పోస్టులు అభిప్రాయాలు 07 February 2012

మన సంస్కృతి సోయి | 07 జూన్ 2007 06:33 pm

సాంస్కృతిక జీవనంలో కుండ - ఆదిలాబాద్‌ రంజన్ల ప్రత్యేకత

-బి. వేణుగోపాల్‌ రెడ్డి

తొలకరికి పులకరించిన నేల మట్టి సౌరభాలను వెదజల్లుతుంది. సువాసనలతో నిండిన ప్రకృతిని చూసి మనిషి విహంగమవుతాడు. జంతువులను వేటాడి రక్తపు వాసన మరిగిన మనిషి ఆదిమ మనిషి వాసనతో నిండిన మట్టిని హత్తుకుంటాడు. మొత్తని మట్టిని తన చేతులలో మురిపెంగా లాలిస్తాడు. ‘మన్ను బొమ్మను’ చేసి పరవసిస్తాడు.

అట్లా మట్టితో అల్లుకున్న ‘బ్రతుకు చిత్రం’ మానవ మేధస్సు సృష్టించిన అద్భుత కళాఖండం ‘కుండ’. ఆది వస్తువు కుండ. కమ్మరన్న చేతిలో వికసించిన పుష్పం కుండ. మట్టి కుండ జీవన సంస్కృతి చిహ్నం. ప్రాకృతిక జీవన సంస్కృతికి గుర్తు. మట్టి ముద్ద నాగరికతకు దారి చూపుతున్నది. మానవ నాగరికత మట్టితోనే ప్రారంభమైంది. నాగరికతకు చిహ్నం ‘మట్టికుండ’. ఈ భూగోళం కూడ ఒక మట్టి కుండనే. ఈ మట్టి కుండ పైనే సృష్ఠి నిర్మాణం జరిగినది. మట్టి జీవ సంబంధమైనది. జీవి మనుగడకు ఈ భూమి పోషణ భారమైంది. మట్టి నుండి పిండుకున్న గింజ కుండలో పడి కమ్మటి ఆహారమైంది. దప్పిక తీర్చే నేస్తమైంది. ధాన్యాగారమైంది. ప్రకృతి ఒడిలో తయారైన కుండ నాగరికత ఆనవాళ్ళను మిగిల్చింది. హరప్పా నాగరికతలో కుండ పెంకులు లభ్యమై నాగరికత విస్తృతిని పెంచింది. సారె పైన జీవన సంస్కృతిని సృష్టించినాడు కుమ్మరన్న. కుమ్మరి చక్రం బతుకు చిత్రాన్ని గీసింది.

ఇప్పుడున్న స్టీల్‌ లాంటి పాత్రలకు తల్లి మట్టికుండనే. మట్టి సమస్త సంపదలకు మూలం, మట్టిలో నుంచి తీసిన ఇనుమును కుండలో కర్గించి, కుండలాంటి సాంచెలో పోస్తే పాత్ర అవుతుంది. ఇట్లా మానవ జీవితం సుకుమారంగా తయారవడానికి కుండ ఒక వనరు అయింది. అద్భుతమైన రుచిని తన సొంతం చేసుకున్నది.

‘పాలగోకు’ పసిడి రుచి ఒక స్మృతి ధార. వంటకు ఒక ప్రత్యేకమైన రుచిని ఆపాదిస్తున్నది.

ఆ రోజుల్లో నిత్య జీవితానికి వివిధ రకాల కుండల్ని కుమ్మరన్న అందించేవాడు. సంస్కృతిలో భాగమైన కుండ పెళ్ళికి స్వాగతం పలుకుతుంది. అయిరేని కుండతో మనిషి చివరి ప్రస్థానానికి తోడై చావు కుండతో వీడ్కోలు చెపుతుంది. శుభకార్యాలకు ప్రత్యేకమైనది కుండనే. అది గృహప్రవేశమైనా, ఇంకా ఏదైనా. బోనాల పండుగకు విశిష్ఠత చేకూరుస్తున్నది కుండ. ఇంకా నీళ్ళ బానలు - నీళ్ళకొరకు వాడే వారు. అంతే కాకుండా పాలకు, పెరుగుకు మరియు చల్లకు ప్రత్యేకమైన కుండలు. ఇంకా గటక కుండ, చారుకుండ, పప్పు కుండ, జిమ్మల కూర కోసం చెవుల కుండ, పెరుగు దుత్త, కుడిది కుండ, నూనె కొరకు ప్రత్యేకమైన దుత్త వాడే వారు. ఊరగాయ కారం కోసం ప్రత్యేకమైన కుండ. కాగులు - ఇది చిన్నపాటి ధాన్యాగారం.

అద్భుత సృష్టి కుమ్మరన్న చేతిలో పురుడుపోసుకున్న కాగు నిలువడెత్తు ఉండును. ఇప్పసారకు ప్రత్యేకమైన కుండ. ఇంకా తాపెంకయే గాక చిప్పలు, దీపెంతలు, రొట్టె పిండి పిసుక్కోవడానికి వెడల్పాటి తకారలు నిత్య అవసరాలను తీర్చేవి. సంస్కృతిలో భాగమైన కుండ బ్రతుకు చిత్రంలో జీవన చిత్రంగా మారినది. ఆధునికతతో వచ్చిన మార్పుల పర్యవసానంగా కుండ ఇంటి నుంచి కనుమరుగయింది. స్టీల్‌, ప్లాస్టిక్‌ల సప్పుల్ల మధ్య కుండ అటకెక్కింది. కాగు బిత్తర చూపులు చూస్తున్నది. ‘మనిషి నుండి మనసు దూరమవుతున్న సందర్భంలో కుండ ఎట్లా అంటే అట్లా ఉపయోగించే వీలు లేదు. పగల దిక్కి అని యాంత్రిక జీవితం నుంచి కుండ వెనక్కి వెళ్ళింది’.

నాటి బాల్యం తాత, మామ ఇచ్చిన చారాన, ఆటాణలను దాచుకునే గళ్ళకుండ. సమయానికి పెద్దల అవసరాలను తీర్చే ఆపన్న హస్తం అయింది. కాని, నేడు గళ్ళకుండ తెలియని బాల్యం చలిగి Key Board పైన కదులుతున్నది. మొత్తం మట్టి ఉత్పత్తులు ఇంటిలో లేనె లేకుంట అవుతున్న సందర్భం నేడు కొనసాగుతున్నది. ప్రపంచీకరణ వేగం కావచ్చేమో! కాని, మన సంస్కృతిని నేడు వాడు వస్తువుగా వాడుకొని సొమ్ము చేసుకుంటున్నాడు. నేడు Five Star హోటల్‌లో, ఉన్న వాళ్ళ పెళ్ళిలో కుండల్లో వంటకాలను చూస్తున్నాం. ముఖ్యంగా పెరుగును కుండలో అందిస్తున్నాడు. మన సంస్కృతిని ఛీ.. అన్న వాడు ఇపుడు సొమ్ము చేసుకుంటున్నాడు. ఇదొక ఉదాహరణ. ప్రపంచీకరణ పర్యవసానంగా బ్రతుకులు ఛిన్నాభిన్నమైనవి.

కాని, ఈ మార్పులకు లొంగకుండా తన అస్తిత్వాన్ని కాపాడుకుంటున్న కుండ ప్రతిరూపం-రంజను ‘పేదవాడి ఫ్రిజ్‌’గా వేసవి తాపాన్ని తీరుస్తున్నది. చల్లని నీటితో గొంతును తడుపుతున్నది.

మట్టి మార్మికత ఒక్కో ప్రాంతంలో ఉంటుంది. ఒక్కోరకంగా అట్లనే ఆదిలాబాద్‌ మట్టి సౌరభాలను పులుముకున్న ఇక్కడి రంజన్లు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకతను సంతరించుకున్నవి. ఆదిలాబాద్‌లోని కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా ఆదిలాబాద్‌, నిర్మల్‌ ప్రాంతాలలో చాలా కుటుంబాలకు ఈ రంజన్ల తయారే జీవనాధారం. ప్రత్యేకమైన సురాయి (కూజా)లు కూడా చేస్తారు. ఆదిలాబాద్‌లోని కుమ్మరి వాడలో 300 కుటుంబాలు ఈ కుండల తయారియే తమ వృత్తిగా నెట్టుకొస్తున్నారు. సుమారు 50 సంవత్సరముల నుంచి రంజన్లను తయారు చేస్తున్నారు. భారత దేశం కుల వృత్తుల సమాజం. కళావృత్తుల సమాజం కూడా. వివిధ కుటీర పరిశ్రమలతో భారతదేశం సంపూర్ణంగా బ్రతికింది. కాని నేడు ఆధునిక మార్పులు, ప్రభుత్వాల నిర్లక్ష్యధోరణి వల్ల వృత్తులన్ని దూరమవుతున్నాయి. మనిషి జీవన అవసరాలకు ఒక అర్థవంతమైన వ్యవస్థ ఉండేది. సాంస్కృతిక జీవనమైన వస్తు మార్పిడి అంతరించి వస్తువాదం నెలకొంది. జీవన అవసరాలకు కుండలే గాక ఇంటి నిర్మాణానికి కూన పెంలు తయారు చేసేది. ”బెంగుళూరు కూన ఎప్పుడు వచ్చిందో గప్పుడు మా నోట్లో మట్టి పడ్డది”. అని చాలా కుటుంబాలు తమ దుస్థితిని తెలియ చెప్పాయి. ఆకలి బాధలు నిత్య రోదనలైన వీరికి ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకడం లేదు. చాలా సిగ్గుచేటు.

”కుండలు, కూన పెంకులు బంద్‌ అవడంతో తామే ఈ రంజన్ల తయారీని జీవనాధారంగా మలచుకున్నామని” కుమ్మరి మల్లన్న తెలియజెపుతున్నాడు. ఇక్కడ 300 కుటుంబాలు ఈ రంజన్లను తయారు చేస్తున్నారు.

ఇది నాలుగు నెల్లు మాకు కడుపు నింపుతుంది. కాని దీనికోసం మేము 5, 6 నెల్ల నుండి కష్టపడుతాము. ఇది మాకు పూర్తి ఆధారానివ్వదు. కాని.. చేయక తప్పడం లేదు. మిగతా నెలల్లో ఇక్కడి వారంతా కూలి కాని, ఇతర పనులు చేసుకుంటారు. మరియు చలికాలంలో పూల పెంపకం, చెట్ల పెంపకానికి కుండీలు తయారు చేస్తారు. వీటిని ముఖ్యంగా ఆడవారు తయారు చేస్తారు. మట్టి ముద్ద కుమ్మరన్న చేతిలో లయబద్దంగా ఆకారం దాల్చుతుంది. మట్టి సేకరణ కుమ్మరన్న జీవితంలో భాగం. ముఖ్యంగా రంజన్ల కొరకు నల్ల మట్టి, ఎర్ర మట్టి అవసరమవుతాయి.

ఈ రెండింటిని ఎండబెట్టి సన్నగా చేస్తారు. దీనిలో చిన్న రాళ్ళుకాని, చెత్త కాని ఉంటే తీసివేస్తారు. మట్టి మానవ సంస్కృతి చిహ్నం. మట్టి నుంచి నిర్మాణం రూపుదిద్దుకుంటుంది. సృష్టిలో ప్రతి జీవికి ఒక ప్రత్యేకత గలదు. అట్లనే చాలా పశువులు తమ దినచర్యలో నెమరేయడం ప్రధాన విధి. కాని నెమరేయని జంతువు ఒకటుంది. అదేమిటంటే గుర్రం అనవచ్చు. కుండ కనుక్కొన్న నిజమైన శాస్త్రవేత్త కుమ్మరన్న అన్వేషణ ఫలితం గుర్రం నుంచి లభించిన ‘గుర్రపు లద్దిని’ మట్టికి కలుపుతాడు. ఎందుకంటే రంజన్లు తయారు చేసి వాటిని కాల్చేటపుడు గుర్రపు లద్దిలోని గడ్డి సంబంధమైన చిన్న చిన్న సూక్ష్మ పదార్ధాలు కాలిపోతాయి. కావున సూక్ష్మారంధ్రాలు ఏర్పడుతాయి. ఈ రంధ్రాల నుంచి నీరు బయటకు వచ్చి కుండను ఎల్లప్పుడు తేమగా ఉంచుతుంది. అందువలన నీరు చల్లదనానికి గురి అవుతుంది. ఇది ఆదిలాబాద్‌ రంజన్ల ప్రత్యేకత. లద్దిని కలపడం ఇక్కడి ప్రత్యేకత అవుతున్నది. లద్ది మహారాష్ట్ర ప్రాంతంలో దొరుకుతుంది. దీపావళి తర్వాత ఈ లద్దిని సేకరిస్తారు. మహారాష్ట్రలోని అడవుల్లోంచి లద్దిని ఏరుకొని తెచ్చుకుంటారు. కాని కొన్ని సంధర్భాల్లో లద్దిని కొనుక్కోక తప్పడం లేదు. 100 రూపాయలు బస్తా ఉండడం, యవత్మాల్‌, చంద్రాపూర్‌ లాంటి సుదూర ప్రాంతాల నుంచి తీసుకరావడం విపరీతమైన ఖర్చులకు దారి తీస్తున్నది. ‘ఏమి పడ్తల్‌ లేదు అని నాగారావ్‌’, లక్ష్మీ దంపతులు చెబుతున్నారు.

కుటుంబమంతా ఈ రంజన్ల తయారీలో ఉన్నాము. ఖర్చులు పోగా 10 వేల ఆదాయం కూడ వస్తలేదని అంటున్నారు.

నిజమే.., ప్రతి వస్తువు ధర నేడు ప్రభుత్వం చేతిలో లేదు. అది వ్యాపారుల చేతిలో పడింది. నియంత్రణ లేని ప్రభుత్వం నీడన పొట్ట పోసుకోవడం నేడు అత్యాశే అవుతున్నది.

ప్రతి కుంటుంబంలోని సభ్యులంతా రంజన్ల తయారీ పనిలో నిమగ్నమవుతారు. ముఖ్యంగా ఆడవారి చేతిలోనే ఈ రంజన్లు తయారవుతాయి. మట్టిని పిసికి అన్ని సమపాల్లలో అనగా నాలుగు గుల్లల మట్టికి మూడు గుల్లల లద్ది మరియు సగం గుల్ల బూడిద కలిపి మిశ్రమం చేస్తారు. ఈ మిశ్రమానికి నీరు కలిపి పిసికి పిసికి ఒక రోజు నిలవ ఉంచిన తర్వాత తయారీకి ఎంతో ఓర్పుతో మట్టికి ఆకారాన్ని అందిస్తారు. మట్టి మందారం చేతిలో తయారైన రంజన్లకు మట్టి ఇతర ముడి సరుకులు మగవారు తెస్తారు. కాని, ఇక్కడ ఆడవారి శ్రమనే అధికం. కుటుంబ పోషణకు మట్టిని నమ్ముకున్న చేతులు మట్టిని సల్పతో టప టప కొడ్తూ రంజన్‌ ఆకృతిని తేవడానికి ఎంతో శ్రమిస్తారు. కాని, సురాయి, కుండలు ‘సారె’పైన చేస్తారు. తయారయిన రంజన్లకు తుది మెరుగులు దిద్దుతారు. జాజు, బింకం పూస్తారు. చూడ చక్కగా ముస్తాబవుతుంది. రంజన్లను అన్నింటిని సుమారు 130 రంజన్లను ఒక దగ్గెర పేర్చి పగిలిన కుండలను కప్పి ‘బట్టి’ పెడతారు. అపుడు కన్‌ కన్‌ మనే అద్భుతమైన కుండలు తయారవుతాయి. బట్టీ పెట్టడానికి 100 రూ కైకిలిచ్చి ఒక మనిషిని పెడతారు. కుండలు సరిగ్గా కాలకపోతే చేసిన కష్టం ఒక దెగ్గరకి వస్తుంది.

బట్టీ పెట్టడానికి చిన్న చిన్న ఎండు పుల్లలు తోడకలు అవసరమవుతాయి. కాని కట్టెలు దొరికే పరిస్థితి లేదు. ”ఎండిన తోడుకలు, కట్టెలు ఏరుకుంటే అటవీ శాఖ వారు వద్దంటున్నారు” అని ఇస్తారి బాధతో చెపుతున్నాడు. 500/- రూ|| పెట్టి కస్లం కట్టెలు కొనె పరిస్థితి మాకు లేదు. పనికిరాని అందుగు పొట్టు, ఎండిన కట్టెలు తెచ్చుకుంటే అటవీ శాఖవారు 250/- దండుగ వసూలు చేస్తున్నారు. వేధింపులకు గురి చేస్తున్నారని”. ఇస్తారి వాపోయిండు. ”ప్రభుత్వం సహాయం చేస్తే చేయక పోని కాని మా పనులకు అడ్డమవుతున్నది”. అని చాలా మంది తెలిపినారు.

”రోజు రోజుకు మేము వృత్తికి దూరమవుతూ, బ్రతకలేని పరిస్థితి ఏర్పడుతున్నది. పోయిన ఏడాది 140 కుటుంబాలు రంజన్లు తయారు చేసినవి. ఈ సంవత్సరము 84 కుటుంబాలే తయారు చేస్తున్నవి. ఇట్లయితే రేపు కుండలనేటివి ఉండవు. మా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి దాపురిస్తది”. అని నాగన్న బాధతో అనడం ప్రభుత్వాల నిర్లక్షాన్ని సూచిస్తున్నది.

ఇక్కడ నివసిస్తున్న వారికి స్వంత ఇల్లు, జాగాలు లేవు. చాలా కుటుంబాలు వలస వచ్చి పని చేసుకుంటున్నవి. కారణం పల్లెలన్ని పని లేక తల్లడిల్లుతున్న అస్తవ్యస్థ సందర్భం నేడు నెలకొన్నది.

వ్యయం అధికమైన నేటి పరిస్థితిలో ఆదాయం ఏ మేరకు సరిపోతున్నది. ఇంత కష్టపడితే వచ్చే 10 వేల ఆదాయంతో జీవిస్తున్నాం. పిల్లలను చదివించే పరిస్థితి నేడు లేదు. అని వాపోతున్నారు. నాగోరావు దంపతులు. భారతీయ ఆర్థిక వ్యవస్థ ఉత్పత్తి చేసిన వారిని మర్చిపోతున్నది. ఉత్పత్తి చేసిన వారి ఆర్థిక పరిస్థితులు పట్టించుకోకపోవడం వల్ల ఆత్మహత్యలు కొనసాగుతున్నవి. పండించిన పంట, ఉత్పత్తి చేసిన వస్తువు హక్కుదారు ఉత్పత్తి దారుని దాటి మూడోవాని కడుపు నింపుతున్నది. ఇది నేటి ఆర్థిక ద్వంద్వ నీతి. తయారు చేసిన కుండ తమ చేతి నుండి జారిపోయిన తర్వాత అధిక రేటు పలుకుతున్నది. ఇది దారుణం. ఉత్పత్తి దారున్ని ముంచడమే. తమ దగ్గర 20 రూపాయలకు కొని బయట 30 రూపాయలు అవుతున్నది అని ఇస్తారి తెలిపిండు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి జిల్లాలో ఆదిలాబాద్‌ రంజన్లు చేరుతున్నవి వేసవి తాపాన్ని తీర్చే రంజన్లు జిల్లాకే తలమానికం. నేడు దీనిని పరిశ్రమగా గుర్తించపోవడం శోచనీయం. ఉత్పత్తి దారుల్ని కనీసం కార్మికునిగానైనా గుర్తించడం లేదు.

Trackback This Post | Subscribe to the comments through RSS Feed

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో