పోస్టులు అభిప్రాయాలు 08 February 2012

సమీక్షలు సోయి | 01 డిసంబర్ 2006 10:53 pm

‘తెలంగాణా శతక సాహిత్యం’ : డా|| పల్లేరు వీరస్వామి గారి పరిశోధన గ్రంథం

- డా|| శంకరమంచి శ్యాంప్రసాద్

 తెలుగులో నిత్యనూతన చైతన్యంతో పరవళ్ళు తొక్కుతూ సజీవ స్రవంతియై కవితా మాగాణంలో నిత్యం కవితా కుసుమాలను విరబూయిస్తున్న విశిష్ట సాహిత్య ప్రక్రియ శతకం. కవి హృదయం నుండి లావాలా పొంగివచ్చే భావధారకు అక్షర చిత్రికను పట్టిస్తుంది శతకం. ఆస్తికుని ఆర్తికి, రసికుని శృంగారానికి, సామాజకుని ఆవేదనకు, వేదాంతుని తాత్వికతకు వేయేల ఏ భావానికి ఆ రూపాన్నిస్తూ అవతరించిన నాటి నుంచి ఆబాల గోపాలాన్ని అలరిస్తున్న సాహిత్య ప్రక్రియ శతకం. ఇదెంత సనాతనమో అంత అధునాతనం - సంప్రదాయబద్ధంగా కవితా మందిరంలోకి ప్రవేశించే కవి భావగాంభీర్యాన్ని, ధారాశుద్ధిని, ఛందస్సుపై పట్టును సమపార్జించుకునేందుకు `సంవదించుకునేందుకు `సాధకునిలా శిక్షణ పొందే దశలో’ చేసే రచనా ప్రయత్నమే శతకం. ఈ దశలోనే లక్ష్య సాధనలో తనను ఆశీర్వదించమని, ఆర్ద్రంగా మొఱ పెట్టుకుంటూ కవి తన కుల దైవాన్నో, ఇష్టదైవాన్నో, స్తుతించడం పరిపాటిగా కనిపిస్తుంది. సహజంగా అందువల్లనే తెలుగులో భక్తిశతకాలు విరివిగా వచ్చాయి. ఆ తర్వాత నీతి ప్రబోధకమైన సామాజిక శతకాలు కొల్లలుగా వచ్చాయి. వస్తున్నాయి. వీటికి కారణం చుట్టూ ఉన్న సమాజాన్ని చూసినప్పుడు కల్గిన మానసిక స్పందనే కాకుండా, తమ జీవితానుభవంలో పండించుకున్న అనుభవాలను, ఆలోచనలను, అనుభూతిని, సమాజానికి అందించాలనే అభినవ దృక్పథంతో కూడా కొంతమంది. పరిణత దశలో శతకాలను రాయడం గమనిస్తాము. సాధారణంగా శతక రచన ప్రాథమిక దశలోనో, లేదా పరిణత దశలోనో రావడం మనం గమనించవలసిన ముఖ్య ప్రత్యేకత.

 నన్నయ నుండి సంప్రదాయబద్ధంగా వస్తున్న మార్గకవితను తోసిరాజని తెలుగు సాహితీ క్షేత్రంలో దేశికవితా మొక్కను నాటిన వైతాళికుడు పాల్కురికి సోమనాథుడు. మత పరంగా మితవాదియైనా సాహితీపరంగా అతివాదియై ఆంధ్ర సాహిత్యంలో అనేక ప్రక్రియలకు ఆద్యుడైనవాడు పాల్కురికి సోమనాథుడు. ప్రామాణిక శతక రచనకు పాల్కురికి సోమనాథుని ‘వృషాధిష శతకమే’ ప్రారంభము. అందుకే సోమనాథుడు ‘శతక వాఙ్మయ బ్రహ్మ’గా కీర్తింపబడుతున్నాడు. ఆ ప్రభావంతో ఎన్నో శతకాలు వచ్చాయి. తెలుగులో శతక సాహిత్యం అనగానే ధూర్జటి కాళహస్తీశ్వర శతకం, భాస్కర శతకం, వేమన శతకం (అధికమైనా), సుమతి శతకం, కృష్ణ శతకం, దాశరథి శతకం, ఆధునికమైతే నార్ల శతకం, నార్ల చిరంజీవి తెలుగు పూలు, కరుణశ్రీ తెలుగుబాల మొదలైన శతకాలు చప్పున స్ఫురిస్తాయి. తెలుగు జాతికి సంస్కృతీ నాగరికతల పట్ల అవగాహననే కాదు ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మాభిమానాన్ని రంగరించి పోసింది శతక సాహిత్యం. ఇప్పటికి పండిత, పామరులు తమదైనందిన వ్యవహారంలో ఎన్నోసార్లు ఆయా శతకాల్లోని పద్యాలను పద్యాలనే - ఉదహరించడం గమనిస్తాం. సుకవి జీవించే ప్రజల నాలుకల యందు’ అన్న జాషువా కవితా వాక్కుకు అక్షరోదాహరణమే శతక కవులు అంటే అతియశయోక్తి కాదు.

 తెలుగు ప్రజల సాంస్కృతిక జీవనంలో ఒక ప్రధానమైన శతక సాహిత్యంపై కాలపరంగా వస్తుపరకంగా ప్రాంతీయ పరంగా జరగాల్సినంత పరిశోధన జరగలేదేమో అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రాంతీయ పరంగా జరగాల్సినంత పరిశోధన జరగలేదనే చెప్పవచ్చు. డా||కె.గోపాలకృష్ణరావు గారి ‘ఆంధ్ర శతక సాహిత్య వికాసము’ అన్నదే మనకు ఇప్పటివరకు ఉన్న ప్రామాణిక పరిశోధన గ్రంథం.

 పల్లేరు వీరస్వామిగారు ప్రాంతీయ పరంగా శతక సాహిత్య పరిశీలన, పరిశోధన, వివేచన జరగలేదనే కారణంతో 1970-1995 సంవత్సరాల మధ్య అంటే ఈ పాతికేళ్ళ కాలంలో వచ్చిన ‘తెలంగాణా శతక సాహిత్యం’ అన్న అంశాన్ని పరిశోధనాంశంగా ఎన్నుకొని పరిశోధన చేసి కాకతీయ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టాను పుచ్చుకొన్నారు. డాక్టర్ పల్లేరు వీరస్వామిగారు వృత్తిరీత్యా సాంఘిక సంక్షేమ శాఖలో సంరక్షకులుగా పనిచేస్తున్న ప్రవృత్తి రీత్యా సాహితీ కారులు విశేషించి పద్యకవితా ప్రయులు. దానితో బంగారానికి పరిమళం అబ్బినట్లెంది. విలువైన పరిశోధనా గ్రంథాలు ‘అసూర్యం పశ్యలు’గా గ్రంథాలయాల్లో మగ్గుతున్న తరుణంలో సాహసించి ఇటీవలనే ‘శ్రీలేఖ సాహితి’ ప్రచురణగా తమ పరిశోధన గ్రంథాన్ని వెలువరించడం అభినందనీయం.

 పల్లేరు వీరస్వామిగారు తమ పరిశోధనాంశాన్ని ప్రధానంగా ఏడ్పు అధ్యాయాలుగా వింగడించుకొని పటిష్టమైన ప్రణాళికను రూపొందించుకున్నారు.

 మొదటి అధ్యాయంలో `తెలంగాణా నేపథ్యంలో ఈ ప్రాంత భౌగోళిక చారిత్రక సాంస్కృతిక పరిస్థితుల్ని వివరించాడు. రెండవ అధ్యాయం ‘శతక సాహిత్యం - ఆరంభవికాసాలను’ గూర్చి సంక్షిప్తంగా పరిచయం చేశాడు. ‘శతకాలు పద్యం అయినప్పటికి అవి సామాజిక జీవితంతో పెనవేసుకొని మానవ శాస్త్రాలుగా పరిఢవిల్లాయి’ (పుట-25) అన్న మాటలు ఎన్నుకున్న అంశంపై పరిశోధకుని ఉన్న అభిమానాన్ని పట్టిచూపుతాయి. మూడవ అధ్యాయం ‘శతక ప్రక్రియా లక్షణాలు’లో సాహితీ విమర్శకుల అభిప్రాయాలను వెల్లడిస్తూ ముఖ్యంగా 1) సంఖ్యా నియమం 2) మకుట నియమం 3) వృత్త నియమం 4) రస ప్రస్తారం 5) భాషా నియమం 6) ముక్తకలక్షణం 7) ఆత్మానుభూతి, ప్రబోధ శతకాల్లో నుండి రసస్ఫూర్తిని ఆస్వాదించడం ఆశించడం అత్యాశేనేమో! వస్తైక్యము లేనిచోట రసపోషణకు అవకాశం లేదు. వృత్త నియమాన్ని గూర్చి ప్రస్తావిస్తూ ‘వృత్తాలను మార్చడం కంటే ఏక వృత్తంతో రచన సాగిస్తే ఆ రచన సాహితీ స్ఫోరకంగా ఉంటుంది. సౌహృదయ సంసృందంగా ఉంటుంది. అంతేగాక కవి ప్రతిభా నైపుణ్యాన్ని అభివ్యక్తి సంస్కారాన్ని తెలుపుతుంది’. అన్న పరిశోధకుని మాటలు గమనీయమైనవి. సంఖ్యా నియమాన్ని గురించి సవివరంగాను, సవిస్తారంగాను చర్చించారు. కపిల వాయి లింగమూర్తి గారి శాస్త్రీయ వివరణ బాగుంది. శతక మంటే నూరే అయినా భావ, గుణ, ఛందో దోషాలు ఒకటి రెండు పద్యాల్లో దొర్లినా - సంఖ్యకు (నూటికి) లోటు రాగూడదనే ఉద్దేశంతోను కవులు 108 పద్యాలు రాసి ఉంటారనిపిస్తుంది. నాలుగో అధ్యాయంలో శైవ వైష్ణవ, దేవపరమైన శతకాలను పేర్కొనడంతో పాటు, విశిష్ట వ్యక్తుల పేరు మీద ఉదాహరణకు కసిరెడ్డి - గాంధీ శతకం, డా|| ఆంజనేయ రాజు గారి సత్యసాయి శతకం, సంపత్కుమార గారి అంతర్మథనం మొదలైన వాటిని గురించి అందలి సొబగులను గూర్చి కూలంకషంగా చర్చించారు. ఇందులో యువతీ, హేప్రభో, జాగృతి, పాండురంగ సూక్తులు, విరించి సూక్తులు వెంగళప్ప, ఆర్య చెకుముకిరవ్వతెలుగుపట్టి, పరమహంస, చారుచర్య, విశ్వ, వినయంగ చంద్రవేదం బొబ్బిలి సూక్తులు, వరదరాజ, మేలుకొలుపు, పౌర, మనిషీ లోగుట్టు, నా మాట, ఓటరయ్య, కృష్ణవేదం, కాదంబిని, భావిపౌర, నవ్యనీతి, భరతబాల, సోదర, దిక్సూచి, నేటిసమాజం మొదలైన పేర్లతో వచ్చిన శతకాలను గురించి సోదాహరణంగా సమీక్షించారు. ఉదాహరణకు వేదాటి రఘుపతి విశ్వశతకంలో

 ప్రగతి లతలు ప్రాకి ఫలవంతమగుటకు
 చీడ పురుగులన్ని చెదరిపోవ
 మంచి ఓటు మందు మన నేలచల్లరా
 విశ్వమినుత నామ వినురరామ

 చైతన్యవంతులైన ప్రజలు వేసే ఓటు ప్రజాస్వామ్యాన్ని ప్రజా సంక్షేమాన్ని పటిష్ట పరుస్తుందని, కాబట్టి ఎన్నికల సమయంలోనే జనం ఓటు ద్వారా ఆ విజ్ఞానాన్ని చూపాలని ప్రబోధిస్తాడు. ఇలా పై శతకాల్లో ఎన్నో పద్యాలను ఉటంకించవచ్చు. పరిశోధకుడు ఆయా శతకాల్లోని విలువైన, సమాజానికి అవసరమనుకున్న పద్యాలను ఎంపిక చేసుకోవడంలో కృతకృత్యుడయ్యాడని తెలుస్తుంది. పరిశోధకుని సామాజిక నిబద్ధతకు ఇదొక ఉదాహరణ. అంటరానితనం, దేశభక్తి చదువు రాజకీయ విమర్శ మొదలైన అంశాలు ఆయా శతకాల్లో ఎలాప్రతిఫలించాయో ఎత్తిచూపారు. సామెతలు, పలుకుబళ్ళు మొదలైనవి చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా తెలుగు శతకాల్లో చోటు చేసుకున్న అన్యభాషా పదాలు ఇంగ్లీషు, ఉర్దూనుంచి అధికంగా వున్నాయి. ఆసఫ్జాహీల పాలన కారణంగా తెలంగాణపై `ఉర్దూ’ ప్రభావం అధికం కాగా ఆధునిక, సాంఘిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల కారణంగా `ఇంగ్లీషు’ మనపై ఎంత పెత్తనాన్ని చూపుతుందో తెలుగు వాళ్ళు నిత్యజీవితంలో గమనిస్తున్నది. మన జీవిత ప్రభావమే - మన శతకాల్లోను ప్రతిఫలనం చెందింది. రాజకీయ బానిసత్వం కన్న సాంస్కృతిక బానిసత్వం మరింత ప్రమాదకరమైంది కాబట్టి. దాన్నుంచి ఎంత తొందరగా బయట పడితే అంత మేలు. అందుకు మేధావులైన ఉపాధ్యాయులు, కవులు, కళాకారులు, పూనుకోవాల్సి వుంది.

 ఇంతటి బృహత్పరిశోధనలో - పరిశోధకుడు మరి కొంత శ్రద్ధ వహిస్తే - మరెన్నో శతకాలు వెలుగు లోకి వచ్చి వుండేవి పాతికేళ్ళలో వచ్చిన శతక సాహిత్యాన్ని పరిశీలించాలనుకున్నప్పుడు విస్త్పుతంగా క్షేత్ర పర్యటనల్ని చేయడంతో పాటు ఆయా ప్రాంతాలకు చెందిన సాహితీ సంస్థలు. సాహితీ కారులతో సన్నిహిత సంబంధాలను నెరపుకొనడంతో పాటు ఆ ప్రాంతానికి సంబంధించిన సాహిత్యంపై వచ్చిన పూర్వ పరిశోధన గ్రంథాలను సంప్రదిస్తే - ఈ పరిశోధన మరింత సమగ్రమయ్యేది. సంపన్నమయ్యేది. ఉదాహరణకు నా దృష్టికే వచ్చిన టి.వి.నారాయణ గారి ‘ఆర్ష పుత్ర’ శతకం 1991లో వచ్చింది. అలాగే కరీంనగర్ జిల్లాకు చెందిన సేనాపతి దత్తాచార్యగారి ‘మనోబోధ’ అన్న నీతి శతకం - 1993 లో వచ్చింది. ఈ రెండూ ముద్రణకు నోచుకున్నాయి. ఈ సిద్ధాంత గ్రంథంలో వీటి ప్రస్తావనగాని పరిచయం గాని లేవు.

 ఇంకా లోతుగా వెళ్ళదలిస్తే డా|| మలయ శ్రీ పి.హెచ్.డి. పరిశోధన గ్రంథమైన ‘కరీంనగర్ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర’ను సంప్రదిస్తే పరిశోధకుడు ఎన్ని శతకాలను తప్పాడో తెలుస్తుంది.

 పాల్కురికి సోమనాథుని కాలాన్ని గురించి భిన్న అభిప్రాయాలున్నా సుమారు 1160-1240 అని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఈ సిద్ధాంత గ్రంథంలో ఆయన కాలాన్ని 1291-1323గా చెప్పడం కూడా చర్చనీయాంశమే. దీనిని బట్టి ఆ కవి కేవలం ముప్ఫై రెండు ఏళ్ళు మాత్రమే జీవించాడని పాఠకులు అనుకోవాల్సి వస్తుంది.

 ఇంగ్లీషు వాళ్ళు దేశశ్రేయస్సుకోసం రూపొందించిన రైల్వేలు తంతి, తపాల, రోడ్లు వంటి సౌకర్యాలు తొలుత ఈ దేశాన్ని ప్రభావితం చేశాయి’ అన్నారు. వలస పాలకుల దృష్టి `దేశ శ్రేయస్సు’ పైన కాదు దేశ సంపదపైన. సైన్యాన్ని తరలించడానికి రవాణా సౌకర్యాలు కల్పించారు. ఈ దేశంలో ఉవ్వెత్తున ఎగిసిన ప్రజా ఉద్యమాలను గురించి, ఆందోళనల గురించి, వాటిని అణిచి వేయడానికి కావలసిన సలహాలను గురించి, సంప్రదింపుల గురించి సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పరచారు. కాబట్టి `దేశ శ్రేయస్సు’ అన్నది. వాళ్ళలో ఏ కోశానా లేదు.

 పరిశోధకుడు సిద్ధాంత గ్రంథంలో పాదసూచికలను (ఫుట్ నోట్సు) ఇచ్చాడు గాని చివరలో పాఠకుల సౌలభ్యం కోసం తప్పకుండా ఇవ్వాల్సిన ఉపయుక్త గ్రంథసూచిని ఇవ్వలేదు.

 అనుబంధం - 1లో ఇచ్చిన సాహితీ ప్రముఖుల ముఖాముఖి బాగుంది. కాని అనుబంధం - 2 లో ఇచ్చిన వాళ్ళ ‘చేవ్రాల్లు’ వల్ల సిద్ధాంత గ్రంథానికి అదనంగా ఒరిగిన ప్రయోజనం కనబడదు.

 ఈ మాటల్ని సాహహితీ విమర్శకునిగా కాకుండా ఒక సహృదయ పాఠకునిగానే వ్యక్తపరుస్తున్నాను. మలి ముద్రణలో వీటిపై దృష్టి సారిస్తారని ఆశిస్తాను.

 డా|| టి.శ్రీరంగ స్వామిగారి పీఠిక, ఆచార్య పేర్వారం జగన్నాథంగారి అభినందన సిద్ధాంత గ్రంథ-అంతరంగాన్ని పరిశోధకుని పరిశ్రమను ఆవిష్కరించాయి. వృత్తి ప్రవృత్తి భిన్నమైనా పాతికేళ్ళ తెలంగాణా తెలుగు శతక సాహిత్యాన్ని మధించి ‘అమృత కలశం’గా ఈ సిద్ధాంత గ్రంథాన్ని వెలుగులోకి తెచ్చినందుకు మనస్ఫూర్తిగా డా||పల్లేరు వీరస్వామిగారిని అభినందిస్తున్నాను. పాఠకులను స్వాగతిస్తున్నాను.

ఒక అభిప్రాయం

  1. on 30 డిసంబర్ 2006 at 2:14 am 1.vijay rapaka

    బాగుంది , చాల క్షున్నంగా వివరించారు, ఇలాగె రాస్తూ వెల్లండి…

Trackback This Post | Subscribe to the comments through RSS Feed

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో