వ్యాసాలు సోయి | 07 జూన్ 2007 06:44 pm
కాపు రాజయ్య - చిత్రకళ
- డా|| కొండపల్లి శేషగిరిరావు
రాజయ్య నా చిరకాల మిత్రుడు-మేముభయులం స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ & క్రాఫ్ట్‌స్ లో ఇంచుమించు రెండేళ్ల తేడాతో డిప్లోమా తీసుకొన్నాం! నేనతని గుణ గణాలను కొంతైనా గుర్తెరుగుతాను! అతనికి బాల్యం నుండి సహజమైన పట్టుదల, దీక్ష, కృషి చేయటం అలవాటు! విద్యార్థి దశ పూర్తయింతర్వాత సిద్దిపేటలో ఉదరవోషణకై స్థిరపడి పల్లెపట్టుల వాతావరణం బాగా జీర్ణించుకొన్నాడు! అది అతని మనోఫలకంపై ముద్ర వేసింది! పల్లెల్లోని జీవితానికి అలవడి ఆ జీవితంలోని రసమాధుర్యాన్ని తనివితీరా గ్రోలి చిత్రాలలో నింపి తెట్టెలు గట్టినాడు! ఆమాధుర్యాన్ని తన శిష్య మాధూకరాలకు పంచిపెడుతున్నాడు. దానికెంతయో అతను శ్లాఘపాత్రుడు! ఏ గురువైననూ తన శిష్యుల మూలకంగానే ప్రఖ్యాతిజెందుతాడు! లేకున్న వాళ్లకృషి అడవిగాచిన వెన్నెలవుతుంది! దామెర్ల రామారావుకు ప్రఖ్యాతి వచ్చిందంటే, దానికి కారకులు ఆయన శిష్యులే! రాజయ్య ఉదరపోషణకు ఉద్యోగం చేసినా, తన జీవిత లక్ష్యాన్ని మఱువక, చిత్రకళలో అనివార్య కృషి చేసినాడు! దానికి ప్రతిఫలంగా ఆయనకు మనదేశంలో పేరుప్రఖ్యాతులు లభించినై! నేటికి ఆయన సన్మానింపబడుతున్నాడు!
రాజయ్యను ఎఱుగని పత్రికా పాఠకులు అరుదు! కొంత కాలం క్రితం యేవారపత్రికలోనైనా, ముఖ్యంగా ఆంధ్ర వారపత్రిక, ఆంధ్రప్రభ. ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ, ధర్మయుగ మొదలైన పత్రికల్లో ఆర్టు మ్యాగజైన్లలో రాజయ్య చిత్రాలు తఱచుగా కన్పించేవి! క్రింద పేరు చదవకుండానే ‘ఓ హో’ ఇది రాజయ్య చిత్రం లాగుందే అన్న వార్ని నేనెరుగుదును! కారణం, ఆయన చిత్రాల్లో నున్న శైలి! రేడియోలో ఒక రికార్డు మధ్యలో ట్యూనుజేస్తే కంఠాన్ని బట్టి ఇది లతామంగేష్కర్, ఘంటసాల లేక రఫీ యనియో రఫ్‌గా చెప్పొచ్చు! అలాగే చిత్రాలు చూచి చిత్రకారుణ్ని పోల్చవచ్చును! చిత్రాల బాణి, రేఖల నడవడి, ఆకృతి లక్షణాలు, కూర్పు (Composition) భూమికా విభజన (Spacing) రూపలక్షణాలు చిత్రకారుణ్ని పట్టిఇచ్చును! ఈ లాంటి ప్రతిచిత్రమూ చిత్రకారుణి రూప పటం అనుటలో సందేహంలేదు! రాజయ్యవేసిన బొమ్మల్లో యే ఒక చిత్రం తీసికొన్నా దానిలో పెద్ద పెద్ద కళ్లు, నొసలు నుండి ముక్కు కొనకు ఒకే సూటిగీత, ప్రస్ఫుటమైన పెద్దని పెదవులు, చెక్కిళ్లు, గోచరిస్తాయి. యీ లక్షణాలన్నీ రాజయ్యగారి ముఖంలో చూడవచ్చును చిత్రకారుడు తెలిసి వేసినా తెలియక వేసినా, అతని లక్షణాలు ఆయన చిత్రాల్లో కొట్టవచ్చినట్లు గోచరిస్తాయి.
రాజయ్య జానపదశైలిలో ప్రత్యేక కృషి చేసి విజయం సాధించినాడు. ఈ జానపద శైలిలో నున్న చిత్రాల తఱుచుగా మనం పెద్దమ్మలోళ్ల గుళ్లు, కాకిపడగల వాండ్ల చిత్రాలు, కాటెమరాజుకధల చిత్రాలు, పేడ బోమ్మల్లో, పాత నిర్మల్ చిత్రాల్లో, మచిలీపట్నం అద్దకాలపై మనకు గోచరిస్తాయి! వీటిని వేసే వాండ్లకు, స్వాభావికత నూతన సృష్టియంటే ఏమిటో తెల్వదు! వాళ్ల పూర్వీకుల పంధాలో యాంత్రికంగా నకలు చేయటం మాత్రం వారికెరుక! ఆధునిక యుగంలో మనదని చెప్పుకోదగ్గ యీ కళలు గూడా సన్నగిల్లి చిత్రకారుల కుటుంబాలు చిన్నాభిన్నమై బ్రతుకు దెరువుకై అన్యవృత్తులు అవలంభించారు! యే కళ అడుగంటిన ఆ రోజుల్లో దాన్ని ఆదుకొని తన సృజనాత్మక శక్తిని జోడించి కృషి చేసినాడు రాజయ్య!
జానపద కళ శాస్త్రీయంగా గుర్తించ బడలేదు! దాని సొబగు బంతిపూవులాంటివని ప్రతీతి! కాని రాజయ్య శైలి బంతిరూపులో చేమంతివాసనలు కల్గింపజేసినవి. దీనికి కారణం ఆయనలో నున్న సృజనాత్మక శక్తి! రాజయ్య ప్రత్యేకించి యేజానపద శైలినీ నిక్కచ్చిగా అనుకరించ లేదు! కొందరు జమినీరాయ్‌ను అనుకరించాడని అనుకొంటారు! కాని జమినీరాయ్‌కి రాజయ్యకు సహస్రాంశ భేదం గలదు! జమినీ రాయ్ సాధారణంగా ఒక భంగిమను తీసికొని దాన్ని అత్యంత క్లుప్త రేఖల్లో ఘనీభవించి, క్లుప్తపరచి మందమైన రేఖలతో మిశ్రిత వర్ణాల్లో ఒక ఆధునిక శైలిని సృష్టించినాడు! అతని చిత్రాల్లో నూటికి తొంబై తొమ్మిది ఇలాంటివే! అతన్ని ఆధునిక జానపద శైలికి వైతాళికుడుగా విదేశీ విమర్శకులు గుర్తించినారు!
భారతదేశంలో నేడు ముఖ్యంగా రెండు విధాల చిత్ర కళ సాగుచున్నది. ఒకటి ఆధునిక చిత్రకళ యనబడు Modern Art. రెండవది సంప్రదాయ చిత్రకళ యనబడే Traditional Art. రాజయ్య చిత్రాలు ఈ రెండవ కోవలో చేరుతాయి.
మనదేశంలో Modern Art యెంతవరకు నిలిచేవీ నేడు చెప్పటం వీలుపడదు! కాని సంప్రదాయ చిత్రకళకు ఎప్పుడైనా స్థానం గలదు! దానికి కారణాలు, దాని చరిత్ర దాని బీజాలూ, భారత క్షేత్రంలో పాదుకొని యుండుట, మన ఆధునిక చిత్రకళకు బీజాలూ, క్షేత్రమూ, యూరోపు, అమెరికా ఖండాలు! అక్కడి మొలకలు మన భూమిలో యెంతవరకు పెరిగి పెద్దవి కాగలవో ప్రస్తుతం చెప్పలేము! ఒకటి మాత్రం నా బుద్ధికి తోస్తున్నది! అదేమిటంటే, మన సంప్రదాయాలూ, విద్య, విజ్ఞానమూ, రుచులు మారి పాశ్చాత్య సంప్రదాయాలు రుచులు జీర్ణించుకొన్నచో మనం వాళ్ల లాగే మారి పోగలము! యెంత మారితే అంతే వాళ్ల ననుకరించ గలం. ప్రస్తుతం మన దేశంలో అనేక మంది చిత్రకారులు పాశ్చాత్య కళాజ్యోతులకే తైలం వోస్తున్నారు! అంత మాత్రం చేత వాళ్ల కళను తక్కువ చూపు చూచుట యని నా ఉద్దేశమే మాత్రం గాదు! పాశ్చాత్య కళలోని Evolution ను క్రమంగా పరిశీలిస్తే మనం వాళ్ల వద్ద నుండి నేర్చుకోదగిన ఉత్తమ విషయాలు అనేకం కనుపిస్తాయి! నేటి సంప్రదాయ చిత్రకారులపై కూడా వాటి ప్రభావాలు పడి నూతన మార్గాలను వెతుకుతున్నారు. ఇలా పాశ్చాత్య ఝంఝామారుతానికి కొట్టుకవోకుండా, భారతీయతను కాపాడుకుంటూ కృషి చేసిన వారిలో ప్రప్రధముడు రవీంద్రనాధ్ టాగూరు, తరువాత నందలాల్ బోసు, చొగ్తాయి మొదలైనవారు! జానపద శైలిని తీసికొని నూతన మార్గాలను అన్వేషించి స్వయంకృషి చేసిన వారిలో ప్రధముడు జమినీ రాయ్! తర్వాత జార్జి కిట్సు - పిలకా నరసింహమూర్తి, శ్రీనివాసులు, కొంత వరకు పైడిరాజు కూడా లేపాక్షి నుండి ప్రభావితులయ్యి చిత్రాలు వేసినారు. లేపాక్షి శైలి జానపదమా లేక (Classical) శాస్త్రీయమా అన్న తగాదా నేటికీయున్నది. అది ప్రస్తుత విషయంగాదు. రాజయ్య కళ కూడా ఈ కోవలో చేరినది. రాజయ్యగారు ఇటు పల్లెగాకుండా అటు గొప్ప పట్టణంగా కూడా మధ్యస్తంగా నున్న సహజ వాతావరణంలో అనేక యిబ్బందులకు లోనవుతూ మామూలు డ్రాయింగు మాస్టరు పదవిని నిర్విఘ్నంగా నెరవేరుస్తూ సిద్దిపేటలో బుద్ధనిలాగ తపస్సు చేసి ఆధునిక భారతీయ చిత్రకారుల్లో నొక ప్రత్యేక స్థానం సంపాదించినాడు!
రాజయ్య చిత్రాలలో రాణివాసాలు కన్పించవు! దుక్కి బక్కలు, గొల్లలు, కాపులు, కమ్మర, కుమ్మరులు, బతుకమ్మ పండుగలు, బోనాలు, బోయలు పండుగలు, జాతర్లు, రంకురాట్నాలు, బెస్తలు, వస్తువులు!తాళ్లు, ఈతలు, కోతులు, కోళ్ల పందాలు, నూతులు, కుంటలు, చెర్వులు, కాల్వలు, చిన్న చిన్న గుళ్లు, దేవుళ్లు, గోపురాలు, పూరి గుడిసెలు, గుడిసెలపై గుమ్మళ్లు, పెంకుటిళ్లు, బోళ్లు, కోళ్లు, మేకలు యివన్నీ రాజయ్య చిత్రాలలో గూళ్ళుగట్టుకొని యుండును. ఇంకా పగటి వేషగాండ్లు, భాగవతులు, వీధి నాటకాలు, గారడి వాండ్లు, దొమ్మర్లు, పురాణ కాలక్షేపాలు, బొడక్కలు, బాపనయ్యలు, శ్రీ వైష్టవులు, దాసర్లు, రామాయణ మహాభారత గాధలు వెయ్యేల ఆయన చిత్రాలలో తెలంగాణా గ్రామ సీమలలోని సభ్యతను వర్ణించి ఆపోశనం బట్టినాడు! రాజయ్య చిత్రాలలో తెలంగాణపు చీరెకట్టు, రుమాళ్లు, గొల్లలు, కల్లుగీతల్లో ప్రత్యేకతలు గోచరిస్తాయి! రాజయ్య రక్తనాళాల్లో ప్రవహించేది శుద్ధమైన ఘనీభవించిన తెలంగాణపు తెలుగుతనం! ఇదియే రాజయ్యలో నున్న ప్రత్యేకత! దీనికే మన జోహార్లు! రాజయ్య చిత్రాలు భారతదేశంలోను ఇతర దేశాల్లోని ముఖ్య నగరాల్లో ప్రదర్శింపబడి అనేక బహుమతులందుకొన్నవంటే ఆయన చిత్రాల్లోని ప్రత్యేక శైలియనియే చెప్పవచ్చును. రంగులలోని రమ్యత, జాజ్వల్యముచే చిత్రాలకు అలంకరణ విరివిగా చేయుటంలో దిట్టతనం గోచరిస్తుంది. ఏ విషయానైనా తీసికొని తన ప్రత్యేక జానపదశైలిలో మలచగల సాహసము చేయగలడు. చిత్రించగలడు. ఈ మధ్య రాజయ్య తైల వర్ణ చిత్రాలు వేయుటకై కొంత ప్రయత్నం చేశాడు! దానికి కారణం అతను నిత్యం వేయుచున్న జానపద శైలిలో విసుగుజెందుటయేనని నేను గ్రహించుతున్నాను.
రాజయ్య వ్యక్తిత్వలో నున్న సౌజన్యం, ఆదరమూ, ప్రేమ అతన్ని అనేకులకు స్నేహమొనర్చినవి! అతను స్నేహపాత్రుడు! ఒకవైపు హైద్రాబాదు ఆర్టు సొసైటీలో ఎక్జిక్యూటివ్ మెంబరు గానూ, మరోవైపు ఆంధ్రప్రదేశ్ లలిత కళా ఎకాడమీకి ప్రభుత్వంచే ఎన్నుకోబడిన మెంబరు గానూ స్థానం లభించిం దంటే ఆయన కళలో నున్న ప్రతిభ అతని ప్రఖ్యాతి యేనని భావిస్తున్నాను. రాజయ్యలో మరో ప్రత్యేక లక్షణం గలదు! ఒక వారం రోజులు క్షౌర కల్యాణము లేకున్నా ఆయనకు యేమాత్రం చీకూ చింతాలేదు! నష్టమైననూ బాధలేదు! లాభించిననూ బైటికి వొంగడు! ఇది చిత్రకారునికి ఉండవలసిన నిర్లక్ష్యము! ఉన్మత్తుడైన కళాకారులకు వేషభాషలపై మోజుండదు! యేవైనా ఒక మంచి చిత్రం పూర్తి చేస్తున్న, లేక చేసిన రోజు చిత్రకారుని సంతోషానికి పట్టపగ్గాలుండవంటే నమ్మండి! ఆరోజు అతను స్వర్గలోకాల అంచులలో విహరిస్తూ దివ్యగంధాలను ఆఘ్రాణిస్తాడు! ఆరోజే అతనికి దసరా, దీపావళీ పండుగలు కలసి వచ్చిన రోజు! కళయే ధనంగా కల్గిన వానికి డబ్బు లోకువగా కనుపిస్తుంది! కనుకనే కళాకారుడు డబ్బును నిర్లక్షనంగా ఖర్చుపెడుతాడు! వ్యాపారికి డబ్బే ప్రధానం వానికి ఇతర సృజనాత్మక శక్తులుండవు! ఏది యెవని దృష్టికి విలువైనదిగా దోచునో దాన్నే వాడు ప్రాణ సమానంగా చూచుకుంటాడు! ఇది సహజ లక్షణం!
ఎట్టి ఆర్టిస్టుకైనా చిత్రాలు అమ్ముడుబోకున్నాపొయిలోని పిల్లి లేవదు! కనుకనే అమ్ముకునేందుకు సిద్దపడుతాడు! తీరా అమ్మింతర్వాత, ఆడ బిడ్డ కాపురానికి వోతున్నట్లు కంటనీరు బెట్టుకుంటాడు! ఆడబిడ్డను అత్తవారింటికి పంపనూ తప్పదు, కంట నీరు పెట్టనూ తప్పదు! ఇది చిత్రకారులకే వర్తిస్తుందిగాని కవులకూ, గాయకులకు వర్తించదు. ఎందుకంటే, స్థూలంగా వాళ్లను విడిచిపెట్టే వస్తువేమి లేకపోవటమే దీనికి కారణం.
అసలు మీ రోజుల్లో చిత్రాలంటూ కొనేవాళ్లు లేరు. నవాబులు, జాగీర్దార్లు, రాజా సాహెబులను వాళ్లు లేరు! వారి ఆస్తులను ఆధికారాలను ప్రజా ప్రభుత్వం హస్తగతం చేసికొన్నది! చిత్రకారులకు శిల్పులకూ గ్రహణం బట్టింది! కళలను ఉద్ధరించేందుకు మన ఆంధ్ర ప్రభుత్వం చేపట్టి, లలిత కళా ఎకాడమీనొకదాన్ని స్థాపించింది! దానికి సంవత్స రానికి ఒక లక్షగ్రాంటు వస్తోంది. దానిలో మొదలు ఐదువేలు, తరువాత చాలా పోట్లాడగా పదివేలు మాత్రం చిత్రాలు కొనేందుకు కేటాయించటం జరిగింది! ఒక్కొక్క చిత్రకారునికి ఎప్పుడో ఛాన్సువస్తుంది. నాలుగో లేక ఐదు వందల చిత్రం అమ్ముడుబోతే, చిత్రకారునికి పాత బొందలు పూడ్చుటకైనా సరివోవు! వాండ్ల కడగండ్లు భగవంతునికే తెలుసు! కేవలం చిత్రాలలో బ్రతుకు దెరువు అసంభవమని చిత్రకారులు గ్రహిస్తున్నారు. యేదో ఉబుసువోక కై చిత్రాలు వైస్తే చిత్ర కళ అభివృద్ది కాజాలదు! పైగా చిత్రాలకయ్యే ఖర్చులు విపరీతంగా పెరిగినాయి! యిలాంటి పరిస్థితుల్లో చిత్రకళలు యేవిధంగా అభివృద్దిజెందుతాయో అగమ్యగోచరంగా నున్నది! ప్రభుత్వానికి కళ యొక్క అభివృద్దియే లక్ష్యమట! కళాకారుని స్థితిని గుఱించి యింతవరకు యే ప్రణాళికా చేయలేదు! ఎకడమీ కేటాయించిన పదివేల రూపాయలు ఒక్క చిత్రకారునికి ఒక సంవత్సర జీవితానికి సరిపోవు ఆంధ్రదేశంలో కనీసం ఒకవంద మంది ఎన్నికైన చిత్రకారులుందురు! వాళ్ల గతి యేమిటి? అసలు మన నాయకులకు వీళ్ల సంగతి జ్ఞాపకముందో లేదో తెలియదు! యేమన్నా అంటే దానికి జవాబు మొదలు ఎగ్రికల్చర్ తర్వాతనే కల్చర్ అంటారు. ఎగ్రికల్చర్‌లో ఎంత అభివృద్ధి జరుగుచున్నదో, బియ్యానికి ధరలేవిధంగా ఆకాశాన్నంటుతున్నవో మీ అందరికీ బాగా తెలుసు! యీ సమస్య ఐదవ పంచవర్ష ప్రణాళిక అనంతరం పరిష్కారమౌతుందేమో వేచి చూద్దాము! అప్పటికి నాగార్జున సాగర్ ఆయకట్టు బాగా ఫలించి ఎగ్రికల్చర్ సమస్య పరిష్కారం చేస్తారేమో! ఎగ్రికల్చర్‌కు కల్చర్‌కు ఉన్న సన్నిహిత సంబందం చిత్రకారుల నిత్య జీవితానికికున్నది! రాజయ్యకు కూడా వున్నది.
పూర్వం అజంతా ఎల్లోరా గుహలను మలచిన శిల్పులకు, చిత్రకారులకు ఎంత ప్రోత్సాహము, సౌకర్యాలు కలిగించినాయో ఆ ప్రభుత్వాలు, కాని వారు సృష్టించిన కళ నేటికీ సజీవంగా నిలబడి మన భారతదేశపుటౌన్నత్యాన్నీ చరిత్రను ప్రత్యక్షంగా చూడగలుగుచున్నాము! అంతగాకున్నా అందులో సగమైనా మన ప్రభుత్వం చేయగలిగిననాడు మనం ఉత్తమ చరిత్రను భవిష్యత్తుకు చూపించగలుగుతాం! కళల అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రజలు కలిసి ప్రోత్సాహామిచ్చిన గాని అభివృద్ధిజెందవు! ప్రభుత్వంగాకున్నా ప్రజలైనా యిలాంటి సన్మానాలు యేర్పాటుజేసి కళను ఆరాధిస్తే అంతకు సంతోషింపదగినది లేదు! రాజయ్యకు జేస్తున్న సన్మానం అతనికి గాదు చిత్రకళకే సన్మానమని నేను భావిస్తున్నాను! చిత్రకళను సన్మానించు భాగ్యము తెలంగాణములో సిద్ధిపేటకే ప్రధమంగా దక్కినదంటే గర్వకారణము! నేను సిద్ధిపేట వాసులను ముఖ్యంగా రాజయ్య శిష్య బృందాన్ని యీ సన్మానం ఏర్పాటు చేసినందుకు అభినందిస్తున్నాను! కళలు, మేళాలూ ప్రచారం మీదనే బ్రతుకుతారు. ఇలాంటి సన్మానాలు ప్రచారానికి కూడా దోహదమిస్తాయి! పత్రికలు ప్రచారానికి ముఖ్యసాధనాలు, అందులో ప్రభుత్వంచే వెలువడు ”ఆంధ్రప్రదేశ్” వీటికెంతైనా ప్రోత్సాహమిచ్చుటకు తోడ్పడగలదు! కాని దురదృష్టమేమిటంటే దీంట్లో చిత్రకారుల చిత్రాలు కళా విమర్శలు మినహాయించబడినవి! ప్రతి నెలా ఒక త్రివర్ణ చిత్రం వేసి ఆ చిత్రకారునికి ప్రతిఫలం ముట్టజెప్పుటలో కళకు కళాకారులకు దోహదం చేసినట్లుండును! కొంతకాలం క్రితం భారతి యీ పనిచేసేది! కాని ఏ కారణం వల్లనో అది మానేసింది! ఆంధ్రదేశంలో చిత్రకళకు యెంతో భవిష్యత్తున్నది! కాని ప్రోత్సహించే యంత్రాంగం లేదు! కేవలం కళా ప్రదర్శన వల్ల ఆపని సాధ్యపడదు! ప్రభుత్వం కోటాను కోట్లు ఖర్చుబెట్టి పంచవర్ష ప్రణాళికల క్రింద వేలాది భవనాలు ఇళ్లు నిర్మిస్తోంది! వాటిలో కళ లేశమాత్రం లేదు! యీ సంగతి గ్రహించి భారత ప్రభుత్వం ఒక జి.ఓ తీసింది. దాని ప్రకారం ప్రభుత్వ భవనాల్లో పెట్టే డబ్బులో 5వ శాతం శిల్పాలు, చిత్రాల Murals కై వెచ్చించవలసి యుండును. అది కూడా పాటిస్తూలేరంటే ఏమనాలో తెల్యటం లేదు. తెలంగాణము ఒక కాలంలో కళలకు మాగాణము. ఇప్పుడు కూడా ఉత్తమ కవులకు చిత్రకారులకు మేధావులకు పుట్టిల్లు. కాని దురదృష్టమేమోగాని ఇక్కడివారికి తగినంత ప్రోత్సాహము, ఆర్థిక స్తోమత లేక అనామకంగా అంధకారంలో నుండుట జరుగుచున్నది. రాజయ్యకు కీర్తి విషయాలో మాత్రం అలా జరుగలేదు. ఆయన యీ అంధకారం నుండి చీల్చుకొని బయట బడ్డాడు. తన స్వయం కృషివల్లనే తగినంత పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు.
కళలను ఆస్వాదించి అనందిచేవారుండవలె. లేనిచో అడవిగాచిన వెన్నెలయౌతుంది. చిత్రకారుడు తన ఆనందానికి చిత్రాలు వేసినా ఇతర్లు చూచి ఆనందిస్తున్నప్పుడు అతని ఆనందం యినుమడిస్తుంది. ఈ మధ్య రాజయ్య తన శైలిలో మార్పునకు కొంత ప్రయత్నము చేసినాడు! దానికి కారణం అతను నిత్యము వేయుచున్న జానపద శైలిలో విసుగుజెందుటయేనని నేను గ్రహించుచున్నాను. నిజంగా ఆధునిక ప్రపంచంలో వైవిధ్యము, మార్పులు ఎడతెగకుండా సాగుచున్నవి. వైయక్తికంగా మనుష్యులకు వైవిధ్యంలో ఎక్కువ ఆసక్తి నూతనత్వము గోచరించును! రోజూ పాత చింతకాయ పచ్చడినే నంజుకొనవలెనంటే విసుగు జనించును. అప్పుడప్పుడు కొత్త రుచులను చూచుటకు మనస్సు పురికొల్పుచుండును. కాని క్రొత్తకూర పాత పచ్చడికంటే తక్కువ రుచియైనచో లేక చప్పగా నున్నచో పాత చింతకాయ పచ్చడియే మేలను కొనుట గూడ కలదు. అలా అనుకొని చిత్రకళలో నూతన మార్గములు వెతుక్కోకుండా ఉండలేము. నూతన శైలికనుగొనుట లేక సృష్టించుట సామాన్య విషయము గాదు. నూతనత్వాన్ని సృష్టించి దాన్ని సరిగా పాకము చేసి రుచి చూచి, చూపించవలయును. అది రసజ్ఞులు విమర్శకులు మన్ననలనందుకొనవలయును. రాజయ్యగారు తమ శైలిని మార్చిననూ దానిలోగూడ ప్రతిభ చూపించగలరేమో మనము వేచి చూడవలసియున్నది.
రాజయ్య గారి శిష్యులు వారిని సన్మానింప బూనుకొనుటలో సన్మానించుటలో, వారికి గురుభావము ప్రేమ యెంత మెండుగా నున్నదో తేట తెల్లమగుచున్నది. దీనికై వారందరినీ నేనెంతయో శ్లాఘించుచున్నాను. ఈ సన్మాన సందర్భములో నన్నాహ్వానించి గౌరవించి నందులకు వారికి నా కృతజ్ఞతలు తెలుపుకొను చున్నాను.
(1966లో రాసిన అముద్రిత వ్యాసం)




on 01 ఏప్రిల్ 2008 at 8:16 am 1.shivaraj …
న్మస్కారాలు
చిత్రకల గురించి పుస్తకాల వివరాలు తెలుపంది