సంస్మరణ సోయి | 07 జూన్ 2007 06:16 pm
మృత్యుముఖంలో మళ్ళీ మెరిసిన ‘విద్యుల్లత’
- అంపశయ్య నవీన్
పదమూడు నెలలు కాన్సర్ వ్యాధితో పోరాడిన ఎం.వి. తిరుపతయ్య చివరకు మార్చి 11న అర్థరాత్రి చివరి శ్వాస విడిచారు. 4.2.2006 నాడు తిరుపతయ్యకు ఈ వ్యాధి సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. కడుపులో పెద్ద పేగుకు సోకిన ఈ వ్యాధి కాలేయానికి కూడా వ్యాపించడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. మూడుసార్లు ఆపరేషన్ చేశారు. వ్యాధి సోకిన భాగాల్ని తొలగించారు. అయినా ఆరోగ్య పరిస్థితి మెరుగు పడలేదు. కొద్ది రోజుల్లో తనీలోకంలోంచి వెళ్లిపోతానన్న విషయం ఆయనక్కూడా తెలిసి పోయింది. దీంతో ఎంత కాలంగానో ఆయనలో అణిగిమణిగి ఉన్న రచయిత ఒక్కసారిగా మేలుకున్నాడు. పక్కమీదనే బోర్లా పడుకుని నవలను రాయడం మొదలెట్టాడు. తిరుపతయ్యలో ఓ ప్రతిభావంతుడైన సృజనాత్మక రచయిత ఉన్నాడని సన్నిహితులమైన మాకందరకూ తెలుసు. కానీ ఆయన ఎక్కువగా రాయలేదు. రాయగల్గిన ప్రతిభ ఉండికూడా రాయలేకపోవడానికి అనేక కారణాలుంటాయి. తిరుపతయ్యకు కూడా అలాంటి కారణాలున్నాయి.
పందొమ్మిది వందల డెభైలలో విప్లవ సాహిత్యం విరివిగా వెలువడింది. ఆరోజుల్లో తిరుపతయ్య ఒక కథ రాశాడు. ఆ కథ పేరు ‘న్యాయం’ ఈ కథను విప్లవ కథగా భావించిన విరసం వారు దీన్ని నాటికగా మలచి కరీంనగర్ జిల్లాలోని అనేక గ్రామాల్లో ప్రదర్శించారు. ఒక విప్లవ కథను రచించాలని తిరుపతయ్య ఆ కథను రచించలేదు. వాళ్ల ఊరికి దగ్గరలో ఉన్న ఊరిలో జరిగిన ఒక యధార్థ సంఘటనే కథగా రాశాడు. ఈ కథలో ఆనాటి గ్రామీణ వ్యవస్థ అత్యంత వాస్తవికంగా చిత్రితమైంది. సంభాషణల్లో తెలంగాణ మాండలికాన్ని వాడిన తీరు ఈ కథకు గొప్ప సౌందర్యాన్ని చేకూర్చింది. ఈ కథను ఆ రోజుల్లో తిరుపతయ్య పనిచేస్తున్న జమ్మికుంటనుంచి వెలువడుతున్న ‘విద్యుల్లత’ అన్న త్రైమాసిక పత్రిక ప్రచురించింది. తర్వాత జననాట్యమండలి వారు నాటికగా మలచి అనేకచోట్ల ప్రదర్శించారు. అట్లా ఈకథకు గొప్ప ప్రాచుర్యం లభించింది. నాటికగా ప్రదర్శిస్తున్న రోజుల్లోనే తిరుపతయ్య పోలీసుల దృష్టిలో పడ్డాడు. ఆయన జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ కాలేజీలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడని తెలుసుకున్నారు. ప్రైవేట్ కాలేజి యాజమాన్యం లెక్చరర్లకు సకాలంలో జీతాలు చెల్లించేది కాదు. ప్రభుత్వం నుండి తీసుకున్న గ్రాంటును స్వంతానికి వాడుకొని లెక్చరర్లకు జీతాలిచ్చేవాళ్లు కారు. లెక్చరర్లు ధర్నాలు, నిరాహారదీక్షలు ప్రారంభించారు. పోరాటాల్లో తిరుపతయ్య చురుగ్గా పాల్గొన్నారు. ఆలా ఆ కాలేజి కమిటీ ఛైర్మన్ ఆగ్రహానికి గురయ్యాడు. తిరుపతయ్య గూర్చి పోలీసులు ఎంక్వయిరీకొచ్చినప్పుడు కాలేజి యాజమాన్యం తిరుపతయ్యకు నక్సలైట్లతో సంబంధాలున్నాయని చెప్పింది. అవకాశం కోసం చూస్తున్న పోలీసులకు 1975లో విధించబడిన అత్యవసర పరిస్థితి అందివచ్చింది. 1976లో తిరుపతయ్యను అరెస్టు చేసి ఓ పోలీసు క్యాంపులో నిర్బంధించారు. ఇది ఆయన జీవితంమీద చెరగని ముద్ర వేసింది. 26 రోజుల తర్వాత పోలీసు క్యాంపుల నుండి విడుదల చేసారు. సహజంగా భయస్థుడైన తిరుపతయ్య ఈ చేదు అనుభవాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ‘యేం రాస్తే యేం ప్రమాదమో’ అనే భయం ఆయనలో స్థిరపడిపోయింది. రాయడం మానేసాడు. అయినను పోలీసులు అరెస్టు చేసిన సంఘటనను ఆధారం చేసుకొని ఆ సంఘటనతో ఎమర్జెన్సీ విధించబడిన కాలంలో భారతదేశంలో జరిగిన మరికొన్ని ఇతర సంఘటనల్ని జోడించి నేను ‘చీకటి రోజులు’ అనే నవలను రాశాను.
రాయడం అనే వ్యాపకానికి చాలాకాలం దూరంగా ఉండిపోయిన తిరుపతయ్య 1987లో ‘బతుకు’ అనే వలను రచించాడు. ‘చతుర’ మాసపత్రిక నిర్వహించిన నవలల పోటీకి ఈ నవలను పంపించాడు. ఈ నవలకు ఈ పోటీలలో మూడవ బహుమతి లభించింది. ‘బతుకు’ నవల రాయడం ద్వారా తిరుపతయ్య మళ్ళీ రచనా వ్యాసంగంలో నిమగ్నుడౌతాడని నేననుకున్నాను. ‘నువ్వు రాయాలి.. నువ్వు బాగా రాయగలవు’ అని నేనాయనకు పదే పదే చెబుతుండేవాడిని, కానీ ఆయనలో మళ్ళీ ఓ రకమైన ఔదాసీన్యం, నిర్వేదం ప్రవేశించాయి. 1998లో తెలుగు అధ్యపకుడిగా పదవీ విరమణ చేశాడు ‘ఇప్పుడైనా నువ్వు రాయడం మీద దృష్టి కేంద్రీకరించాలి’ అన్నాను. ‘ఎందుకు రాయడం,ఎవరు చదువుతారు?ఇంతకాలం రాసి నువ్వేం సాధించావు? ఎంత డబ్బు సంపాదించావు? మనం రాయడం ద్వారా పోగొట్టుకోవడమేగాని సంపాదించేదయితే ఏది లేదుగా?’ అంటూ ఓ ప్రైవేట్ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా చేరాడు. బహుశా ఆయనిక ఏమీ రాయడేమో అనుకున్నాను.
2006 సంవత్సరం, ఫిబ్రవరి నాల్గో తేదీనాడు ఆయనకు అకస్మాత్తుగా కడుపులో విపరీతమైన నొప్పొస్తే హాస్పిటల్లో చేర్పించాం. ఎమర్జెన్సీ ఆపరేషన్ చెయ్యాలన్నారు. వరంగల్ నుంచి హైదరాబాద్‌లోని యశోదా హాస్పిటల్‌కు తరలించాం. ఒక మేజర్ ఆపరేషన్ చేసి ఆయన పెద్ద పేగుకు కాన్సర్ వచ్చిందని డాక్టర్లు నిర్ధారించారు. అప్పట్నించి ఆయన జీవితం పడకకే అంకితమైపోయింది. ఈ దశలో ఆయనలోని రచయిత మేల్కోన్నాడు. పక్కమీద బోర్లాపడుకుని రాయడం మొదలెట్టాడు. రోజూ ఐదారు పేజీలకంటే ఎక్కువ రాసేవాడు కాదు. ఆరు నెలల్లో 600 పేజీలు రాశాడు. తర్వాత మరో నాలుగు నెలలు శ్రమించి రఫ్‌గా రాసిన ఈ నవలను ఫెయిర్ చేసాడు. డాక్టర్లు తిరుపతయ్య ఆరు నెలల కంటే ఎక్కువ కాలం బతకపోవచ్చునన్నారు. కానీ ఆయన 13 నెలలు బతికాడు. ఈ 13 నెలల్లో 10 నెలలు ఈ నవల రాస్తూ ఉండిపోయాడు. నవల రాయడమన్న ఒక సృజనాత్మక వ్యాపకంలో మునిగిపోవడం వల్లనే ఆయన ఇంతకాలం బతగ్గలిగాడేమోనని డాక్టర్లన్నారు. నవలను పూర్తి చెయ్యగానే చదవమని నాకిచ్చాడు. నాతోపాటు ముగ్గురు మిత్రులు.. గంట రామారెడ్డి, ఎం. సత్యనారాయణ రెడ్డి, ఎం. రవీందర్ కూడా చదవాలన్నాడు. మేం నల్గురం నవలను చదివాం చర్చించాం. చాలా బాగుందనుకున్నాం. ఈ నవలతోపాటు ఆయన ఇదివరకు రచించిన ‘బతుకు’ నవలను కూడా తీసుకురావాలనుకున్నాం. ఈ రెండు నవలల్ని ప్రింటింగుకిచ్చాం. ‘నేను బతికుండగానే ఈ రెండు నవలల ఆవిష్కరణ జరగాలి’ అన్నాడు తిరుపతయ్య. హైదరాబాదులోని లిటరసీ హౌస్‌లో (సాక్షరతా భవన్ - ఆంధ్ర మహిళాసభ) పనిచేస్తున్న తాళ్ళపల్లి మురళీధర్‌గౌడ్‌కు ప్రింటింగు బాధ్యతల్ని అప్పగించాం. ఈ రెండు నవలలకు ఏలే లక్ష్మణ్ ముఖ చిత్రాన్ని రూపొందించాడు. యుద్ధప్రాతిపదికన ఈ రెండు నవలల ప్రింటింగు ప్రారంభమయింది.
తిరుపతయ్య ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. ‘నేను పుస్తకాల్ని చూస్తానా?’ అంటుండేవాడు. ‘తప్పకుండా చూస్తావు. ఆవిష్కరణ కార్యక్రమంకూడా జరుగుతుంది’ అని చెప్పాను. ఫిబ్రవరి 12వ తేదీనాడు రెండు నవలలు ‘బతుకు’-'జీవన సమరం’ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఆ విషయం తిరుపతయ్యకు చెప్పగానే ఆయనలో నూతనోత్సాహం జనించింది. చాలా ఆశ్చర్యంగా ఆయన ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. ఫిబ్రవరి 12వ తేది ఎప్పుడొస్తుందని ఎదురు చూడటం మొదలెట్టాడు. ఆ సభకు ఎవరెవర్ని పిలవాలో లిస్టురాసిచ్చాడు.
ఫిబ్రవరి 12వ తేదీనాడు తిరుపతయ్య రచించిన ఈ రెండు నవలల ఆవిష్కరణ వరంగల్‌లోని అశోకా కాన్ఫరెన్స్ హాల్లో ఘనంగా జరిగింది. ‘బతుకు’ నవలను పేర్వారం జగన్నాథంగారు, ‘జీవన సమరం’ నవలను నేను ఆవిష్కరించాం. రామచంద్రమౌళి సభకు అధ్యక్షత వహించారు. గంట రామారెడ్డి, గిరిజా మనోహర్‌బాబు, ఎం. రవీందర్ ఈ రెండు నవలల్ని సభకు పరిచయం చేశారు.
ఎంతో ఉద్విగ్నభరితమైన వాతావరణంలో జరిగిన ఈ సభలో తిరుపతయ్య మూడు గంటలసేపు కూర్చున్నాడు. అందరి ఉపన్యాసాలను శ్రద్ధగా విన్నాడు. చివర్లో తన ప్రతిస్పందనను తెలియజేశాడు. తిరుపతయ్య గారి ఎందరో మిత్రులు, శిష్యులు, సహాధ్యాయులు ఈ సభకొచ్చారు. వరవరరావు, సాయిరెడ్డి, నేరెళ్ళ వేణుమాధవ్, సుప్రసన్న, వాసిరెడ్డి భాస్కరరావు లాంటి ఎందరో ప్రముఖులు ఈ సభలో పాల్గొన్నారు. చివర్లో తిరుపతయ్యను నగరంలోని సాహిత్య సంస్థలు, ఆయన శిష్యులు ఘనంగా సన్మానించారు. కన్నీళ్ళతో ఆయనకు పూలదండలు వేశారు. శాలువాలు కప్పారు. సభకొచ్చిన వాళ్ళందరికీ తిరుపతయ్య చాలా కొద్దిరోజుల్లోనే ఈ లోకంనుంచి వెళ్లిపోతున్నాడని తెలుసు. అందుకే అందరూ ఆయనకు కన్నీళ్ళతో బరువెక్కిన గుండెలతో వీడ్కోలు చెప్పారు.
రాత్రి పదకొండు గంటలకు ఇంటికెళ్లిన తిరుపతయ్య నాకు ఫోన్ చేసి ‘ఈ జన్మకు నాకీ ఆనందం చాలు నవీన్’ అన్నాడు.
ఆ మర్నాటి నుండి తిరుపతయ్య ఆరోగ్యం ఇంకా క్షీణించింది. సరిగ్గా నాల్గు వారాల తర్వాత తిరుపతయ్య చివరి శ్వాస విడిచాడు. ఆయన భౌతికంగా ఈ లోకంనుంచి వెళ్లిపోయినా ‘బతుకు’ ‘జీవన సమరం’ అన్న ఈ రెండు నవలలు ఆయనను తెలుగు సాహిత్యంలో కలకాలం బతికిస్తాయి. ఆయన రచించిన కథలు, ఒక్క అసంపూర్ణ నవల కూడా త్వరలోనే వెలుగు చూస్తాయి.



