నివాళి సోయి | 02 మార్చ్ 2007 12:59 am
నివాళి : నందగిరి ఇందిరాదేవి
తొలి తరం తెలంగాణ కథకుల్లో నందగిరి ఇందిరాదేవి ప్రముఖంగా వెలుగులోకి వచ్చారు. ఆమె 22 సెప్టెంబరు 1919న వరంగల్‌లో జన్మించారు. సంఘ సేవకుడైన వడ్లకొండ నరసింహారావు ఆమె తండ్రి. ఇందిరాదేవి ఆ కాలంలోనే బి.ఎ. (1937) వరకు చదువుకున్నారు. నిజాం కాలంలో హైదరాబాద్ రేడియో స్టేషన్ నుంచి ప్రసారమయ్యే ‘నషర్’ ప్రోగ్రాముల్లో పాల్గొనేది. తర్వాత కూడా చాలా రేడియో ప్రసంగాలు రాసింది. ఆంధ్రయువతి మండలి వ్యవస్థాపకులలో ఆమె ఒకరు. 1937లో నిజామాబాద్‌లో జరిగిన ఆరవ ఆంధ్రమహిళాసభలకు ఇందిరాదేవి గారు అధ్యక్షత వహించారు. ఆ కాలంలో ఆమె అనేక సామాజిక, సాంసృతిక ఉద్యమాల్లో పాలు పంచుకునేది. ఆమె రాసిన కథలు భారతి, గృహలక్ష్మి, ఆంధ్రజ్యోతి మొదలైన పత్రికల్లో అచ్చయినాయి. తను రాసిన కథలను సంపుటిగా అచ్చు వెయ్యకపోయినా దాదాపు 50 ఏండ్లు రచించిన రేడియో ప్రసంగాలను ఆమె “మసకమాటున మంచు” పేరుతో 1955లో అచ్చువేసుకుంది. ఇందిరాదేవి కథలు వ్యావహరికమైన భాషలో సరళ శైలిలో ఉన్నాయి. సంసార సంబంధమైన ఇతివృత్తాలను తీసుకుని కథలు రాసింది. స్త్రీ పురుషుల మనస్తత్వాలను సుకురమారంగా చిత్రించింది.
ఇందిరాదేవి చాలా కాలంగా అమెరికాలో తన కుమారుల వద్ద ఉంటున్నది. జనవరి 22, 2007న ఆమె తుది శ్వాస విడిచారు. తొలితరం తెలంగాణ రచయిత్రిగా ఆమె సాహిత్య కృషిని తెలంగాణ రచయితల వేదిక సమున్నతంగా స్మరించుకుంటూ ఆమెకు స్మతికి వినమ్రంగా నివాళి అర్పిస్తున్నది.
- తెలంగాణ రచయితల వేదిక



