందరో యువకవుల రచనలచ్చయ్యేవి. దాశరథి `నా తెలంగాణ’ కవిత మొదటి సారిగా ఇందులోనే అచ్చయింది. తెలంగాణ యువ రచయితలకు తొలి సారిగా వేదిక కల్పించిన పత్రిక సుజాత. ఇందులో రామకృష్ణశర్మ స్వయంగా ప్రమోద పేరుతో `సింహావలోకనం’ శీర్షికన ఆనాటి సమాజాన్ని చిత్రిక గట్టారు. అలాగే `నీరక్షీర వివేకం’ పేరుతో పుస్తక సమీక్షలను వెలువరించాడు. `విద్యుల్లేఖ’ పేరిట కర్నూలు నుంచి కొన్ని సంచికలు వెలువరించాడు. ఇంత ఘన చరిత్ర ఉన్న ఈ పత్రిక వెలువరించిన రచనలను `సుజాత సూచి’ పేరిట సిద్ధం చేయడం జరిగింది. దీన్ని గ్రంథ రూపంలో తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
1943 లోనే వితంతువైన కమలను పెళ్ళిచేసుకొని సంస్కరణను ఉపన్యాసాల ద్వార ప్రచారం చేయడమే గాకుండ ఆచరణలో చూపించాడు. దీంతో ఆనాటి బ్రాహ్మణ సమాజ బహిష్కరణకు కూడా గురయ్యాడు. అయితే ప్రజాహితం కోసం పనిచేసే చైతన్యశీలి రామకృష్ణశర్మ బహిష్కర్తలపై `విడో మారేజ్ చట్టం’ క్రింద కేసులు వేసి తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్ని అవరోధాలైన అవలీలగా ఎదుర్కొంటానని నిరూపించాడు. తెలంగాణ పోరాట కాలంలో జాయిన్ ఇండియా ఉద్యమంలో కాంగ్రెసు పార్టీ తరపున ప్రచారం చేస్తూ రహస్య జీవితం గడిపాడు. ఆ తర్వాత ఆరుణా అసఫలీ, జయప్రకాశ్ నారాయణ్ లాంటి సోషలిస్టు నాయకుల ప్రభావంతో వనపర్తి రాజా రామేశ్వరరాయలు, పాగాపుల్లారెడ్డి మొదలైన నాయకులతో కూడి నిజాం వ్యతిరేక ఉద్యమ ప్రచారం కోసం కర్నూలు నుంచి ఒక రహస్య రేడియో కేంద్రాన్నే నిర్వహించిన ప్రతిభాశాలి. ఆ రేడియోకు స్వయంగా తాను వార్తలు సేకరించడమే గాకుండా రాసి చదివేవాడు. మహబూబ్నగర్, హైదరాబాద్ వరకు ఈ రేడియో కవర్ చేసేదంటే ఆనాడు ఈ రేడియో నిర్వహించిన పాత్రను ఊహించుకోవచ్చు. రచయితగా రామకృష్ణశర్మ ఎన్నో పుస్తకాలను వెలువరించాడు. ఆయన స్వీయ చరిత్ర `శతపత్రం’ అలనాటి తెలంగాణకు దర్పణం. సంస్కృతాంధ్రాంగ్ల హిందీ, కన్నడ భాషల్లో పండితుడు. కవి, గాయకుడు, నటుడు కూడా అయిన గడియారం దశరూపకసారం, భారతదేశ చరిత్రం, ఆలంపురంక్షేత్ర చరిత్ర, తెలుగుసిరి, బీచుపల్లి క్షేత్ర మహాత్మ్యం, ఉమామహేశ్వర చరిత్రం, భారతీయ వాస్తువిద్య, మొదలైన ఎన్నో రచనలు వెలువరించాడు. ఇవన్నీ ఒక ఎత్తు తెలంగాణ శాసనములు ఒక ఎత్తు. శాసన పరిశోధనము, ప్రాచీన లిపి, శిల్ప శాస్త్రాల్లో నిష్ణాతుడైన శర్మ హైదరాబాద్లోని లక్ష్మణరాయ పరిశోధక మండలి తరపున ఈ శాసనములను వెలువరించాడు. ఎంతో శ్రమకోర్చి పరిష్కరించిన ఈ శాసనాలు ప్రామాణికమైన వ్యాఖ్యతో తెలంగాణ ఘన చరిత్రను రికార్డు చేసింది. ఆలంపురం క్షేత్రాలమీద ఆయన రచనలు ప్రామాణికమైనవి. అలాగే ఈ దేవాలయ సముదాయాన్ని తుంగభద్రానదీ మధ్య నుంచి యథాతథంగా ఒడ్డున పునః ప్రతిష్టించడంలో ఆయన చేసిన సేవ మరవలేనిది. భారతదేశ చరిత్రలోనే ఒక కట్టడాన్ని యథా తథంగా వేరే ప్రదేశానికి మార్చడం ఇదే ప్రథమం. దీన్ని బట్టి చారిత్రక వారసత్వం పట్ల ఆయనకున్న మక్కువ తెలుస్తుంది.
ఆంధ్రసారస్వత పరిషత్తు స్థాపకుల్లో ఒకరిగా, నిర్వాహకునిగా దాదాపు ఐదు దశాబ్దాలు ఆయన చేసిన సేవ అటు ఆదిలాబాద్ నుంచి ఇటు మహబూబ్నగర్ వరకు అందరికీ సుపరిచితమే. 1953లో ఆలంపూర్లో సారస్వత పరిషత్తు సమావేశాలను చారిత్రకంగా నిర్వహించి అందరి మెప్పుపొందారు. కాళోజి నాగొడవ మొదటి సారిగా ఈ సమావేశంలోనే ఆవిష్కరింపబడింది. శ్రీశ్రీ మొదలు అనాటి తెలుగు సాహితీ హేమాహేమీలంతా ఈ సమావేశాలకు హాజరయి గడియారం ఆతిధ్యం స్వీకరించినవారే. పరిషత్తు రజతోత్సవ, స్వర్ణోత్సవ కార్యక్రమాల నిర్వహణలో కూడా పాలుపంచుకున్నాడు.
పాలమూరులో గ్రంథాలయోద్యమానికి పునాదులు వేసింది గడియారమే. ఆలంపూరు తాలూకాలోని చెన్నిపాడు గ్రంథాలయం, ఉండవెల్లిలోని శ్రీ సరస్వతీ విలాస పుస్తక భాండాగారములను రూపుదిద్దింది రామకృష్ణశర్మే. సిర్పూర్లో జరిగిన ఆంధ్రగ్రంథాలయ మహాసభల్లో పాల్గొన్నాడు.
6-3-1919నాడు అనంతపురం జిల్లా కదిరిలో జన్మించిన గడియారం చిన్నప్పుడే ఆలంపూరులో స్థిరపడి తెలంగాణ చరిత్రకు, సాహిత్యానికి, సంస్కృతికి చేసిన సేవ గణనీయమైంది. సాంప్రదాయాన్ని, మూఢాచారాల్ని చీల్చి చెండాడం గురువు, శతావధాని వేలూరి శివరామశాస్త్రి నుంచి నేర్చుకున్న శర్మ స్మారక సంచికను తేవడానికి ఆయన శిష్యులు ప్రయత్నిస్తున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు అందుకున్న గడియారం ఈ ఏడాది జూలై 25న తుది శ్వాస విడిచారు.
తెలంగాణను కార్యస్థలంగా ఎంచుకుని ఆరు దశాబ్దాలపాటు అవిశ్రాంతంగా వివిధ రంగాల్లో బహుముఖీన ప్రతిభతో పనిచేసిన గడియారం లేని లోటు తీరనిది. ఆంధ్రసారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీకి, రాష్ట్ర గ్రంథాలయోద్యమానికి, శాసన పరిశోధన రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్స్ లైబ్రరీకి ఆయన పేరు పెట్టి గౌరవించుకోవాల్సిన అవసరముంది. అదే ఆయనకు నిజమైన నివాళి.




on 19 డిసంబర్ 2006 at 5:54 pm 1.కొత్త పాళీ …
కీ శే శ్రీ గడియారం వారి ఆత్మకథని ఈ మధ్యనే మా డిట్రాయిట బుక క్లబ్బులో సభ్యులం చదివి చర్చించుకున్నాం. వెనక ఆస్తులేమీ లేకున్నా, సరైన ఉపాధి లేకున్నా, భాషకోసం, ఇతరుల బాగు కోసం నిరంతరం పాటుబడి అనేక విజయాలు సాధించిన మహా వీరుడు శర్మగారు. లైబ్రరీకి పేరు పెట్టుకోవటమే కాదు, ఆయన ఉద్యమ స్ఫూర్తిని మనం కూడా జీర్ణించుకుని, ఇంకా దేశాన్ని అణగ్దొక్కి ఉంచుతున్న నిరక్షరాస్యతనీ, మూఢనమ్మకాల్నీ రూపు మాపి ప్రజల్లో జ్ఞాన దీపం వెలిగించాలి. ఆ ప్రాతః స్మరణీయుణ్ణి ఇలా గుర్తుచేసినందుకు మీకు దండాలు.