పోస్టులు అభిప్రాయాలు 08 February 2012

వ్యాసాలు సోయి | 02 మార్చ్ 2007 01:50 am

కాకతీయ కళ, నా అనుభవం

- డా|| కొండపల్లి శేషగిరిరావు

విద్యార్ధిదశలో నున్నప్పుడు నేను తరచుగా వేయి స్థంభాల గుడిని చూచి దాని అద్భుత నిర్మాణానికి ఆశ్యర్యపడి ఆనందించేవాడిని. నా స్నేహితులను, ఆట పాటలను వదిలి వంటరిగా శిల్పాలను తరచు తిలకించే వాడిని. నల్లరాతితో చెక్కిన శిల్ప స్థంభాలను, ప్రతిమలను వాటి అలంకరణను చూచి ఏదో దైవికానందాన్ని పొంది వాటి కళాప్రాభవానికి ముగ్దుడనయ్యేవాణ్ని. బాహ్య ప్రపంచాన్ని మరిచి ఒక తెలియని ఆనంత అద్భుత సాగర గర్భంలో ప్రవేశించినట్లు అనుభూతి పొందేవాణ్ని. దేవాలయ శిల్పాలను దర్శించి, నాలో కళాతృష్ణ శైశవ దశకు చేరుకుంది. దీని ప్రభావం నా చదువుపై పడి విద్యార్ధి దశలో చోటుచేసికొని కొన్నిసార్లు క్లాసులకు గూడ ఎగబెట్టే వాణ్ని. నాప్రకృతిలో ఈ అలవాటు చోటుచేసికొన్నది. కాకతీయ శిల్పాలు కలలోకూడా దర్శించేవాడిని. కాలక్రమేణ అనేక కాకతీయ శిల్పాలను ఓరుగల్లు కోటలోను, రామప్ప దేవాలయంలోను దర్శించి, కాకతీయ కళావైభవాన్ని, దాన్ని సృష్టింపజేసిన కాకతీయులను, స్మరించే వాడిని. దాదాపు మూడు శతాబ్దాల పర్యంతరం వారి పాలన సాగినదని చరిత్రకారులు నిర్ణయించినారు. నాలోని కళాతృష్ణకు జీవం పోసి కాలక్రమేణ శిల్పాలను చూసి రేఖా చిత్రాలుగా గీయించినది. నా యోగ్యతను బట్టి రేఖా చిత్రాలు వేసినాను. చిత్రాలు వేసిన సందర్భంలో అనేక అనుభూతులను అనుభవాలను రుచి చూచినాను. అప్పటికీ నాలో ఏదో ఒక అసంతృప్తి వెంటాడుతూనే వున్నది. కాకతీయ శిల్పం నాకు ఏకలవ్య బాంధవాన్ని కలిగించినది. దాని మూలంగా నేడు ఒక ప్రఖ్యాత చిత్రకారునిగా పేరు గడించినని సాదరంగ మనవి చేసుకుంటున్నాను.

నా అనుభవంలో కాకతీయ కళను గురించి క్లుప్తంగా చెప్పవలసిన అవసరమైంతెనా గలదని భావిస్తున్నాను. కాకతీయుల చిత్రకళను గురించి కావ్యాల ద్వారానే కొంత భోగట్టా మనకు తెలుస్తుంది. మాచల్దేవి చిత్రశాలలో అనేక శృంగారచిత్రాల వర్ణన శ్రీనాధుని క్రీడాభిరామంలో కనుపిస్తుంది. కాని ఓరుగల్లు కోట పతనం తర్వాత కాకతీయుల చిత్రకళ కనుపించుటలేదు. పిల్లలమర్రి దేవాలయంలో గర్భ గుడి ముఖద్వారం పైనున్న భక్తి చిత్రం ‘క్షీరసాగరమధనం’ కేవలం కాకతీయ చిత్రకళా శైలిదని చెప్పుటకు వీలుకాదని కొందరు విమర్శించినారు. మాచర్లలోని వీరభద్ర దేవాలయంపై అవి రెండూ తర్వాత కాలం నాటివేనని అనుమానం కలుగుతుంది. దానికి కారణం, వాటి శైలిలో క్లాసికల్ మెచ్చురిటీ, శాస్తీయ పరిణతి, కనబడుటలేదు. శిల్పంలో నున్న రూపలావణ్యత సునిశితాలంకరణ చిత్రాలలో కనపడుటలేదు. శిల్పశైలికి చిత్రశైలికి పోలికలు లేవు చిత్రాలలో జానపద (ఫోక్) శైలికి, శాస్త్రీయ (క్లాసికల్) శైలికి మధ్యస్థంగా కనబడుచున్నది. దీని వలన మనం గ్రహించ వలసిన విషయమే మిటంటే ఈ చిత్రాలు కాకతీయుల కాలం తర్వాతనే చిత్రించబడి యుండవచ్చును. సమకాలీన చిత్రకళకూ, శిల్పకళకూ రూపరచనలో ఎక్కువతేడా ఉండుటకు వీలులేదు. శిల్పరూప రచనకు చిత్రరూప రచనకు రేఖలే మూలం గనుక ఏకశైలీకృతమై యుండుట సామాన్యసూత్రం. అజంతా గుహ చిత్రాలకూ శిల్పానికీ అత్యంత సామ్యత గోచరించినట్లుగా పైనచెప్పిన చిత్రాలకు శిల్పాలకు సామ్యత ఎక్కువగా కనుపించదు. విజయనగర కాలం నాటి లేపాక్షి చిత్రాలలో జైన సంప్రదాయ పోలికలు గలవు. వానిలో శాస్త్రీయ పరిణితి అధికంగా గోచరిస్తుంది. కాకతీయ కళ కూడా జైన సంప్రదాయం నుంచి వచ్చిందని చరిత్రకారులు చెప్పుచున్నారు. కాని సూక్ష్మ పరిశీలన చేసినచో కొంత తేడా కనుపించును. కాకిపడిగెలవాండ్ల పట చిత్రాలలో రూపరచన అపభ్రంశంగా కనపడుతుంది. వేషభూషలు, దక్కనుశైలిని పోలి, అటు పూర్తిగా దక్కను శైలిగాక, జైనసంప్రదాయానికి మధ్య కొట్టు మిట్టాడుతున్నట్లు కనబడుచున్నది. కాకతీయ చిత్రకళయని నిక్కచ్చిగా తేల్చి చెప్పే విధంగా లేవు మాచర్ల మరియు పిల్లలమర్రి చిత్రాలు.

కాకతీయ శిల్పాన్ని నాలుగు రకాలుగా విభజించ వచ్చును. (1) దేవతామూర్తులు (2) నాట్యభంగిమలు (3) నరనారీమూర్తులు (జెనరి ఫిగర్స్) (4) అలంకార రూపాలు బౌద్ధ, చోళ, చాళుక్య, హోయసల శిల్ప ప్రభావాలు నిస్సందేహంగా కాకతీయ శిల్పంలో ప్రతిబించుతాయి. కాకతీయ శిల్పంలో కదలిక (మూమెంట్) ఎక్కువ. స్థబ్దత (స్టాటిక్) తక్కువగా గోచరిస్తుంది. ప్రాణప్రదమైన హెచ్చుతగ్గులు కలిగి, పునరావృత్తి దోషము లేకుండా వైవిధ్యంతో విలసిల్లుతాయి. నాట్యభంగిమలు, నరనారీమూర్తులలో ఈ వాస్తవాన్ని గ్రహించవచ్చును. కాకతీయ శిల్పంలోని అంతరాత్మ ప్రాణశక్తితో ప్రస్ఫుటిస్తుంది. శిల్పంలోని ప్రతిమలు దీర్ఘాకారములుగా గోచరించును. హోయసల శిల్పం కురచగా, బొద్దుగా (షార్ట్‌) లావుగాను, అవసరానికన్నా అధికమైన అలంకరణతో కనిపిస్తుంది. అలంకారం అధికమైనచో అసలు ఆకృతి సౌందర్యానికి అడ్డుకట్ట వేస్తుంది. కాకతీయ శిల్ప సౌందర్యం దీనికి భిన్నం. ఆకృతి ప్రభావం ఎక్కువగాను అలంకరణ తగు పరిమాణంలో గోచరిస్తుంది. కాకతీయ శిల్పంలోని మానవరూప శిల్పం ప్రమాణమైయున్నది. అమరావతి, నాగార్జునకొండ శిల్పంలో అలంకారం కాకతీయ శిల్పంకన్నా ఇంకా తక్కువ ప్రమాణంలో గోచరించి రూప సౌందర్యం ప్రధానంగా గోచరిస్తుంది.

కాకతీయ శిల్పంలో ఉబ్బెత్తు పని (రిలీఫ్ వర్క్‌) అధికంగా కనుపించును. వీనిలో రిలీఫ్, హై రిలీఫ్ రెండు విధాలుగా నుండి గండ శిలా ఫలకాల ఆధారంగాను ఘనమైన స్థంభాల ఆధారంగాను నిలిచియుండును. మకరతోరణాలు విరివిగా గనుపించును. వీటి ముఖ మండలముల నుండి వెనుక నుండి అనేక రీతిల కాల్పనిక లతలు అలంకార యుక్తములై జాలువారును. విరామస్థలాలలో, ఏనుగులు, సింహాలు, హంసలు, చెక్కబడియుండును. కొన్ని స్థలాలలో ప్రవాహరూపంలో శిలాంచలములు కొనసాగుచుండును. స్త్రీల వక్ష సౌందర్యమును వివస్త్ర రూపంలో వ్యక్తపరచి ఆభరణ అలంకారములతో అధికభాగం కప్పిపుచ్చుటలో కాకతీయ శిల్పానికి హోయసల శిల్పానికి సామ్యత గలదు. ముత్యాల మాలలు కంఠాభరణాదులు విరివిగావాడబడినవి. కిరీటములయందు కూడ అలంకరణ రూపాలతో బాటు ముత్యాల వరుసలు అధికంగా గోచరించును. కర్ణకుండలాలు (డయామీటర్) వ్యాస ప్రమాణము ఇతర భారతీయ శిల్పంతో పోలిస్తే చాలాపెద్దవిగా కనబడుచున్నవి. నడుము క్రింది భాగములు నగ్నంగానైనా లేక కురుచైనా చీరెకట్టుగలవిగా గోచరిస్తవి. నడుముపై వడ్డాణములు, మేఖలలు ముత్యాలు రత్నాలు పొదిగిన అలంకారాలతో వ్రేలాడుతున్నట్లు కనుపించును. ఈమేఖలలో రత్నాలు చిన్న చతురస్ర ఆకారము (స్క్వేర్ షేప్) త్రిభుజాకారము, వృత్తాకారములలో పొదిగియున్నవి. ఇటువంటి మేఖలలు నేటికీ తెలంగాణములోని గొల్లలు, వెండితో చేసినవి వాడుట గలదు. చేతులకు బరువైన కంకణాలు విరివిగా గోచరించును. కిరీటములు రూపకల్పనలో అద్భుతంగా మలచబడినవి. త్రిభుజాకారములలో ముత్యాలు, రత్నాలు పొదిగి అలంకృతమై, ఎత్తుగా కనబడును. ఎక్కడికక్కడ నిలువు,అడ్డగీతలతో విభజింపబడిన ఖండికల సమూహంతో అలంకరణ చేయబడినది. శిల్పులు త్రిభుజాకారమును సమాంతర రేఖలచే విరిచి, వివిధ ప్రమాణములలో రసరంజకముగా చూపించి మానవ రూపాలకు దివ్యత్వం కలిగించినారు. దేవాలయములపై కప్పులోని మధ్య భాగంలో నటరాజు రూపము నిర్దుష్ట ప్రమాణములతో శిల్పంచి చుట్టూరా అష్ట దిక్పాలకులను చూపించినారు. స్త్రీరూపముల వక్షోజాలను గుండ్రముగాను అత్యున్నతముగాను పైకి ఉబికివచ్చునట్లు మలచి, వానిపై నుండి ముత్యాల సరాలు వ్రేలాడుచున్నట్లుండి చూచుటకెంతో ఆసక్తిని కలిగించును. పిడికిళ్లకందు, సన్నని నడుము పిరుదులు విశాలంగాను అలంకృతమై యుండును. ఇతర దేవాలయముల మాదిరి పద్మాకృతులు, కప్పులపై జ్యామితీ రూపకల్పనతో కనబడుచున్నవి. తెలుగులోను కన్నడ లిపిలో నున్న వక్రీకరణము (కర్విలెనియల్) మొత్తం కాకతీయ శిల్పంలో దాని అలంకరణములో కనబడుచుండును. స్థల నిర్ధేశము లేక ప్రష్ఠ భూమికలు సరళ రేఖలచేత నిర్దేశించి దానిలోపల వక్రరేఖలచే రూపములను సృష్టించినట్ల కనబడుతుంది. దీనితో మనకు అవగతమైన సత్యం ఏమిటంటే, ‘చిత్రాలు గీయటానికి సరళరేఖలు పనికిరావు. వక్రరేఖ విగృతంగా ఉన్న అందమైన చిత్రానికి అది ఆగుపించని పునాది’.

దేవాలయ నిర్మాణ పథకంలో స్థపతుల పాత్ర చలా ముఖ్యమైనది. ముఖ్యమైన శిల్పాలు స్థపతిచే చెక్కబడినవి. అవి శాస్త్రీయ పద్ధతితో మలచబడినవి. వానిలో స్థపతి ప్రతిభావిశేషం కనుపిస్తుంది. నా దృష్టిలో సాధారణ శిల్పం అతని శిష్యగణంచే రూపొందించబడినవి. వానిలో అచ్చటచ్చట ఖాళీ స్థలాలను అలంకరించుటలో శిష్యగణం పాత్ర ఎక్కువగా కనబడుతుంది. ముఖ్యంగా నిత్య జీవితానికి సంబంధించిన చిత్రణ చేయుటలో స్వాతంత్య్రం శిష్యగణాలకు వదిలివేసినట్లు కనబడుతుంది. హంసలు, ఏనుగులు, కుస్తీపట్లు, సంగీతం, నాట్యం, వేటలు, మిథున శిల్పాలు, తాపసులు, కామికులు, జంతువులు, వేటగాండ్లు, పక్షుల శిల్పాలు ఉదాహరణలుగా చెప్పవచ్చును. గుర్రాలచిత్రాలు కాకతీయశిల్పంలో అరుదుగా గోచరించును. కాకతీయ శిల్పంలో నంది విగ్రహాలు అత్యంతాకర్షకంగా మలచబడినవి. వానిపై అలంకరణ మహోన్నతమై, మైమరపింప చేయును. వేయిస్తంభాల గుడిలోని, రామప్పలోని నంది శిల్పాలు దీనికి ఉత్తమ ఉదాహరణలు మానవరూపాలలో నాట్య భంగిమలలో మలచబడిన నాగినీ శిల్పాలు, శిల్ప కళాచాతుర్యమునకు, రసరంజితమైన రూపకల్పనకు లయాన్వితమైన మెళకువలకు పరాకాష్టను చెందినవని నిర్ద్వందముగా చెప్పవచ్చును. శిల్పకళాచార్యుల పనితనంలోని ప్రతిభ శిష్యులైన వారిలో లోపించియుండును. అది రూపప్రమాణాలలో కొట్టవచ్చినట్టు కనుపించును. అచ్చటచ్చట ప్రమాణ బద్దత లోపించినట్లు కనుపించును. కాని లయలో లోపం కనిపించదు. లయ పుట్టుక తోనే శిల్పిలో ఇమిడి యుండును. ప్రమాణం అభ్యాసంతో కూడుకొని యుండుటయే దీనికి కారణం. భారతీయ శిల్పంలో ఈ సత్యం గోచరిస్తుంది. పాడుబడ్డ దేవాలయాలలో శిల్పాలను ఏకాంతంగా ఒక నిశ్శబ్ద వాతావరణంలో వీక్షించటానికి అడుగిడినప్పుడు, శ్మశాసనంలో భూత ప్రేతపిశాచావరణంలో ప్రవేశించినట్లు అనుభూతి, భయం ఆవరిల్లుతుంది. ఇదినా వ్యక్తిగతానుభవం, కాని ప్రతి శిల్పాన్ని తిలకించి బైటపడినపుడు అసంతృప్త ఆనందం, మహాతపస్సులో నుండి జాగ్రదావస్థకు చేరుకొన్నట్లు, ఒక భూతకాలం నుండి వర్తమానంలోకి అడుగిడినట్లుగా గోచరిస్తుంది.

Trackback This Post | Subscribe to the comments through RSS Feed

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో