వ్యాసాలు సోయి | 07 జూన్ 2007 07:05 pm
ఉత్తర తెలంగాణ కథకుల పరిచయం - 2
- బి.ఎన్.స్వామి
58. చైతన్య ప్రకాశ్
కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రకాశ్ రేణ కథా సంపుటిని వెలువరించారు. ఇతని కథలకు క్లుప్తత ప్రాణాధారంగా ఉంది. నిమ్నకుల సమస్యల్ని కథలుగా చిత్రించారు. బతుకు రేవు, చంద్రకళ, అమీన, రేణ లాంటి కథలు వీరి కథా కౌశలానికి నిదర్శనాలు. లోతైన అవగాహన, సామాజిక సమస్యల పట్లగల పరిశీలన, వీరి కథల్లో తొంగి చూస్తాయి.
59. చొప్పకట్ల చంద్రమౌళి
కరీంనగర్ జిల్లా వేములవాడవాస్తవ్యులు. భయం, తాటాకు మంటలు, ఇడ్పుగాయిదం లాంటి కథలు వీరి శైలిని పట్టిస్తాయి.
60. జయధీర్ తిరుమల రావు
కరీంనగర్ జిలాలో జన్మించిన వీరు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. వీరు దాదాపు ఇరవై కథలు రాశారు. పరిశోధకులుగా ప్రసిద్ధులు. వీరి కథలు కొత్త కోణాల్ని ఆవిష్కరించాయి. చలం చెప్పని కథ వీరి నవ్య ధోరణికి ప్రతీక. పురివిప్పిన కర్తవ్యం కథలో, వీరి పరిశీలనాశక్తిని, శిల్ప చాతుర్యాన్ని విడమరుస్తుంది.
61. జి. సురమౌళి
కరీంనగర్ జిల్లా విలాసాగర్‌లో జన్మించారు. మధులిమాయె రాసిన విప్లవ సారధి అంబేడ్కర్ అనే పుస్తకాన్ని తెనిగించారు. ఏ విషయాన్నయినా బలంగా చిత్రించగల కథనం వీరి సొంతం. వీరి అంగుడు పొద్దు కథంతా తెలంగాణా మాండలికంతో నడిచింది.
62. జి. రాములు
కరీంనగర్‌కు చెందిన వీరు 1948లో పెరటి చెట్టు, పిచ్చి శాయన్న అనే పెద్ద కథలను రాశారు. వీరి ఆత్మఘోష కథ గ్రాంధిక భాషలో ఉంది. సంస్కరణ భావాలను చిత్రించే కథ ఇది.
63. జింబో (మంగారి రాజేందర్)
అసలు పేరు మంగారి రాజేందర్. కరీంనగర్ జిల్లా వేములవాడ వాస్తవ్యులు. లా వొక్కింతయు లేదు, జింబో కథలు లాంటి కథా సంపుటాలు వెలువరించారు. అన్ని ప్రక్రియల్లో వీరిది అందె వేసిన చేయి. వీరి కథల్లోని ఇతి వృత్తాలు ఎక్కువగా న్యాయపరమైన విషయాల్ని చర్చిస్తాయి. తన జన్మస్థలమైన వేములవాడ ప్రాంత విశిష్టతను తెలుపుతూ కథలు రాస్తున్నారు.
64. జితేందర్ రావు
వరంగల్ జిల్లాకు చెందిన జితేందర్ రావు వృత్తి రీత్యా లాయర్. ప్రవృత్తి రీత్యా కథకుడు. అదృష్టవంతుడు, కుక్క-మనిషి, శని లాంటి మంచి కథలు అనేకం రాశారు.
65. జూకంటి జగన్నాథం
కరీంనగర్ జిల్లా సిరిసిల్ల వాస్తవ్యులు. వైపని అనే కథా సంపుటిని వెలువరించారు. వలస, కళేబరం, దుగోడ, యాతన లాంటి కథలు వీరి కథన శక్తికి నిదర్శనాలు. తెలంగాణాలో జరిగే మార్పులు కథల్లో గోచరిస్తాయి. కవిగా ప్రసిద్ధి కెక్కిన వీరు మంచి కథకులు.
66. జె.పి. వైద్య
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కథకులు. కిటికీ అనే కథ అభ్యుదయ పంథాలో సాగింది. హాస్యరసం మేళవించి సరదా కథలు కూడా రాశారు. వేట కథల రచయితలుగా వీరు గుర్తింపు పొందారు.
67. టంకశాల అశోక్
వరంగల్ జిల్లాకు చెందిన వీరు కవిగా, రచయితగా ప్రసిద్ధులు. వీరు రాసిన ఐదేళ్ళ పాటు సమ్మెలు అనే కథలో వీరి జర్నలిస్ట్ దృక్ఫథం కనబడుతుంది.
68. డింగరి నరహరి ఆచారి
వీరు కరీంనగర్‌కు చెందిన సంస్కృతాంధ్ర పండితులు. సంస్కృతం నుండి తెలుగులోకి కథల్ని అనువాదం చేశారు. కవిసామ్రాట్ మరియు పుత్రస్యాపిగతిర్నాస్తి అనే రెండు తెలుగు కథలు రాశారు. కవిగా, వ్యాసకర్తగా లబ్ద ప్రతిష్టులు.
69. తాడిగిరి పోతరాజు
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నివాసి. ఎర్రబుట్ట వీరి పెద్ద కథ. వీరి కథలు సమాజంపై తీవ్ర ప్రభావాన్ని కలిగించాయి. బ్లాక్ అండ్ వైట్ అనే కథ బద్‌లా కథా సంకలనంలో కనబడుతుంది. అనేక కథలు రాసిన వీరు విశ్రాంత ఆంగ్లోపన్యాసకులు.
70. తిరుపతి
కరీంనగర్ జిల్లాకు చెందిన వీరు పిడికిళ్ళు బిగుసుకున్న రాత్రి అనే కథ రాశారు. బద్‌లా కథా సంకలనంలో ప్రచురితమైంది.
71. తుమ్మేటి రఘోత్తమరెడ్డి
కరీంనగర్ జిల్లాకు చెందిన కథకులు. తుమ్మేటి రఘోత్తమరెడ్డి కథలు పేర వీరి కథల్ని విరసం పుస్తక రూపంలో ప్రచురించింది. సిద్ధాంత బరువుతో నినాదప్రాయంగా, శిల్ప రహితంగా విప్లవకథ ఉంటుందనే అపోహను వీరి కథలు పటాపంచలు చేశాయి.
72. తుర్లపాటి లక్ష్మి
వృత్తీరీత్యా ఉపాధ్యాయురాలు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన లక్ష్మి నిజామాబాద్ జిల్లాకు చెందినవారు. సూర్యునితో పోటీ పడి అనే కథా సంపుటిని వెలువరించారు. ఇందులో పద్దెనిమిది కథలున్నాయి. స్త్రీ వివక్ష, త్యాగాలు, వరకట్న హత్యలు, ఆర్థిక అసమానతలు, మూఢ నమ్మకాలు, స్త్రీల కష్టాలు ఇతి వృత్తాలుగా కథలు రాశారు.
73. దార్ల రామచంద్రం
కరీంనగర్లో నివసిస్తున్న వీరు కిర్రు చెప్పులు కథా సంపుటిని వెలువరించారు. సామాజిక సమస్యలకు, సంఘటనలకు సాహిత్య రూపం ఇవ్వడం ద్వారా రామచంద్రం సామాజిక చైతన్యంగల కథా రచయితగా ఎదిగారు. బాల చంద్రుడు, బాల్యం బతుకు, బతుకు బడి, కిర్రు చెప్పులు కథలు తెలంగాణా బహుజన కులాల సంస్కృతి ప్రతిబింబాలు.
74. నందగిరి ఇందిరా దేవి
వరంగల్ జిల్లాకు చెందినది. ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్ స్టేట్‌లో గల డల్లాస్ నగరంలో ఉన్నారు. భారతి, గృహలక్ష్మి, ఆంధ్రజ్యోతి మొదలైన పత్రికల్లో వీరి కథలు ప్రచురితమయ్యాయి. పందెం కథ జీవన సత్యాల్ని ఆవిష్కరించింది.
75. నవీన్
నవలాకారుడిగా పేరొందిన అంపశయ్య నవీన్ కథలు రాసిన వరంగల్ జిల్లా వాసి. లైఫ్ ఇన్ ఎ కాలేజ్, ఎనమిదో అడుగు, ఫ్రమ్ అనురాధా విత్ లవ్ అనే మూడు కథా సంపుటాలను వెలువరించారు. మనో విశ్లేషణ వీరి కథల్లో ఎక్కువగా కనబడుతుంది. సమస్యల్ని తనదైన కోణంలో కథల్లో ఆవిష్కరిస్తారు. చైతన్య స్రవంతి శిల్పానికి వీరు పెద్దపీట వేశారు.
76. నందిగం కృష్ణారావు
వరంగల్‌కు చెందిన వీరు న్యాయవాది. నాలుగ్గాళ్ళ న్యాయం, రెప్పవేయని కన్ను లాంటి కథా సంపుటాలతో ప్రసిద్ధి చెందినారు. వీరి కథలకు వ్యంగ్యం జీవం పోసింది. ప్లీడర్ చెప్పిన పోలీస్ కథలు, గాడిద కథలు పేరుతో రాసిన ఇతని సీరియల్ కథలు చాలా ప్రాచుర్యం పొందినాయి. ఏముంది, పోలీస్ దేవుడు, రుజువు కథలు వీరి తార్కిక శక్తికి నిదర్శనాలు.
77. నలిమెల భాస్కర్
ప్రస్తుతం కరీంనగర్ పట్టణంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. పద్నాలుగు భాషల్లో వీరిది అందెవేసిన చేయి. నూరేళ్ళ పది ఉత్తమ మళయాళ కథలు, అద్దంలో గాంధారి, మంద అనే అనువాద కథా సంకలనాల్ని వెలువరించారు. మంద మరియు నాకూ స్వాతంత్య్రం వచ్చింది అనే రెండు కథలు, స్వతంత్ర కథలు. అనువాదానికి కథల్ని ఎంచుకొనే వీరి ధోరిణి విలక్షణంగా కనిపిస్తుంది.
78. ననుమాస స్వామి
వరంగల్ జిల్లాకు చెందిన వీరు గంటీలు అనే కథా సంపుటిని వెలువరించారు. గంటీలు, జెర్రిగొడ్డు, పాలచుట్ట లాంటి కథలు సమస్యలను దృశ్యీకరించాయి.
79. నల్లాల లక్ష్మీరాజం
కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన వీరి సంపుటి తిరుగు ప్రయాణం. తిరుగు ప్రయాణం, దొమ్మరి రంగడు, మావూరి ముచ్చట్లు, పునరావృతం లాంటి కథల్లో రచయిత యొక్క దృక్పథం కనిపిస్తుంది. పీడితకుల సంస్కృతి చిత్రణ, తెలంగాణలో వచ్చిన మార్పులు ఇతని కథల్లో కనిపిస్తాయి.
80. నాగుల రాధేశ్యాం
ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన వీరు నిబద్ధత కలిగిన కథకుడు. వీరి జింకపిల్ల కథ రుతుపవనాలు కథా సంకలనంలో ప్రచురితమైంది.
81. నామని సుజనా దేవి
జీవిత బీమా సంస్థలో పని చేసే ఈమె వరంగల్ వాసి. వీరి కథల్లో శృంగారం, సామాజిక సమస్యలు సమపాళ్ళలో రంగరించి ఉంటాయి. ప్రేమ లేఖలు అనే కథ ఉత్తరాలతో నడవడం వల్ల కథకు బలం చేకూరింది. ఇది వీరి కథా కౌశలానికి నిదర్శనం. లవ్ స్టోరి, తృప్తి, ఐ లవ్ ఇండియా లాంటి కథలు వీరి దృక్ఫథాన్ని పట్టిస్తాయి. అలవోకగా రాసే శక్తి వీరికుందని వీరి కథల్ని విశ్లేషిస్తే తెలుస్తుంది.
82. నెల్లుట్ల రమాదేవి
వరంగల్ జిల్లాకు చెందిన ఈమె కవయిత్రి, కథకురాలు. సంస్కారం, నిర్ణయం లాంటి కథలు పలువురి ప్రశంసలు పొందినవి. చిన్న చిన్న అంశాలను సైతం కథలుగా మలచే నైపుణ్యం వీరికి ఉంది.
83. నెల్లుట్ల వెంకటేశ్వర రావు
వరంగల్ జిల్లాకు చెందిన వీరు అనేక కథలు రాశారు. అందులో నాకీతాళివద్దు అనే కథ ఒకటి. ఈ కథలో సస్పెన్స్ పోషించారు. ఇంకా వీరు నాటకాలు, బుర్రకథలు, సంగీత రూపకాలు రాశారు. రూపమతి, వెళ్ళిపోయాడు మొదలగునవి వీరి మరికొన్ని కథలు.
84. నేరెళ్ళ శ్రీనివాస్ గౌడ్
కరీంనగర్ జిల్లా హన్మాజిపేటకు చెందిన వీరు వృత్తిరీత్యా గీత కార్మికుడు. పది కథలతో కూడిన పేదోళ్ళ బతుకులు అనే కథా సంపుటిని ప్రచురించారు. సామాజిక సమస్యలకు తన కథల్లో చోటిచ్చి, సమకాలీన జీవితాలను చిత్రించారు. తెలంగాణా ప్రాంతోచిత భాష వీరి కథలకు వన్నె తెచ్చింది.
85. ఫణి కుమార్
వరంగల్ జిల్లా వాస్తవ్యులు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ సమీపంలోని ప్రదేశాలను నేపథ్యంగా చేసుకొని రాజుల మడుగు, కృష్ణాష్టమి అనే కథలను రాసినారు. గోదావరి గాథలు అనే కథా సంపుటిని ప్రచురించినారు. వీరి కథల్లో ఆదిలాబాద్ గిరిజన జీవితం, అటవీ చట్టాల ఫలితాలు, ఐటిడిఏ పనితనం లాంటి అనేక విషయాల ప్రస్తావన ఉంది.
86. పల్లె సురేష్ బాబు
కరీంనగర్ జిల్లా రామగుండం ప్రాంతానికి చెందిన వీరు తమ కథల్లో సామాజిక సమస్యలనే కాక ప్రేమ వ్యవహారాల్ని కూడా చిత్రించారు. మనసు లోగిళ్ళు, గుండెకో సవ్వడి అనే కథల్ని ప్రేమ, శృంగారం సమపాళ్ళలో రంగరించి రాశారు. వీరి కథల్లో సెంటిమెంటు, ప్రేమ పండుతుంది.
87. పంజాల జగన్నాథం
కరీంనగర్‌కు చెందిన వీరు మట్టి వాసనలు అనే కథా సంపుటిని వెలువరించారు. కథల్లో సామాజిక సమస్యల పట్ల ఆవేదన ఉంది. తెలంగాణా ప్రాంతోచిత భాష కథల్లో కనబడుతుంది.
88. పాములపర్తి వెంకట నరసింహారావు
కరీంనగర్ జిల్లాలోని వంగర గ్రామంలో జన్మించారు. భారత ప్రధానిగా పనిచేసి పేరుగాంచినారు. వీరి గొల్ల రామవ్వ అనే కథ సాహితీ చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తుంది. విశ్వనాథ వేయిపడగలు నవలను సహస్ర ఫణ్ పేర హిందీలోకి అనువదించినారు. ఆత్మకథాత్మకమైన ఇన్‌సైడర్ అనే నవలను ఇంగ్లీషులో రచించారు.
89. పి. కేశవరెడ్డి
నవలా రచయితగా పేర్గాంచిన వీరు నిజామాబాద్ జిల్లా వాస్తవ్యులు. వక్ర ప్రకృతి, పల్స్ ఆఫ్ ది రోడ్ లాంటి కథలు రాశాడు. పల్స్ ఆఫ్ ది రోడ్‌లో సుక్క పందిని ప్రధాన పాత్రగా చేసి కథీకరించారు. ఇందులో మాండలికం పుష్కలంగా పండింది.
90. పి. చంద్
కార్మిక, గిరిజన, రైతాంగ కథలు అనేకం రాసిన పి. చంద్ భూనిర్వాసితులు లాంటి సింగిల్ కాన్సెప్ట్‌తో కథా సంపుటి వెలువరించారు. కరీంనగర్‌కు చెందిన వీరు జులుం అనే కథా సంపుటిని కూడా వెలువరించారు. తెలంగాణాలో చోటు చేసుకున్న ఉద్యమాల పట్ల నిబద్ధత కలిగి అణచివేతకు గురైన వర్గాల పక్షాన నిలిచి కథలు రాశాడు. బొగ్గు గనుల్లో జరుగుతున్న మార్పులను, అన్యాయాలను చిత్రించే కథలను అనేకం రాసాడు.
91. పులుగు శ్రీనివాస్
వరంగల్‌కు చెందిన పులుగు శ్రీనివాస్ కార్మిక కోణంలో నుండి ఆరు కార్మిక కథలు రాసి సంపుటిగా వెలువరించారు. ఈయన కథలకు జీవిత వాస్తవాలు ఆధారం. కథల్లో కఠిన వాస్తవాలు, కరడు కట్టిన మనుషులూ కనబడుతారు. సంకర విత్తులు, చుడీదార్ పిల్ల లాంటి కథలు వీరి కథా కౌశలానికి ప్రాంతీయాభిమానానికి తార్కాణాలు.
92. పులిపాక కనకదుర్గ
భారతీయ జీవిత బీమా సంస్థ ఉద్యోగిగా పనచేస్తున్న ఈమె వరంగల్ జిల్లా వాస్తవ్యులు. దాదాపు ముప్ఫది కథలు రాశారు. అనేక పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వీరి కథా సంవిధాన చాతుర్యానికి నిదర్శనంగా మంత్ర ఖడ్గం అనే జానపద కథ నిలుస్తుంది. రైలు ప్రయాణం ఆధారంగా రాసిన కథ అతను-ఆమె. వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల కొడుకు-కోడలు అనుసరించిన విధానాన్ని తెలిపే కథ పునరావృతం. మంచి, చెడుల సంఘర్షణగా అతిథిదేవోభవ అనే కథ నిలుస్తుంది. మంచి కథన శక్తి కలిగిన రచయిత్రి.
93. పెండ్యాల చిన రాఘవరావు
వరంగల్ జిల్లాకు చెందిన వీరు ఘనపురంలో స్నేహలత అనే సాహితీ సంస్థను నడిపారు. అనేక పత్రికల్లో కథలు అచ్చయినాయి. జీవన దృశ్యాలు అనే కథా సంపుటిని వెలువరించారు.
94. పెండ్యాల శేషగిరి రావు
వరంగల్ జిల్లా చిన పెండ్యాలలో జన్మించారు. సాహిత్య సాంస్కృతికోద్యమాలకు మార్గదర్శిగా నిలిచారు. ముహూర్తబలం వీరి కథ. శ్రావణి అనే కథా సంపుటి వెలువరించారు.
95. పెద్దింటి అశోక్ కుమార్
కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండల వాస్తవ్యులు. ఊటబాయి. వలస బతుకులు, మా ఊరి బాగోతం లాంటి కథా సంపుటాలను వెలువరించారు. అనేక కథలను రాసిన వీరి కలం తెలంగాణా ప్రాంతోచిత భాషకు పట్టం కట్టింది. వీరి కథల్లో సామెతలు, పలుకుబళ్ళు బండ్లకొద్దీ దొర్లుతుంటాయి. తెలంగాణా పల్లె జీవితాలు వీరి కథల్లో చిత్రితమయ్యాయి.
96. పేర్వారం జగన్నాథం
చేతనావర్తన కవుల్లో ఒకరైన వీరు వరంగల్ వాసి. అనేక ప్రక్రియల్లో అందె వేసిన వీరు కథలు కూడా రాశారు. ప్రతీకారం, రైల్వేగేట్ లాంటి కథలు వీరి కలం నుండి జాలు వారాయి.
97. పేర్వారం రాములు
ఆంధ్రప్రదేశ్‌లో డి.జి.పి.గా పనిచేసిన వీరు వరంగల్ జిల్లాకు చెందిన వారు. తమ అనుభవాల్ని కథలుగా రాసి పోలీసు చమత్కారాలు అనే పేర సంపుటిగా వెలువరించారు.
98. పొట్లపల్లి రామారావు
వరంగల్ జిల్లాకు చెందిన వారు. జైలు అనే కథా సంపుటిని వెలువరించారు. వీరి జొన్న గింజ, సమాధి స్థలము శిల్ప రీత్యా మంచి కథలు.
99. బాలవేని రాజేశం
కరీంనగర్ జిల్లా పెద్దపల్లి దగ్గరగల కొత్తపల్లి గ్రామ నివాసి. కథలంటే మక్కువ ఎక్కువ. నానమ్మకల, మా బడి దొరగడి అనే కథలు ప్రచురితమయ్యాయి. తెలంగాణా మాండలికం వీరి కథలకు శక్తి నిచ్చింది.
100. బి.ఎస్. రాములు
కరీంనగర్‌కు చెందిన వీరు కథకుడు, తత్వవేత్త. పాలు, తేనెటీగలు, వేపచెట్టు, మమతలు-మానవ సంబంధాలు, బతుకు పయనం లాంటి అనేక కథా సంపుటాలను వెలువరించారు. ప్రథమ శ్రేణి మేధావిలా నిలబడాలని చెప్పే బి.ఎస్. రాములు తన కథల్లో దృక్ఫథానికి కాక జీవితానికి పెద్దపీట వేశారు.
101. బి. దామోదర్ రావు
వృత్తిరీత్యా ఉపన్యాసకుడైన వీరు కరీంనగర్ జిల్లా నివాసి. ఇతని సింగిడి కథా సంపుటిలోని కథలన్నీ గ్రామాల్లో జరుగుతున్న కుల వివక్షతను, దొరల దౌర్జన్యాన్ని, పన్నుల వసూలు తదితరాలైన కథాంశాలతో ఉన్నాయి. గిరివి అనే కథ తెలంగాణా జన జీవితాల్ని చిత్రించింది.
102. బి. మురళీధర్
ఆదిలాబాద్‌కు చెందిన కథకుడు. నిరుడు కురిసిన కల నవలతో పాటు కథల్ని కలిపి ప్రచురించారు. కథల్లో సెంటిమెంటు పండుతుంది. అలంకారాలు కొత్తగా కనిపిస్తాయి. పాత్రోచిత భాష వాడుతారు. కొత్త నిర్వచనం, సైకాలజీ బేస్డ్ కథ, అందమైన ప్రయాణం లాంటి కథలు వీరి కథా సామర్థ్యానికి నిర్వచనాలుగా ఉన్నవి.
103. బి. పద్మజ
వరంగల్‌లో ఉంటున్న వీరు రాసిన కథ రాజేశ్వరి. ఈ కథ రుతుపవనాలు కథా సంకలనంలో ఉంది. సంక్లిష్టమైన స్త్రీ జీవిత చిత్రణే ఈ కథ. ఇందులో స్రీ వాద ధోరిణి, విప్లవోద్యమ స్పృహ రెండూ కనిపిస్తాయి. వీరి కథలు అలభ్యములు.
104. బి. సతీష్ కుమార్
నిజామాబాద్ జిల్లాకు చెందిన వీరు గుండెచప్పుళ్ళు అనే కథ రాశారు. కథా లక్షణాలను అందిపుచ్చుకొని మంచి కథలు కూడా రాశారు.
105. బిక్కునూరి రాజేశ్
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వీరు కల్పన-2095 అనే కథను ఆగస్టు 1995లో రాశాడు. వీరి కథలు వ్యంగ్య వైభవంతో విరజిల్లుతాయి.
106. బుర్ర రాములు
వరంగల్ జిల్లాకు చెందిన వీరు అనేక కథలు రాశారు. ఏడో సారా కథ, తొవ్వకోసం లాంటి కథలు వీరి దృక్ఫథాన్ని పట్టిస్తాయి. ప్రగతిశీల ఉద్యమాలతో సంబంధమున్న వీరి కలం నుండి అనేక కథలు వెలువడ్డాయి.
107. బుర్ర తిరుపతి
పెద్దపల్లికి చెందిన జర్నలిస్టు. తక్కువ కథలు రాసినా మంచి కథలు రాసారు. పల్లె అలికిడి, అరుణ మొదలైన కథలు వీరి సామాజిక దృక్ఫథాన్ని పట్టిస్తాయి.
108. బెజ్జారపు వినోద్ కుమార్
కరీంనగర్ జిల్లా కోరుట్ల నివాసి. దాదాపు వంద వరకు కథలు రాశారు. గవ్వల మూట అనే కథా సంపుటిని వెలువరించారు. విడవకుండా కథను చదివించే శైలి వీరిది. చిన్న విషయాలను కూడా కథగా మరల్చగల నేర్పు వీరికుంది. కొమ్మల్లో గాలిపటం, తాతాయ్య వాచీ లాంటి కథలు వీరి కీర్తిని ఇనుమడింప చేసాయి.
109. బెజ్జారపు రవీందర్
కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన మంచి కథా రచయిత. చరణం జారిపోయాక, పడగ తెగిన పాము, గోగుపూల పాట, నిత్యగాయాల నది, పోరుతల్లి, ఒంటికాలి శివుడు, వానపాట, జీవన గీతం, పీనుగు లాంటి కథల్ని విశ్లేషిస్తే వస్తు వైవిధ్యం, శిల్ప రహస్యాలు తెలిసివస్తాయి.
110. బోయిన భాస్కర్
కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌ప్రాంతానికి చెందిన వీరు పత్రికారంగంలో పనిచేస్తున్నారు. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. యామిని, గడ్డిపువ్వు అనే కథలు కథా పాటవానికి నిదర్శనంగా నిలుస్తాయి. జీవితమే వీరికి రచనా శక్తిని ప్రసాదించింది.
111. మలయ శ్రీ
కరీంనగర్ చెందిన మంచి సాహితీ వేత్త. ఐరేని కుండలు అనే కథా సంపుటిని వెలువరించారు. సామాజిక న్యాయాన్ని, శాస్త్రీయతను, హేతుబద్ధతను వీరి కథలు బోధిస్తాయి.
112. ముప్పాళ లక్ష్మణరావు
వీరు కరీంనగర్ జిల్లా బీర్‌పూర్‌కు చెందిన వారు. వీరు రాసిన కథ ఎత్తుండ్రి పిడికిల్లు. ఈ కథ నేల తల్లి విముక్తికోసం కథా సంకలనంలో ప్రచురితమైంది.
113. ముదుగంటి పాపిరెడ్డి
కరీంనగర్ జిల్లాకు చెందిన వీరు అరుదుగా కథలు రాసినా, రాసిన కథలతో వీడని బంధాలు అనే కథా సంపుటిని వెలువరించారు. ఇతని పాత్రలు ఎక్కువగా ఆదర్శాలు, ఆశయాలతో కదులుతుంటాయి. సమాజంలోంచి, జీవితంలోంచి తీసుకొని రాసిన మంచి కథలు.
114. ముదిగంటి సుజాతా రెడ్డి
కరీంనగర్ జిల్లాకు చెందిన రచయిత్రుల్లో అనేక కథలు రాసి, ప్రచురించిన కథకురాలు సుజాతా రెడ్డి. మింగుతున్న పట్నం, విసుర్రాయి లాంటి కథా సంపుటాలు వెలువరించారు. తెలంగాణా తొలితరం కథకులు-1, 2 సంపుటాలను పరిశోధించి వెలువరించారు. ఈమె కథలు ఆలోచనాత్మకాలు. తన కథల్లో సైతం వివిధ రకాలైన శిల్ప పద్ధతులను అనుసరిస్తారు.
115. మొగురం గట్టయ్య
కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు. రాక్షసులు, దారులు లాంటి కథలు రచించారు. వీరి కథ నల్లకలువలు కథా సంకలనంలో ప్రచురితమైంది.
116. మేర్గు రవీందర్
కరీంనగర్‌జిల్లా గోదావరిఖని కార్మికుడు. జీతం అనే వీరి కథ నల్లకలువలు కథా సంకలనంలో ప్రచురితమైంది. వీరు మరిన్ని మంచి కథలు రాశారు.
117. యశోదా రెడ్డి
కరీంనగర్‌తో అనుబంధం కలిగిన వీరు వయస్సులోనూ, యశస్సులోనూ ఎదిగిన రచయిత్రి. ఈమె కథలకు ఇక్కడి భాష జవాన్ని, జీవాన్ని ఇచ్చింది. మా ఊరి ముచ్చట్లు కథా సంపుటిని వెలువరించారు. వీరి కథల్లో తెలంగాణా సామెతలు, పలుకుబళ్ళు, నుడికారం కనబడుతాయి.



