పోస్టులు అభిప్రాయాలు 08 February 2012

మన సంస్కృతి & వ్యాసాలు సోయి | 02 డిసంబర్ 2006 01:25 am

తెలంగాణ జన్మనిచ్చిన అద్భుత జానపద కథలు

- డా|| ముదిగంటి సుజాతా రెడ్డి

జానపద సాహిత్యం ఒక మహాసముద్రం. దాని పుట్టుక మూలాలను గురించి తెలుసుకోవటం మహా కష్టం. ఆదిమ మానవుని అనుభవం కల్పనల నుంచి ఎన్నో కథలు పుట్టాయి. అతని భయం ఆకాంక్షలు దైవరాక్షస శక్తుల మీద నమ్మకాలు ఆలోచనకు అందని సంఘటనలు తీర్చుకోలేని కోరికలు అందుకోలేని లోకాలు అద్భుతమైన కథల సృష్టికి ప్రేరణలయ్యాయి. మానవాతీతమైన అద్భుత శక్తులు అతని తీరని కోరికలను సాకారం చేసేవిగా కథల్లో దూరాయి. ఈ అద్భుతమైన వృత్తాంతాలను కథలను మౌఖికంగా ఒకరితో ఒకరు చెప్పుకునేటప్పుడు ఒక తరం నుంచి మరో తరానికి అందించేప్పుడు మరిన్ని కల్పనలు అద్భుత సంఘటనలు చోటు చేసుకుంటూ పోయాయి. ఇవి కేవలం వచనంలో మాటల్లో వుండటమే కాక గొంతెత్తి పాడుకునే గేయాల రూపం కూడా ధరించాయి. రామాయణ మహాభారత కథల మీద ఆధారపడిన గేయాలే కాక, ప్రాంతీయ సంఘటనల నుంచి పుట్టిన కథా గేయాలే కాక, పేరంటాళ్ళ వృత్తాంతాలతో కూడిన కథా గేయాలే కాక, మతసంబంధమైన కథా గేయాలే కాక అద్భుత వృత్తాంతాలతో కూడిన కథాగేయాలు కూడా జానపదసాహిత్యంలో వున్నాయి. మనకు లిఖిత సాహిత్యంలో కాశీ మజిలీ కథలు, బేతాళ కథలు, విక్రమార్కుని కథలు, శుక సప్తతి కథలు, దశకుమార చరిత్ర, కాదంబరి, వాసవదత్త వంటి ఎన్నో కథలున్నాయి. ఇవి గాక లిఖిత సాహిత్యంలోకి ఎక్కనటువంటి అద్భుతరసంతో నిండిన కథా గేయాలు జానపద సాహిత్యంలో కన్పిస్తున్నాయి. అటువంటి అద్భుత రస కథా గేయాలు కొన్ని తెలుగు ప్రజల్లో వ్యాప్తిలో వున్నాయి. బాలనాగమ్మ కథ, బాల రాజు కథ, కాంబోజి రాజు కథ, గాంధారి కథ, ధర్మాంగద చరిత్ర కథ వంటివి తెలుగు నాట ప్రజల్లో వ్యాప్తిలో వున్నాయి. ఈ ఐదు కథల్లో మూడు కథలు - బాల నాగమ్మ కథ, గాంధారి కథ, ధర్మాంగద కథలు తెలంగాణ ప్రాంతంలో జరిగాయి. ఆ కథల్లో చెప్పబడిన ప్రదేశాలు, పట్టణాలు తెలంగాణంలో వుండటం విశేషం.

 బాల నాగమ్మ కథ నాటకాలుగా ప్రదర్శింపబడింది. సినిమాలుగా కూడా వచ్చింది. మౌఖికంగా ఈ కథను పాడుకోవటమే కాక వచనంలో చెప్పుకోవటం గా కూడా బాగా ప్రచారంలో వుంది. ఈ కథ ఆంధ్రదేశం లోనే కాక కర్నాట దేశంలోనూ బాగా ప్రచారంలో ఉంది. ఇంకా ఉత్తర దక్షిణ భారతంలో ఎక్కడెక్కడ ఏయే రూపంలో వ్యాప్తిలో వుందో పరిశోధించవలసి వుంది. ఈ కథ రామాయణంతో తులతూగేంత కథాబలం, శిల్పం, పాత్రల చిత్రణలతో వుంది. బాల నాగమ్మ కథ పూర్వ ఉత్తర భాగాలుగా వుంది. నవభోజరాజు భూలక్ష్మికి సంతానం లేకపోవటం, భూమిలక్ష్మి సంతానం కోసం పడే బాధలు, ఏడుగురు కూతుళ్ళను పొందింతరవాత నాగేంద్రుని కాటుతో మరణించటం, సవతి తల్లి చేతిలో కూతుళ్ళు బాధలు పడటం, నవభోజరాజు రెండో భార్య ప్రేరణతో పిల్లల్ని అడవిలో వదిలేయటం, వాళ్ళు పానుగల్లు చేరుకొని అక్కడి రాజు ఏడుగురు కొడుకులను వివాహం చేసుకోవటం, ఏడుగురు అక్కచెల్లెండ్లలో చిన్నది బాలనాగమ్మ - ఆమెకు బాలవద్దిరాజు పుట్టటం, మాయల ఫకీరు వచ్చి మోసంతో ఆమెను ఎత్తుకపోవటం, బాల నాగమ్మ మాయల ఫకీరు చెరలో వుండటం, బాలవద్దిరాజు పెద్దవాడయి తల్లిచెరను విడిపించబోవటం, అతని అద్భుత సాహస కార్యాలు, చివరకు బాలవద్ది రాజు మాయలఫకీరును చంపి బాల నాగమ్మను, చెరనుంచి విడిపించటం వంటి కథా సంఘటనలు పూర్వ ఉత్తర భాగాల్లో వున్నాయి. బాలనాగమ్మను పానుగల్లు పట్టణం నుంచి మాయల ఫకీరు ఎత్తుకపోయినట్లుగా చెప్పబడింది. తెలంగాణలో నల్లగొండ జిల్లాలో ఒక పానుగల్లు, మహబూబునగరం జిల్లాలో ఒక పానుగల్లు పట్టణాలు చారిత్రక ప్రసిద్ధమైనయి వున్నాయి. పరిశోధకులు బాలనాగమ్మ నివసించింది మహబూబునగరంలో పానుగల్లుగా నిర్ణయించారు. మాయల ఫకీరు మౌలాలి గట్టున నివసించేవాడుగా చెప్పబడినాడు. మౌలాలి అనే ప్రదేశం కొండప్రాంతం హైద్రాబాదుకు సమీపంలో వుంది. అదే మాయల ఫకీరు నివాస స్థానమని పరిశోధకులు నిర్ణయానికి వచ్చారు. మౌలాలి నుంచి పానుగల్లు పన్నెండామడల దూరంలో వుందని కథలో చెప్పబడింది. ఇప్పటికి మౌలాలి నుంచి మహబూబునగరంలోని పానుగల్లు అంతే దూరంలో వుందని బిరుదురాజు రామరాజు తన ‘తెలుగు జానపద గేయ సాహిత్యము’ అనే గ్రంథంలో అన్నారు.

 గాంధారి కథ చాల ప్రాచీనమైందని విమర్శకులు అభిప్రాయపడ్తున్నారు. కాకతీయ వంశంలో రాణి రుద్రమదేవి చాల సామర్థ్యంతో సామ్రాజ్యాన్ని పరిపాలించింది. ఆ కాలంలో ఆమె సామర్థ్యానికి ఆశ్చర్యపోయి. ‘ఆమె మహా మాంత్రికురాలా ఏమి!’ అని అనుకునె వారట ప్రజలు. ఆమె వివాహకథనే ‘గాంధారి కథ’ గా రూపొందిందని ఆ కథను కూర్చిన ఒక జంగం కవి నిగూఢంగా చెప్పాడట. ఆ జంగం కవి క్రీ.శ.1300 ప్రాంతం వాడట. కాని ఈ కథ అంతకన్నా ప్రాచీనమై జానపదుల నోళ్ళల్లో కల్పనాశక్తితో పుట్టివుంటుంది. క్రమంగా ఎన్నో నూతనాంశాలను చేర్చుకుంటూ పోయి వుంటుంది. ఈ కథ నాయిక పేరు గాంధారి లేదా శివగాంధారి. నిజామాబాదు జిల్లాలో ఎల్లారెడ్డి తాలుకాలో గాంధారి అనే గ్రామముంది. ఒకప్పుడది నరేంద్రరాజుకు రాజధాని నగరమట. గాంధారి గ్రామంలో ఇప్పటికి ఈ కథ కొద్ది మార్పులలో ప్రచారంలో వున్నదని బిరుదురాజు రామరాజు తెలిపారు. అక్కడ ఈ కథ నాయికా నాయకులైన గాంధారి బాలరాజుల విగ్రహాలు కూడా వున్నాయట. గాంధారి తారశీల పట్టణం రాజు వసుపతి కూతురు. వసుపతి రాణి దేవపద్మగంధికి ఇరవైనాలుగేండ్లు గడిచినా సంతానం లేదు. చివరకు శ్రీశైల మల్లికార్జున స్వామి అనుగ్రహంతో గాంధారి జన్మించింది. అస్సలు స్వామి ప్రత్యక్షమై ఆయుస్సు లేని మగబాలుడు కావాలా ఆయుస్సుగల బాలిక కావాలా - అని అడిగితే రాణి కూతురునే కోరుకుంది. గాంధారి పెద్దదయి సమస్త విద్యలను నేర్చుకుంది. అప్పుడు ఆమెను మేనబావ బాలరాజుకిచ్చి పెండ్లి చేయాలనుకున్నారు. కాని రెండు కుటుంబాలకు వైరముంది. బాలరాజు తమకు పోయిన రాజ్యాన్ని తిరిగి తెస్తానని. తల్లితో చెప్పి మామదగ్గరికి పోతాడు. అక్కడ గాంధారిని చూసి ప్రేమిస్తాడు. రాణి పద్మగంధికి ఈ సంబంధం ఇష్టముండదు. ఆమె గాంధారిని తన తమ్ముడు సుహితునికియ్యాలనుకుంటుంది. అందుకని గాంధారి వివాహం బాలరాజుతో కాకుండా అడ్డంకులు సృష్టిస్తుంది. కాని గాంధారి తన తంత్రవిద్యలతో ఒక పట్టణాన్ని సృష్టించి బాలరాజును వివాహం చేసుకొని సుఖంగావుంటుంది. పద్మగంధి ప్రోత్సాహంతో సుహితుడు బాలరాజు మీదికి యుద్ధానికి పోతాడు. బాలరాజు పరాక్రమంతో యుద్ధం చేసి సుషితుని చంపేస్తాడు. తర్వాత బాలరాజు కోరికతో గాంధారి సుహితుని బ్రతికిస్తుంది. సుహితుడు గాంధారి తలిదండ్రులను పిలిపించి గాంధారి బాలరాజులకు వైభవంగా వివాహం చేయిస్తాడు, తాను సన్యాసం స్వీకరిస్తాడు. ఈ కథ చాల అద్భుత సంఘటనలతో మాయలు తంత్రాలతో అమానుష శక్తులతో నడుస్తుంది. పెద్ద వాళ్ళు పిల్లలకు బాలనాగమ్మ కథ వలెనే దీన్ని చెప్పటం ప్రచారంలో వుండేది. ఇప్పుడు ‘హ్యారీపాటర్’ పుస్తకాలు వచ్చింతర్వాత మన కథలకు ప్రచారం లేకుండా పోతున్నది. ఈ కథలను గురించి జనానికి తెలియను కూడా తెలియకుండా పోతున్నది.

 మరో అద్భుతరసంతో కూడిన కథ ‘ధర్మాంగద చరిత్ర’. దీనికి ‘పాము పాట’ అని కూడా పేరు వుంది. ఈ కథ పాట రూపంలో మంజరీ ద్విపదలో దొరుకుతున్నది. అంతేగాక వచనంలో కూడా లభిస్తున్నది. ఈ కథను కూడా పై కథల వలెనే పెద్దవాళ్ళు పిల్లలకు చెప్పేవారు. కాశ్మీర దేశాన్ని కనకపురం రాజధానిగా ధర్మాంగదరాజు పాలిస్తున్నాడు. రాజుకు చాలా కాలం వరకు సంతానం కలుగలేదు. చాల జానపద కథల్లో సంతానం లేకపోవటం, రాజురాణి వ్రతాలు పూజలు చేయుటం, వరంతో సంతానం కలగటం అనే కథ ‘మూస’ అనేది వుంటుంది. చాలా కాలానికి ధర్మాంగదుని రాణి రెండు నాలుకలతో నిండు పడగ తోవున్న కొడుకును కంటుంది. రాజదంపతులు దుఃఖించి దీన్ని రహస్యంగా పెడ్తారు. కుమారునికి యుక్తవయస్సు వచ్చినంక కత్తికి బాసింగం కట్టించి సౌరాష్ట్రరాజు రత్నాంగుని కూతురు త్రైలోక్య సుందరితో చేస్తారు. చాలా కాలం ఆ సుందరికి మామలు భర్తను చూపలేదు. భర్తను చూపక పోతే ప్రాణాలు విడుస్తానని సుందరి అంటుంది. అప్పుడు అత్తమామలు అసలు రహస్యం బయటపెడ్తారు. సుందరి పామును ఒక బుట్టలో పెట్టుకొని సకల పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంది. ఆఖరికి ఆమె మాండవ్యాది ఋషుల సలహాతో ధర్మపురి చేరుకొని అక్కడి ధర్మగుండంలో మునుగుతుంది. అప్పుడు పాము నవమన్నుథాకారుడైన రాజకుమారుడుగా మారుతాడు. అయితే ధర్మపురి ఇప్పుడు కరీంనగరం జిల్లాలో వున్న ధర్మపురియే వేములవాడ చాళుక్యరాజు రెండో రాజరాజు కన్నడ సాహిత్యంలో ఆదికవి అయిన పంపమహాకవికి అగ్రహారంగా ఇచ్చాడు. పవిత్ర గోదావరి నదీతీరంలో వెలిసిన ధర్మపురి తర్వాత గొప్ప పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ధర్మాంగద కథ కాశ్మీర దేశంలో ఆరంభమై తెలంగాణలోని ధర్మపురి క్షేత్రంలో ముగిసింది. ఈ కథను ధర్మపురి మహాత్మ్యం కథగా కూడా చెప్తారు. ధర్మాంగద కథను పాటగా బతుకమ్మ ఆటలోను పాడుతారు.

 తెలుగులో వున్న మాయలు మంత్రాలు, అమానుష శక్తులు, దైవమహిమలతో కూడిన అద్భుతరసంలో ముంచెత్తే ఐదు కథల్లో మూడు కథలకు తెలంగాణ ప్రాంతమే పుట్టినిల్లు అయింది. ఈ మూడు కథలు కూడా చాల ప్రాచీనమైనయి. కథా కోవిదుల అద్భుత కథన శక్తికి గీటురాళ్ళుగా వున్నాయి. శ్రోతలకు ఆశ్చర్యానందం కలిగించే గొప్ప కథలు.

Trackback This Post | Subscribe to the comments through RSS Feed

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో