స్పందన సోయి | 07 జూన్ 2007 03:53 pm
మూడు కలలు ఒక గొడ్డలి మరొక ప్రశంస
- లోకేశ్వర్ హైదరాబాదీ
ఈ మాటేటి జయప్రకాశ్ ఎవరో నాకు సరిగ్గా తెల్వదుగని సోయి పత్రిక పుణ్యమా అని తన తొలి కథతోనే ఆ పిల్లగాడు తెలంగాణా కథల ఆకాశంకు రాకెట్‌లాగ ఉరికొచ్చిండు. చాలా కాలం తర్వాత ఒక మంచి కథ చదివిన అనుభూతి మిగిలిపోయింది. కథ ఎత్తుగడ, ముగింపు, కథ నడిచిన పద్దతి ‘రొటీన్’ను బద్దలు కొట్టింది. వరంగల్ మాండలికాన్ని ఉర్దూభాషతో మేళవించి తెలంగాణా కాకటైల్‌ను సృష్టించినాడు. శబ్బాష్ జయప్రకాశ్ శబ్బాష్.
కథ చదివినంతసేపూ అసాంతం కండ్లల్ల కన్నీళ్లు గిర్రున తిరిగినై. ఎందుకో నాకు తెల్వదు. తెల్సినా మీకు చెప్పను ఆ కథను మీరే చదివి మీరే ఏడవండి మనసారా.
అయ్యో! ఎట్లుండే వొరంగల్ ఎట్లయిపోయింది. రాజ్యాన్ని ప్రశ్నించి ధిక్కరించినందుకు ఎంత మంది గిరీష్‌లు రోడ్ల పక్కన శవాలై తేలిండ్రు. ఖాజీపేటల రైలు దిగి భూమ్మీద కాలు పెట్టంగనే కాళ్లల్ల అండర్ కరెంట్ ప్రవేశించే రోజులు గదా అవి. రాలిపోయిన వారు రాలిపోయినంక, కూలిపోయిన వారు కూలి పోయినంక హితులు, సన్నిహితులు వరంగల్‌ను ఇడిచి కాందీశీకుల్లాగ దేశాలమీదికి ప్రవాసం బోయిండ్రు కదా! ఇగ ఇక్కడేముందని ప్రాణం చివుక్కుమన్నపుడు కొండంత అండ కాళోజీ ఉన్నడు కదా అనుకుని నక్కల గుట్టలనే బస్సుదిగి ఆయనను కల్సుకుని స్వాంతన పొందెటోళ్లం. ఆ తర్వాత ఆ ఆసరా కూడా దూరమాయె. జనార్థన్ పాయె కాళోజీ పాయె. ఇగ అంతా శూన్యమే కదా! ఇక ఎవర్నీ కలువాలె? ఉన్న ఒకే ఒక్కడు బుర్ర రాములన్నను కల్సి ఎట్లున్నవన్న బాగున్నవా? అని గొంతు గురగురలతోని పరామర్శిస్తే ”వొరంగల్ వాళ్లని బాగున్నరా అని అడుగకండ్రి ఇంకా బ్రతికున్నరా అని అడుగండ్రి” అని ఆయన నిష్ఠూర నిజాన్ని మాట్లాడుతడాయె. ఇగ ఏముంది వొరంగల్ల. ఎట్లుండే వొరంగల్ ఎట్లయిపాయె. అన్నట్లు తమ్మీ జయప్రకాశ్ ఇరానీ చా, సమోసా, మిర్చీలని రాసినవ్ గని హన్మకొండ చౌరస్తాల ‘కోహినూర్’ హోటల్ మాటెత్తకపోతివి, అమ్మ ఒడిలాంటి హోటల్ కదా అది. ఆ ఒక్క మాటంటే నా తభియత్ ఇంకా ఖుష్ అయ్యెడ్డిగదా!
అరె భై జై ప్రకాష్ వొరంగల్ ఆత్మను పట్టుకొని దాని గోసను చెప్పేకథను రాసినవ్. వీలుంటే వివరంగా ఒక నవలను అదీ వొరంగల్ మీదనే రాయవా? ప్లీజ్.
చున్ చున్ కే ఇంత మంచి కథను వేసిన సోయి పత్రికకు హృదయపూర్వక అభినందనలు.



