పాటలు సోయి | 07 జూన్ 2007 06:29 pm
కోటి రతనాల వీణ
- వడ్డేపల్లి మల్లేశము
కోటి రతనాల వీణమ్మా మా తెలంగాణ
మీటలన్ని కొల్లగొట్టారా ఆగడుసువాల్లు
సాగినన్ని ఆటలాడారా ఆ పోకిరోల్లు ||కోటి||
బావులున్నవి, చెరువులున్నవి
పంట పండే భూములున్నవి
గొడ్డు, గోద, పాడి, పేడ
చెమట వడిసే రైతులున్నా
కష్టమెంతా చేసినా గాని మా అన్నలారా
నోట్ల కట్టలు వాల్ల పాలాయె మా చెల్లెలారా ||కోటి||
తెలంగాణ ప్రాంత మందున
తెగువతో కంపెనీలు పెడ్తె
కరంటంతా వాల్లకైతే
జనం బతుకు చీకటాయె
బాయి కాడి చేను ఎండిందా కరంట్ లేక
పొలం నెర్రెలు పెట్టి ఏడ్చిందా మా చెల్లెలారా ||కోటి||
గల గలా చప్పుల్లు చేసె
జీవనదులు పారుతున్నా
తాగ నీల్లు లేక జనము
తల్లడిల్లి పోయినారా
పంట చేన్లు మాడిపోయినాయీ మా అన్నలారా
ప్రాజెక్టులు వాల్లకైనాయా ||కోటి||
సింగరేణి బొగ్గు గనులు
సింమెంట్ ఫ్యాక్టరీలు మనయి
ఆరుకాలం చెమట వడిసి
ఉత్పత్తులు ఎన్నో పెంచిన
కాలె కడుపులు మనకు మిగిలాయా మా అన్నలారా
కండ్లల్లో కారం చల్లారా ఆ ఆంధ్ర వాల్లు ||కోటి||
మనల దోపిడి చేసినోల్లు
మన భాష నెక్కిరించి నారు
పదవులన్ని గుంజుకొని
పనికి రాని వాల్లజేసిరి
ఉద్యోగాలన్ని వాల్లకు ఉపవాసాలేమొ మనకు
ఎంతకాలం ఓపిక పడుదాం ఓ అన్నలారా
ఎదిరించి పోరాడగ రండి మా చెల్లెలారా ||కోటి||
పనులు లేక పస్తులుండిరి
పల్లెలన్ని లేక పస్తులుండిరి
పల్లెలన్ని గుల్ల అయినవి
ముల్లె మూట సదురుకోని
యువకులందరు పట్నమెల్లిరి
తెలంగాణ బిడ్డలందరూ పిడికిల్లు ఎత్తి
తెగువతో సాధించగ రండి మీరంత కలిసి ||కోటి||



