సంస్మరణ సోయి | 02 మార్చ్ 2007 01:44 am
అస్తమించిన అక్షరసూర్యుడు… ముద్దసాని రాంరెడ్డి
- కె.వి. నరేందర్
ఎవరెస్టునెక్కాలంటే ఉండాల్సింది ఆక్సిజన్ కాదు… ఆత్మవిశ్వాసం… మనకన్నీటి ఏటికి ఎదురీదాలంటే కావాల్సింది సానుభూతికాదు… నిబ్బర పోరాటం… విధి వేయి గాయాలు చేసినా వెరువక ఆశల పతంగాలు ఎగరేసేవాడే నిజమైన దీరుడు. కాలం కత్తిగీతలుగీసినా… కలల విహాంగాలు విసిరేవాడే ధీరుడు…
అలాంటి ఓ అరుదైన సాహితీమూర్తి అస్తమించాడు.
ఆయనే ముద్దసాని రాంరెడ్డి!!
ఓ దురదృష్ట ఘటన ఆయనిని ఒంటరి పక్షినిచేసినా ఆత్మవిశ్వాసానికే ఓనమాలు నేర్పారు.
ఆయన మరణంతో సాహితీక్షేత్రం అక్షర పతాకాన్ని అవనతం చేసింది. తల, చేతులు, ఛాతీ తప్ప 40 ఏళ్లుగా నడుం కించి భాగం పూర్తి స్పర్శ కోల్పోగా తనని తాను కూడదీసుకొని రచనే జీవన విధానంగా మలుచుకున్న గొప్ప సాహసికుడాయన!
ఈ మధ్య ఓ రోజు సాయంత్రం ఫోన్ చేసి ‘రోల్ మోడల్ అవార్డొచ్చింది బిడ్డా… నువ్వే స్వీట్ పట్టుకొని రావాలె. అసలే కదల్లేనంటే ఢిల్లీ వచ్చి అవార్డు అందుకోమంటారు. నీ క్షత్రగాత్రుడు కథ యాదికచ్చింది’ అన్నారు.
‘ఏం స్వీట్ పట్టుకు రమ్మంటారు సార్?” అన్నాను.
“సంకురాత్రి పోయినంక అరిశెలు పట్టుకొస్తవా?” నవ్వుతూ చెప్పాడు. అదే నేను విన్న చివరి నవ్వు… సంకురాత్రి పీడ పండుగ కదా… ఆ పీడ ఆయన్ని మృత్యురూపంలో వచ్చి తీసుకుపోయింది. నలభై ఏళ్ళనించి ఆయన్ని తీసికెళ్లడానికి మృత్యువు భయపడ్తూనే వుంది. అతడి వజ్ర సంకల్పం ముందు ఇన్నాళ్లు ముకుళిత హస్తాలతో ముడుచుకు పోయిన మృత్యువు చివరికి ఆయన మనోనిబ్బరాన్ని దేవతలక్కుడా చూపించడానికి తీసికెళ్ళి వుంటుంది.
భారతీయ సాహిత్యమనే బంగారు పుష్పాలకి అనువాద పరిమళాలద్ది, సురవరం ప్రతాపరెడ్డి జీవితాన్ని, తెలంగాణా ప్రజల గుండెల్లో నిక్షిప్తం చేసిన సదాస్మరణీయుడు ముద్దసాని రాంరెడ్డి!!
‘అసూర్యం నస్య’ అనేపదం ఆయనకు అక్షరాలా వర్తిస్తుంది. ఒకటికాదు. రెండుకాదు. నాలుగు దశాబ్దాలు ఆయన నాలుగ్గోడల మధ్యే అసాధారణ రీతిలో రచనా వ్యాసంగం చేసారు. కనీసం కూర్చొలేని స్థితిలో… మంచంపైనే బోర్లా పడుకొనే సారస్వత సాధన చేసారు.
కవిగా, విమర్శకుడిగా, రచయితగా, పాత్రికేయుడిగా ఆయన మజిలీ అనన్యం. అన్నిటినీ మించి ఆయనకాలంతో చేసినపోరాటం అనితరసాధ్యం. వారి చలన కార్యక్రమాలన్నీ స్తంభించినా, కాలం కొత్తగీత గీసినా, కలాన్ని మాత్రం మనోనిబ్బరంగా నడిపించారు. ఇది ఎందరికో స్ఫూర్తిదాయకం.
ఉర్దూ, హిందీ, మరాఠీ, తెలుగు, ఆంగ్ల, సంస్కృత భాషల్లో రాంరెడ్డి గారికి ప్రవేశం వుంది. అనువాదంలో ఆయనది తిరుగులేని కలం. 1925, జూన్ 6వ తేదీన మానకొండూర్ మండలంలోని ఊటూరు గ్రామంలో జన్మించిన రాంరెడ్డి 1945లో ఉర్దూ మిడియంలో మెట్రిక్ పాసయ్యారు. ఆపై నాగపూర్‌లో ఇంటర్ వరకూ చదివి, పోలీసు యాక్షన్ అనంతరం హైదరాబాద్ నిజాం కాలేజీలో బిఎ పూర్తిచేసారు. 1954లో ఎం.ఎ (తెలుగు) 1955లో జర్నలిజం (ఎం.సి.జె) 1956లో ఎల్.ఎల్.బి. పూర్తిచేసారు. 1958లో జిల్లా పౌరసంబంధాల శాఖాధికారిగా చేరి హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పనిచేసారు. 1967, ఆగస్టు 16న విధి నిర్వహణలో ఆయన ప్రయాణిస్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురై, వెన్నుపూస పూర్తిగా దెబ్బతిని, నడుం నుంచి కింది భాగమంతా స్పర్శాజ్ఞానం కోల్పోయింది. ఎటూ కదలని స్థితిలోఆయన మంచంపై నుంచే రేడియో వ్యాసాలతో రచనకు శ్రీకారం చుట్టారు.
సురవరం ప్రతాపరెడ్డిపై రాసిన రచనకు రాష్ట్ర సాహిత్యకాడమీ వారు 1973లో అవార్డు ప్రదానం చేసారు. సజ్జాద్ జహీర్ ఉర్దూ రచన ‘లండన్ కే ఏక్ రాత్’ పుస్తకాన్ని ‘లండన్‌లో ఒక రాత్రి’ పేర తెలుగులో అనువదించగా విశాలాంద్ర పబ్లికేషన్స్ వారు 1975 జులైలో ప్రచురించారు. ‘నర్మద శంకర్ -జీవిత చరిత్ర’ అనే మరో రచన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది. ప్రముఖ హిందీ రచయిత లాల్ శుక్లా రాసిన ‘రాగ్‌దర్బారి’ హిందీ రచన, ‘దర్బారు రాగం’ పేరుతో రాంరెడ్డి అనువదించగా న్యూఢిల్లీలోని నేషనల్ బుక్ ట్రస్ట్ 1986 లో ప్రచురించింది. నరేంద్ర లూథర్ రాసిన ‘హవాయీ కొలంబస్’ రచనను ‘గాలిమేడల కొలంబస్’గా అనువదించారు. రాంరెడ్డి రచనల్లో విశ్లేషించదగ్గవి ‘ఆధునిక రాజ్యాంగ తత్వమునకు అరవిందుని తోడ్పాటు’ హిస్టరీ ఆఫ్ ఫ్రీడం మూమెంట్ 1996లో ఢిల్లీ ప్రభుత్వం పురస్కారం పొందాయి. అవకాశాలు పుష్కలంగా వున్నా అడుగు ముందుకేసేందుకు బద్దకిస్తున్న నేటితరంలో ఎంతో మందికి రాంరెడ్డి స్ఫూర్తిప్రదాత. ఎదురుపడ్డ ప్రతి రాయినీ ఎదగటానికి సోపానంగా మలచుకునే విశాలతత్వానికి ప్రతీక.
వీరి రచనలకు గాను 1992లో తెలుగు విశ్వ విద్యాలయం పురస్కారం, 1997లో తె.వి. అనువాద రచనా పురస్కారం, 2001లో సురవరం సాహితీ వైజయంతీ పురస్కారంతో పాటు పలు సాహితీ, సాంస్కృతిక సంఘాల అవార్డులు వచ్చాయి.
ప్రముఖ దినపత్రిక సియాసత్ వ్యవస్థాపకులు అబిద్ అలీఖాన్ ఉర్దూభాషకు చేసిన సేవలపై రాంరెడ్డి పుస్తకంగా రాసారు. ప్రముఖ సూఫీకవి ఆనంద్ రాసిన ఫరేజ్‌బాబా రచనను తెలుగు అనువాదం చేసారు. ‘వదిన గారి గాజులు’ అనే నవలని మరాఠీలోకి అనువాదం చేసారు. ఉర్దూ రచయిత్రి ఇసుమాత్ చుఖ్తాయి రాసిన ‘ తేడ్ లఖీర్’ నవలను వక్రరేఖగా, 12వ శతాబ్దానికి చెందిన సూఫీకవి, తత్త్వవేత్త ఫరీజ్‌బాబా జీవిత చరిత్రను అనువాదం చేసారు. 40 ఏళ్లుగా తనని కూడ దీసుకుంటూ, రచనే జీవన విధానంగా మలుచుకున్న గొప్ప సాహసికుడాయన.
సాహిత్యంలో సాహసమేముంటుందనుకునే గిన్నిస్‌బుక్, లిమ్కాబుక్లు రాంరెడ్డిగార్ని తమ పుస్తకాల పుటల్లో నిక్షిప్తం చేసుకోవల్సింది. తెలంగాణా సాహితీమూర్తుల పేరిట వారాల ఆనంద్ నిర్మిస్తున్న డాక్యుమెంటరీల్లో మొదటగా ముద్దసాని రాంరెడ్డిపై నిర్మిచారు. కరీంనగర్‌లో జరిగిన తెలంగాణ రచయితల వేదిక మహాసభల్లో ఆ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఈ మధ్యే ఇండియాటుడే రాంరెడ్డిపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ముద్దసాని రాంరెడ్డి జ్ఞాపకాల్ని, అనుభవాల్ని ఇప్పటికైనా నిరంతరం ప్రకటించాల్సి వుంది. అప్పడుగాని ఆయనెంత గొప్పవాడో తెలుగు పాఠకులకి తెలిసే అవకాశం తక్కువ.
సురవరం సాహిత్య వైజయంతి వెలువరించిన కరపత్రంలో రాంరెడ్డి గార్ని ‘ఆంధ్రా స్టీఫెన్ హాకింగ్’ గా అభివర్ణించింది. అనువాద రచనలకు గాను తెలంగాణా పతాక రచయితగా మిగిలిపోయే ముద్దసాని రాంరెడ్డి అంపశయ్య మీద అక్షర సూర్యుడే.
కాని…ఆ అక్షర సూర్యుడు… జనవరి 7న అస్తమించాడు.
ఆయన మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటు. ఆ స్ఫూర్తిప్రదాతకి అక్షర నివాళులర్పిస్తూ…
ముద్దసానికి లభించిన అవార్డులు -
1. సురవరం ప్రతారెడ్డి జీవితం -రచనలు 1973 (ఆం.ప్ర. సాహిత్య అకాడమీ బహుమతి)
2. బూర్గుల రామకృష్ణారావ్ జీవితం - సాహిత్యం 1982 (ఈపుస్తకాన్ని రాష్టప్రౌరసంబంధాల శాఖ ప్రచురించింది.)
3. లండన్‌లో ఒకరాత్రి 1975 ( విశాలాంధ్ర ప్రచురణ)
4. ఆధునిక రాజ్యాంగ తత్వానికి అరవిందుని తోడ్పాటు 1981 (తెలుగు ఆకాడమీ అవార్డు అందుకున్న ఈ పుస్తకాన్ని 1984లో డిగ్రీస్థాయి పాఠ్యగ్రంథంగా వుంచారు)
5. నర్మదా శంకర్ జీవిత చరిత్ర - సాహిత్యం 1984 (కేంద్ర సాహిత్యకాడమీ ప్రచురణ)
6. దర్బారు రాగం 1985 (కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు)
7. హిస్టరీ ఆఫ్ ఫ్రీడం మూవ్‌మెంట్ - 1986 (పదివేల రూపాయల బహుమానం)
8. ఇందిరాగాంధీ ఆత్మకథ - నా సత్యపథం - 1988
9. గాలిమేడల కొలంబస్ (ఆంధ్రప్రదేశ్ పత్రికలో ధారావాహిక)
10. ఆరడుగుల నేల - 2000 (కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురణ)
11. ఈ మధ్యే రాష్టప్రతి ‘రోల్ మోడల్’ అవార్డు అందుకోవల్సి వుండె. ఆ అవార్డుని స్వీకరించకుండానే ఆయన కన్నుమూసారు.



