కవితలు సోయి | 07 జూన్ 2007 06:41 pm
మోదుగపూలు
- నాంపల్లి సుజాత
పొట్టకూటికి తప్పని కొత్తఫీట్లు
పండు గుండెల్లో కత్తిదించందే
గొంతు జారదు
సౌదీ మస్కట్ దుబై
ఏ పేరైనా పొరుగోడికి ఊడిగవే,
‘జీవునం కాపాడుకపో’ బిడ్డా
ఊరు తల్లి తరిమింది.
బకాసురునికి రోజుకొక్కడు
ఊరంతా ప్రవాసమే
ఇన్నాళ్ళూ… తలరాతని తలవంచినం
మర్మం తెల్వక కర్మనుకున్నం
ఆహా! ఇంకానా!
కాదు మేం కండ్లుమూసుకున్నా ఎర్రోల్లం
మా నెత్తిన గోదారి పక్కన కృష్ణమ్మ
ఐనా పొలాలెందుకు శెల్కలైపాయె
మా భూములేల నెర్రెలు బిడ్డ బీళ్ళు
మా నీళ్ళను మర్రగట్టె మో కాలడ్డిందెవడు
కాలువలల్ల కాట్లమొద్దేసిందెవడు?
మా నౌకర్ల కెసరు బెట్టి
మమ్మల్నాగం జేసిందెవడు
మా నోళ్ళల్ల దుమ్ము గొట్టి
పోరల్ని అడవులు పట్టించిందెవడు?
మా భాష నీకు యాసైతే… మరి జాగో!?
నాగడ్డమీద నన్నే సుట్టపోన్ని చేస్తావ్!
ఊసర వెళ్లి నాటకాలకు తెరదించుతం
కనబడలేదా
ఇరగబూసిన మోదుగపూలు
అవీ దగా పడ్డ మా కండ్లల్ల ఎర్రజీరలు
వినబడలేదా
మా కాళోజీ కలలు గన్న తెలంగాణా స్వరం
దినదినం రగిలే మా గుండెం దిక్కారం
ఓ తల్లీ నా తెలంగాణా!
ఇన్నాళ్ళ నీ సంకెళ్ళని ఛేదించే నీ పిల్లలం
పులిపిల్లలై వస్తున్నాం.




on 21 అక్టోబర్ 2008 at 1:25 am 1.JAY BODA …
చాలా బాగు0ది
on 11 ఆగస్టు 2009 at 1:58 am 2.srinath …
చాలా బాగుంది …..మీ ఆవెదనని ఆవెసాన్ని చాలా పొఎటిక గా చెప్పారు..