సంస్మరణ సోయి | 02 మార్చ్ 2007 01:30 am
అష్టావధాని, కవిశిరోమణి అందె వెంకటరాజం గారి సాహితీసేవ
- బి.యస్.రాములు
తెలంగాణలో కవులకు కరవు లేదు. కరీంనగర్ జిల్లా కవులకు, కళాకారులకు పుట్టినిల్లు. అందె వెంకటరాజం సాంప్రదాయ కవిత్వ రీతుల్లో పుట్టిపెరిగిన కవి. జీవితమంతా దానికే అంకితమిచ్చారు. సెప్టెంబరు 11 సోమవారం 2006న పరమపదించిన ఆయన వయస్సు 73 సంవత్సరాలు. ఆయన కోరుట్ల డిగ్రీ కాలేజీ తెలుగు లెక్చరరుగా 1992 జూన్ 30వ తేదీన రిటైరయ్యారు.
రిటైరయిన తర్వాత కూడా సాహిత్యరంగంలోని గాని, జీవితం లోగాని రిటైర్మెంటు ఆలోచన లేకుండా నిరంతర కృషి చేసిన అందె వెంకటరాజం సాత్వికుడు. వినయశీలి. రిటైరయిన తర్వాత కూడా ఏడు గ్రంథాలను ప్రచురించారు.
అందె వెంకటరాజం జీవితం నైజాం రాజ్యంలో ఎదుగుతున్న విద్యావంతుల జీవనవికాసాలకు, మధ్యతరగతి ఆవిర్భావానికి ఒక సూచిక, ప్రతీక.
అందె వెంకటరాజంగారి తండ్రి, తాతలు పట్టుబట్టలు నేసేవారు. పద్మశాలి కులానికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు వుండేవి. కోరుట్లలో ఏడో తరగతి వరకు చదివిన అందె వెంకటరాజం ఎనిమిదో తరగతి నుండి జగిత్యాల హైస్కూలులో చదివారు. 1951లో హెచ్చెస్సీ ఉత్తీర్ణులయ్యారు. 1951 నాటికి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, జగిత్యాల అనే రెండు కేంద్రాల్లోనే హైస్కూళ్లు వుండేవి. జగిత్యాల లోని సుప్రసిద్ధ చిత్రకారులు పి.టి.రెడ్డి అవార్డు గ్రహీత అలిశెట్టి మహరాజు (అలిశెట్టి ప్రభాకర్ చిత్రలేఖన గురువు) గారి ఇంట్లో అద్దెకుండడం వల్ల వాళ్లు ఒకే వయసువారు కావడంవల్ల వారి స్నేహం జీవితాంతం కొనసాగింది. వారి గ్రంథాలకు అలిశెట్టి మహరాజుగారే ముఖచిత్రాలు వేసేవారు.
కోరుట్ల నేతబట్టలకు, పట్టుబట్టలకు ప్రసిద్ధిగాంచింది. అందె వెంకటరాజం జన్మించిన 14-10-1933 నాటికి ఆ ప్రాంతంలో గత్తర్లతో, కరవుతో, ప్లేగు వ్యాధితో మరణాలు పెరిగి జనాభా సగానికి పడిపోయింది. అదేకాలంలో నైజాం రాజ్యమంతటా ఆంధ్ర మహాసభ సభలు, గ్రంథాలయ ఉద్యమం, ఆర్య సమాజం తమ కార్యకలాపాలను గ్రామాల్లోకి విస్తరించాయి. వర్ణవ్యవస్థలో ఎవరైనా బ్రాహ్మణులు కావచ్చు అనే సిద్ధాంతాలు ఆ కాలంలో ఆర్య సమాజ్ ద్వారా బలంగా కొనసాగాయి. అలా కోరుట్ల, వరంగల్, షోలాపూర్, నిజామాబాద్ మొదలైన ప్రాంతాల్లో పద్మశాలీలు పద్మబ్రాహ్మణులుగా, పూజారులుగా మారారు. పోతులూరి వీరబ్రహ్మం ఉద్యమంతో విశ్వబ్రాహ్మణులు, పద్మశాలీలు, మరికొన్ని కులాలు తాము కూడా బ్రాహ్మణులమే అని జంధ్యాలు వేసుకోవడం ఒక ఉద్యమంగా తర్వాత సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్నది. అలా జంధ్యం వేసుకున్న పద్మశాలీ కులంలో పుట్టిన కవి అందె వెంకటరాజం.
1944లో ఆంధ్రమహాసభ కమ్యూనిస్టుల ఆంధ్రమహాసభగా చీలిపోయేనాటికి అందె వెంకటరాజం 5వ తరగతి చదువుతున్నారు. 1945 నుండి కమ్యూనిస్టు ఆంధ్రమహాసభ ఉద్యమం కరీంనగర్ జిల్లాలో కూడా వేగం పుంజుకుంది. ఆ సమయంలో 12 ఏళ్ల కుర్రాడిగా వున్న అందె వెంకటరాజం తొలి కవిత రాశాడు. దాన్ని అప్పటికే స్వంత పుస్తకాలు ప్రచురించిన అచల తత్వవేత్త మిట్టపెల్లి రాజయ్య వీరికి మేన బావగా ఎవరు విమర్శించినా రాయడం ఆపకు అని ప్రోత్సహించారు.
1947 ఆగస్ట్ 15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. నైజాం రాజ్యం స్వతంత్ర రాజ్యంగానే కొనసాగుతున్నది. 1948 సెప్టెంబర్ 17న తేదీన నైజాం రాజ్యం భారతదేశంలో విలీనమయ్యే ఒప్పందం కుదిరింది. దాంతో అందె వెంకటరాజం తన 17వ యేట 10వ తరగతి చదువుతున్నప్పుడు 1948 ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవం మొదటిసారిగా జరుపుకున్నారు.
కోరుట్ల ప్రజలకు కరీంనగర్తో పాటు నిజామాబాద్ జిల్లాలోని గ్రామాలతో సన్నిహిత సంబంధాలు వుండేవి. జిల్లాల సరిహద్దులు, మానసిక సరిహద్దులుగా అప్పటికింకా రూపుదిద్దుకోలేదు. బంధుత్వాలు గానీ, పని కోసం వెతుకులాట గానీ జిల్లాలు దాటి, రాజ్యాలు దాటి ప్రయాణం చేసేవారు. 1850 నుండి వేలాదిమంది పద్మశాలీలు ఇతర కులాలవాళ్లు బంబాయి రాష్ట్రానికి, ఇతర ప్రాంతాలకు పని వెతుక్కుంటూ వెళ్లేవారు. అలా హెచ్చెస్సీ పాసైన తర్వాత అందె వెంకటరాజం నిజామాబాద్ జిల్లాలోని బిక్కునూర్‌లో ఉపాధ్యాయులుగా చేరారు. అందె వెంకటరాజం మొదట ఉర్దూ మీడియంలో చదువుకున్నారు. తర్వాత తెలుగు భాషా పరీక్షలను రాసి తెలుగు పండితుడు అయ్యాడు. ఆనాటి తెలుగు భాష పాఠ్యగ్రంథాలు గ్రాంథిక భాషలో ఉండేవి. వాటిని చదివి గ్రాంథిక భాషలో కవిత్వం రాయడం నేర్చుకున్నారు. అయినప్పటికీ చిన్నప్పటినుంచి చుట్టూ ప్రజలు పాటలు పాడడం విని తాను ఎన్నో పాటలు కైగట్టాడు. కాని పాటకు పాఠ్యపుస్తకాల్లో సాహిత్య గౌరవం లేకపోవడంతో దాన్ని అలానే వుంచి పద్యం రాయడం నేర్చుకున్నారు. జాషువా లాగే పద్యాలతో తనను తాను గొప్ప కవిగా నిరూపించుకోదల్చుకున్నారు. అయితే డా||సి.నారాయణరెడ్డి సాహిత్య గురువుగా పరిచయం ప్రారంభమైన తర్వాత సినారె లాగ గేయ కవిత్వం రాయాలని పూనుకున్నారు. అలా రాసిన పద్యాలు మాత్రాఛందస్సు గేయాలతో 1961లో ‘నవోదయము’ అనే కవితాసంపుటి ప్రచురించారు. మా పెదనాన్న మిట్టపెల్లి రాజయ్య జగిత్యాలలో ఉండడంవల్ల వారి ద్వారా ఈ పుస్తకాన్ని నా విద్యార్థి దశలోనే చదివాను. అలాంటి మాత్రాఛందస్సు గేయాలు ఎన్నో రాశాను. అలా నాలో గేయకవిత పట్ల అపారమైన ఆసక్తిని కలిగించడానికి సినారె గారి అక్షరాల గవాక్షాలు, అందె వెంకటరాజంగారి ‘నవోదయం’ ఎంతో స్ఫూర్తినిచ్చాయి.
అటుతర్వాత వానమామలై వరదాచార్యులుగారి పరిచయంతో గేయాలు వదిలి పద్య కవిత్వానికే అందె వెంకటరాజం పరిమితమయ్యారు. సి.నారాయణరెడ్డి, వానమామలై వరదాచార్యులు ఇద్దరూ నా సాహిత్య గురువులు అని ప్రకటించుకున్న అందె వెంకటరాజం ఎందుకో సి.నారాయణరెడ్డి లాగా గేయ, వచన కవిత, పాట ప్రక్రియల్లో కృషి చేయకుండా పద్య కవిత్వానికి, అష్టావధానాలకు మలుపు తిరిగారు.
శూద్రులకు కవిత్వం ఏం వస్తుంది అనే ఈసడింపులు ఉపాధ్యాయ విద్యారంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా విన్న అందె వెంకటరాజం తనను తాను నిరూపించుకోదల్చు కున్నట్టున్నారు. అష్టావధాన ప్రక్రియలో ప్రవేశించి 88 అష్టావధానాలను పూర్తిచేశారు. అష్టావధానాల్లో చెప్పిన పద్యాల నుంచి ఆణిముత్యాలను కొన్నిటిని పుస్తకంగా ప్రచురించారు.
అందె వెంకటరాజం వచన కవిత ప్రక్రియ తప్ప మిగతా సాహిత్య ప్రక్రియలన్నీ చేపట్టారు. నాటకాలు రాశారు. కథలు రాశారు. పాటలు రాశారు. సాహిత్య విమర్శ రాశారు. వానమామలై వరదాచార్యుల కృతులపై పి.హెచ్.డి చేశారు. ఆయన మంచి వక్త కూడా. స్థానిక రచయితలను ఎదిగించడంలో, ప్రచురణలను వెలువరించడంలో సాహిత్య సభలను ఏర్పాటు చేయడంలో కార్యశీలిగా జిల్లాలోనే ఒక ఆదర్శం. స్వాతంత్య్ర సమరయోధులు డా|| బోయినపెల్లి వెంకటరామారావు తర్వాత నిరంతరంగా సభలు, సమావేశాలు దశాబ్దాల తరబడి కొనసాగించిన ధన్యజీవి అందె వెంకటరాజం. వారి గొప్పతనం ఏమిటంటే ఎవరు విరాళం ఇచ్చారో వారి పేర్లన్నీ ప్రతి పుస్తకంలో ప్రచురించి దాతలను చరిత్రలో నిలిపారు. వారు ఇచ్చింది ఎప్పుడో మర్చిపోయారు. కాని ఇచ్చిన దాతృత్వం ద్వారా వారి పేర్లు పుస్తకాలు ఉన్నంత కాలం దశాబ్దాలుగా నిలిచి కొనసాగుతున్నాయి.
అందె వెంకటరాజం వందలాది ఉపాధ్యాయులను తయారుచేశారు. వారిలో ఎందరో రచయితలుగా ఎదిగారు. అందె వెంకటరాజం ‘నవోదయం’ కవితాసంపుటి తర్వాత మణిమంజూష (కవితాసంపుటి 1971), భారతరాణి (నాటికల సంపుటి 1971), భువన విజయము (నాటిక 1971), వానమామలై వరదాచార్యులవారి కృతులు - అనుశీలనము (సిద్ధాంత గ్రంథం 1986), మానసవీణ (కవితా సంపుటి 1993), సాహితీ జీవన తరంగాలు (సాహిత్య వ్యాసాలు 1994), అవధాన పద్యమంజరి (1995), శ్రీ గోవిందగిరి తత్వ గీతమాల (9 గీతాలు 1997), నింబగిరి నరసింహ శతకము (1999), విచిత్రగాథలు (2006) వెలువరించారు. స్వర్ణ భారతము (పాటల సంపుటి 2006) ప్రూఫ్ స్థాయిలో ఉండగానే మరణించారు.
సాహితీవేత్త అన్ని ప్రక్రియలను రాయాలి, రాయగలడు అని విశ్వసించిన తరాల లోని చివరి తరానికి చెందినవాడు అందె వెంకటరాజం. ఇప్పుడు అన్ని ప్రక్రియలు రాయాలని రచయితలు అనుకోవడంలేదు. పత్రికలకు రాయకుండా డైరెక్టుగా పుస్తకాలే తెచ్చుకోవాలి అని అనుకునే తరానికి కూడా చివరి ప్రతినిధి అని చెప్పవచ్చు. పత్రికల్లో రాకపోవడంవల్లనైతేనేమి, సాంప్రదాయ, సాహిత్య రీతులను ఎక్కువగా ముందుకు తీసుకుపోవడంవల్లనైతేనేమి అందె వెంకటరాజం కృషి పండితులకు, స్థానిక జిల్లా ప్రజలకు పరిమితమైంది. అయితే సాహితీవేత్తగా అతని కృషికి గుర్తింపు రాష్ట్రవ్యాప్తంగా సుప్రసిద్ధుడు. సాహిత్య అకాడమీ సభ్యులుగా చాలాకాలం కొనసాగారు.
అందె వెంకటరాజం కవితల్లో సామాజికమైన వస్తువు వుంటుంది. ఇప్పుడు సాహిత్యంలో అభివ్యక్తి మారింది. అయినప్పటికీ అందె వెంకటరాజం కవితల్లో కొన్ని చాలాకాలం నిలిచేవి ఉన్నాయి.
ఉపాధ్యాయులను బతకలేక బడిపంతులు అని కొంతకాలం అనేవారు. ఇప్పుడు బతకనేర్చినవారే బడిపంతులు. బతకలేక బడిపంతులు అనేవారిని ప్రశ్నిస్తూ అందె ఇలా అంటారు - ‘బతుకు నేర్పు బడిపంతులు / బతుకలేని మానవుడా?… తాళిగట్టనట్టి మగలు / తనకు నలుగురున్నారు… సారె కటిటు వంచినచో / శాఖ యేమి వికసించును? కదలుచుండు జలములలో / కనబడునే ప్రతిబింబము? అని విద్యాధికారుల, రాజకీయ నాయకుల పెత్తనాన్ని తేప తేపకు బదిలీలను నిరసించారు.
అందె వెంకటరాజంగారికి పీడిత ప్రజల దృక్పథం సహజంగానే అలవడింది. అయితే అది ఎక్కువ కవితలుగా జాలువారలేదు. ‘భోగసాగరమున దేలి / భూవలయము బట్టి యేలి / నరరక్తము ద్రాగి తూలి / నర్తించును సంపన్నుడు, కలవారికె చదువు పదవి / కలవారికె ఓటు సీటు / కలవారికె సుఖము లన్ని / కలవారికె బతుకు సుమ్మి’ అని ప్రశ్నిస్తూ కులమతాల హెచ్చుతగ్గులను ఈసడించారు. నేత కార్మికుల గురించి చక్కని పాట ఒకటి రాశారు. ‘అన్నము లేకున్న కొన్ని నాళ్లుండొచ్చు / బట్టలేక ఒక పూట బతుకు గడచేనా? / ఇల్లు ముంగిలి లేక ఎందైన నిలువొచ్చు / బట్టలే కొక నాట బతుకు నడచేనా?’ అంటూ అఖిల కార్యమ్ములకు ఆదిమూలము గుడ్డ / అచ్ఛనాగరికతకు ఆదిచిహ్నము గుడ్డ’ అనే గొప్పసత్యాన్ని స్పష్టం చేశారు.
గ్రంథాలయం యొక్క అనే ప్రాశస్త్యం గురించి తెలంగాణ విమోచనం కాకముందటి దీనమైన ప్రజల బతుకు గురించి చక్కని కవితలు రాశారు. ‘స్వాములు బండ్లపై స్వారి చేయుచు నుండి / ఎడపక ముందు పర్వెత్తినాము / కోపాన పైబడి కుక్కల గొట్టిన / ట్లెంత గొట్టిన మేను లిచ్చినాము / రక్తమ్ము చెమటగా రాల్చి పనుల కంటె / ఘోరమౌ కడగండ్ల మానాల / నెదిరించ లేక యర్పించినాము’ అంటూ గద్గదస్వరంతో గతాన్ని తలపోస్తారు.
మహాకవి దాశరథి గురించి, సినారె గురించి చక్కని కవితలు రాశారు. జీవితం పట్ల అవగాహన కోసం జీవిత శకటం అనే పాటను రాశారు. ‘ఈ జీవితశకటము / ఎపుడు చేరునో గమ్యము / ఎడమడుగగు పయనమ్ముల / బపడలి పోయె సడలిపోయె’ అని జీవితంలోని ఎగుడుదిగుడులను, రాగద్వేషాలను చాలా సులభంగా అర్థమయ్యేట్టు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి గీతాలు కోకొల్లలుగా కన్పిస్తాయి. అవి జీవితంపట్ల పాఠ్యపుస్తకాలు ఇవ్వలేని అవగాహనను ఇస్తుంటాయి.
యువశక్తి యొక్క ప్రాధాన్యతను, తెలుగుతల్లి విశిష్టతను, పసిపిల్లల ప్రబోధాలను సుప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ బి.రాజంబాబు ప్రశంసను, ఒకనాటి చేనేత వైభవాన్ని, రుణబాధను, ఆదికవి నన్నయ నుండి రాజయోగి మిట్టపెల్లి రాజయ్య దాక ఎందరినో స్మరించారు, కవిత్వీకరించారు.
అంగడి గురించి ఇటీవల గోరటి వెంకన్న అనే కవి ఒక గొప్ప పాట రాశారు. అందె వెంకటరాజం మానవ సంబంధాలు తెగుతున్న తీరును అంగడిలోకంగా చాలాకాలం క్రితమే పాట రాశారు. ఈ అంగడి లోకంలో ‘ఎవరికివారే యమునాతీరే / ఎవరి బతుకు వారిదే / ఎవరి మెతుకు వారిదే / ఎవరి వెతలు వారివే’ అంటూ వేదన చెందారు. నిత్యశంకితుడి గురించి - ‘తా నెవ్వని నమ్మనిచో / తన నెవ్వరు నమ్మబోరు’ అని చక్కని మాట చెప్పారు.
కృతజ్ఞత లేని వాణ్ణి కొడుకైనా ఏరు దాటిన తర్వాత బోడిమల్లయ్య అయినా ‘కృతఘ్నుని శవాన్ని కుక్క కూడా ముట్టదు’ అని శపిస్తారు. ఇలా మానసవీణ కవితాసంపుటి చూపుకు సాంప్రదాయ కవిత్వ పుస్తకంలా కనపడినా ఆధునిక సాహిత్యం నింపుకొన్న తీరును తెలుపుతుంది.
అష్టావధాన మంజరి పుస్తకంలోని పద్యాలను, అవధానంలో కల్పించే అవరోధాలను కావాలని అపఖ్యాతికి నెట్టే విధంగా వేసే ప్రశ్నలు, ఇచ్చే దత్తపదులు, నిషేధాక్షరాలు, సమస్యలు మొదలైనవి చదువుతుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఈత ముళ్లల్లో, తుమ్మ పొరకలో ఇరుక్కుపోయిన శరీరం ఎంత బాధపడ్తుందో అలాంటి భావన వారి వివరణ చూస్తే మనకు కూడా హృదయం కలుక్కుమంటుంది. అయితే వాటన్నిటిని అధిగమించి అష్టావధానాలను జయప్రదంగా నిర్వహించి జేజేలు అందుకున్నారు. బంగారు కడియాలను సినారె, వానమామలై వరదాచార్యులు మొదలైన వారి హస్తాలమీదుగా అలంకరించుకున్నారు.
విచిత్ర గాథలు అనే కథలసంపుటి గాథాసప్తశతి వంటి జీవిత శకలాల నుండి ఒక సందేశం, ఒక తాత్వికత అందించే ప్రయత్నం చేస్తుంది. హాస్యం, అమాయకత్వం, మానవ మనస్తత్వాలు, నమ్మకాలు మొదలైనవి ఇందులోని 73 కథల్లో చక్కగా పరుచుకున్నాయి. ఇంకా ఆవిష్కరించబడని ఈ పుస్తకం ఒక 30 ఏళ్ల ముందు వచ్చి వుంటే అందె వెంకటరాజంగారి సాహిత్యపీఠం సాహిత్యచరిత్రలో మరోవిధంగా వుండేది. విచిత్ర గాథలు, ‘స్వర్ణభారతం’ పాటల సంపుటి చాలాకాలంగా నేను చేస్తున్న డిమాండ్, విమర్శ తట్టుకోలేక చివరకు తెచ్చిన పుస్తకాలు. అందుకే కాబోలు విచిత్ర గాథలు పుస్తకానికి ముందుమాట రాయాలని రాయించుకున్నారు.
అందె వెంకటరాజం అందించిన సాహిత్యం విలువైనది. ఒక సామాజిక పరిణామ క్రమంలో ఎదిగిన అనుమాండ్ల భూమయ్య, దూడం నాంపల్లి, ఆశావాది ప్రకాశరావు, కసిరెడ్డి వెంకటరెడ్డి, రవ్వా శ్రీహరి మొదలైనవారి క్రమాలన్నీ ఒకే రకంగా ఉండడంలో ఒక అంతస్సూత్రం వుంది. పేదరికం నుండి పెద్దల తిరస్కారాల నుండి జీవితాన్ని, సమాజంలో ఒక గుర్తింపును సాధిస్తూ సామాజిక సేవగా సాహిత్యాన్ని అందించాలనే ధ్యేయం, లక్ష్యం వీరందరిలోని అంతస్సూత్రం. జీవితాన్ని గెలుచుకుంటూ తన జీవితం తను జీవిస్తూ తనతో చేతనైన మేరకు సాహిత్యం కోసం, సమాజం కోసం కృషి చేసిన కోవలోకి వీరు వస్తారు.
అందె వెంకటరాజం తన రచనలతోపాటు తెలుగు సాహిత్యానికి ఇచ్చిపోయిన వారసత్వం మరెంతో వుంది. తన శిష్యులను ఎదిగించడం, సాహిత్య సమావేశాల కోసం ‘భారతీ సాహిత్య సమితి’ని…లో ఏర్పాటుచేసి నిరంతరం సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఎందరికో స్ఫూర్తినిచ్చి అందుకోసం సినారె పార్లమెంటు సభ్యుల ఫండ్ను సాధించి సినారె కళాభవనాన్ని కోరుట్ల ప్రజలకు అందించిన ధన్యజీవి అందె వెంకటరాజం. అది ప్రారంభం కాకముందే చనిపోవడం ఆయన సంతాపసభతో 16-9-2006 ఆదివారం నాడు అది ప్రారంభం కావడం ఒక వైచిత్రి.
అందె వెంకటరాజం షష్టిపూర్తి సంచిక 1995లో వెలువడింది. అందులో వారి జీవితవిశేషాలతో పాటు మరెన్నో విశేషాలు తెలుస్తాయి. శ్రీ గాదె శంకర కవి, సుప్రసిద్ధ కవి సుద్దాల అశోక్ తేజ, బి.ఎస్.రాములు, బైరి నర్సయ్య మొదలైన ఎందరికో ఉత్తేజాన్ని స్ఫూర్తిని ఇచ్చిన అందె వెంకటరాజం 75 ఏళ్ల వజ్రోత్సవ సంచిక వెలువరించాలని అనుకున్నారు. కాని రెండేళ్ల ముందు తనువు చాలించారు. పాత రోగాలు తిరిగబెట్టడానికి చికున్ గున్యా రావడం ప్రధాన కారణం. చికున్ గున్యా తీసుకుపోయినవారిలో అందె వెంకటరాజంగారు ఒకరు.
సాహితీ జీవనతరంగాలు వ్యాస సంపుటిలో తన స్వీయ చరిత్ర నుండి కొన్ని సంఘటనలు కూడా వ్యాసాలుగా రాశారు. అలాగే అందె వెంకటరాజం షష్టిపూర్తి సంచికలోను, వారి సమీప బంధువు ఎక్కలదేవి లక్ష్మణ (పద్మశాలి సంఘ నిర్మాతల్లో ఒకరు, వారు కూడా అందె వారి కన్నా వారం ముందు 88వ యేట పోయారు.) గారి షష్టిపూర్తి, వజ్రోత్సవ సంచికలలోను రికార్డుకాని సామాజిక జీవితం ఎంతో వుంది. అయినప్పటికీ అందె వెంకటరాజం ఏ సమాజం నుండి, ఏ సామాజిక, చారిత్రక, రాజకీయ పరిణామాల గుండా జీవిస్తూ ఎదిగారో రికార్డు చేయవలసే వుంది. ఆయన రచనలపై, జీవితంపై పరిశోధన చేసే విద్యార్థులతోపాటు బతికున్న అతని సమకాలికులందరి కర్తవ్యం. ఈ కర్తవ్యం నెరవేర్చినప్పుడు దాశరథి రంగాచార్యగారి ‘జీవనయానం’లా, బిట్ల నారాయణగారి (రవివర్మ ఫోటో స్టూడియో, వరంగల్) ‘నా అంతరంగాలు’ లాగా ఒక గొప్ప సామాజిక పరిణామక్రమం చరిత్రగా గణుతికెక్కుతుంది.




on 26 డిసంబర్ 2009 at 11:23 pm 1.baabji tvk …
వీర బ్రహ్మం గారి ఉద్యమం చూసి విశ్వ బ్రాహ్మణులు కూడా మేమూ బ్రాహ్మణులమే అని జంధ్యాలు వేసుకున్నారని వ్రాశారు.వీర బ్రహ్మం గారు పుట్టింది 1610 సంవత్సరం లో.అంటే అంతకు ముందు విశ్వబ్రాహ్మణులు జంధ్యాలు వేసుకోలేదా..? ఒక్క సారి వేదాలు, ఉపనిషత్తులు , బ్రాహ్మణాలూ చదివి నిజమైన బ్రాహ్మణులు ఎవరో తెలుసుకొని అప్పుడు వ్రాయండి.విశ్వబ్రాహ్మణులకు వేదాలలో ఎంత విశిష్టమైన స్థానం ఉన్నదో,అసలు దేవతలెవరో,విశ్వకర్మ ఎవరో,విశ్వకర్మకూ విశ్వ బ్రాహ్మణులకూ గల సంబంధం ఏమిటో, జంధ్యం వేసుకునే హక్కు ఎవరికి ఉందో,అసలు ..జంధ్యం సృష్టించిందెవరో…ఇత్యాదులు కనీసం తెలుసుకుని ప్రాథమిక అవగాహనతో వ్రాయగలరు.మీకు తెలియక పోతే నాకు వ్రాయగలరు. నేను కూలంకషంగా సగౌరవంగా మీకు తెలియ చేస్తాను. మనకు తెలియని విషయం చిన్న పిల్లల దగ్గర నుండీ ఐనా తెలుసుకోవడంలో తప్పు లేదు అని నా భావన. మీరు అడిగే ప్రతి సందేహానికీ నాదగ్గర ఖచ్చితమైన జవాబు వేదోపనిషత్ రెఫరెన్సులతో సహా ఉన్నది. ధన్యవాదములు.