సంస్మరణ సోయి | 02 మార్చ్ 2007 01:23 am
తెలంగాణ ఆణిముత్యం ‘హీరాలాల్ మోరియా’
- కె. పి. అశోక్ కుమార్
హైదరాబాదు స్వాతంత్య్ర పోరాటయోధుడిగా, విప్లవ ధోరణులతో కూడిన సంస్కరణాభిలాషిగా, ప్రముఖ పత్రికా రచయితగా చరిత్రకారునిగా, కవిగా, కథా రచయితగా, నవలాకర్తగా, ప్రజాస్వామ్యవాదిగా, సామాజిక పరిణామాను శీలుడుగా ప్రస్తుతించబడ్డ హీరాలాల్ మోరియా లాంటి బహుముఖ ప్రజ్ఞాశీలురు అరుదుగా కనిపిస్తారు.
మోరియా పూర్వికులెప్పుడో ఉత్తరాది నుండి వచ్చి ఖమ్మంలో స్థిరపడినారు. మోరియా తండ్రిగారు కలప వర్తకులైనా సాహిత్యాభిరుచి కలిగినవారు. ఖమ్మంలో పుట్టి పెరిగిన హీరాలాల్ మోరియా ఏడవతరగతి వరకు ఖమ్మం హైస్కూలులో చదివారు. వందేమాతరం ఉద్యమం సందర్భంగా హైస్కూలు నుంచి ‘రెస్టికేట్ చేయగా హైద్రాబాదులోని కేశవ మోమోరియల్ హైస్కూలులో చేరి మెట్రిక్ పూర్తిచేశారు. చదువుకునే రోజులనుండే సాహిత్యం పట్ల అభిరుచి కల్గిన మోరియా గార్కి దాశరథి, కవి రాజమూర్తి లాంటి వాళ్ళ స్నేహం కూడా వారి అభిలాషను పెంచగలిగింది. మాతృభాష మరాఠి అయినప్పటికీ తెలంగాణలో అప్పుడు ఉర్దూ ప్రధాన భాషగా ఉండడం వలన ఉర్దూలో ఎనలేని పాండిత్యం సంపాదించారు. స్వయంకృషిలో ఆంగ్లబాషలో కూడా మంచి పట్టును సాధించారు.
నిజాం ప్రభుత్వ వ్యతిరేక పోరాటం రోజుల్లో ముఖ్యంగా రజాకార్ల దురంతాలను శక్తివంతంగా ప్రతిఘటించిన స్టేట్ కాంగ్రెస్ ఉద్యమం ఆరంభదినాల్లోనే అనగా మోరియా ఇరవై సంవత్సరాల వయసులోనే స్టేట్ కాంగ్రెస్ ఆదేశం ప్రకారం ఖమ్మం జిల్లాలో మొదటి సారిగా సత్యాగ్రహం చేసి జైలు పాలయ్యారు. మోరియా చక్కటి ఉపన్యాసకుడు. ఆనాటి హైదరాబాద్ సంస్థాన విమోచనోద్యమంలో మోరియా ఉపన్యాసం ఎక్కడ వున్నా ప్రజలు తండోపతండాలుగా, ప్రభుత్వ నిషేదాజ్ఞలను సైతం లెక్కచేయకుండా గుమిగూడుతుండేవారు. తన ఉపన్యాసాలలో నైజాం నవాబు నిరంకుశ పరిపాలనను గురించి, ఆయనకు తొత్తులైన జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు, జమిందార్ల గురించి- వారి దోపిడి విధానాలను వివరిస్తూ ప్రపంచంలో వస్తున్న మార్పుల గురించి, ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి అరటిపండు వొలిచినట్టు వివరించేవారు. నిజాం ప్రభువు దుష్టపరిపాలన ప్రజాబలం ముందు ఆగదని ప్రాచ్య పాశ్చాత్య దేశాలలో జరిగిన ప్రజా పోరాటాల్లో ప్రభువులు ఏవిధంగా పతనమై పోయిందీ, ప్రజలు ఎలా గెలిచారో వివరించి చెబుతూ వుండేవారు. వీరు ఉపన్యాసాలతో విద్యార్థులను, కార్యకర్తలను ప్రజలను ఉత్తేజితులను చేసేవారు. మోరియా కాంగ్రెస్‌వాది కావడంతో గాంధీ మార్గం - అహింసా పద్ధతులలోనే తన పోరాటాన్ని వ్యక్తం చేసేవారు. మోరియా రాజకీయ గురువు, తెలంగాణా వీరకేసరి సర్దార్ జమాలాపురం కేశవరావు గారితో నిర్విరామంగా ఉద్యమ కార్యక్రమాలలో తలమునకలుగా వుండి కూడా అంతర్ముఖంగా ఆలోచిస్తూ ఏదో ఒక కథో, కవితో నైజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా అల్లుతూ వుండేవారు. పత్రికలకు పంపుతూ వుండేవారు. మోరియా, సర్దార్ కేశవరావుతో కలిసి మధిరలో సత్యాగ్రహం చేసి అరెస్టు అయి వరంగల్లు సెంట్రల్ జైలులో నిర్బంధింపబడ్డారు. అటు తర్వాత సంవత్సరం పాటు నిజామాబాద్ సెంట్రల్ జైలులో అనేక కష్టాలనుభవించారు. జైలు సౌకర్యాల మెరుగుకోసం, ఖైదీల హక్కుల కోసం కూడా సత్యాగహ్రం చేశారు. జైలులో వున్న రోజులలోనే మోరియా ప్రాచీన సాహిత్యం వైపు ఆసక్తిని పెంచుకున్నారు. దాంతో ‘భగవాన్ రాం’ పేరుతో రామాయణాన్ని ఉర్దూ భాషలో రచించారు. దీనికే ఉత్తరప్రదేశ్ ఉర్దూ సాహిత్య అకాడమీ వారి బహుమతి లభించింది.
నిజాం ప్రభుత్వం పతనమై, హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన తర్వాత కొంతకాలానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అప్పటి నుండి శ్రీ మోరియా ద్విగుణీకృత ఉత్సాహంతో కాంగ్రెస్ పక్షాన క్రియాశీలక రాజకీయాలతో పాల్గొంటూ వచ్చారు. 1952 నుండి 1962 వరకు శ్రీ మోరియా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటి ప్రధాన కార్యదర్శిగా వుండి, ఖమ్మం జిల్లాలో రాజకీయ చైతన్యానికి, అభివృద్ధికి ఎంతో కృషిచేశారు. ఖమ్మం జిల్లాలో హిందీ, ఉర్దూ, తెలుగు బాషల అభివృద్ధికి ఎంతో కృషిచేశారు. అంజుమన్ తరఖ్ఖి ఉర్దూ, అంజుమన్ తహఫుజ్ ఉర్దూ సంస్థలను స్థాపించడంతో పాటు రాష్ట్రంలో ఉర్దూ ద్వితీయ భాష గుర్తింపుకై ఎంతో కృషి చేశారు. ఖమ్మం జిల్లాలో పెక్కు పత్రికలకు విలేకరిగా పనిచేసిన మోరియా, కొలిపాక మధుసూదన్ రావు గారితో కలిసి ఒక సంవత్సరం పాటు “మా భూమి” పత్రికను నడిపి చేదు అనుభవాలను మిగుల్చుకున్నారు. ఖమ్మం జిల్లా రచయితల సంఘాన్ని స్థాపించి ఆ సంస్థ తరపున యాభై గ్రంథాలను ప్రచురించడం కూడా అపూర్వమే. దీనితో పాటు లలిత కళల అభివృద్ధి కోసం ‘భారతీయ కళాపరిషత్తు” ను కూడా స్థాపించారు. మోరియా దాదాపు పది సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి సభ్యులుగా వుండి, సంస్థ అభివృద్ధిలో పాలుపంచుకున్నారు. అదేవిధంగా పది సంవత్సరాల పాటు ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థకు అధ్యక్షులుగా వుండి గ్రంథాలయోద్యమంలో భాగంగా జిల్లాలో గ్రంథాలయాల విస్తరణకు తీవ్రమైన కృషి చేశారు. తర్వాత కాలంలో గ్రంథాలయాలలో పుస్తక కొనుగోళ్ళలో చోటు చేసుకున్న అవినీతి - అలసత్వాల గురించి ఆవేదన వెలిబుచ్చడం కనిపిస్తుంది. మోరియా ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్తు సభ్యులుగా దాదాపు ఐదు సంవత్సరాలు ఉండి జాషువా గారితో కలిసి ఎన్నో నిర్మాణాత్మకమైన సూచనలు చేసి ఆనాటి సభాధ్యక్షులైన శ్రీ గొట్టిపాట్టి బ్రహ్మయ్య గారి మన్నలను పొందగలిగారు.
రాజకీయ ఉద్యమాలంటే మోరియా గారికి ఎంత ప్రాణప్రదమో, సాహిత్యం పట్ల - సాహిత్య ఉద్యమాల పట్ల కూడా అంతే ఆసక్తిగా ఉండేవారు. వారు దాదాపు వేయి గీతాలను రచించారు. సామాజిక స్పృతో నిండిన మోరియా కవిత్వం ప్రభోదాత్మకంగా, సాంఘిక దురాచారాలపై ఖండనగా, రాజకీయ విమర్శగా రూపుదాల్చిన విధానం కనబడుతుంది. వీటితో పాటు ప్రకృతి సౌందర్యం, మన ప్రాచీన కళాఖండాల ఔన్నత్యాన్ని తెలిపే కవితలు కూడా లేకపోలేరు. వాటిని “ప్రణయసౌధం” సంపుటిలో చూడవచ్చు.
తెలంగాణా విమోచనోద్యమ కవిగా “మాకు వద్దీ రాజ ప్రముఖ్ / కఠిన పాషాణ సదృశు / డీ నిరంకుశ లోహమూర్తి / మాకు వద్దిక, మాకు వద్దు” లాంటి కవితలు అనాడు ప్రచారానికి ఎంతగానో తోడ్పడినాయి. దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత తాము ఆశించిన ప్రగతి, అభివృద్ధి కనిపించకపోవడంతో మోరియా కన్న కలలు కల్లలుగా మారడంతో ఆయనలో అంతర్మధనం మొదలయింది. తత్ఫలితంగా వెలువడిన విప్లవ కవితా సంపుటాలే “ఇది కథనం కదలండి”, “నేను భూదేవి బిడ్డను” “రండి స్వాతంత్య్ర దినోత్సం జరుపుకుందాం”. “యువతరం మేల్కొనాలి” మొదలైనవి. “మిన్నేటి పొంగులు” అనే కవితా సంపుటి మోరియా గార్కి చాలాపేరు తెచ్చిపెట్టింది. సమకాలీన సామాజిక పరిస్థితులను ప్రతిబింభించిన కవితా సంపుటి “ఇది కదనం కదలండి” ఇందులోని ఒక ఖండికలో “బిచ్చం పుట్టని ఈ దేశంలో / భిక్షాటన నిషేధించిన నీకు / బుద్ది వున్నట్టా / లేనట్టా అని నిలదీస్తారు. అలాగే “ప్రభుత్వం / పేదల కొంపలను కొంటుంది / వయస్సును కొంటుంది / మనస్సును కొంటుంది / మనుషులను కొంటుంది”. అంటూ ప్రభుత్వ విధానాలను ఖండించిన కవి “ప్రజాస్వామ్య పరిరక్షణకు కూడదు నరభక్షణ / కూడు, గుడ్డ కొంప / గూడూ / అందరికీ కావాలిక / ఈ దేశం అందరిదీ / ఈ రాజ్యం అందరిదీ / ఎన్ననటికీ కాకూడదు కొందరిది” అని కర్తవ్యబోధ చేస్తారు. ప్రజాస్వామ్య లక్ష్యాలనే కాలరాస్తున్న ప్రభుత్వాల తీరుకు అద్దం పట్టిన ఈ కవితను నేటి రింగురోడ్డ భాగోతానికి కూడా వర్తింప చేయవచ్చు. అలాగే భావ, అభ్యుదయ, విప్లవ గీతాల సంకలనమే “అమృతపథం” అనే కవితా సంపుటి, మోరియా గారికి తెలంగాణా చరిత్ర - సంస్కృతి మీద వున్న ఆసక్తులే. “భాగ్యమతి” కావ్యానికి ప్రేరణ. మోరియా గారు ముషాయిరాల్లో పాడిన ఉర్దూ గీతాలతో “చైతన్యపథం” వెలువరించారు. తెలంగాణ పోరాట యోధుడు సర్దార్ జమలాపురం కేశవరావు గారి జీవితాన్ని “మహాపథం” పేరుతోవచనా కవితా సంపుటిగా వెలువరించారు. దీన్ని తెలుగులో కవి రాజమూర్తి, ఇంగ్లీషులోకి యం. రామానుజాచారి గారు అనువదించారు. మోరియా కవితా సంపుటులన్నీ అయన భావుకతకి, కవితాశక్తికి నిదర్శనాలు.
మోరియా మంచి నవలాకారుడు కూడా. రాజకీయ కార్యక్రమాల్లో బిజీగా వుండటం వల్ల ఎక్కువగా నవలలు వ్రాయలేక పోయారు. వారు రాసిన ఆరు నవలలు వారికి మంచిపేరు తెచ్చిపెట్టాయి. తన నవలల్లో ప్రవేశపెట్టిన విభిన్న పాత్రల ఆలోచనలు, జీవిత విధానం, వారి సమస్యలు, ఉద్రేకాలు, కోరికలు అన్నింటిని సునిశితమైన పరిశీలనా దృష్టితో ఆవిష్కరించగలిగారు. పాత్రల మనో విశ్లేషణతో పాటు, ఆనాటి సామాజిక రీతిని విభిన్న దృక్పథాల నుండి విశ్లేషించడం ఆయన నవలల ప్రత్యేకత. సాంఘికంగా, రాజకీయంగా యాభయవ దశకంలో చోటుచేసుకున్న మార్పులు వ్యక్తిగత జీవితంపై ప్రతిబింబించిన తీరును “గుడిమెట్లు” (1958) నవల ఆవిష్కరించగలిగింది. ఈ నవలలో ఉన్నత మధ్యతరగతికి చెందిన విద్యాధికురాలిని కేంద్రంగా చేసుకొని భిన్న మనస్తత్వాలకు చెందిన పురుషులను చిత్రించబడడటం జరిగింది. ఈ నవల రైల్వే ప్లాట్‌ఫారంపై జరిగిన ఒక సన్నివేశంతో ప్రారంభమై, మరల అలాంటి సన్నివేశంతోనే ముగియటం విశేషం. ఈ నవల ఆదర్శానికి- ఆచరణకు, సామాజిక రీతికి - మనస్తత్వానికి మధ్య జరిగే సంఘర్షణను చిత్రీకరించింది. “తెగని గొలుసులు”, మనోవైజ్ఞానిక నవల. రచయితకు స్త్రీ జాతి పట్ల వున్న సానుభూతి, వారిని ఉన్నతులుగా - శక్తివంతులుగా తీర్చి దిద్దాలనే తపనను ఈ నవల వ్యక్తం చేస్తుంది. గౌరవమనే పరదాల మాటున నైతిక విలువలు, మానవత్వం, మనుగడ ఎలా దారుణంగా ఖూనీ చేయబడతాయో అత్యంత వాస్తవికంగా తెలియజేసిన నవల “ఆగిన తుఫాను” ఉన్నతాధికారుల విలాస జీవితాలు, వాటివల్ల వారి కుటుంబాలకు కాలక్రమంలో కలిగే అనర్ధాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో వుండే మహిళలు ఎదుర్కొనే రకరకాల ఇబ్బందులు- మేధావులై ఆదర్శంగా నిలవాల్సిన కళాశాలల అధ్యాపకులు కొందరు చేసే అక్రమాలను చర్చించిన నవల “విరగని విగ్రహాలు” వీటితో పాటు వారు రాసిన “జీవనది” “ఎవరి కోసం” నవలలు కూడా చెప్పుకోదగినవే.
మోరియా దాదాపుగా అయిదు వందల కథలను వ్రాశారు. నలభైయవ దశకం నుండే ఆయన హిందీ, ఉర్దూలలో కథలను రాయడం, అవి ఉత్తరాదిన ఉన్న ప్రముఖ పత్రికలు ప్రచురించడం జరిగేది. తెలంగాణా తన కార్యస్థలం కాబట్టి తెలుగులో కూడా తన కథలు వెలువడాలనే ఆయన కోరిక. దాంతో వ్రాసిన ప్రతికథను తెలుగులో అనువదింపజేసి, పత్రికలలో వెంట వెంటనే ప్రకటిస్తూ పోయారు. ఉర్దూ నుండి తెలుగులోకి వచ్చిన తొలి కథల సంపుటి “బ్రతుకుబాటలు” కీ.శే. వట్టికోట ఆళ్వారుస్వామి దేశోద్ధారక గ్రంథమండలి తరపున ప్రచురించడం విశేషం. కార్మిక కర్షక ఉద్యమాలతోనూ రైతుకూలీలతోను, అట్టడుగు ప్రజానీకంతో సన్నిహిత సంబంధం వున్న మోరియా గారు వారి వారి వృత్తిపరమైన జీవితపరమైన విభిన్న సమస్యలను తీసుకుని హేతువాద దృక్పథంతో కూలంకషంగా వాటిని పరిశీలిస్తూ ఎన్నో కథలు, కథానికలు వ్రాశారు. అలనాటి హైద్రాబాద్ రాష్ట్ర విమోచనోద్యమంలో సామాన్య అమాయక ప్రజలు రజాకార్ల దౌర్జన్యాలకు, దౌష్ట్యాలకు గురై పడ్డ బాధలను కండ్లకు కట్టినట్లు చిత్రించడంలో కృతకృత్యులైనారు. ఈ దుర్మార్గాలను ప్రతిఘటించడంలో వారు కనబరచిన ధైర్యసాహసాలను, పోరాడిన తీరును వివరించే కథా సంపుటాలే వివిధ బాషలలో వెలువడ్డాయి. వాటలో “పరిష్కారం” “మాయని గాయాలు” మ్రోగని కంఠాలు” “వాడని పూవులు” మొదలైన తెలుగు కథా సంపుటాలు, “ఏక్ మంజిల్ దో రాహే” మోరియాకి కహనియా “ధర్తీ కి పుకార్”లాంటి దంటూ హిందీ కథా సంపుటాలు, “పనాహె గారు” ఉర్దూ కథా సంపుటం “మాన్విత్ ఇన్దిమాన్”, “డైమండ్స్ అండ్ స్టోన్స్” ఇంగ్లీషు కథా సంపుటాలుగా పేర్కొనదగినవి. కథా రచనలో ఈయనది వాస్తవిక దృక్పథం. ఏ కాలపు సాహిత్యం ఆనాటి సాంఘిక జీవితాన్ని ప్రతిబింభించాలన్న అభిప్రాయం కలవారు స్వాతంత్య్రానంతరం దేశంలో వచ్చిన పరిణామాలను, వాటి ఫలితాలను ఊహించి కొన్ని కథలల్లారు.
మోరియాతో రాసిన నాటకాలు ప్రదర్శనా యోగ్యమైనవే. ప్రతి నాటికలోనూ, నాటకంలోనూ ఏదో ఒక సందేశం, ఏదో ఒక ప్రయోజనం మనకు గోచరిస్తుంది. సంఘటనలను, సన్నివేశాలను కథా సందర్భానికి అనుకూలంగా మలచి, అవి హృదయానికి హత్తుకునే విధంగా తీర్చిదిద్దడం వారి ప్రత్యేకత. మోరియా గారు రచించిన శ్రవ్యనాటికలు కూడా ఆనాటి సామాజిక స్థితిని ప్రతిబింబింపజేస్తాయి. వారు సృష్టించిన ఆయా పాత్రలు సంఘములోని ఆయా మనో వికారాలను కలిగి వున్న వ్యక్తుల చిత్రీకరణలే. ఈ విషయాన్ని ఆయన బాహాటంగా చెప్పుకున్నారు కూడా.
మోరియా రాజకీయ గురువు, సహచరుడు తోటి సత్యాగ్రహి, జైలులో పెక్కు మాసాలు తమతో కఠిన కారాగారవాస శిక్షలను అనుభవించి కీర్తిశేషులైన సర్దార్ శ్రీ జమలాపురం కేశవరావు గారి జీవిత చరిత్రను, “సింహగర్జన” పేరుతో ఆయన వివిధ సందర్భాలలో చేసిన ఉపన్యాసాలను వేరు వేరు సంపుటాలుగా ప్రకటించారు. “సర్దార్ జ్ఞాపకాలు, సంఘటనలు” అదేవిధంగా “సర్దార్ జీ భావాలు” అనే పేరుతో మరి రెండు సంపుటాలు వెలువరించారు. ఈ గ్రంథాలలో మాజీ హైద్రాబాదు సంస్థానంలో అమాయకపు ప్రజలు అనుభవించిన అమానుషమైన కడగండ్లను- ఆనాటి అధికారులు, జమిందార్లు, జాగీర్దార్లు సలిపిన దోపిడి విధానాన్ని ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం పడ్డ పాట్లను ఇందులో వివరించారు. ఈ పుస్తకాలు అనాటి తెలంగాణా రాజకీయ, ఆర్థిక, సామాజిక చరిత్రకు నిదర్శనాలుగా నిలుస్తాయి. ఉర్దూభాషలో మహాకవి, ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడైన మక్టూమ్ మొహియుద్దీన్ జీవిత చరిత్రను, నిజాం వ్యతిరేకోద్యమంలో ఆయన నిర్వహించిన పాత్ర గురించి అందులో తెలియజేశారు. ఉద్యమ కాలంలో తనతో పాటు కలిసి పనిచేసిన సుమారు వందమంది కాంగ్రెస్ కార్యకర్తలు సహచరుల జీవిత సంగ్రహాలను వ్రాసి ప్రచురించారు. వీరితో పాటు ఆంధ్రోద్యమంలో పనిచేసిన ప్రముఖ నాయకుల జీవిత చరిత్రలను కూడా రాశారు. అన్నింటికంటే ముఖ్యమైనది గురజాడ మీద ఉర్దూలో ప్రత్యేక సంచిక వేయడం. అందులో మోరియా వ్రాసిన వ్యాసం ఎన్నదగినది. ఈ పుస్తకాన్ని ఆంధ్రదేశంలో వున్న ఒక్క గ్రంథాలయం కూడా కొనుగోలు చేయకపోవడం విచారకరం. జీవిత చరిత్రలను రాయడంలో మోరియా నిష్పక్షపాతమైన చరిత్రకారుడిలా వ్యవహరించారు.
సమాజంలోని అసంఖ్యాకమైన సమస్యలను తీసుకొని మోరియా వేయికి పైగా లఘువ్యాసాలు రాశారు. ఈ వ్యాసాల్లో ప్రతిచిన్న సమస్యపై రచయిత యొక్క అవగాహనను, సామాజిక స్పందనను ఆవేదనను స్పష్టంగా గుర్తించవచ్చు. అప్పుడప్పుడు దేశంలోని విభిన్న ఆర్థిక, రాజకీయ , చారిత్రిక, విద్యా వైజ్ఞానిక కళా, సారస్వత రంగాలకు సంబంధించిన విషయాలపైన మోరియాగారు ఎన్నో వ్యాసాలు వ్రాసి ప్రకటించారు. వాటినే తరువాతి కాలంలో పుస్తకాలుగా ప్రకటించారు. వాటిలో పేర్కొనదగినవి. “దశలు - దిశలు” “మన విద్యారంగం” “మనం మన సమస్యలు” మొదలైనవి.
మోరియా ఉర్దూ రచయిత ఆయన రచనలన్నీ తొలుత ఉర్దూలో వచ్చినవే. అయితే దాదాపు అన్ని రచనలు ఏకకాలంలో కొన్ని సార్లు ఉర్దూకంటే ముందుగా తెలుగులోకి అనువదింపబడినవి. ప్రముఖ తెలుగు రచయితలు ఉటుకూరి రంగారావు, దాశరథి, కవిరాజమూర్తి, తాళ్ళూరి రామానుజస్వామి, కౌముది, కొలిపాక మదుసూదనరావు, ఎ.జనార్ధనరావు, ఎం.ఎ. రహమాన్, కొండపల్లి వెంకటశేషగిరిరావు, అంకిత కేశవులు మొదలైనవారు తెలుగులోనికి అనువదించారు. కొన్ని ఆంగ్లానువాదాలను సి.హెచ్. వెంకటేశ్వరరావు, హిందులు శ్రీ పురానాలాల్ మోడి అనువాదం చేశారు.
స్ఫురద్రూపం, స్మితవదనం, ఉత్తమ సంస్కారం, మృదుభాషిత్వం, ఉత్సాహం మేళవించిన మోరియాగారు త్యాగశీలి, నిరాడంబరుడు, నిస్వార్ధపరుడు. ఆయన ఇల్లు ఒక సాహితినిలయం. బ్రహ్మాండమైన ఒక పుస్తక భాండాగారం. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ భాషలకు చెందిన సుమారు పదివేలకు పై బడిన ఎన్నో అమూల్యమైన గ్రంథాలు ఇందులో ఉండేవి. సాహితి బంధువులకు ఇదొక విహార కేంద్రంగా ఉండేది. నిబద్ధత కలిగిన రాజకీయ కార్యకర్తగా పనిచేశారే తప్ప పదవుల కోసం ఎన్నడూ ఆశించలేదు. పదవులే ఆయనను వరించి వచ్చాయి. వచ్చిన పదవులను కూడా నిస్వార్దంగా, హుందాగా నిర్వర్తించి తప్పుకున్నారు. రాజకీయరంగంలో కానీ, సాహిత్య రంగంలో కాని వివాదరహితుడిగానే వుంటూ అందరి మన్ననలను అందుకున్న మోరియా కృషి, సేవలు చిరస్మరణీయాలు.



