వార్తల్లో & వ్యాసాలు సోయి | 01 మార్చ్ 2007 11:41 pm
మట్టి మనుషుల పాదయాత్ర
- పరవస్తు లోకేశ్వర్
“చల్తే చలో చల్తే చలో చల్తే చలో
ఏ వక్త్ కీ ఆవాజ్ హై చల్తే ఛలో”
మట్టికాళ్ల మహారాక్షసి కోస్తా ఆంధ్ర అంతర్గత వలసవాద పెత్తనానికి వ్యతిరేకంగా తల్లి తెలంగాణా విముక్తి కోసం భూమి పుత్రుల పాదయాత్ర- నేలతల్లి స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం మట్టి మనుష్యుల జైత్రయాత్ర. నడక నడక. నడక నడుస్తున్న చరిత్ర. మాకాళ్ళ మీద మేం నడుస్తున్నాం. మా నేల మీద మేం నడుస్తున్నాం. మేం ముందుకు మున్ముందుకే నడుస్తాం. ప్రపంచం మా వెంట నడుస్తుంది. నడక. నడక. నడక మా నేస్తం- కంటికి దూరమైతె కాలికి దూరమా? చుట్టు ముట్టు సూర్యపేట నట్టనడుమ నల్లగొండ, ఆ పైన హైద్రబాదు అందులో గోలుకొండ - గోల్కొండ ఖిల్లా క్రింద ఆంధ్రుల నయా వలసవాదాన్ని బొంద పెట్టటానికే లాంగ్ మార్చ్- పాలేరు వాగు వంతెన మీద నుండి నాంపల్లి బాగే ఆం ఎదురుంగ ఉన్న అమరవీరుల స్థూపం దాకా. ఆ అమరవీరుల ఆత్మల్ని విముక్తం చేసి, వారు కన్న కలలను నిజం చేసే దాకా. మట్టి మనుషుల పాదయాత్ర.
“భూమి కోసమే నడు
భుక్తి కోసమే నడు
విముక్తి కోసమే నడు
భయం గియం విడునడు”
2007 నూతన సంవత్సరం ప్రారంభదినం. ఉదయం పది గంటలు. నల్లగొండ జిల్లా కోదాడ మండలం దగ్గరిలోని నల్లబండ్ల గూడెం గ్రామానికి ఆనుకుని ఉన్న పాలేరు వాగు మీది వంతెన. చరిత్రకు సాక్షిభూతమైన వంతెన. మౌనమునిలా కాలాన్ని పరిశీలించే వంతెన. ఆంధ్రా సరిహద్దును దాటి తెలంగాణకు ముఖద్వారం మాదిరిగా నిలిచిన అతి పురాతనమైన వంతెన. కాలానికి కట్టిన కత్తుల వంతెన. నెత్తుటి వంతెన. ఆ రోజు అక్కడి జాతీయ రహదారి నంబర్ నైన్ మట్టి మనుషుల పాదముద్రలతో పులకించి పోయింది. పరవశించి పోయింది.
భాజాభజంత్రీలు, మేళ తాళాలు, తెలంగాణా నినాదాలు, బ్యానర్లు, కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు మరికొన్ని గులాబీ కండువాలు ఆ మట్టి మనుషులతో కలిసి కదం కదం కలిపి, భుజం భుజం కలిపి తెలంగాణా ఐక్యతను చాటటానికి అక్కడ గుమికూడినారు. సరిహద్దుకు అటు ఇటు ట్రాఫిక్ జాం. రెండువైపులా ‘ముసాఫిర్లు’ అక్కడ ఏం జరుగుతుందో అని కుతూహలంతో చూస్తున్నారు. అదొక “లగాన్” టీం. తమ రక్తంతో చెమటతో భూమిని దుక్కిదున్ని ఆరుగాలం కాయకష్టం చేసి “రాజనాలు” పండించే రైతుబిడ్డల టీం. గోసి గొంగడి గాళ్ల దళం. “కఫన్” మాదిరిగా తలలకు చుట్టుకున్న తలపాగాలు భుజాలకు వ్రేలాడే జోలేసంచులు. పాదాలకు కిర్రు చెప్పులు, ఆకు చెప్పులు, చేతి కర్రలకు “జై తెలంగాణ” నినాదాలున్న శ్వేత కేతాలు. ఎవరు వారు? ఎచటి వారు? ఎట నుండి ఇటు కొచ్చినారు?
ఆ పాదయాత్రకు, సారధ్యం వహిస్తున్నది వేనేపల్లి పాండురంగారావు. మిరియాలగూడెం మండలంలోని “ఆలగడప” గ్రామం మాజీ సర్పంచ్. ఎన్నో సార్లు తన మీదనే గాక చివరికి “తెలంగాణా” పైన్నే రెఫరెండం జరిపి జాతీయ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించి తెలంగాణా దుష్మన్ల కండ్లు తెరిపించి నోళ్ళు మూయించిన సాదా సీదా ఆమ్ ఆద్మీ. ఆ ఆలగడప గ్రామంలో మనుషులే గాదు చివరికి “చిలకలు” కూడా “జై తెలంగాణా” అని నినదిస్తాయట. వేనేపల్లి పుణ్యమా అని ఆ “ఆలగడప” “చిలుకపలుకుల తెలంగాణా” గ్రామంగా మారింది. అతను ఏం చేసినా తనదంటూ ఒక స్వంత ముద్ర ఒక ప్రత్యేకత ఉంటుంది. అందులో ఒక భాగమే “పాలేరు వాగు నుండి మూసీ నది దాకా” నడుస్తున్న జనయాత్ర, జైత్రయాత్ర.
ఇక ఆయనను అనుసరిస్తున్నది సుమారు 60, 70 మందిభూమి పుత్రులు. ఆలగడప వారు మరియు దాని చుట్టుప్రక్కల వారు. ఆ బృందంలో అతి పెద్ద వయసున్న వాడు షేక్ జాన్. 75 సం||రాలు ఉన్నా నడకలో మాత్రం నవయువకుడు. ఆలగడప గ్రామానికి మస్కూరిగా పనిచేశాడు. అతి చిన్న వయసున్న పిల్లగాడు క్రాంతికుమార్ 17 సం||రాల నూనుగుమీసాల ప్రాయం. “మోతె” గ్రామం నివాసి. 5వ తరగతి వరకు చదువుకొని “హలికుడుగా” మారాడు. పెద్ద దేవులపల్లి గ్రామ నివాసి పెద్దబోయిన రామలింగ యాదవ్ది మరో కథ. తెల్లటి మీసకట్టుతో సూదంటురాయి లాంటి చూపుతో హుషారుగా కనబడుతున్న ఆయన వయస్సు 60 పైన్నే అట. ప్రభుత్వ ఉద్యోగం నుండి పదవీ విరమణ చేసి “తెలంగాణా సైనికుడుగా” మారాడు. ఇద్దరు పిల్లలు అమెరికాలో ఒకరు ఇక్కడనే వ్యవసాయంలో ఉన్నారట. ఆ ఊరినుండే మరో యువకుడు ప్రసాద్. బిఎష్సి పాస్ అయ్యి ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నాడట. గొట్టి ముక్కల శ్రీనివాస్. స్వచ్ఛమైన అమాయకమైన పల్లెటూరి పిల్లగాడు. కోదాడ నివాసి. ఇట్లా మరెందరెందరో వేనేపల్లి “పాదయాత్రలో” పదాతి దళం సభ్యులు. అయితే అంశుల స్వామిది మాత్రం మరో విషాద గాధ. చక్రాల కుర్చీలోనే పాదయాత్రను అనుసరిస్తున్న అతను “ఫ్లోరోసిస్” బాధితుడు. ప్రక్కనే కృష్ణానదీ పరివాహక ప్రాంతమున్నా త్రాగే నీటికి నోచుకోక కలుషిత జలాల్ని తాగి కుచించుకొని పోయిన దేహంతో జీవచ్ఛవంలా బ్రతుకీడుస్తున్న వంచితుడతను. ఐదేళ్ళ పిల్లవాడిలాగ కనబడుతున్న 35 సం||రాల యువకుడతను. నడవటం కాదు కదా సరిగ్గా నేల మీద కూచోలేని దీన పరిస్థితి అతనిది. పడుకొనే అన్నం తింటాడు. అన్ని పనులు పడుకునే. ఎవరి నిర్లక్ష్యపు పలితమిది? అని పెద్ద పెద్ద మూగ కండ్లతో మనల్ని ప్రశ్నిస్తుంటాడు. ఈ సర్కారు పాలనలో మన్నుబడ అని చూపులతోనే ఆపిస్తుంటాడు.
అతని ప్రక్కనే దుశ్చర్ల సత్యనారాయణ. జల సాధన సమితి నేత. విఫలమైన తెలంగాణా “భగీరథుడు”. బిల్కుల్ పైదల్ ఆద్మీ లాగ జీబురు గడ్డంతో పిచ్చి పిచ్చిగా పెరిగిన జుట్టుతో తెలంగాణ మీద తప్ప తన మీద తనకే సోయి లేకుండా ఊడిపోయిన ఒక పన్నుతో, వెలుగుతున్న కండ్లతో ముఖమంతా చిర్నవ్వులతో ఒక యోగిలా కనబడ్డాడు. అప్పడెప్పుడో ఐదేండ్ల క్రితమే నెలకు 30 వేల రూపాయల బ్యాంకు ఉద్యోగం వొదులుకొని క్రిష్ణమ్మ జీవజలాల్ని నల్లగొండకు మళ్లించి ఫ్లోరోసిస్ భూతాన్ని ఓడించాలని భంగపడ్డ భగీరథుడతను. “హర్దర్ద్ కా దవా జిందా తిలిస్మాత్” అన్నట్లు అన్ని సమస్యలకు పరిష్కారం “తెలంగాణా” అని యుద్ధరంగంలోకి దూకిన క్షతగాత్ర సైనికుడతను.
ఆ పాదయాత్రలో ఎందరెందరో బాధితులు. బాధా సర్పదష్టులు. ఆంధ్ర వలస పాలనను ‘ఖబరస్తాన్’ కు పంపటానికి నుదుట కఫన్లు కట్టుకున్న తెలంగాణా ముద్దుబిడ్డలు. భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసిన బందగీకి వారసులు వాళ్లు. పాలేరు వంతెన కాడ పాండురంగారావు ఉపన్యాసంతో పాదయాత్ర ప్రారంభమైంది. అదిమామూలు ఉపన్యాసం కాదు. మూడు తరాల తెలంగాణా ప్రజల ఆత్మఘోష సకల విధాల దోపిడీలకు, అన్యాయాలకు అవమానాలకు గురైన జీవుల వేదన.
“యాభై అరవై సంవత్సరాల క్రింద మీరు ఖాళీ చేతులతో కట్టుబట్టలతో కల్లబొల్లి కబుర్లతో ఈ వంతెనను దాటి మా తెలంగాణా లోపలికి వచ్చారు. ఆ తర్వాత ఈ రోజు వరకూ ఈ వంతెన పై నుండే మీరు మా సిరిసంపదలను, భోగభాగ్యాలను మీ ఆంధ్రా ప్రాంతానికి తరలించుకుపోయారు. దానికి ఈ వంతెననే మూగసాక్షి. దాని క్రింది నుండి ప్రవహించేవి నీళ్లు కాదు. మా తెలంగాణా ప్రజలకన్నీళ్ళు. మా కన్నీళ్ళ వల్లనే మీ సముద్రంలో ఉన్న నీళ్లన్నీ ఉప్పుగా మారినాయి” అని వేనేపల్లి తన గుండె గొంతుకతో ఘోషిస్తుంటే ఆ ఉపన్యాసం వింటున్న వారి కండ్లల్లో కన్నీళ్లు గుబగుబమని పొంగుకొచ్చాయి. ఆవేశంతో పిడికిళ్లు బిగుసుకున్నాయి. “జై తెలంగాణా” నినాదాలతో మిన్నూ మన్నూ ఏకం అయినాయి.
పాదయాత్ర నల్లబండ్లగూడెం దాటి కోదాడకు చేరుకుంది. ప్రతి రోజు 20-25 కిలోమీటర్ల చొప్పున పది రోజులలో హైద్రాబాదు చేరుకోవాలని వారి ఆలోచన. సడక్ మీద కలిసిన ప్రతి ఒక్కరికి తమ పాదయాత్ర లక్ష్యానికి సంబంధించిన కరపత్రాలను పంచుతున్నారు. ప్రతి చిన్నా పెద్ద గ్రామంలో నలుగురు కూడిన కాడ తెలంగాణా ఎందుకు కావాలో చిన్న చిన్న ఉపన్యాసాలు ఇస్తూముందుకు సాగుతున్నారు. “రోడ్లకు మా నమస్కారం” అంటూ ఆ మట్టి మనుషుల పాదాలు చందన చర్చిత చల్లని ధూళి పరిమళాలతో పాదప్రక్షాళనం చేసుకుంటున్నాయి.
“బాటలు నడిచి పేటలు దాటి” అన్నట్లు 3వ తారీకున ఆ పాదయాత్ర సూర్యాపేట చేరుకుంది. చరిత్రలో సూర్యాపేట మామూలు పేట కాదు. ఆంధ్రమహాసభ కన్నా ముందే అలనాడు సూర్యాపేట వర్తకులు “వరక్త సంఘాల” సభలను ఏర్పాటుగావించి నిజాం పాలనకు వ్యతిరేకంగా చైతన్యాన్ని రగిలించిన పేట సూర్యాపేట. వర్తక సంఘాల సంగతి జ్ఞాపకం రాగానే తెలంగాణా వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి రాసిన “సంఘాల పంతులు” కథ కూడా జ్ఞాపకం వస్తుంది. గుజ్రే జమానే యాద్ ఆతీ హై…
అట్ల 3వ తారీఖున ఆ పాదయాత్రికులకు ఘనంగా స్వాగతం పలుకుతూ సూర్యాపేటలో “తెలంగాణ విద్యావంతుల వేదిక వారు” ఒక సభను ఏర్పాటుచేశారు. ఆ రాత్రి అక్కడ నిద్రచేసి తెల్లారంగానే మళ్లీ “తెలంగాణా కారవాన్” నకిరేకల్ వైపు పురోగమించింది. తోవ పొడుగునా వారిచ్చిన నినాదాలు సాదా సీదా నినాదాలే. సామాన్యులకు కూడా తెలంగాణా పోరాటం ఎందుకు జరుగుతుందో బోధ పడేటట్టు!
మా భూములు మాకు గావాలె
మా నీళ్లు మాకు గావాలె
మా కరెంటు మాకు గావాలె
మా బొగ్గు మాకు గావాలె
మా చదువులు మాకు గావాలె
మా ఉద్యోగాలు మాకు గావాలె
గుండె గోడల్లోకి చొచ్చుకొని పోయే ఈ సులభమైన నినాదాలు “రామనామ తారక మంత్రం” లాగా గ్రామీణులపై పనిచేశాయి.
అదే పాండురంగారావు ప్రత్యేకత. ఏ విషయంలోనూ నేలవిడిచి సాము చేయటం అతనికిష్టం ఉండదు.
ఆ భూమి పుత్రులు “ఇనుపాముల” ఊరు దగ్గరికి వచ్చేసరికి దూరంగ పొలంలో పనిచేస్తున్న ఒక స్త్రీ “ఆగండన్నా. ఆగండన్నా” అని దొర్లుకుంట వారి దగ్గరికి ఉరుక్కుంట వచ్చింది. ఎందుకిట్ల నడుస్తున్నారని ప్రశ్నించింది. పాదయాత్ర తమ్ముండ్లు ఆ అక్కకు సంగతులన్నీ వివరంగా చెప్పినారు. అప్పుడా అక్క “మన రాజ్యాం మనకు రావాలె” అని వారిని దీవించి ముందుకు సాగనంపింది.
వేనేపల్లి జనం ముందు నిలబడి పోటోలకు ఫోజులిచ్చే నాయకుడు కాదు. తెర వెనుక మనిషి జనం వెనుక మనిషి. జనం మనిషి కావుననే ఆయన ఆ మట్టి మనుషులు ముందు నడుస్తుంటే వారి వెనుక నడుస్తున్నాడు. ఆ దృశ్యం చూసే సరికి నాకు చర్చిలో కిరస్తానీ సోదరులు పాడుకునే పాట జ్ఞాపకం వచ్చింది.
“చిన్న గొర్రె పిల్లలము ఏసయ్యా
మెల్ల మెల్లగా నడుపు ఏసయ్యా”
అయినా అతను వారిని అంత జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నా, ఒక ఆపద రానే వచ్చింది. ఒక అపశృతి జరగనే జరిగింది. నకిరేకల్లు దాటిన తర్వాత రోడ్డు మలుపులో ఒక లారీ వేగంగా వచ్చి గారపాటి యాదయ్యను గుద్దుకుంది. అదృష్టం కొద్ది చేయి మాత్రమే విరిగింది. అతనికి ప్రాథమిక చికిత్స డాక్టర్ చెరుకు సుధాకర్ చేసి వైద్యం కోసం అతనిని హుటాహుటిన హైద్రాబాదుకు పంపినారు. అతని యోగక్షేమాలను ప్రతి రోజు సెల్ ఫోన్ ద్వారా వేనేపల్లి తెలుసుకొనేవాడు.
నకిరేకల్లు దాటి కట్టంగూరు వచ్చి జాతీయ రహదారి నెంబర్ నైన్‌కు తాత్కాలికంగా టాటా చెప్పి కాలిబాట ద్వారా కుగ్రామాలను పలకరిస్తూ ప్రచారం చేస్తూ పాదయాత్ర నల్లగొండ సమీపంలోని పానగల్లు దేవాలయానికి 5వ తారీఖున సాయంత్రం చేరుకుంది. ఆ పానగల్లు దరిదాపుల్లోనే ఒకవైపు ప్రఖ్యాతి గాంచిన ఛాయాసోమేశ్వర దేవాలయం మరోవైపు ఉదయ సముద్రం చెరువు. ఆ రెండు కూడా కాకతీయ రాజులు కట్టించిన పుణ్యఫలాలే. కాకతీయ రాజులు త్రవ్వించిన చెరువులు, ఆ చెరువులు, కుంటల క్రింద నిజాం కాలం వరకూ సాగిన వ్యవసాయం అన్నీ ఆంధ్రవలస పాలకుల కుట్రల ఫలితంగా కనుమరుగైపోయినాయి. “ఆ సేతానమేడుందిరా” అని గోరటి ఎంకన్న ఘోషించే పాడుకాలం దాపురించింది.
ఆ సాయంత్రం పానుగల్లు దేవాయలం దగ్గర ఆ మట్టి మనుషుల పాదయాత్రకు భాజాభజంత్రీలతో, మేళ తాళాలతో చెవులు గింగురుమనే నినాదాలతో, ఒడలు పులకరించే పాటలతో ఘనంగా ఎదుర్కొళ్ళు జరిగినాయి. నల్లగొండ పట్టణానికి సంబంధించిన కవులు, కళాకారులు, రచయితలు, మేధావులంతా అందులో పాల్గొని వారిని సాదరంగా పట్నంలోకి ఆహ్వానించినారు. నల్లగొండ పట్నంలోని అన్నీ పురవీధులు ఆ ఊరేగింపుతో పులకరించిపోయాయి. తర్వాత ఎస్‌బిఆర్ ఫంక్షన్ హాలులో బహిరంగ సభ జరిగింది. తెలంగాణా రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి వేణు సంకోజు ఆ సభకు అధ్యక్షత వహించారు. ఆయన తన అధ్యక్షోపన్యాసంలో “మట్టి మనుషుల పాదయాత్రీకులకు పేరు పేరునా పాదనమస్కారం చేస్తున్నాను.” అని ప్రకటించగానే సభయావత్తు కరతాళధ్వనులతో మారుమోగింది. జై తెలంగాణ నినాదాలు ఆకాశాన్ని అంటినాయి. చాలా మంది ఉత్తేజంగా ప్రసంగించినారు. ముగింపులో పాండురంగారావు, హృదయాలు ద్రవించి, మనుసులు ఆర్ధ్రమయ్యే రీతిలో ఉపన్యాసమిచ్చినాడు.
“మా పాదయాత్ర లక్ష్యం, గమ్యం అసెంబ్లీవైపు కాదు. అధికారం వైపు రాజకీయ అందలాల వైపు అంతకన్నా కాదు. మా మట్టి మనుషుల పాదయాత్ర అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం వైపు వారి ఆశయాలను సాధించేవైపు స్వతంత్ర తెలంగాణ వైపు…
మమ్మల్ని మీరు మరీ పరీక్షిస్తే తెలంగాణా ఇవ్వటంలో మరింత ఆలస్యం చేస్తే ఇక తెలంగాణా రాష్ట్రం కాదు తెలంగాణా దేశం కోసం పోరాడాల్సివస్తుంది. కనుక బహపరాక్ జాగ్రత్త…
మీరు హైద్రాబాద్ పట్టణం గురించి లిటిగేషన్స్ పెడుతున్నరు కదా? ఒ.కె. మీ హైద్రాబాద్‌ను మీకిస్తాం. మరి మా పాత హైద్రాబాద్ మీకిస్తారా మరి. మా పాత హైద్రాబాద్‌ను మాకు జాగ్రత్తగా తిరిగి అప్పగించాలె. ఆ చెరువులు, ఆ బావులు, ఆ చమన్లు, ఆ బాగ్‌లు, అప్పటి సంస్కృతితో సహా అన్నింటిని మాకు అప్పగించాలె…
ఆంధ్రులు తెలంగాణలోని అన్ని మారుమూల గ్రామాలలోకి చొరబడ్డారు. ఒక్క ఫ్లోరోసిస్ గ్రామాలున్న నల్లగొండ జిల్లాలో తప్ప. ధైర్యం ఉందా అక్కడ నివసించి ఆ కలుషితమైన విషం నీళ్లు త్రాగటానికి? పక్కనే బిరాబిరా పరుగులిడే క్రిష్ణమ్మ. అయినా మాకు త్రాగటానికి గ్రుక్కెడు మంచినీళ్లు గతిలేక ఆ విషం నీళ్లే త్రాగుతున్నాం. ఇది 50 సంవత్సరాల ఆంధ్ర వలసవాద పరిపాలన పాపం కాదా?
మా అంతిమ లక్ష్యం భౌగోళిక తెలంగాణా కాదు. ఉత్త పది జిల్లాల తెలంగాణా కాదు. మట్టి పరిమళించి మనుషులు వికసించే ప్రజాస్వామిక తెలంగాణా”.
ఆ నిరంతర యాత్రికులు, పథికులు ఆ రాత్రి అక్కడే విశ్రమించారు.
ఆరో తారీఖు ఉదయం మళ్ళీ బళ్ళున తెల్లారగానే ఊరేగింపుగా నడుస్తూ పట్నం నడిబొడ్డున ఉన్న అమరవీరుల స్థూపం దగ్గర జమైనారు. పాటలు, పద్యాలు, నినాదాలతో “నల్గొండ సూర్యుడిని” నిద్రలేపి ఆ ఉదయపు వాతావరణాన్ని వెచ్చబరిచినారు. పురజనులు వారిని పట్నం పొలిమేరల వరకూ సాగనంపి “అల్విదా” తీసుకున్నారు.
ఆ జనజీవన పోరాటయాత్ర వాగులా, వంకలా పిల్లకాలువలా, ఉపనదిలా, సాగి సాగి విస్తరించి నదిలా మహానది లాగా ప్రవహించసాగింది. అనేక గ్రామాలల్ల యువకులు, విద్యార్థులు, రైతులు ఆ యాత్రలో పొరుగూరి వరకు పాల్గొన్నారు. స్వచ్ఛంధంగా సాగే పాదయాత్ర. ఉభయ కమ్యూనిస్టుల కంచుకోటలైన గ్రామాలలో ఆ పార్టీ శ్రేణులైన అనేక మంది కార్యకర్తలు “తెలంగాణాకు” వ్యక్తిగతంగా తమ మద్దతు ప్రకటించారు. “మీరు పోరాటం చేయండి సార్ టైంవచ్చినపుడు మేం కూడా దుంకుతం పార్టీలదేముంది. తెలంగాణా వొచ్చినంక కూడా పార్టీలుండొచ్చు కదా” అని భరోసా ఇచ్చారు. “ఊరందరిది ఒకదారి ఉలిపికట్టెది మరొకదారి” అన్నట్లు క్యాడరేమో తెలంగాణ వైపు పార్టీ ఏమో విశాలాంధ్ర వైపు అనిపించింది. చారిత్రిక తప్పిదాలకు అలవాటు పడినవారు జనజీవన నాడిని ఎప్పటికీ తెలుసుకోలేరు.
నార్కెట్‌పల్లికి ముందు చర్లపల్లిలో గ్రామస్తులు పాదయాత్రకు స్వాగతం పలికారు. ఒక ముసలమ్మను మరో నడీడు మనిషిని పలకరిస్తే “తెలంగాణ మన కోసం కాదు సార్ మన పిల్లల కోసం. వారి బాగుకోసం వారి సుఖం కోసం” అని దూరదృష్టితో ప్రవచించారు.
ఏడవ తారీఖు సాయంత్రం చిట్యాలలో ఒక బహిరంగ సభ జరిగింది. “ఈచ్ వన్ టీచ్ వన్” లాగా ప్రచారం సాగింది. చౌటుప్పల్, కొయ్యలగూడెం, కొత్తగూడెం, భూదాన్‌పోచంపల్లి, అనాజ్‌పూర్, అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్ దాటి “మట్టి మనుషులు యల్.బి.నగర్ చౌరస్తా దగ్గర పదో తారీఖు ఉదయాన పది గంటలకు నగర ప్రవేశం చేశారు.
పట్నమొల్లు పల్లెటూరు రైతుబిడ్డలకు “తమదైన పద్దతిలోనే” వెల్కం చెప్పారు. ఏమైతేనేం నగరంపై మట్టిమనుషుల ‘ముట్టడి’ ప్రారంభమైంది. “లగాన్ టీం” దండుయాత్ర నగరవీధులలో కదంతొక్కి మార్చ్ చేసింది. గోసి గొంగడి మనుషులు తలకు చింపుల పేగుల తలపాగాలు. వడివడిగా నడిచే ఆ కిర్రు చెప్పులు, భుజాలకు వ్రేలాడే జోలె సంచులు, ‘జై తెలంగాణా’ శ్వేత కేతాలను ఎగురవేసే చేతి ఊతకర్రలు నగరవాసుల దృష్టిని ఆకర్షించాయి. చైతన్యపురి, దిల్సుఖ్‌నగర్ చౌరస్తాలు అడ్డుదొలిగి పక్కపక్కలను వొదిగి వారికి దారినిచ్చి వారిని గౌరవించాయి. వారిస్తున్న నినాదాలలో దాగిన వారిగుండెచప్పుళ్ళను జాగ్రత్తగా విన్నాయి. వారు పంచిన కరపత్రాలను చదివి అర్థం చేసుకున్నాయి.
ముస్లిం సోదరులు మలక్‌పేటలోని ఆజం ఫంక్షన్ హాల్‌లో వారందరికి భోజనాల ఏర్పాటుచేసి తెలంగాణా పట్ల తమ సంఘీభావాన్ని తెలియజేశారు. నగరజనం నీరాజనాలను అందుకొంటూ పాదయాత్ర సాయంత్రం మూడుగంటలకు బాగేఆం ఎదురుంగ ఉన్న అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుంది.
పాదయాత్ర భారత సంస్కృతిలో ఒక భాగం. సాధువులు, సంత్లు, ఫకీర్లు, తత్వవేత్తలు పాదయాత్రల ద్వారానే తమ భావాలను ప్రచారం చేసి ఆనాటి సమాజం సంక్షోభదశలో, సంక్లిష్ట దశలో ఉన్నప్పుడు దానికి మార్గనిర్దేశనం చేసేవారు. దానిని ముందుకు నడిపేవారు. గౌతమబుద్దుడు, శంకరాచార్యుడు, వల్లభాచార్యుడు, రామానుజుడు, కబీర్, నానక్, సంత్ జ్ఞానేశ్వర్, కృష్ణ చైతన్య మొదలగు వారెందరో పాదయాత్రలను తమ ప్రచార సాధనాలుగా ఎంచుకున్నారు. జ్ఞాని అనేవాడు లోక సంచారి అయి తీరాలి. ఈ స్థావర జంగమాత్మక ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి నిరంతరం సంచారమే మార్గం. దేశ స్వాతంత్య్రం కోసం గాంధీ పాదయాత్రలను ఒక పోరాటంగా, ఉద్యమంగా చేపట్టినాడు. ఆ తర్వాత సర్వోదయ ఉద్యమనాయకులు వినోభా భావే, జయప్రకాశ్ నారాయణ లాంటివారు దేశం నలుమూలలా పాదయాత్రలను నిర్వహించారు. చైనాలో లాంగ్‌మార్చ్ ద్వారానే చైర్మన్ మావో అధికారాన్ని సంపాదించినారు. కావున పాదయాత్రలు పురాతన ఆసియా నాగరికతకు భారతీయ సంస్కృతికి సంబంధించిన ప్రత్యేకతలు. ఆ వారసత్వాన్ని “వేనేపల్లి” ఈనాడు కూడా కొనసాగిస్తున్నాడు.
ఆలగడప తదితర గ్రామాల నుండి బయలుదేరిన “మట్టిమనుషులు” అమరవీరుల స్థూపానికి పూలదండలు వేసి ఒక్క నిమిషం వారికి శ్రద్దాంజలి ఘటించారు. పిమ్మట “అమరవీరుల ఆశయాలను సాధిస్తాం. సాధిస్తాం” అని ప్రతిజ్ఞలు చేశారు. అక్కడ గుమికూడిన ప్రజలంతా వారితో గొంతు కలిపారు. ఆ తర్వాత చరిత్రను లిఖించే అద్భుత క్షణాలు” ప్రారంభమైనాయి. ఆ మట్టి మనుషులు తమ వెంట ఒక సంచిలో “ఆలగడప నేల మీద మట్టిని” తెచ్చారు. వేనేపల్లి ఆ మట్టిసంచిని అందరికీ చూపిస్తూ” ఈ మట్టి నా పూర్వీకుల మట్టి. చెమట, రక్తం, కన్నీళ్ళతో తడిసిన మట్టి. ఈ మట్టిలోనే వారంతా పుట్టి పెరిగి తిరిగి ఈ మట్టిలోనే మట్టిగా మారినారు. ఈ మట్టిని ఆంధ్రుల వలసవాద పరిపాలన నుండి విముక్తి చేస్తాం. ఈ మట్టికి స్వాతంత్య్రాన్ని ప్రసాదిస్తాం. రాబోయే తరాల వాళ్ళందరూ ఈ మట్టిలో సుఖశాంతులతో జీవించాలి. వర్ధిల్లాలి” అంటూ ఉద్వేగంగా ప్రసంగిస్తూ సంచిలోని ఆ మట్టిని తన గుప్పిళ్లతో తీసుకొని తన నడినెత్తి మీద పోసుకుంటుంటే ఆ మట్టిని తన ముఖానికి అద్దుకుంటుంటే అందరి కండ్లల్లలో కన్నీటి ఊటలు ఉబికినాయి.
ఆయన ఇంకా ప్రసంగిస్తూ “మా పాదయాత్రల పాదముద్రలతో మొత్తం మూడున్నర కోట్ల తెలంగాణా ప్రజల అడుగుజాడలు ఉన్నాయి. వారందరూ మా వెంట ఉన్నట్లే. ఒక వేళ ఢిల్లీ పీఠం వారు తెలంగాణా ఇవ్వకపోతే తెలంగాణా అన్ని దిక్కుల నుండి ఇటువంటి పాదయాత్రలెన్నో బయలుదేరి ఈ నగరాన్ని ముట్టడిస్తాం. అష్టదిగ్బంధనం చేస్తాం. తెలంగాణాను మేం సాధించుకుంటాం.
ఈస్వామి అంశులస్వామి. యాదగిరిగుట్ట నర్సింహ స్వామి. భద్రాలచలం సీతారామస్వామి. పాలకుల నిర్లక్ష్యం వల్లనే ఇట్లా అయినాడు. నల్లగొండ జిల్లాను ఫ్లోరోసిస్ నుండి విముక్తం చేయటానికే మేము తెలంగాణాను విముక్తి చేయాలని ప్రయత్నిస్తున్నాం. మాకు నీళ్లు కావాలె. ఇక భవిష్యత్తులో మా పిల్లలెవరూ ఇట్లా కావొద్దు.
ఒకవేళ మీరు తెలంగాణా ఇవ్వకపోతే మేం సద్దాంలమౌతాం. పోరాటాలు చేస్తాం. చిరునవ్వులతో ఉరికంబాలను ఎక్కుతాం. ప్రాణాలను అర్పిస్తాం.
వేనేపల్లి పాండురంగారావు తన “రక్తంతో రాగాలాపన చేస్తుంటే అతని మాట మంత్రంగా మారి శ్రోతలను మంత్ర ముగ్ధులను చేసింది. తెలంగాణా ఆశయానికి అందరినీ కట్టిపడేసింది. అంకితం చేసింది.
అమరవీరుల స్తూపం దగ్గర ఆలగడప మాజీ మస్కూరి, 75 సంవత్సరాల జాన్ను “ఏం తాతా ఎట్లుంది యాత్ర” అని పలుకరించగానే గొంతులో గురగురలతో “పెద్ద దొరలు రానిచ్చేటట్లు లేరు నాయినా. అయినా మేము నడుస్తనే ఉంటం. దీని అంతు చూసే దాకా. ఈ రోడ్డు మీద నా తనువు పోయినా పర్వలేదు. నడుస్తనే ఉంటం. ఇవి భగవంతుడు ఇచ్చిన కాళ్లు. ఆయనే మమ్ములను నడిపిస్తున్నడు” అని అన్నడు. అతన్ని చూస్తుంటే - 1952 మొదటి తరం తెలంగాణా పోరాటానికి ప్రతినిధిలాగా కనిపించిండు. మూడుతరాల తెలంగాణా పోరాటం. మూడు దశల తెలంగాణా పోరాటం.
చివరికి ముగింపుగా ఆ పాదయాత్ర మంజిల్ ఔర్ మక్సద్ గవర్నర్ గారి నివాసం రాజ్ భవన్. అయితే ఆయన లేరని తెల్సింది. అయినా పాదయాత్రీకుల ప్రతినిధి బృందం గవర్నర్ గారి ఓ.యస్.డి.ని కలిసి ఒక విజ్ఞాపన పత్రాన్ని “తెలంగాణం మాత్రమే కావాలని” సమర్పించింది. వేనేపల్లితో పాటు ప్రతినిధి బృందం సభ్యులు తెలంగాణా ఆవశ్యకతను వివరిస్తుంటే ఆయన ఓపికగా విన్నారు. ఆఖర్లో చక్రాల కుర్చీలో వెంట వచ్చిన అంశులస్వామిని ఎదురుగా ఉన్న ఆయన టేబుల్ పై పండబెట్టారు. అతడిని చూసి ఆ అధికారి అవాక్కయినాడు. పరేషాన్ అయినాడు. “నాలాగా మరెవరూ కావొద్దు. మాకు మంచి నీళ్లు గావాలె. మాకు తెలంగాణా కావాలె” అని అంశులస్వామి రెండుచేతులెత్తి ఆ అధికారికి మొక్కిండు.
గవర్నర్ నివాసం నుండి అందరం ఇవతలికి వచ్చాం. ఇక వీడ్కోలు. ఇక ఆ మట్టి మనుషులకు వారు చేసిన పాదయాత్రకు “అల్విదా” చెప్పే క్షణాలు దగ్గరికి రానే వచ్చాయి. అందరి హృదయాలు బరువెక్కి ఉన్నాయి. మాటలు కరువయ్యాయి. లక్షల లక్షల పాదముద్రలతో చరిత్రను లిఖించిన 275 కిలోమీటర్ల పాదయాత్ర “పాలేరు వాగు నుండి మూసి నది దాకా” ముగియబోతుంది.
“మరి మీ తిరుగుప్రయాణం ఎట్ల పాండురంగారావ్” అని దిగులుగా అడిగాను.
“ఏముంది ఆర్టిసి బస్సులలో” అని స్వచ్ఛమైన చిరునవ్వుతో సమాధానం.
“ఈ పూట మా ఇంటికి వచ్చి అన్నం తిని రెస్టు తీసుకోవచ్చు గదా”!
“లేదు రేపు మా ఊర్ల ఉండాలె. అక్కడ మిషన్లు పంచే పని ఉంది” అన్నాడు ఆ భూమి పుత్రుడు.
అతని నేతృత్వంలో ఆ “లగాన్ టీం” రోడ్డు దాటి వడివడిగా నడిచి పోతుంటే నాకెందుకో అకస్మాత్తుగ గాంధీగారి “దండియాత్ర” సీను గుర్తుకొచ్చింది.
పాదయాత్రలో పాల్గొన్న మట్టి మనుషులు
1. వేనేపల్లి పాండురంగారావు - అలగడప
2. దుశ్చర్ల సత్యనారాయణ - రాఘవాపురం
3. అంశుల స్వామి - శివన్నగూడెం
4. అంశుల సత్యనారాయణ - శివన్నగూడెం
5. ఇంజమూరి వెంకటేశ్వర్లు - నేరేడుచర్ల
6. గాలం దాగయ్య - దామరచర్ల
7. బాదనబోయిన కృష్ణమూర్తి - దామరచర్ల
8. గొట్టిముక్కల శ్రీనివాసానాయుడు - కోదాడ
9. రాయిరాల శివప్రసాద్ - మిర్యాలగూడ
10. సబ్బు భరత్ రెడ్డి - పాములపాడు
11. పెద్దబోయిన రామలింగయ్య - పెద్దదేవులపల్లి
12. చేగొండి మహేంద్ర ప్రసాద్ - పెద్దదేవులపల్లి
13. దోమలపల్లి పెద్దవీరయ్య - పందెనపల్లి
14. గద్దపాటి జానయ్య - పందెనపల్లి
15. దంతాల విద్యాసాగర్ - ఎర్రపాడు
16. గురజాల మధు - మోతె
17. యం. యల్లయ్య -మోతె
18. దోసపాటి కృష్ణ - మోతె
19. దోసపాటి శ్రీనివాస్ - మోతె
20. దోససాటి క్రాంతికుమార్ - మోతె
21. సిద్దులసైదులు - మోతె
22. దోసాపటి సైదులు - మోతె
23. గజ్జి శ్యాంసుందరం - మోతె
24. యం.విఠల్ - మిర్యాలగూడ
25. పెద్దబోయిన నాగేందర్ - పెద్దదేవులపల్లి
26. నూనె యాదగిరి - కురుమర్తి
27. ఎరుపుల కిష్టమ్మ - గుండ్లపల్లి
28. వంగూరి రామక్క - గుండ్డపల్లి
29. వంగూరి సాయమ్మ - గుండ్లపల్లి
30. దుబ్బ కొండమ్మ - నల్లగొండ
31. పగడం చినలక్ష్మయ్య - అవంతపురం
32. నలబోలు భూపాల్‌రెడ్డి - నేలమర్రి
33. పిడమర్తి మైసయ్య - కోదాడ
34. విరగని లక్ష్మణ్ - ఆలగడప
35. బాచబోయిన సైదులు - ఆలగడప
36. యార సైదులు - ఆలగడప
37. పట్టేటి వెంకటయ్య - ఆలగడప
38. షేక్ జానీ - ఆలగడప
39. ఉప్పల సైదాచారి - ఆలగడప
40. రంజాన్ - ఆలగడప
41. కొత్త నరసింహస్వామి - ఆలగడప
42. కొమరపూడి వాసుదేవాచారి - ఆలగడప
43. చదర్ల నారాయణ - ఆలగడప
44. పోతురాజు శ్రీనివాస్ - ఆలగడప
45. గుడ్ల రవి - ఆలగడప
46. రంగు శంకరాచారి - ఆలగడప
47. నిమ్మల ఎల్లయ్య - ఆలగడప
48. నిమ్మల యాదయ్య - ఆలగడప
49. రుద్రాక్షి బుచ్చయ్య - ఆలగడప
50. పూసపాటి చంద్రశేఖర్ - ఆలగడప
51. కానూరి నాగేందర్ - ఆలగడప
52. కన్నెబోయిన లక్ష్మినరసింహ - ఆలగడప
53. బుడిగబోయిన వెంకన్న - ఆలగడప
54. మంద జినయ్య - ఆలగడప
55. పూసపాటి దుర్గయ్య - ఆలగడప
56. పూసపాటి రాజాలు - ఆలగడప
57. పూసపాటి వెంకన్న - ఆలగడప
58. పూసపాటి చిన వెంకన్న - ఆలగడప
59. పూసాపాటి కోటయ్య - ఆలగడప
60. జయిపురా సురేంద్రాచారి - ఆలగడప
61. నిమ్మల వెంకన్న - ఆలగడప
62. బాచబోయిన భూపతి - ఆలగడప
63. వర్మ - ఆలగడప
64. ఆకుల నగేష్ - ఆలగడప
65. కొప్పోజు శ్రీనివాస్ - ఆలగడప
66. కొత్తరామదాసు - ఆలగడప
67. రాజు - ఆలగడప
68. ఇరుపల్లి బుచ్చిబాబు - ఆలగడప
69. చింతకాయల సోమయ్య - ఆలగడప
70. బి. సోమయ్య - ఆలగడప
71. ముసిని రామయ్య - ఆలగడప
72. బూర చిన అంజి - ఆలగడప



