వైతాళికులు & వ్యాసాలు సోయి | 02 మార్చ్ 2007 03:11 am
తెలంగాణ వైతాళికుడుగా వట్టికోట ఆళ్వారుస్వామి
- ఎన్. వేణుగోపాల్
ఫిబ్రవరి 5, 2007 ఆళ్వారుస్వామి 46 వర్ధంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం
ఆళ్వారుస్వామికి పూర్వరంగం
భూస్వామ్య, రాచరిక సమాజాలలో భూస్వామినీ రాజునూ మేల్కొలపడానికి స్తోత్రపాఠాలు పాడేవ్యక్తిగా ఉనికిలోకి వచ్చిన వృత్తి వైతాళికుడు. ఆ పదాన్నే ఆధునిక సమాజాలలో ప్రజలను చైతన్యపరచిన తొలితరం ఆలోచనాపరులను, మేధావులను, ప్రచారకులను, సామాజిక కార్యకర్తలను, ప్రజానాయకులను ఉద్దేశించి కూడ వాడడం జరుగుతున్నది. సర్వసాధారణంగా భూస్వామ్య, రాచరిక, మధ్యయుగ సమాజాలు పెట్టుబడిదారీ, ప్రజాస్వామిక, ఆధునిక సమాజాలుగా మారే పురుటినొప్పులు పడుతున్నప్పుడు ఆ మార్పును త్వరితం చేసిన, గానంచేసిన, ఆ మార్పుకు విస్తృత ప్రజాసంఘీభావం సమకూర్చిపెట్టిన మేధావులను, బుద్ధిజీవులను, సృజనకర్తలను వైతాళికులని పిలవడం జరుగుతున్నది.
యూరోపియన్, అమెరికన్ సమాజాలలో కూడ అటువంటి మార్పులు జరగడం, ఆ మార్పులలో వైతాళికుల పాత్ర వారి నేపథ్యాల గురించి ఇక్కడ అప్రస్తుతంగాని, భారతీయ సమాజాలలోని వైతాళికుల గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు వారి మధ్య తీవ్రమైన అంతరాలు, సామ్యాలు, భేదాలు, వారిలో ఒక్కొక్కరి ప్రత్యేకతలు ఆశ్చర్యం గొలుపుతాయి. బెంగాలీ సమాజంలోని రాజారామమోహనరాయ్ (1772-1833), ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ( 1820-1891), కేశవ చంద్రసేన్ (1838-1884), రామకృష్ణ పరమహంస (1836-1886), ల నుంచి, గుజరాతీగా పుట్టినా ఆర్య సమాజం ద్వారా హిందూ సమాజమంతా ప్రముఖుడైన దయానంద సరస్వతి (1834-1883), కోస్తాంధ్ర తెలుగు సమాజంలోని కందుకూరి వీరేశలింగం (1848-1919), రఘుపతి వెంకటరత్నం నాయుడు (1862-1939), గురజాడ అప్పారావు (1861-1915) ల వరకూ ఈ భారతీయ వైతాళికుల సంప్రదాయం విస్తృతమైనది. సుధీర్ఘమైనది. దానికదిగా ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసినది. అయితే దాదాపుగా ఆయా సమాజాలలోని వైతాళికులందరూ ఒక నిర్ధిష్ట, సంపన్న, విద్యాధిక వాతావరణం నుంచి, ప్రత్యేకమైన అవకాశాలతో వైతాళికులుగా ఎదిగారు. (1) తమిళ సమాజంలోని సుబ్రహ్మణ్య భారతి (1882-1921)మరాఠీ సమాజంలోని జ్యోతిబాఫూలే (1827-1890), మలయాళీ సమాజంలోని నారాయణ గురు (1856-19228) వంటి వైతాళికులు మాత్రమే సంపదలోనో, కులంలోనో, అవకాశాలలోనో ఈ సంప్రదాయానికి మినహాయింపు.
వట్టికోట ఆళ్వారుస్వామి (1915-1961) ని తెలంగాణ వైతాళికులలో ఒకరిగా చెప్పేటప్పుడు ఆయనకూడ ఈ మినహాయింపు కిందికే వస్తాడు. తెలంగాణ వంటి ఒక వెనుకబడిన ప్రాంతంలో, ఇరవయో శతాబ్దపు తొలి అర్ధభాగంలో వైతాళికుడిగా ఎదిగేందుకు వట్టికోట ఆళ్వారుస్వామికి బ్రాహ్మణ కటుంబంలో పుట్టడం మినహా ఇతర ప్రత్యేకమైన అర్హతలేమీ లేవు. వంశపారంపర్య ఆస్తి, అధికారం, తల్లిదండ్రుల ఉన్నత స్థానం, కుటుంబానికి బయటి ప్రపంచంతో సంబంధం, ఉన్నత విద్య, ఉద్యోగం సామాజికజీవనం - ఇవేవీ ఆయనకు అందివచ్చినవి కావు. వీటిలో కొన్ని ఆయన తన జీవితక్రమంలో, అనన్యసాధ్యమైన సాధనతో, కృషితో సంపాదించి ఉండవచ్చు గాని, ఇతర సమాజాలలో వైతాళికులుగా ఎదిగినవారికి ఉన్న ఇటువంటి అవకాశాలలో చాలా భాగం ఆయనకు పుట్టుకతో రాలేదన్నది ఒక వాస్తవం.
అసలు ఇరవయో శతాబ్ది తొలి అర్ధభాగపు తెలంగాణ వాతావరణమే విశిష్టమైనది. దాని ప్రత్యేక లక్షణాలను సరిగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ సమాజంలో వైతాళికుడి పాత్రకు ఉన్న విశిష్టత అవగతమవుతుంది. ఆనాటి తెలంగాణ ఒక భూస్వామ్య సమాజంగా ఉండింది. భారత ఉపఖండంలోకి బ్రిటిష్ వలసవాద ప్రవేశం వల్ల దిగుమతి అయిన అరకొర ఆధునికతా వాసనలు కూడ సోకని సంస్ధాన ప్రాంతం నాటి తెలంగాణ. బ్రిటిష్ వారి నుంచీ, ఫ్రెంచి వారి నుంచీ కూడ తన కుటుంబ, ప్రభువర్గ విలాసాల కొరకు, కొంతవరకు హైదరాబాదు లోని కులీన వర్గాలకొరకు నిజాం ప్రభువులు ఆధునిక జీవనశైలులను స్వాగతించారుగాని అవి సంపన్నవర్గాలను దాటి కిందికి, కనీసం మధ్యతరగతి దాకా కూడా ప్రవహించలేదు. మతం, కులం, సంపద, భాష అనే ప్రధాన భూమికలపై నిలిచిన అంతరాల వ్యవస్థలో పిరమిడ్ పైన నిరంకుశ ప్రభువు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఉండగా ఆ క్రింది వరుసలలో వేరు వేరు స్థాయిలలో, అనేకపేర్లతో (2) పిలవబడిన ప్రభు వంశ ఆశ్రితులు, భూస్వాములు ఉండేవారు. ఈ భూస్వామ్య వ్యవస్థను యాధాతథంగా ఉంచి, సంరక్షిస్తూ కప్పం వసూలు చేసుకున్నది మిగిలిన భారతదేశంలో రాజ్యం చలాయించిన బ్రిటిష్ వలసవాదం. అందువల్ల నాటి తెలంగాణ అటు వలసవాదం కిందా, ఇటు భూస్వామ్యం కిందా నలిగిపోతూ ఉండింది.
నాటి తెలంగాణలో రెండు ప్రధాన జీవనదులు ఉండి, సారవంతమైన భూమి ఉన్నప్పటికీ, అతికొద్దిభాగం మినహా ఆధునిక నీటిపారుదల సౌకర్యాలను, వ్యవసాయోత్పత్తి పద్ధతులను ఎరగదు (3). పారిశ్రామికాభివృద్ధి హైదరాబాదు నగరానికీ, సంస్ధానంలోని మరి ఒకటిరెండు నగరాలకూ మినహా ఇతర చోట్ల తెలియదు. (4) ఆధునిక విద్యా, వైద్య, రవాణా అవకాశాలేవీ నాటి సమాజానికి తగినంతగా కాదు సరిగదా, నాటికి బ్రిటిష్ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నంతగా కూడ లేవు. (5)
ఈ విధంగా ఆనాటి తెలంగాణ సమాజం అనేక రకాలుగా వెనుకబాటుతనాన్ని అనుభవిస్తుండింది గనుక, తన ప్రజ్ఞాపాటవాలను, సృజనాత్మకతను సంపూర్ణంగా వికసింప జేసుకునే అవకాశాన్ని కోల్పోయి ఉండింది గనుక, ఆ సమాజం లో వైతాళికుడి పాత్ర చాలా అవసరమయినది, లోతయినది, విస్తృతమయినది. ఆ వైతాళికుడు కేవలం ఏదో ఒక రంగంలో మాత్రమే తన శక్తియుక్తులు ప్రదర్శిస్తే సరిపోయేది కాదు. ఆ సమాజం ఆ వైతాళికుడి నుంచి అనేక రంగాలలో కృషిని ఆశించింది. ఆ వైతాళికుడు సవ్యసాచి కావాలని ఆశించింది.
మాడపాటి హనుమంతరావు (1885-1970), ఆదిరాజు వీరభద్రరావు (1892-1973), సురవరం ప్రతాపరెడ్డి (1896-1953) వంటి తొలితరం తెలంగాణ నాయకుల బహుముఖకృషికి కారణం ఇదే. తెలంగాణ వైతాళికులందరూ సామాజిక, రాజాకీయ, సాహిత్య, మత, సాంస్కృతిక రంగాలన్నిటిలోనూ పనిచేయవలసి వచ్చింది. రచయితలుగానూ, ఆ రచనల ప్రచారకులుగానూ ఉండవలసివచ్చింది. సాంఘిక కార్యకర్తలు గానూ, ఉపన్యాసకులుగానూ, రాజకీయ కార్యకర్తలుగానూ కూడ ఉండవలసివచ్చింది.
మరోమాటల్లో చెప్పాలంటే, ఒక భూస్వామ్య సమాజంలో సహజమైనదిగా కనపడే మానసిక, శారీరక శ్రమవిభజనను వాళ్లు తుడిచేయవలసి వచ్చింది. మేధో శ్రమకూ, శారీరక శ్రమకూ మధ్య గీసి ఉన్న అసహజమైన విభజనరేఖ ఆఖాతంగా మారిపోయిన ఇవాళ్టి స్థితి నుంచి చూస్తే, ఆ విభజనరేఖను తుడిచేయడానికి ఒక శతాబ్దం వెనుక వారు జరిపిన అటువంటి కృషి ఎంత మహత్తరమైనదో, ఎంత అపూర్వమైనదో అర్థమవుతుంది.
అటువంటి బహుముఖ కృషి చేసిన, శ్రమవిభజనను తుడిచేసిన తెలంగాణ వైతాళికులలో వట్టికోట ఆళ్వారుస్వామికి మరింత ప్రత్యేకత ఉంది. ఆయన తాను చేసిన పనులు కేవలం సామాజిక అవసరాలను తీర్చడంగా మాత్రమే కాక, పరిస్థితులు తోసినందువల్ల మాత్రమే కాక, ఇతర వైతాళికులకన్న ఎక్కువ అవగాహనతో, ఎక్కువ చైతన్యపూర్వకంగా చేసినట్టనిపిస్తుంది. ఆ ప్రత్యేకతకు కారణమైనవి ఆయన జీవితం, ఆయన కృషి, ఆయన ప్రభావం.
ఆళ్వారుస్వామి జీవితం
తెలంగాణ వైతాళికుడిగా ఆళ్వారుస్వామిని అంచనా కట్టే ముందు ఆయన జీవితం గురించీ, కృషి గురించీ, ప్రభావం గురించీ స్థూలంగానైనా తెలుసుకోవాలి.
ఆళ్వారుస్వామి నల్లగొండ జిల్లాలోని నక్రేకల్లు సమీపంలోని చెరువుమాధవరం అనే గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. చిన్ననాటనే తండ్రి చనిపోగా, పరాయి ఇళ్లలో వంటలు చేసిపెట్టి, పనులు చేసి, ఒక రకంగా సేవక-యాచక వృత్తితో పొట్టపోషించుకోవలసివచ్చింది. అందువల్ల ప్రాథమిక దశలో కూడ నియత విద్య అభ్యాసానికి ఆయన నోచుకోలేదు. పదమూడు పద్నాలుగేళ్ల వయసులో సూర్యాపేటలో గ్రంథాలయం ద్వారా ఆయనకు ప్రపంచంతో పరిచయం మొదలయింది. సొంతంగా తెలుగు మాత్రమే కాక ఇంగ్లీషు కూడా నేర్చుకున్నాడు. ఈ క్రమంలోనే నక్రేకల్లు, సూర్యాపేట, కందిబండలలో ఇళ్లలో వంటపనులు, బెజవాడలో హోటల్ సర్వర్ వృత్తి, హైదరాబాదులో ఫ్రూఫ్‌రీడర్ పని వంటి అనేక జీవన వ్యాపారాలు చేశాడు. చివరికి, బహుశా 1936-37 ప్రాంతాలలో హైదరాబాదు చేరి గోల్కొండ పత్రికలో ఫ్రూఫ్‌రీడర్ ఉద్యోగం చేరాడు.
అప్పటి వరకూ గడిపిన జీవితం మాత్రమే ఆయన సొంతం అనుకోవాలి. అప్పటి నుంచి, 1961 ఫిబ్రవరిలో మరణించే వరకూ ఆయన జీవితమంతా బహిరంగ, సామాజిక జీవితమే. ఆ ఇరవైమూడు, ఇరవై నాలుగేళ్లలో జైలు జీవితానికి మూడేళ్లపైగా ఖర్చయిపోగా, మిగిలిన రెండు దశాబ్దాలలో ఆయన చేసినపనులు రాశి రీత్యా చూసినా, వాసి రీత్యా చూసినా అసాధారణమైనవి.
ఆ ఇరవై ఏళ్లలో ఆయన కథకుడిగా, వ్యాసకర్తగా, నవలారచయితగా, విమర్శకుడిగా, కవిగా, ఉపన్యాసకుడిగా, పత్రికా రచయితగా, పత్రికా సంపాదకుడిగా, ప్రచురణకర్తగా, పుస్తకాల అమ్మకందారుగా, పరిశోధకుడిగా, గ్రంథాలయ నిర్వాహకుడిగా, మొట్టమొదటి సూచీ గ్రంథాలయ స్థాపకుడిగా - ఒక్కమాటలో చెప్పాలంటే, అక్షరంతో, మాటతో సంబంధం ఉన్న పనులన్నీ చేశాడు. స్టేట్ కాంగ్రెసు, ఆర్యసమాజం, ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టుపార్టీ, అభ్యుదయ రచయితల సంఘం, తెలంగాణ రచయితల సంఘం వంటి సామాజిక రాజకీయ సాహిత్య సంస్థలన్నిటిలో కార్యకర్తగా, నాయకుడిగా పనిచేశాడు. ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, గుమస్తాల సంఘం, రిక్షా కార్మికుల సంఘం, రైల్వే ఉద్యోగుల ఆందోళన వంటి కార్మికోద్యమ సంస్థలకు నాయకత్వం వహించాడు. బహుశా తెలంగాణలో తొట్టతొలి పౌరహక్కుల పరిరక్షణా కార్యక్రమాన్ని నిర్వహించాడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విరమణ తర్వాత బహుశా నిర్లిప్తతతో కమ్యూనిస్టు పార్టీకి దూరమైనా, 1959లో కేరళలో నంబూద్రిపాద్ మంత్రివర్గాన్ని కేంద్రప్రభుత్వం బర్తరఫ్ చేయగానే, అందుకు నిరసనగా మళ్లీ కమ్యూనిస్టుపార్టీలో చేరాడు.
ఇన్ని రంగాలలో, ఇంత బహుముఖంగా విస్తరించిన ఆయన వ్యక్తిత్వాన్ని సమగ్రంగా అంచనా కట్టవలసిన పని ఇంకా మిగిలే ఉంది. (6)
ఆళ్వారుస్వామి కృషి
పైనే చెప్పినట్లు ఆళ్వారుస్వామి నలభై ఐదు సంవత్సరాల జీవితంలో మొదటి ఇరవై సంవత్సరాలు బతుకు తెరువు వెతుక్కోవడంలోనే గడిచిపోయాయి. మూడు సంవత్సరాలకు పైగా జైలు నిర్భంధంలో గడిచాయి. అంటే ఆయనకు సామాజిక కృషి సాగించడానికి నిండా ఇరవైరెండు సంవత్సరాలు కూడ దొరకలేదు. ఆ ఇరవైరెండు సంవత్సరాల కాలంలోనే ఆయన సాగించిన సామాజిక, సాహిత్య, సంఘ నిర్మాణ కార్యక్రమాలు చూస్తే ఆయన ఎంత నిర్విరామంగా, ఎంత పట్టుదలతో, ఎంత విస్తృతంగా పనిచేశాడో తెలుస్తుంది.
సామాజిక రంగంలో ఆయన ఆంధ్రమహాసభలో సాగించిన కృషి అందరికీ తెలిసిందే అయినా మళ్లీ ఒకసారి ఇక్కడ చెప్పుకోవడం అవసరం. ఆయన మొదటిసారిగా 1937లో నిజామాబాదులో జరిగిన ఆరవ ఆంధ్రమహాసభలో పాల్గొన్నాడు. ఆ ఆంధ్రమహాసభే తొలిసారిగా నిజాం బాధ్యతాయుత ప్రభుత్వం నిర్వహించాలని మనవి చేసి ఒక బహిరంగ రాజకీయ ప్రస్తావనకు నాంది పలికింది. ఆ మహాసభలో ఆయనకు పెద్ద పాత్రలేకపోవచ్చు గాని, ఆయన ఆ తర్వాత మల్కాపురం (ఏడవ ఆంధ్రమహాసభ, 1940), చిల్కూరు (ఎనిమిదవ ఆంధ్ర మహాసభ, 1941), భోనగిరి (పదకొండవ ఆంధ్రమహాసభ, 1944) లలో క్రియాశీలపాత్ర నిర్వహించారు. (7) ముఖ్యంగా భోనగిరి ఆంధ్రమహాసభకు ముందు అందులోని ఇరుపక్షాలకూ మధ్య వచ్చిన ఘర్షణను నివారించడానికి ఆళ్వార్‌స్వామి చేసిన ప్రయత్నం ‘మీజాన్’ పత్రికలలో అచ్చుకు కూడ ఎక్కింది. రెండు పక్షాల మధ్య వచ్చిన వివాదాన్ని గాంధీ సహాయంతో పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఆ క్రమంలో ఆయన రాసిన సుదీర్ఘ వ్యాసాలు ‘మీజాన్’ లో అచ్చయ్యాయి. ఇక చీలిక తప్పనప్పుడు, ఆయన అప్పటికి ఇంకా కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు కానప్పటికీ, కమ్యూనిస్టుల నాయకత్వంలోని, రావి నారాయణరెడ్డి అధ్యక్షతలోని ఆంధ్రమహాసభ వైపే ఉండిపోయారు. ఆ చీలిక జరిగిన 1944 నుంచి కడివెండిలో కాల్పులు జరిగిన 1946 జులై 4 దాక, ఆ తర్వాత కూడ చాల చోట్ల ఆయన రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డిలతో పాటు ప్రధానవక్తగా కూడ ఉన్నాడని ఆధారాలున్నాయి. బహుశా 1944 నాటికే ఆయనలో కమ్యూనిస్టు భావాలు బలపడినట్లు కనిపిస్తుంది. అందువల్లనే 1944లోనే గుమస్తాల సంఘం ఏర్పాటుచేయడం, దాని బాధ్యతలు నిర్వహించడం జరిగి ఉంటుంది. అధికారికంగా మాత్రం ఆయన 1945లోనే కమ్యూనిస్టు పార్టీలో చేరినట్లు ఆధారాలున్నాయి.
ఒకవైపు ఆంధ్రమహాసభ కార్యకర్తగా పనిచేస్తూనే ఆయన తొలిరోజుల్లో స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహంలో కూడ పాల్గొన్నాడు. అందులో భాగంగా జైలు నిర్భంధాన్ని కూడ అనుభవించాడు. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా ఉన్నప్పుడు కూడ ఆయనలో గాంధీ పట్ల అభిమానం కొనసాగినట్టే కనబడుతుంది. అయితే, బ్రిటీష్ ఇండియాలో స్వాతంత్య్రం అనబడేది వచ్చి, తెలంగాణలో రైతాంగ సాయుధపోరాటాన్ని విరమించిన తర్వాత ఆయనకు అన్ని రాజకీయపక్షాల ఆచరణతోనూ అసంతృప్తి ఏర్పడినట్టనిపిస్తుంది. ‘రామప్ప రభస’లో 1957 ఆగస్టు 15 గురించిరాస్తూ, “నాటి పాలకులు, సంపన్నులు పాలితులను, బీదలను హింసించడం, దోచుకోవడం హక్కుగాను, అధికారం గాను, చట్టరీత్యా పొందిన వరంగాను బాహాటంగా చెప్పుతూ చేశారు. అందువల్ల వారి వాదంలోని అసహజత్వాన్ని బాధితులు బాహాటంగా, బలంతో ఎదుర్కొని, వారి బూటకాన్ని లోకానికి చాటారు. వారి ఆటలను కట్టివేశారు. వారి జాతకాలను మార్చి వేశారు. వారి చట్టాలను చెత్తబుట్టల్లో చేర్చారు. వారి నిజస్వరూపాలను నగ్నం చేశారు. వారి పశుశక్తిని భగ్నం చేశారు. కాని నేటి పరిస్థితులు వేరు. ‘నేషనల్ సోషలిజం’ పేర హిట్లర్ ప్రపంచాన్ని మింగ చూచాడు. ‘కంట్రోల్ డెమోక్రసీ’ పేర నాసర్ నాయకత్వం చేపట్టాడు. ‘ప్రజల ప్రజస్వామ్యం’ పేర మార్క్సిజం ముద్రతో, కమ్యూనిస్టులు మనుషుల విలువలను మంట కలుపుతున్నారు. దేశాన్ని కుల, ముఠా, ప్రాంత, భాషా భేదాలను ‘గాంధీ వారసులు’గా కాంగ్రెసువారు రేకెత్తిస్తున్నారు. నాడు రాజ్యాలను, రాజరికాలను నిలబెట్టుకోవడానికి ప్రజలపై దౌర్జన్యాలు సాగితే నేడు ప్రజలపేర, ప్రజలకొరకు, ప్రజాప్రతినిధులుగా ప్రజలపై దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ప్రజలను మభ్యపెట్టుతున్నారు” అని రాశారు.
అట్లా ఒకవైపు, ఆంధ్రమహాసభ, మరొకవైపు స్టేట్ కాంగ్రెస్ పనులు చేస్తూనే ఆయన దేశోద్దారక గ్రంథమాల పేరుతో పుస్తక ప్రచురణ సంస్థను కూడ 1938లోనే ప్రారంభించాడు. 1942లో నిర్భంధం వల్ల ఆగిపోయి, 1943లో విడుదల తర్వాత కూడ ఇతరపనుల ఒత్తిడివల్ల పునరుద్ధరించ లేకపోయిన గ్రంథమాలను 1951లో రెండోసారి జైలు నుంచి విడుదల అయిన తర్వాత పునరుద్ధరించాడు. ఈ రెండు విడతలలో కలిసి ముప్పై పుస్తకాలు ప్రచురించాడు. వాటిలో తెలంగాణ పాఠకులకోసం అవసరమైన పుస్తకాల అనువాదాలూ ఉన్నాయి. స్వతంత్ర రచనలూ ఉన్నాయి. వాటిని తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో పాఠకులు ఉన్న దగ్గరికల్లా వెళ్లి ప్రచారం చేశాడు.
ఆళ్వారుస్వామి రచనలన్నీ విశిష్టమైనవే గాని ఇంతవరకూ ఎక్కువగా వెలుగు ప్రసరించని ‘రామప్పరభస’ వ్యాసాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసి ఉంది. ఆయన చివరి రచనలలో ఒకటి, మరణానంతరం పుస్తకరూపంలో వచ్చినది ‘రామప్పరభస’. ఇది మచిలీపట్నం నుంచి వెలువడే తెలుగు విద్యార్ధి మాసపత్రికలో 1956-57లో శీర్షికగా అచ్చయి, 1984లో పుస్తక రూపం ధరించింది. అటు అప్పటి వరకూ తాను సభ్యుడిగా ఉండిన కమ్యూనిస్టు పార్టీకి రాజీనామా చేసి, ఇటు స్వాతంత్య్రానంతర గాంధీవాదంతో నిరాశచెంది, ఒకరకంగా నిర్లిప్తతలోకి ప్రయాణించిన మేధావి అభిప్రాయాలుగా ఈ వ్యాసాలు కనబడతాయి. మరొక దశాబ్దం తర్వాత ఈ దేశంలో పాలక కాంగ్రెస్ పార్టీకి, కమ్యూనిస్టు ర్టీల దిగజారుడుకూ వ్యతిరేకంగా వచ్చిన తిరుగుబాటుకు ఒక భవిష్య సూచనగా ఈ వ్యాసాలకు చాలా ప్రాధాన్యత ఉంది.
ఆళ్వార్‌స్వామి ప్రభావం
ఆళ్వారుస్వామి ప్రభావం ఆయన సహరచయితలమీద, తర్వాతి తరం రచయితలమీద, తెలంగాణ ప్రత్యేక ఆస్తిత్వం గురించి ఆలోచించే అందరిమీదా గణనీయంగా ఉంది. నిజానికి ఆయన ప్రభావం ఆయన మరణానంతరమే ఎక్కువగా ఉందన్నా, పెరుగుతున్నదన్నా అతిశయోక్తి కాదు. ఆయన రచనల గురించీ, కృషి గురించీ చెప్పుకోవడం, మననం చేసుకోవడం, దాన్ని ఆదర్శంగా గ్రహించడం ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నది. తెలంగాణ ప్రజాజీవితాన్ని ప్రతిభావంతంగా నవలలకెక్కించిన రచయితగా, తెలంగాణ భాషను సజీవంగా అక్షరాలకెక్కించిన కథకుడిగా, గ్రంథాలయోద్యమ కార్యకర్తగా, తెలంగాణ చరిత్ర పరిశోధనపై ఆసక్తి ప్రేరేపించిన వ్యక్తిగా ఆయన ప్రభావం ఇప్పుడు మరింతగా, మరింత ఎక్కువమందికి అవగాహనకు వస్తుంది.
పునః పునరాగమనమే వైతాళికుడి సారం
కొనసాగుతున్న, విస్తరిస్తున్న ప్రభావమే ఆళ్వారుస్వామి వైతాళికుడనడానికి ప్రబలమైన నిదర్శనం. ఒక మేధావి వైతాళికుడైనప్పుడు మాత్రమే అతని గురించి మళ్లీ మళ్లీ చర్చ జరుగుతుంది. ఆయన భావాలు ఎంత సంబద్ధమైనవో, ఎంత సార్వకాలికమైనవో మళ్లీ మళ్లీ కనిపిస్తూ ఉంటుంది. ఆయన ఒక ఉదాహరణప్రాయమైన, ఆదర్శప్రాయమైన చిహ్నంగా మారిపోతాడు. ఆ చిహ్నం నుంచి ఎప్పటికప్పుడు కొత్తకొత అర్ధాలు గ్రహించడానికి, నిన్న కనిపించకుండా ఉండిపోయిన వెలుగులు ఇవాళ గ్రహించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఆయన రచనల గురించీ, కృషి గురించి ఇంకా ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని కొత్త తరాలలో ఆకాంక్షలు పెల్లుబుకుతూ ఉంటాయి.
ఒక సమాజపు వైతాళికుడి పని తన సమకాలీన సమాజంలో, తన స్థలకాల పరిమితులలోపల మాత్రమే జరగదు. వైతాళికుడిగా ఉండడమంటేనే ఆ వ్యక్తి పునఃపునరాగమిస్తూనే ఉన్నాడు. ఆయన రచనల అధ్యయనం అవసరం, ఆ రచనల మీద ఆసక్తి రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం విస్తరిస్తున్న తెలంగాణ ప్రత్యేక అస్తిత్వ ఆకాంక్షలు వట్టికోట ఆళ్వారుస్వామిని సగౌరవంగా సంస్మరించుకుంటున్నాయి. ఆయన స్మృతి నుంచి నేర్చుకోవలసినదెంతో ఉన్నదని గ్రహిస్తున్నాయి. తెలంగాణ సమాజం ఆళ్వారుస్వామిని అట్లా మళ్లీ మళ్లీ ఆహ్వానిస్తునే ఉంది. ఆయన తెలంగాణ వైతాళికుడనడానికి అంతకన్న పెద్ద రుజువు అవసరం లేదు.
ఉపయక్త గ్రంథాలు కొన్ని :
- కె. శ్రీనివాస్ (1999), తెలంగాణలో సాహిత్య పునర్వికాసం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సమర్పించిన పిహెచ్డి సిద్ధాంతగ్రంథం, ఆముద్రితం
- వట్టికోట ఆళ్వారుస్వామి (1952) జైలు లోపల, సర్వోదయ ప్రెస్, సికింద్రాబాదు.
- వట్టికోట ఆళ్వారుస్వామి (సం.) 1956), తెలంగాణం - రెండో భాగం, దేశోద్ధారక గ్రంథమాల, సికింద్రాబాదు.
- వట్టికోట ఆళ్వారుస్వామి (1983), రామప్పరభస, తెలుగువిద్యార్ధి ప్రచురణ, మచిలీపట్నం
- వరవరరావు (1983), తెలంగాణ విమోచనోద్యమం - తెలుగు నవల, హనుమకొండ
- సంగిశెట్టి శ్రీనివాస్ (2003), షబ్నవీస్ - తెలంగాణ పత్రికారంగచరిత్ర (1886-1956), కవిలె, హైదరాబాద్
- సంగిశెట్టి శ్రీనివాస్ (2004), దస్త్రమ్ - తెలంగాణ తొలితరం కథల సూచి, కవిలె, హైదరాబాద్
- సంగిశెట్టి శ్రీనివాస్ , ఎన్ వేణుగోపాల్ (2006) - తెలంగాణ వైతాళికుడు వట్టికోట ఆళ్వారుస్వామి సార్థకజీవనం, కవిలె, హైదరాబాద్
- D.N. Dhanagare ( 1986), Peasant Movements in India - 1920-1950, Oxford University Press, Delhi
- V. Ramakrishna Reddy ( 1987) Economic Hisotory of Hyderabad State, Gian Publishing House, Delhi
అధోఃసూచికలు
1) వీరిలో ఈశ్వర చంద్ర విద్యాసాగర్, రామకృష్ణ పరమహంసలు మాత్రం పేదకుటుంబాల నుంచి వచ్చారు. విద్యాసాగర్ తన ఉన్నత విద్య ద్వారా, రామకృష్ణ పౌరోహిత్యం ద్వారా ప్రత్యేకమైన అవకాశాలు పొందారు.
2) పాయోగాలు, ఉమ్రాలు, సంస్థానాలు ఎస్టేట్లు, ఇనాంలు, అగ్రహారాలు, సంస్థానాలు, మక్తేదార్లు, జాగీర్దార్లు, దేశముఖ్లు, దేశపాండ్యాలు వంటి అనేక పేర్లతో ఇవి ఉండేవి.
3) కాకతీయునాటి నీటిపారుదల సౌకర్యాలను మినహాయిస్తే, ఆధునిక నీటిపారుదల - వ్యవసాయోత్పత్తి సౌకర్యాలు నాటి తెలంగాణలో చాల తక్కువ. పదహారో శతాబ్దపు హుసేన్‌సాగర్, ఇబ్రహీంపట్నం చెరువు, 1920లలో నిర్మాణమైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్, నిజాంసాగర్లలో నిజాంసాగర్ మినహా ఏదీ పెద్దెత్తున ఆదునిక వ్యవసాయోత్పత్తికీ, వ్యవసాయంలో మిగులుకూ దారి తీసినవి కావు.
4) వట్టికోట ఆళ్వారస్వామి సంపాదకత్వంలో వెలవడిన ‘తెలంగాణం’ వ్యాససంకలనం (1956)లో గొబ్బూరు రామచంద్రరావు రాసిన పారిశ్రామిక కార్మికులు వ్యాసం ప్రకారం, 1951 నాటికి తెలంగాణ జనాభా 1,01,07,773 కాగా, అందులో పారిశ్రామిక కార్మికుల జనాభా 64,000, అంటే 0.6 శాతం. అందులోనూ, కేవలం సింగరేణి బొగ్గు గనుల్లోనే 20,000 మంది పనిచేసేవారు గనుక, తెలంగాణలో ఇరవయో శతాబ్ది ప్రథమార్ధబాగంలో పారిశ్రామికాభివృద్ధి ఎంత తక్కువగా ఉండేదో అర్థమవుతుంది.
5) ఇరతయో శతాబ్దపు తొలి అర్ధభాగం తెలంగాణలో అక్షరాస్యతా శాతం ఎంత అనే విషయంలో కఛ్చితమైన గణాంకాలు దొరకడం లేదు. నాలుగు శాతం నుంచి పదిశాతం వరకు ఎంతయినా ఉండవచ్చుననీ, మొత్తానికి పదిశాతం కన్న తక్కువేననీ లభ్యమవుతున్న ఆధారాలు చెపుతున్నాయి. వైద్య సౌకర్యాలు, రవాణా సౌకర్యాల విషయంలో హైదరాబాదు, ఒకటిరెండు నగరాల పరిస్థితి కొంత మెరుగుగాని, విశాలమైన తెలంగాణలో ఆ సౌకర్యాలు లేవు.
6) ఆ కృషిలో ఒక ప్రథమ ప్రయత్నం సంగిశెట్టి శ్రీనివాస్, ఎన్ వేణుగోపాల్ల రచన ‘తెలంగాణ వైతాళికుడు వట్టికోట ఆళ్వారుస్వామి సార్థక జీవనం’ (కవిలె ప్రచురణ - 2006)
7) ధర్మవరంలో జరిగిన తొమ్మిదో ఆంధ్రమహాసభ (1942), హైదరాబాదులో జరిగిన పదవ ఆంధ్రమహాసభ (1943) లలో ఆళ్వారుస్వామి పాల్గొన్నట్టులేదు. బహుశా ఆ సమయంలో ఆయన జైలులో ఉండడం వల్ల హాజరయినట్టులేదు. లేదా, ఆయన పాల్గొని ఉంటే అందుకు సంబంధించి ఆధారాలు దొరకవలసి ఉంది.
8) చాల అచ్చుతప్పులతో, గందగోళంగా వచ్చిన ఈ పుస్తకానికి ‘మామాట’ అనే పేరుతో తెలుగు విద్యార్ధి ప్రచురణలు రాసిన ముందు మాటలో దీన్ని రామప్పరగడ అని కూడా ప్రస్తావించారు. ఈ పుస్తకంలో మొత్తం పదహారు వ్యాసాలున్నాయి. ఆ వ్యాసాలు తెలుగువిద్యార్ధి పత్రికలో ఏ సంచికనుంచి ఏ సంచిక వరకు వెలువడ్డాయో కూడ ప్రచురణకర్తలు రాయలేదు.



