సమీక్షలు సోయి | 01 డిసంబర్ 2006 10:14 pm
తెలంగాణా అస్థిత్వ కవిత్వం: `పొక్కిలి’
- సబ్బని లక్ష్మీనారాయణ
కవిత్వం పుట్టుక, నేపథ్యం సమాజమే అయినపుడు ఒక నేల గురించి, జాతుల గురించి వెలువడే సాహిత్యం, కవిత్వం సజీవ రూపాలై ఆ నేల, ఆ ప్రజల ఆకాంక్షలను, ఆలోచనలనూ ప్రతిబింబిస్తుంటాయి. తెలంగాణా గడ్డకు ఒక ఉజ్వలమైన సాహిత్య చరిత్ర, నేపథ్యం ఉంది. ఈ నేలపై తలెత్తిన ఉద్యమాల్లో తెలంగాణా సాయుధ పోరాటం మహోన్నతమైనది. తెలంగాణాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ప్రజాపోరాటమది. మొదటినుంచి ఇది పోరు గడ్డ, అణిచివేయబడ్డ గడ్డ, దగా చేయబడ్డ గడ్డ. ఆ నేపధ్యంలోంచి అద్భుతమైన రచనలు వెలువడ్డాయి. ఒకనాటి నిజాం నిరంకుశ పాలన రోజుల నుంచి, తెలంగాణా సాయుధ పోరాటం నుంచి స్పందించి, భాషలు కాదని, దేశాలు కాదని ఈ నేలను, ఈ నేల పోరాటాలను గూర్చి అద్భుతంగా కవిత్వం చెప్పిన వారున్నారు. ఫాబ్లోనెరుడా చేత అనేక మంది రష్యన్, స్పానిష్, పాలిష్, రచయితల చేత గీతాలు రాయించుకొన్నది. హరంద్రనాథ్ చటోపాధ్యాయ, చిత్తప్రసాద్ వంటి జాతీయ స్థాయి కవులను, కళాకారులను ప్రభావితం చేసింది తెలంగాణా సాయుధ పోరాటం. ఆరుద్ర `త్వమేవాహం’ పుట్టుకకు కారణమైంది తెలంగాణ. సోమసుందర్ `వజ్రాయుధం’కు పదును నిచ్చింది తెలంగాణ. శేషేంద్ర లాంటి `ఉత్క్పుష్టమైన కవులచే కవిత్వం రాయించుకొంది తెలంగాణ. ఇది ఇప్పటి మాట కాదు, దాదాపు యాబయి యేళ్ళ కిందటి మాట. నాటి నిరంకుశ నిజాం పాలన నుంచి నేటి వరకు తెలంగాణా తన ఉనికి అస్థిత్వం కోసం పోరాడుతూనే ఉంది. నాటి దాశరథి, కాళోజి లాంటి అతిరథుల నుండి నేటి తరం కవుల దాక ఆ ధార సజీవ ధారలానే ప్రవహిస్తూ వస్తుంది. రచనా పరంగా చెప్పుకొంటే తెలంగాణా సాయుధ పోరాటం నేపధ్యంగా వట్టికోట ఆళ్వారు స్వామి `ప్రజల మనిషి’, `గంగు’ వంటి నవలలు రాసారు. వాటికి కొనసాగింపుగా `చిల్లర దేవుళ్ళు’, `జనపదం’, `మోదుగుపూలు’ వంటి విశిష్టమైన నవలలు అందించారు దాశరథి రంగాచార్యుల వారు. ప్రజల భాషలో, తెలంగాణ ప్రజా జీవితంలోంచి వెలువడిన ఆణిముత్యాలు అవి.
`నిజాం రాష్ట్రంలో తెలుగు కవులు పూజ్యం’ అన్న మాటకు స్పందించి తెలంగాణాలోని 350 పైగా కవుల కవిత్వంతో ‘గోలకొండ కవుల, సంచిక’ను వెలువరించిన ఘనత కీ||శే|| సురవరం ప్రతాపరెడ్డిగారిది. ఇది 1930 నాటి మాట. `బండెనుక బండి కట్టి… పదహారు బండ్లు కట్టి… ఏ బండ్లెవోతవ్ కొడుకా నైజాం సర్కరోడా…’ లాంటి ఉర్రూతలూగించిన పాటలు తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అనేకం పుట్టినవి. నిజాం ఫ్యూడల్ పాలనలో తెలంగాణ ప్రజలు అష్టకష్టాలు పడ్డ సంగతి ఉట్టి మాటలు కావు. స్త్రీలు మాన ప్రాణాలు అర్పించారు. నిజాం సైనికులు రజాకార్ల ఆగడాలకు అంతే లేదు. స్త్రీలను బరిబాత (నగ్నంగా) బతుకమ్మ లాడించారంటే, నిజాం పాలకుల దురాగతాలకు అంతేముంది. తెలంగాణా గడ్డ నుంచి నిజాం పాలన అంతం కోసం కళాకారులు, కవులు, రచయితలు యోధులు పోరాడారు, ప్రాణాలర్పించారు, అద్భుతమైన, సాహిత్యాన్ని అందించారు. అవన్ని అక్షరబద్ధం చేయబడ్డసత్యాలు. భారత దేశానికి స్వాతంత్య్రం 1947, ఆగస్టు 15 నాడు వస్తే ఈ దేశంలో అంతర్భాగమై ఉన్న హైదరాబాద్ రాష్ట్రానికి 1949 సెప్టెంబర్ 17 నాటికి గాని, సైనిక చర్య తర్వాత నిజాం పాలన అంతమొంది స్వాతంత్య్రం వచ్చిందనే సంగతి ఎందరికో తెలియకపోవచ్చు. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది, ఎలా ఏర్పడింది, ఆంధ్ర రాష్ట్రం తొలి రాజధాని ఏది, ఆంధ్ర ప్రదేశ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది. ఏ ఒప్పందాల మేరకు ఏర్పడింది అనే సంగతి తేటతెల్లంగ అందరికి తెలియకపోవచ్చు.
1949 సెప్టెంబర్ 17 నుండి నవంబర్ 1, 1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పడేవరకు తెలంగాణ జిల్లాలు వేరుగానే ఉన్నాయి. బలవంతపు పెద్దమనుషుల ఒప్పందం మూలంగా తెలంగాణా సమైక్యాంధ్రలో కలిసిపోయింది. తెలంగాణ అభివృద్ధికి `ఎన్నో ఒప్పందాలు ఉన్నప్పటికిని అన్నీ బుట్టదాఖలై, నేటికి యాభై ఏళ్ళు గడిచి కూడా అది అడుగడుగన దగా పడుతు వెనుకబడిపోయింది అన్ని రంగాల్లో. ఇది నాయకులు చేసిన మోసమా, నిర్లక్ష్యమా? ఎక్కడైతే దోపిడి కాబడుతారో, అక్కడ ప్రశ్నించే తత్వం వస్తుంది, ఉద్యమాలు లేస్తాయి. తెలంగాణా లోని వనరులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు నష్టం వాటిల్లుతుందని 1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం వచ్చింది. అది ప్రజా ఉద్యమం అయి బ్యాలెట్ ద్వారా `కూడా నిరూపితమై’ పార్లమెంట్ సీట్లను కూడా గెలిచి చూపెట్టింది. కాని నాయకులు దానికి నీళ్ళు చల్లారు. మళ్ళ 2001లో తెలంగాణా ఉద్యమం ప్రబలమైంది. ప్రత్యేక తెలంగాణా ఏర్పడడం మినహా తెలంగాణా అభివృద్ధికి వేరే దారి లేదని ఈ యాబయి యేళ్ళ చరిత్ర చెప్పింది అని ఘోషిస్తు చెప్పిన నాయకులు, మేధావులు, విద్యార్థులు, కళాకారులు, రచయితలు, కవులు తమ నిరసనను తెలియ జేస్తూనే వస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం అనేది అది ఇక్కడి ప్రజల అభిష్టం, కాని ఇది ఇక్కడి రాజకీయ నాయకుల స్వార్థపు కోరిక మాత్రమే అని అనుకోవడం ఎవరికైనా అది వారి పాక్షిక దృష్టి మాత్రమే అవుతుంది. కాళోజీ లాంటి కవులు తన వాడి అయిన కలాన్ని బలంగా కదిలించి వినిపించాడు తెలంగాణా వాదాన్ని గత యాభై యేళ్ళనుంచి నాటి నుంచి నేటివరకు సామాజిక, సాంస్కృతిక నేపధ్యంగా అన్ని రంగాలలో తెలంగాణా వెనుక బాటు తనాన్ని, పాలకుల పక్షపాతాన్ని, నిరసిస్తూ కవులు, రచయితలు, కళాకారులు తమ కలాలకు పదును పెట్టారు, తమ గొంతును విప్పారు. ఇలా వారు స్పందించడం 2001ల తర్వాత అది ఉదృత స్థాయికి చేరుకొంది. ఈ నేపధ్యంగా తెలంగాణా వెనుకబాటుతనంను వివరిస్తూ మేధావులచే వివిధ పుస్తకాలు వెలువడ్డాయి, వ్యాసాలు వెలువడ్డాయి, పాటలు వచ్చాయి. 1930 నాటి గోలగొండ కవుల సంచిక వలెనే నేటి 2002ల నుండి `పొక్కిలి’ `మత్తడి’ వంటి కవిత్వ సంకలనాలు వెలువడ్డాయి. అవి తెలంగాణా ప్రజల అభీష్టాలు, ఆకాంక్షలు. ఈ నేపధ్యంలో 2002, మేలో వెలువడిన కవిత్వ సంకలనం `పొక్కిలి’. నిజాయితీగా ఇది తెలంగాణ వాద కవిత్వం. 1980, 1990 ల దళిదవాద, స్త్రీ వాద, మైనారిటీ వాద కవిత్వాల్ని తెలంగాణ వాద కవిత్వం బ్రేకు వేసింది. సమిష్టిగా తెలంగాణా వాదులమని తమ దృక్పధాలను ఘోషిస్తూ ఒక నేల కోసం పాడిన కవిత్వ సంకలనమిది. ఆ కవిత్వ ధ్వనులను ఒక్కసారి పరిశీలిస్తే తెలంగాణ గుండె గోడు వినిపిస్తుంది. ప్రజల కష్టాలు, కన్నీళ్ళు, ఆవేదనలు తేట తెల్లమవుతాయి.
కవి అఫ్సర్ `పొలి’ అనే కవితలో
‘కదులుతున్న ఉరికంబం నా వూరు
సూర్యచంద్రులు వెలేసిన ఆకాశం నాది
నా చుట్టు వీచే గాలి / అధికారం విసిరిన ఉచ్చు
ఇరుసు విరిగి కుప్పకూలి / చెల్లా చెదురైన బండి / విరిగిన చక్రాల మధ్య
తెగిన కాళ్ళ మధ్య ఎప్పుడూ ఓ రక్త ప్రవాహం
నెత్తురేదో చెమటేదో కన్నీళ్ళేవో తెలియని యేరు’
అంటూ ఇక్కడి బతుకుల నేపధ్యంను వివరిస్తూ, నెత్తురోడుతున్న ఈ నేలను స్మరిస్తున్నాడు, దానికి కారణం ఎవరు, ఏమిటీ అని చూడమంటున్నాడు.
ప్రముఖ కవి, మానవతా కవితా మూర్తి అమ్మంగి వేణుగోపాల్ తెలంగాణా ముఖచిత్రాన్ని ఇలా దర్శించమంటున్నారు ముచ్చటగా,
‘తెలంగాణా
మొన్న కల
నిన్న పీడకల
ఈనాడు ఉరిపెట్టుకొన్న సత్యం
నా తెలంగాణా’
తెలంగాణా కావాలని ఆకాంక్షించేవారే ఇక్కడి వారు అందరు. కాని నాయకులు మోసం చేశారు గతంలో, ఈనాడు మరేమవుతుందో అని చూడమంటున్నాడు.
అడుగడుగున అహరహం తెలంగాణా కోసం, తెలంగాణా భాషా సంస్కృతుల కోసం పరితపించారు కాళోజీ, అన్యాయాలపై, అక్రమాలపై నిరసనను ధిక్కారస్వరంతో తెలిపారు కాళోజీ,
తెలంగాణాను దోపిడి చేసింది ఎవరైనా ఊర్కొనేది లేదంటు,
‘దోపిడి చేసే ప్రాంతేతరులను
దూరం దాకా తన్ని తరుముతం
ప్రాంతం వాడే దోపిడి చేస్తే
ప్రాణం తోనే పాతర వేస్తం
దోస్తుగ ఉండే వారితో మేమును
దోస్తీ చేస్తం - ప్రాణమిస్తం’
ఇక్కడి ప్రజల అభిమతాన్ని, నైజాన్ని నిశితంగా తెలియచెప్పాడు కాళోజి. తన గళంతో, పాటలతో ప్రజానికాన్ని ఉర్రూతలూగించే ప్రజాగాయకుడు గద్దర్ తెలంగాణా స్థితిని ఇలా స్మరిస్తున్నాడు.
‘పొద్దు గల్ల పరమాన్నం
పగటికి మెత్తన్నం
పొద్దుగూడితే పులిసిపోయినన్నం
తెల్లారుతే పురుగులన్నం
ఆ పురుగులన్నం పక్షులకు పరమాన్నం
కాలమిది
సమయమిది
పగిలిన తెలంగాణ కవి కంఠమిది’
తెలంగాణా బతుకుల్లో చెదిరిపోయిన, గతి తప్పిపోయిన ఆకాంక్షలను గద్దరుపై విధంగా స్మరిస్తున్నాడు.
డా|| చెరుకు సుధాకర్, తల్లి వేరు తెలంగాణాను స్మరిస్తూ…
‘అమ్మను ఎరుకపట్టుడు అంతకష్టమా?
బిడ్డ గాకపోతే తల్లిని దబ్బున గుర్తు పట్టేది ఎవరమ్మా?
నా ఎరుకకు ఏండ్ల చరిత్ర ఉంది
నా ఆర్తికి, అనుబంధానికి ఏండ్ల వడగండ్ల చరిత్ర ఉంది
చరిత్రకు చరిత్ర నేర్పిన తల్లి తెలంగాణా ఆనవాలు మాయంచేసి
మనిద్దరి ‘తల్లిమాయి’ ఒకటే అంటావు’
తన భాషను, నేలను, సంస్కృతిని, ఆ నేలతో అనుబంధాన్ని, తల్లిబిడ్డల సంబంధాన్ని స్మరిస్తూ ఆంధ్ర, తెలంగాణా బతుకుల సంస్కృతి ఒకటే ఎలా అంటావు, ఇద్దరి తల్లి ఒకటే అయితే ఒకరికి వట్టిపోయిన బతుకులెందుకు, ఒకరికి అన్ని అందిన బతుకులెందుకు అని ప్రశ్నిస్తున్నాడు.
`ఇది వంద యుద్ధాల బడి’ అంటూ జయధీర్ తిరుమల రావు, శతాబ్దాల తెలంగాణా సంస్కృతి, చరిత్ర, సామాజిక అంశాలను గుర్తుకు చేస్తు బతుకవచ్చిన ఎవరినైనా ఈ తెలంగాణ తల్లి ఆదరించింది అని, కాని అలా వచ్చినవారు ఇక్కడి వారి యాసను, భాషను చిన్న చూపు చూస్తూ, ఇక్కడి బతుకు సంస్కృతితో మమేకమైపోక ఎలా `ఎలియన్’ఏ గా ఉండిపోతున్నారో అంటూ,
‘నువ్వెప్పుడైనా నా బతుకమ్మ పాటకి పల్లవైనావా
నువ్వెన్నడైనా కొమిరెల్లి మల్లన్న `పట్నం’ చూశావా
నువ్వెన్నడైనా సమ్మక్క జాతరలో భాగమయ్యావా
నువ్వొక ఎలియన్వి
ప్రజల్ని పరాయికరించిన రూలర్వి
మా బతుకుల మీద చావు దెబ్బలు పడినా
అయ్యో అనని ధరోదాత్తుడవి
బతుకవచ్చిన తమ్ముళ్ళకోసం
మా అమ్మ బడిని పరిచే ఉంచాం
వారు మా ఆత్మీయ పచ్చకార్డులు
బతుకుల్ని కొల్లగొట్టే బిగ్ బ్రదర్లపై మాత్రం
రుధిర బంధువులమై ఘనీభవిస్తున్నాం
యుద్ధారంబపు సమాధి స్థితి’
ఇలా బతుకవచ్చిన వాళ్ళతో పేచిలేదు, మా బతుకుల్ని కొల్లగొట్టేవారిపైనే మా దృష్టి అంతా అని తెలియజేస్తున్నాడు.
`నా పేరు యాద్గిరి’ అంటూ జింబో, తెలంగాణ భాషను, యాసను సినిమాల్లో విలన్లు, జోకర్లు మాట్లాడుకొనే భాషకు పరిమితం చేసింది ఎవరు? ఎందుకు? యాద్గిరి అంటే ఎట్లుంటడు, గుండానా, రేడీనా, ఆ పేరును అలా సింబలైజ్ చేసింది ఎవరు?
‘నా పేరు యాద్గిరి
నా పేరు వింటేనే
మీ మొఖాలు వెకిలిస్తాయి
నన్నో సర్వర్గానో, విలన్గానో
ధ్వందార్ధాల జోకర్ గానో
మోసగాడిగానో, తార్పుడిగాడిగానో చూపిస్తారు
అవహేళన చేస్తారు’
తెలంగాణ భాషను, యాసను అవహేళన చేస్తారు ఎందుకు అంటూ,
‘నేను భాషను ప్రేమిస్తాను
యాసను ప్రేమిస్తాను
భాష నా తల్లి’ అంటున్నాడు జింబో.
‘తోవ తెలంగాణ’ అంటూ జూలూరు గౌరిశంకర్
‘నా తల్లి తెలంగాణ
మా చూపు, తోవా తెలంగాణ
మా చివరి దరి, దారి తెలంగాణ
మా కలత నిద్రల్ని చాకలి ఐలమ్మా మేలుకొలుపు
ఓ దొడ్డి కొంరయ్య, నన్నొక్కసారి ఆవహించు’
అంటూ తెలంగాణ సాయుధ పోరాట అమరులను స్మరిస్తూ భవిషత్తు తెలంగాణాను దర్శిస్తున్నాడు. మొదటి నుండి జాలురు గౌరీశంకర్ది, తన దారి తెలంగాణనే, తన చూపు తెలంగాణనే …
`నా తెలంగాణ కోటి రత్నాలవీణ’ అన్నారు దాశరథి నాడు.
కాని నేడు `కోటి గాయాల కూన’ అంటున్నాడు టి. జితేందర్ రావు తెలంగాణని,
‘కోటి రత్నాల వీణ
కొల్లగొట్టబడి కోటి గాయాలకూనై రోధిస్తుంది
కొలిమిలో నిప్పులా మండుతుంది’
ఇంకా డా|| దిలావర్ తెలంగాణని `కోటి సంకెళ్ళ బంధిఖాన’ అంటున్నాడు ఇలా,
‘కొమ్మ కొమ్మలో తెల్లని పావురాల గుంపులు వాల్తాయని
నాటిన నాటి విప్లవం ….
ఇలా నెత్తురు ముద్దలు వూస్తుందని అనుకోలేదు.
ఉద్యోగాల పంట పండుతుందనుకొన్న తెలంగాణ మాగాణంలో
అసలు కంటే కలుపే పిచ్చి పిచ్చిగా మొలుస్తుందని ఊహించలేదు’
ఒకనాటి రక్తపు టేరుల పారిన తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత, శాంతి కుసుమిస్తుందనుకొంటే… ఇప్పటికీ గాయాల తెలంగాణనే ఈ నేల అని, ఇక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కరువై ఇక్కడి వారికే అవి అందకుండా పోయి, అన్యులు వాటికి ఆక్రమిస్తుంటే చూస్తు మిన్నకుండి పోయిన బతుకల్ని స్మరిస్తున్నాడు దిలావర్.
ఉమ్మడి సంస్కృతిలో, సమైక్యరాగమని, అందరమొక్కటే. అంతా ఒక్కటే అని చెప్పుకస్తున్న ఈ సుధీర్ఘ కాలంలో మరి తెలంగాణా, ఎందుకు వెనుకబడిపోయింది అని ప్రశ్నిస్తూ, ఇంకా అంతా బాగుంది, బాగుందంటూ చెప్పే మోసపూరిత మాటలు ఇంకెన్నాళ్ళు, మీ మాటలిక సాగవు అని హెచ్చరిస్తున్నాడు నందిని సిధా రెడ్డి, ఇలా,
‘మన నేల ఒకటే మన జాతి ఒకటే అయితే
బతుకు లొక్క తీర్గ ఎందుకు లెవ్వురా అయ్య
మన తల్లి ఒకటే అయితే
మాతృ స్తన్యమెందుకు దొరుకది
…………………………………
పలుకు పలుకున నునురాగాలు
బొల్తాగొట్టించె తందుకు బడామాటలొస్తయి మీకు
ఖేల్ ఖేల్ మే ఫరక్ రహతా
హర్ జమానా అలగ్ హోతా
యే ఖేల్ ఔర్ నహీ చలేగా’
`వాయిదాలు పడుతున్న విజయం’ అంటూ ప్రొ|| ననుమాసస్వామి,
‘నా ఆలోచనల మీద నాకే సందేహం
నా విజయం మీద నాకే అపనమ్మకం
గతాన్ని తలపోసుకొంటు దిగులుగా బతుకుతున్నవాణ్ణి
…………………………………………………….
పదం పదం కల్సి కదం కదం కల్పిగీస్తే గెలవలేమా?
విజయం ఎప్పటికైనా తథ్యం కాకపోతే వాయిదా పడుతుంది తప్ప’
ఇలా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయా లేదా అనే సందేహంలో ఉండి, కాలాన్నంత నెమరేసుకొని, ప్రజల సంస్కృతి, కళల, ఉద్యమాలతో మమేకమై పోయి, పదం పదం కలిపితే ఏనాటికైనా విజయం తథ్యం, కాకపోతే కాస్త వాయిదా పడుతుంది…. అంటూ బతుకుపై, భవిష్యత్పై గొప్ప నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నాడు.
`దెబ్బతిన్న పులి’ అంటూ తెలంగాణా వెనుకబాటు తనాన్ని ఇలా ప్రదర్శిస్తున్నాడు పొట్లపల్లి శ్రీనివాస రావు.
‘ఇక్కడ కాలువలుండవు - వున్నా నీళ్ళుండవు
ఇక్కడ ప్రాజెక్టులుండవు - వున్నా నిధులుండవు
ఇక్కడ పరిశ్రమలుండవు - వున్న ఉత్పత్తులుండవు
ఇక్కడంతా ఖాయిలా …. ఖాయిలా….
ఖాయిలా బతుకు తెలంగాణది’.
‘మాట్లాడుతాను మనిషిగా …’ అంటు బాణాల శ్రీనివాస రావు,
‘మాటే మనిషికి ప్రాణం
మాట్లాడేవాడే మనిషి
మాట్లాడుతాను మనిషిగా
………………………
మట్టి లోకి దూసుకపోతూ
కొత్త దారుల్లోకి సాగిపోతూ
మా గాయాల పాటల్ని
మీ చెవుల్లోకి బంపుతాను
ఒకెట్లకొద్ది బాధల్ని చేది
మీ దోసిళ్ళు నింపుతాను’
అని తెలంగాణ బతుకు బాధల్ని, గాథల్ని గానం చేస్తాను మనిషిగా మాట్లాడుతాను అని తెలియచేస్తున్నాడు.
తెలంగాణా సాహిత్య, సాంస్కృతిక, సామాజిక నేపథ్యం యొక్క పురోగమనదిశను నిర్దేశిస్తూ మన్నె శ్రీనివాస్ ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు.
‘నేస్తం
బాధల వంతెన మీద
బ్రతుకు బాటలు వేస్తున్నోల్లం
ఆకలి కేకల మీద ఆర్తనాదాల
గీతాల్ని వింటున్నోల్లం
ఇక్కడమన జీవితాల్ని
మనమేగా తాకట్టు పెట్టుకుంది
………………………………
ఇక్కడ కర్తవ్యాన్ని
కాలం మీద పదును పెట్టాల్సి ఉంది.
పిరికి గుండెకు ధైర్యాన్ని నింపాల్సి వుంది.
వీర తెలంగాణ
తల్లి నొదిటిమీద
తిలకం దిద్దాల్సి ఉంది
మనదొక లక్ష్యసాధన ………..’
అంటు తెలంగాణ లక్ష్య సాధనను గుర్తుకు చేస్తున్నాడు.
గత అర్ధ శతాబ్ధ కాలంలో తెలంగాణ కవిత్వాన్ని ఒక్క చోట చేర్చి సంకలనంగా తీసుకరావడం ఇదే ప్రథమం. ఈ సంకలనాన్ని తెస్తూ సంపాదకుడు జూలూరు గౌరీశంకర్ `ఇది నేటి నిజం, నేటి విజం’ అన్నాడు. ముమ్మాటికి ఇది నిజం. ఈ సంకలనానికి ముందుమాట రాస్తూ గుడిపాటి’, తెలంగాణ జీవిత చిత్తరువు `పొక్కిలి’ అని వ్యాఖ్యానించాడు.
ఇలా ఒక నేల సామాజిక నేపధ్యంగా, వెనుకబాటుతనం నేపధ్యంగా వెలువడిన ఈ సంకలనాన్ని వాస్తవాలను గురైరిగి నిజాయితీగా పరిశీలించాలి ఎవరైనా. ఈ సంకలనులో ప్రసిద్ధులైన కవుల నుండి, ఒకటి రెండు దశాబ్ధాలుగా రాస్తున్న కవుల నుండి, నిన్న, మొన్న, ఇవ్వాళ దాక రాస్తున్న కవులున్నారు. ఇందులో 129 మంది కవులు, కవయిత్రులు తమ గొంతును వినిపించారు. ఒక ఉమ్మడి లక్ష్యంరీత్యా, వస్తువు రీత్యా ఫల ప్రదమైన కవిత్వ సంకలనమిది. ఇలాంటి పుస్తకం రావడానికి రూపకర్త అయిన శ్రీ జూలూరి గౌరీశంకర్ మరెందరో సాహితీ మిత్రులు అభినందనీయులు.



