నిరసన సోయి | 01 మార్చ్ 2007 11:04 pm
లొంగని వీరునికి సలాం!
సద్దాంహుస్సేన్ దారుణ హ్యతకు నిరసనగా తెలుగు కవులు, కళాకారులు, జర్నలిస్టులు కలిసి 3 జనవరి నాడు తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ హోల్‌లో ఒక సభ నిర్వహించారు. అనేకమంది ప్రముఖులు ఈ సభకు హాజరయ్యి అమెరికా హంతక చర్యను ఖండించారు.
సభకు ప్రముఖ కవి శివారెడ్డి అధ్యక్షత వహించారు. సద్దాం హత్యకు సంతాప సూచకంగా ఒక నిముషం మౌనం పాటించడంతో సభ ప్రారంభం అయ్యింది.
మొదట సంధ్యక్క బృందం ‘మీత్యాగం ఉన్నతమైనది, అది హిమశిఖరాల వంటిది’ అనే ఉద్వేగభరితమైన పాట పాడారు.
శివారెడ్డి సభను ప్రారంభిస్తూ ఈ దుశ్చర్యను ఖండించటంలో భారత ప్రభుత్వం చూపిస్తున్న చేతగానితనాన్ని తీవ్రంగా విమర్శించారు.
అధికారభాష సంఘం అధ్యక్షుడు ఏ.బి.కె. ప్రసాద్ మాట్లాడుతూ అసలు ఇరాక్ యుద్దంలో మొదటి నుంచి అమెరికా ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తోందో వివరించారు. జార్జిబుష్ తాత అయిన ప్రెస్కాట్ బుష్ కు నాజీలతో సంబంధాలు వున్నాయని ఇటీవలనే వెల్లడైందని, వీళ్లు డబ్బుల కొరకు ఏ దుర్మార్గానికైన ఒడిగట్టే కిరాతకులని అన్నారు.
విప్లవకవి వరవరరావు సద్దాం చనిపోయిన క్షణం ఒక సుడిగాలి జార్జ్ బుష్‌ను కలవరపెట్టిన వార్తను ఉటంకించారు. అతడి మరణం కూడ సామ్రాజ్యవాదులను వణికించింది అన్నారు. సద్దాంకు అంజలి ఘటిస్తూ ఒక కవితను చదివి వినిపించారు.
ప్రముఖ పాటల రచయిత, గాయకుడు గోరటి వెంకన్న మాట్లాడుతూ ‘వీరులు ఉరికొయ్యను ఎలా ముద్డాడుతారో సద్దామును చూస్తే తెలిసిందన్నారు. అమెరికా సామ్రాజ్యవాదం పై ఒక మంచి పాటను పాడారాయన.
స్కైబాబ సద్దాంపై రాసిన ‘లొంగని వీరునికి సలాం’ అనే గొప్ప కవితను చదివి వినిపించాడు.
షాజహాన, జూపాక సుభద్ర, హెచ్చార్కే కూడ సద్దామును అన్యాయంగా ఉరి తీయడాన్ని ఆక్షేపిస్తూ కవితలు చదివారు.
ఎన్ వేణుగోపాల్ మాట్లాడుతూ సద్దాం మరణం ప్రపంచాన్ని ఒక కొత్త కోణం నుంచి చూసేటట్టు చెయ్యగలదేమో మనల్ని మనం ప్రశ్నించుకోవాలని అన్నారు. ఇవ్వాళ అంతా అమెరికా కళ్లతో ప్రపంచాన్ని చూడటం అలవాటు చేసుకున్నారని అంటూ దీనికి ఉదాహరణంగా మన పేపర్లలో మధ్య ప్రాచ్యం అని రాస్తున్న ప్రాంతం నిజానికి మనకు తూర్పు ఆసియా అని వివరించారు. సద్దాం వ్యక్తిగత నర్సు చెప్పిన విషయాలని ఉటంకిస్తూ తనకు పెట్టిన ఆహారంలోంచి కొంతభాగాన్ని దాచి వుంచి పావురాలకు పెడ్డటం ద్వారా సద్దాంలో ఒక శాంతికాముకుడు, జైల్‌లో ఖాళీ సమాయల్లో మొక్కలకు నీళ్లు పోయడం ద్వారా సద్దాంలో ఒక రైతు హృదయం వున్నాయని అన్నారు. మొక్కవోని జాతీయ భావాలకు, సామ్రాజ్యవాద వ్యతిరేకతకు అతడు ప్రతీక అని, అతడు మరణించినా అనేక మందికి ప్రేరణగా నిలుస్తాడని అన్నారు.
పౌరహక్కులనేత ప్రొ. హరగోపాల్ అమెరికా సామ్రాజ్యవాదం యొక్క దుర్మార్గ స్వభావాన్ని సోదాహరంగా వివరించారు. సద్దాంను చంపివేసి దాన్ని సున్ని, షియాల మధ్య మత ఘర్షణలు పెంచడానికి అమెరికా కుట్ర చేస్తోందని అన్నారు.
పౌరహక్కుల నేత రత్నమాల మాట్లాడుతూ సద్దాం మరణం ఒకలాగ ఉదారవాదుల, ప్రగతిశీల శక్తుల వైఫల్యమేనని అన్నారు.
సభలో ఇంకా లోకేశ్వర్, సంగిసెట్టి శ్రీనివాస్, తెలకపల్లి రవి, శ్రీధర్ దేశ్‌పాండే, జి.ఎస్.రాంమోహన్, రాంకి, చిక్కుడు ప్రభాకర్, అరుణోదయ రామారావు తదితరులు పాల్గొన్నారు.
(hridayam.wordpress.com సౌజన్యంతో)



