వ్యాసాలు సోయి | 02 మార్చ్ 2007 12:08 am
గిరిజనుల స్వప్నసాకార వేదిక నాగోబా జాతర
- డా|| ఉదారి నారాయణ
ఏ జాతి సంస్కృతి అయినా ఆ జాతి ఔన్నత్యాన్ని చాటి చెబుతుంది. సంస్కృతి ఆత్మంతా పండగలలోనే ప్రతిబింబిస్తుంది. త్వరితగతిన మారుతున్న మానవ జీవితం ఎన్నో ఒడిదుడుకుల్ని తట్టుకొని ఒకింత బరువుగా ముందడుగు వేస్తూనే ఉంది. పాశ్చాత్య సంస్కృతి వల్ల వర్తమానదేశాలు విపరీత ప్రభావాలకు గురి అవుతున్నాయి.
ఈ నేపథ్యంలోంచి ఆలోచిస్తే ఆదిమ గిరిజనులు తమ సంస్కృతిని కాపాడుకుంటూ వస్తూనే ఉన్నారు. దీనికి కారణం గిరిజనులకు వారి సంస్కృతిపై గల ఆదరాభిమానాలే.
ఆదిలాబాద్ జిల్లాలో ఆదిమ గిరిజన పండుగైన నాగోబా జాతర ఇక్కడి గిరిజనుల సంస్కృతికి నిలువెత్తు సాక్ష్యం. ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్ గూడెంలో కొన్ని తరాలనుండి ఈ పండగ వైభవంగా జరుగుతున్నది.
ఇద్దరు గిరిజన ప్రేమికులు శాపగ్రస్తులైన నంది, నాగుబాము ఈ ఒక్కరోజు మాత్రమే మనుషులుగా అవతరించి గిరిజనులకు కెస్లాయి చెట్టుకింద ప్రత్యక్షమవుతారని స్థానిక గాథలు చెబుతాయి. అక్కడే ఆ చెట్టుకిందనే పుట్టచేసి నాగదేవతను ప్రతిష్టించడం వల్ల కేస్లాయి, కెస్లాపూర్ అనే పేర్లతో ఇక్కడ జాతర కొనసాగుతున్నది.
ఆదిమ గిరిజనులు జయంతులకంటే వర్ధంతులనే (పిత్రి) ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ నాగోబా జాతరను కూడా వర్ధంతిగా తమ జాతి దైవం ప్రత్యక్షమవుతున్న దినంగా భావించి పూజిస్తారు. ఇట్లా నెలరోజుల నుంచే పండగ సంబరాలు పూజాది కరణాలు మొదలవుతాయి. వారం రోజులనుంచి మెస్రం వంశీయులు 150 కి.మీ. కాలినడకన వెళ్లి నాగేంద్రుణ్ణి శుద్ధి చేస్తారు. తరువాత శాంపూర్‌లోని నందిదేవుణ్ణి, ఉడుంపూర్‌లో ఉడుముదేవుణ్ణి కూడా శుద్ధి చేస్తారు.
ఈ జాతర సందర్భంగా వాళ్ల పూర్వీకులు దేవుళ్లు ప్రత్యక్షమవుతారని వీళ్ల నమ్మకం. ప్రతియేట పుష్య మాసం అమావాస్య నుండి మూడు రోజుల పాటు జాతర జరుగుతూనే ఉంటుంది. ఈ జాతరకు ఆదిమ గిరిజనులే గాకుండా గిరిజనేతరులు, ఇతర రాష్ట్రాలనుంచి గిరిజనులు కూడా వచ్చి నాగోబాను పూజిస్తారు. పాలు చక్కెరను నైవేద్యంగా సమర్పిస్తారు. అందుకే ఇక్కడి నాగేంద్రుని ఆలయం ఈ జాతర ప్రత్యేక ఆకర్షణ. పండుగ సంబరాలు ముగిసేవరకు డోలు వాయిద్యం నిరంతరంగా మోగుతూనే ఉంటుంది.
జాతర సందర్భంగా నూతన వధూవరులు అక్కడికి చేరుకొని నాగోబాను దర్శించుకోవడం గిరిజన సంస్కృతిలో అరుదైన ఆచారం. అంతేగాకుండా అక్కడి గిరిజనులందరికి ఈ వధూవరులను పరిచయం చేయడం వీళ్ల తెగలోని అన్యోన్యతా భావానికి నిరద్శనం. ప్రత్యేకమైన వీరి జీవన విధానంలో నాగరికులపై విశ్వాసం లేక వాల్ల సుఖదుఃఖాలను వెల్లబోసుకునే అపురూప వేదిక ఈ జాతర. దూర ప్రాంతాలనుంచి వచ్చిన బంధువుల పరిచయాలు సంసార సాదకబాధకాలు కలబోసుకున్న ఆత్మీయ పండగ.
గిరిజన వీరుడు కొమురంభీం అమరుడైన తరువాత గిరిజనుల్లో కమ్ముకున్న నిరాశ నిస్పృల జీవితాలను, అక్కడి స్థితిగతులను అధ్యయనం చేయడానికి మానవ పరిణామ శాస్తవ్రేత్తయిన హైమన్ డార్ఫ్‌ను అప్పటి నైజాం ప్రభుత్వం నియమించింది. ఆయన గిరిజన గూడాలన్నిటిని తిరిగి చూసి వాళ్లతో ఒకడుగా మమేకమై వారి సమస్యలను సామరస్యంగా పరిష్కరించే వాడు. అయితే నాగోబా జాతర సందర్భంగా గిరిజనులంతా కెస్లాయ్లోనే చేరడం వల్ల 1940 సంవత్సరం నుంచి అక్కడే సమస్యల పరిష్కార వేదికను ఏర్పాటుచేసి ఎందరికో ఆపధ్భాందవుడయ్యాడు. నాటినుంచి నేటివరకు కెస్లాపూర్ దర్బార్ సాగుతూనే ఉంది. గతకొన్ని సంవత్సరాలనుంచి ప్రభుత్వమే ఈ సభను నిర్వహిస్తున్నది.
మారుతున్న కాలంలో పాటు గిరిజనుల జీవనశైలి అనివార్యమైన మార్పులకు గురిఅవుతూనే ఉన్నది. ప్రపంచీకరణ ఆధునీకరణ వల్ల అమాయక గూడెం జీవితాలు బయటి సమాజాన్ని ఇంకా మినుకు మినుకుగా బెదురు బెదురుగా చూస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు సమస్యల పరిష్కారం, భూమి పంపిణికి ఇదే వేదికపై శ్రీకారం చుట్టాడు హైమన్ డార్ఫ్. ప్రస్తుతం వీళ్లు భూమి పట్టాలకోసం పడిగాపులు కాస్తూనే ఉన్నారు. పాత సమస్యలు బూజుపట్టుతుండగా కొత్త సమస్యలు వాళ్ల బతుకులపై స్వారీ చేస్తూనే ఉన్నాయి. అడవిని నమ్ముకున్న ఆదిమ గిరిజనులు వాళ్ల అడవి వాళ్లదిగాకుండా పోతున్నది. సజీవ సజలధారలు సెలయేళ్లు, వాగులు బక్కచిక్కి ఎండిపోతున్నాయి. చేద్దామన్నా చేతులకందని పని, చేసినా చేతికందని ఫలితం… ప్రభుత్వం సంక్షేమ పథకాలు పట్టణాల జేబులు నింపుతున్న వైనాన్ని చూస్తుంటే గిరిజనుల భవిష్యత్తు ఎంత అగోచరమవుతున్నదో అర్థం చేసుకోవచ్చు.
ప్రభుత్వాలుమారినా నాయకులు మారినా దర్బారులు దూషణలతో దర్జాగా సాగుతున్నా గిరిజనుల జీవితాల్లో ఇంకా చీకటి తాండవిస్తూనే ఉంది. గూడెం నరాలలోకి నిశ్శబ్దంగా ప్రసరిస్తున్న స్టార్ టి.వి., ఛీప్ లిక్కర్, ప్రపంచబ్యాంకు ఆదేశాలతో విస్తరిస్తున్న విశాలమైన రోడ్లు, ట్రాక్టర్లు, బుల్డోజర్లు, పొక్లైన్లు నోటికందిన బుక్కను గుంజుకుంటున్నంత కాలం, చలికాలంలో నీరెండలా, వేసవిలో ఇప్పచెట్టు నీడలా రేపటి మీద కాసింత నమ్మకంతో నాగోబా జాతర్లు, దర్బార్లు సాగుతూనే ఉంటాయి.



