మన సంస్కృతి & వ్యాసాలు సోయి | 02 మార్చ్ 2007 12:31 am
అంతరించిపోతున్న తెలంగాణ పంటల సంస్కృతి - ఒక పరిశీలన
- బి. వేణుగోపాల్ రెడ్డి
సంస్కృతి వివిధ రూపాలలో కనపడుతుంది. ముఖ్యంగా ఒక ప్రాంత ప్రజలను గుర్తించాలంటే వారి కొట్టుబొట్టు, భాష మరియు ఆహారపు అలవాట్ల ఆధారంగా గుర్తించగల్గుతాము. అయితే ఆహారపు అలవాట్లు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటాయి. వీటి ఆధారంగా వారి సంస్కృతి ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఆహార లభ్యత ఆ ప్రాంత వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. ఒక ప్రాంతంలో పండే రకరకాల ఆహారధాన్యాలు మరొక ప్రాంతంలో పండకపోవచ్చును. కావున ‘ఆహార సంస్కృతి’ వారి జీవితంలో భాగం. ఏ కాలంలో పండే పంట ఆ కాలంలో వారు ఉపయోగించుకుంటారు.
తెలంగాణది ప్రత్యేక ఆహార సంస్కృతి. ఇక్కడ అనేక రకాలైన పంటలు పండుతాయి. ప్రతి పంటొక ప్రత్యేకతను కల్గియున్నది. అది వారి ప్రధాన అలవాటుగా మారుతున్నది. నేడు ఆ విత్తనాలు కనుమరుగు అవుతున్నాయి. విత్తనం తరతరాల ఆస్తి. వ్యవసాయం ప్రారంభం నుంచి అవి మానవ జీవితానికి జీవితాన్ని అందించాయి.
కాని, నేడు వ్యవసాయం వ్యాపారాత్మకంగా మారడం వల్ల, వాణిజ్య పంటలకే విలువ ఇవ్వడం మరియు సంకర విత్తనాల వాడకం పెరగడం వల్ల చాలా రకాల ఆహారధాన్యాలు అంతరించే దశకు చేరుకున్నవి. రైతు తాను పండించి పది మంది బ్రతికే దశలో వ్యవసాయం ఉండింది. కాని నేడు తనే బ్రతికే పరిస్థితి లేదు. మరియు ఒకే రకమైన వాణిజ్య పంట అయిన ప్రత్తివేయడం (తెలంగాణలోని చాలా జిల్లాలు) వల్ల ఒక ఉప్పు తప్పితే బయట ఏమి కొనుక్కోని రైతు ప్రతి తిండి గింజలు అధిక రేటు ఉన్నా కొనుక్కోక తప్పడం లేదు. ‘నవధాన్యాలు’ పండించిన రైతు నేడు ధాన్యాలపై దృష్టి పెట్టడం లేదు.
ఆదిలాబాద్‌లోని కొన్ని ప్రాంతాలు తిరిగినపుడు చాలా మంది రైతులు ఈ పంటలు వేయడం లేదని తెలిసినది. పెద్ద మనుషులను పలకరించినపుడు అప్పటి పంటలు, ఆనాటి కాలం గురించి ఎంత చెప్పిన తక్కువే. అది పసిడి పంటల కాలం ఇప్పుడున్న హైబ్రిడ్ సంస్కృతికి ఆనాటి దేశ సంస్కృతి చాలా తేడా, జమీన్ ఆస్మాన్ ఫరకున్నదని చాలా మంది పసిడి పంటల కాలాన్ని గుర్తుచేసుకొన్నారు. నిజమే… ‘ఎవరిని అడుక్కోకుండా తనే స్వయంగా సమృద్ధిగా బ్రతికే ఊరు, ఊరుమ్మడి బతుకులు గిపుడు కనపడ్తలేవు’ అని బొంత సినబాయి పంటల గురించి చెప్తూ… “మిరుగు పడకపోతే అరుగు అయిపోతది” అన్నట్లు మా బతుకు భూమి, కాలంతో ముడి అయి ఉన్నదని బతుకు కాలం ఎట్లా ముడి అయి ఉన్నదో పల్లె తల్లుల తాత్విక చింతన ఎంత గొప్పదో అర్థమవుతున్నది. మిరుగు అప్పుడు ‘అనుముల’తోనే విత్తనం పెట్టడం ప్రారంభిస్తాం. అనుములు పెట్టడం గిపుడు చాలా తగ్గినది. ఇది ఎంతో పురాతనమైన విత్తనం. దీనిలో హైబ్రిడైజేషన్ జరుగలేదు. కావున దేశియే దొరుతకున్నది. అనుములు ఉడకబెట్టుకొని తింటే ఆ రుచికి గంజెడు కాయ కొద్ది సేపట్లోనే అయిపోతది. అని ఆ విత్తన ప్రత్యేకతను వివరిస్తున్నది. విత్తనం వారి జీవితంలో ఒక భాగమవుతున్నాయి. అట్లనే చిక్కుళ్ళు (బెల్లం చిక్కుడు, గణె చిక్కుడు, తెల్ల చిక్కుడు), బబ్బెర్లు కూడా ఆహారానికి ఒక ప్రక్క పెట్టుకుంటరు.
జొన్నలు తెలంగాణలో ప్రధాన ఆహారపంట. ఇది రైతు సంస్కృతిలో భాగమైనది. దీని ప్రత్యేకతను తెలుపుతూ… ఆదిలాబాద్ జిల్లాలోని ‘సాసీమ’ ప్రాంతంలో జొన్నలు ప్రధాన ఆహార పంట. వరి తక్కువగా పండేది. కావున ఎప్పుడైనా పండుగలపుడు వరి అన్నం తినేది. కదురులో పొన్ను రోకలితో పోటు పెట్టి బియ్యంగా మార్చుకొని వండుకునేది. వరిలో వట్టి అడ్లు వర్షాకాలంలో పండుతాయి. దీనిలో ఎర్రవి, తెల్లవి దొరుకును. మరియు బీటడ్లు పండును. జొన్నతో మేము ఘటక, రొట్టెలు తినేవారం. జొన్నలను దంచి ‘బగార’ వండుకుంటాం. అది ఎంతో రుచికరంగా ఉంటది. మరియు అంబళి కాచుకునేది. జొన్న పిండితో ‘జందకాయలు’ పుష్యం నెలలో వండుకునేది. (పుష్యం నెల ప్రాముఖ్యత ఏమనగా బర్రె గాని, గొడ్డు గాని ఈనితే దుడ్డె గాని, ల్యాగ గాని ఆడబిడ్డకు ఇస్తారు.) జొన్న రొట్టెనే ఇపుడు తక్కువ తింటున్నారు. ఎంతో బలం ఉన్న ఆహారం గిపుడు అందరు తింటలేరు. అన్నం బుసి బుక్కినట్టె ఉంటది. ఎంత తిన్నా మళ్ళా ఆకలైనట్లే ఉంటది. తక్కువ వర్షపాతం, సెలక, బరకంలో పండే ‘పసిడి పంట’ జొన్న రకాలు నేడు లేవు. అని బాధపడుతున్నది చినబాయి. ఏమేమి రకాలు అప్పుడు పండిచేది అని అడిగితే, లటారు జొన్నలు (గువ్వ జొన్నలు) పెద్ద జొన్నలు (ఇపుడు ఇవి కనిపించకుండయినాయి). ఇవి రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి పంది మూతి కంకులు, రెండు టేకెదరి పెద్ద కంకులు. వీటి వల్ల రుచికరమైన రొట్టెలు తయారగును. మళ్ళా ‘ఆమ జొన్నలు’ వేసేది. ఇవి పచ్చ ఆమలు, తెల్ల ఆమలుగా దొరుకుతుండేడిది. ఇవి పిస్కుళ్ళ కొరకువేసేది. అద్భుతమైన రుచి కల్గినవి పిస్కుళ్ళ జొన్నలు. వాటి రుచి తియ్యదనం నేటి తరంకు తెలువదు. అట్లనే రామకేడి జొన్నలు, పులగం జొన్నలు, ప్యాలాల జొన్నలు, అప్పాల జొన్నలు, జిగట జొన్నలు పండించేవారం. ఇవి నేడు అసలుకే కనపడడం లేదు. అసలు ‘గౌరాణి’ పంటలే కనపడకుండయి. తొగళ్ళు (కందులు) లో ఎర్ర తొగళ్ళు, తెల్ల తొగళ్ళు, నల్ల తొగళ్ళు ఉండేటివి. ఇపుడు హైబ్రిడ్ రకం వేయడం వల్ల ఒక్క ఎర్ర తొగళ్ళు ఇపుడు దొరుకుతున్నా మిగతావి పండిస్త లేరు. అని తన వ్యవసాయ విద్యను చెబుతున్నది. ఇంకా వేరుశెనగ (పల్లీలు) ఈ ప్రాంతంలో బాగా పండుతాయి. భూమిలో దూరంగా తీగల ద్వారా కాచేవి గుత్తి వేరుసెనగ (ఇందులో మూడు గింజలు). గుత్తి వేరుశెనగనే ఇపుడు ఎక్కువగా కనిపిస్తున్నది. అలాగే గోధుమలు రబిలో పండేవి. తెల్ల గోధుమలు (జవ్వల్), ఎర్ర గోధుమలు రెండు రకాలు మంచి పంటరకాలు. సెనగలు ఎర్ర సెనగలు, తెల్ల సెనగలు రకాలుగా ఉన్నవి అలాగే ‘అట్నాలు’ అనేవి పండించేవారు. ఇవి బఠాణీల మాదిరిగా ఉంటాయి. వీటిని పప్పుగా, ఎంచుకొని కూడ తింటారు. ఇవి అసలుకే కనపడడం లేదు. నువ్వుల్లో తెల్ల నువ్వులు, నల్లనువ్వులు, పయ్య నువ్వులు ఉన్నాయి. నువ్వు ‘మూడు నెళ్ళ’ పంట. అందుకే “పుబ్బలో వానపడితే పువ్వుకు పుట్టెడు నువ్వులు పండుతాయి.” అన్న నానుడి ఉన్నది. మళ్ళ బరకత్ ఎక్కువ గల పంట. ప్రతి ఒక్కరు నువ్వు అలికేది. గానుగ పట్టించి నువ్వుల నూనె వాడుకొనేది. ఇది ఎంతో బలవర్ధమైనది. చిన్న పిల్లగాండ్లకు నువ్వుల నూనె రాయడం వల్ల చర్మం సున్నితంగా ఉండును. ఎముకలు బలంగా తయారగును. ఈ రోజు నువ్వుల నూనె దొరకడం లేదు. పంటను కూడ రైతులు వేయడానికి ఆసక్తి చూపడం లేదు. అలాగే నూనె గింజలైన కుసుమలు, అవిసెలు, ఉలవలు, ఆవాలు కూడ వేస్తారు. ఆముదం నూనె దీపాల కోసం బాగా వాడుతుంటిమి. ఇయ్యాల ఇంటి ముందు దీపాలే కానవస్తలేదు. ఇప్ప పరకలతో (గానుగ కట్టి) చేసిన నూనె సుక వాడుతుంటిమి.
నేడు చాలా రకాల విత్తనాలు ఈవిధంగా అంతరించి పోతున్నాయి. వ్యవసాయంలో గత రెండు దశాబ్దాలుగా ఈ విపత్కర పరిస్థితి కొనసాగుతున్నది. “యవుసం మాబతుకులు సక్కదిద్దకపోయిన ఎంతో కొంత విత్తనాలు అంతరించకుండా మా గిరిజనుల దెగ్గరనే ఉన్నయి” అని తొడసం చిత్రు పట్నాపూర్, బోథ్ తమ స్థితిగతులను, కాపాడుకుంటున్న తరాల విత్తనం గూర్చి గోస వెళ్ళగక్కొండు. పోడు వ్యవసాయం తర్వాత స్పష్టమైన వ్యవసాయ విధానం మా ఆర్థిక, సామాజిక స్థితిగతలకు అనుగుణంగా ప్రభుత్వం ఇవ్వలేదు. ఇతర గిరిజనేతర రైతుతో మేము పోటి పడలేము. సబ్సిడీలతో కుంటి వ్యవసాయం చేయలేక అడవి దూరమవుతున్న సందర్భంలో ‘అర్దాకలి యవుసం’ అస్థవ్యస్థంగా నడుస్తుందని చెప్పిండు.
అయ్యా… ఇయ్యాల భూక్ హర్తాల్ చేసినా సర్కార్ ఏమి చేస్తలేదు. కాని గా కాలంల కరువచ్చినపుడు సామలు, సజ్జలు (కుండె జొన్నలు), బుర్కలు (మంచుతో పండేవి కూడ ఉంటయి) కొర్రలు 3 నెలలకే పంట వస్తుంది. కరువులో అవి మమ్ములను ఆదుకునేటివి. గుడ్డి సర్కారు గడ్డి తింటున్నది గని మా వ్యవసాయం మా జీవి గంజి అవుతున్నది. కాని గీ కాలంల అవి సుక మాకు దొరుకత లేవు. అని సకాలం పోయి అకాల పరిస్థితులు ఎట్లా దాపురించినవో, ప్రభుత్వం, కాలం మధ్య విభజన రేఖ ఎట్లా ఉన్నదో బండారి భోజరెడ్డి ఆవేదనగా మాట్లాడటం ఈనాటి భూక్ హర్తాల్ ‘బేకార్ హర్తాల్’ గా మారడం చాలా బాధగా అనిపిస్తున్నది. పెద్ద మనుషులు తమ అనుభవము ఒక్కొక్కటి నెమరు వేస్తున్నపుడు చాలా ఆసక్తికర విషయాలు తెలిసినయి. పెసర్లు, మినుము లాంటి ధాన్యాలు పండించడం తగ్గినది. తగ్గడంతో ఈ ధాన్యాలతో వంటలు లేకపోవడం ఒక లోటుగా మారినది. పెసర్లలో తీగ పెసర్లు, పచ్చ పెసర్లు ఉన్నయి. తీగ పెసర్లు జొన్నలో వేస్తారు. ఇవి కనిపియ్యడం లేదు. వ్యవసాయం సమృద్ధి ఎప్పుడవుతుంది. రైతు ఆదాయ వ్యయాలు సరిగ్గా ఉన్నప్పుడు. కాని నేడు వ్యవయం విపరీతమైనది. మొదట పత్తి పండించినపుడు చిన్న పత్తి, పెద్ద పత్తి (పెద్ద బుగ్గ కల్గినవి) పండించేవారు. చిన్న పత్తినే ‘కాటోల్’ పత్తి అందురు. పెద్ద పత్తి పెద్ద చెట్టయితది. అయితే కాటోల్ పత్తి చిన్న బుగ్గ ఉండును. అధికంగానే దిగుబడి వచ్చేది. దక్కన్, గుజరాత్‌కు సంబంధించిన పత్తి రకాలు ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచినవి. అటువంటిది ఆంగ్లేయులు యంత్రాలకు తగిన విధంగా ఉండడానికి పొడవు పింజగల పత్తిని ప్రవేశపెట్టి ఇక్కడి కాల పరిస్థితులకు తట్టుకునేవి కాకపోవడం వల్ల వాటి పై అధిక పెట్టుబడి పెట్టడంవల్ల రైతు పరిస్థితి నేటికి మారలేదు. అప్పటి కాలంలో తక్కల్లు (షేరు) దూది దూదేకులకు ఇస్తే ఏకులు చేసి ఇచ్చేవారు. రాట్నంతోటి దారం తీసిన ‘కండెలు’ శాలొల్లకు ఇస్తే ‘పసడాలు’ ఇచ్చేవారు. (ఇవి తెల్లగా ఉండి ఎంతో వెచ్చగా ఉండును). ఈ రోజు వ్యవసాయ వృత్తి సంబంధాలు కరువై పోవడం వల్ల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నది. విత్తనం స్వంతంగా సంరక్షించుకునే రైతు హక్కు నేడు ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు ధారదత్తం చేయడం వల్ల రైతు బతుకులతో ఆడుకుంటున్నది. పత్తి గింజలకు పెండరాసి విత్తుకునేవారు. విత్తనం తరతరాల సంస్కృతికి చిహ్నం, సంస్కృతి వారసత్వం కావున విత్తనాలకు రైతే హక్కుదారుగా ఉంటడు. విత్తనం రైతు జీవితంలో భాగం. య్యవుసం, జీవితం అయిన రైతు గొప్ప ‘టెక్నాలజిస్ట్’ అని ప్రపంచానికి తెలుసు.
వ్యవసాయ అవసరాల కోసం జనుముతో తాళ్ళు తయారు చేసుకుంటరు. తెల్ల పుంటి, ఎర్ర పుంటి పండిస్తరు. జనుపనార తెల్లపుంటితో తీస్తారు. ఎర్ర పుంటికూర ఆహారంగా పనికి వస్తుంది. కరెంటు లేని రోజులో లైట్‌గా ఒక దిక్సూచిలా పుంటి కట్టె మండుతుంది. పొయ్యి అంటి పెట్టడానికి పుంటి కట్టె ఉపయోగపడ్తది. ఎండ్రికాయలు పట్టడానికి లైట్‌గా ఆహార అన్వేషణ జరుపుతది. పుంటి నుంచి నూనె సుక తీస్తారు. గంగకు నైవేద్యం వేయడానికి దీపం పుంటి కట్టెతో తయారుచేస్తరు. నిప్పు రాజేయడానికి జకముక దూది తంగకు పూత వస్తుంది. దీనిని చిట్టెడు జొన్నలకు ఇచ్చేవాళ్ళు. వస్తు మార్పిడి ఒక గొప్ప ‘సాంస్కృతిక జీవనమని’ తెలుస్తున్నది.
వ్యవసాయం ఒక జీవన విధానంగా మారిన క్రమంలో వ్యవసాయం చుట్టు అల్లుకున్న మరొక విధానం ‘ఆహార సంరక్షణ’ అనగా ధాన్యాగారం. దీని తయారిలో రైతు మేధస్సు తెలుస్తున్నది. గాయ ఇంటిలో ఒక మూల గది లాంటి భాగం ధాన్యాగారం. అట్లనే గుమ్మిని వాయుల్ పబ్బుతో తయారుచేస్తరు. ఇది గుండ్రంగా, నిలువెడెత్తు ఉండును. దీనికి చుట్టు పెండ రాస్తారు. ఇది చల్లగా ధాన్యసంరక్షణగా ఉండును.
ముల్లకట్ట - వరి గడ్డితో జడ చుట్టు అల్లుతారు. పాతర - ఇది భూమి లోపల తవ్విన నిర్మాణం గుండ్రంగా ఉండి లోతు ఎక్కువగా ఉండును. జొన్నల నిల్వ కొరకు దీనిని తవ్వుతారు. 3సం||రాల సురక్షితంగా ఉండును.
కుమ్మరన్న అద్భుత సృష్టి ‘కాగు’ ఇది నిలవడెత్తుగా ఉండును. దొంగల బెడద ఉన్నప్పుడు సురక్షిత స్థలం మరియు విత్తనాల నిల్వకై ‘బుర్రకాయలను’ వాడుతారు. రైతు మేధస్సు సృష్టించిన ఇంజనీరింగ్ అద్భుతమైనది. ఇవన్నీ ఆధునిక వ్యవసాయంతో కనుమరుగు అవుతున్నయి. ‘జడ్డిగం’ లాంటి వ్యవసాయ పనిముట్టు నేడు తయారీలో లేదు. అన్నీ అంతరిస్తున్న దశకు చేరుకున్నది.
మట్టి పొరలలో శ్వాసిస్తున్న విత్తనం భూమిని చీల్చుకొని వచ్చి తన అస్థిత్వాన్ని ప్రకటింపచేస్తుంది. భావగర్భితమైన తన లక్షణాలను బట్టి విత్తనం స్వభావం తెలుస్తున్నది. గట్లనే తెలంగాణ నేడు జర్గుతున్న తెలంగాణ ఆస్థిత్వ పోరాటంలో ‘సాంస్కృతిక పునరుజ్జీవం’ అంగర్భాగం కావాలి.




on 30 మే 2008 at 10:46 am 1.MAdhusudhan reddy vanteru …
మిత్రులార, అంతరించిపొతున్న మన సంస్కృతిని,పంటలను,మన భూములను కాపాదుకొవాలి.భావి తరాలకు వీటి ప్రాముఖ్యము గురించి చెప్పవలిసిన అవసరము ఉన్నది.