సభలు-సమావేశాలు సోయి | 07 జూన్ 2007 04:05 pm
‘పేగుబంధం’ ఆవిష్కరణ
ఎన్నో సాహిత్య ఉద్యమాలకు, ప్రక్రియలకు నల్లగొండతో అవినాభావ సంబంధం ఉందని ప్రముఖ రచయిత అల్లం రాజయ్య అన్నారు. బోధనం నర్సిరెడ్డి రాసిన ‘పేగుబంధం’ కథల పుస్తకాన్ని మార్చి 10వ తేదీన నల్లగొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆయన ఆవిష్కరించారు. గ్రామీణ మానవ సంబంధాల్లోని ఉన్నత విలువలను ఎటువంటి జిమ్మిక్కులు లేకుండా రచయిత ఈ కథల్లో ఎంతో హృద్యంగా చిత్రించాడని ఆయన ప్రశంసించారు.
గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గాదె వినోద్‌రెడ్డి రచయిత బోధనం నర్సిరెడ్డిని శాలువాతో సత్కరించారు. ప్రముఖ సాహితీ విమర్శకులు ఎస్. రామకృష్ణ, అల్లం నారాయణ కథల సంపుటిని పరిచయం చేశారు. పొల్లుపోని నల్లగొండ మాండలికంలో వ్యవసాయజీవితాలను రచయిత సమర్థవంతంగా చిత్రించారని వారన్నారు. ఆవిష్కరణ సభకు అధ్యక్షతవహించిన ప్రముఖ రచయిత కాసుల ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ గతాన్ని వర్తమానంతో అనుసంధానం చేస్తున్న కథలుగా పేగుబంధం కథలను అభివర్ణించారు. తాను అనుభవించిన గ్రామీణ జీవితం తన కథలకు స్ఫూర్తి అని రచయిత పేర్కొన్నారు. తన పుస్తకం మొదటి కాపీని ఆవిష్కర్త చేతులమీదుగా ఆయన కట్టా మల్లారెడ్డికి అందించారు.
కార్యక్రమంలో డా|| నోముల సత్యనారాయణ, డా|| సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, బైరెడ్డి కృష్ణారెడ్డి, మేరెడ్డి యాదగిరి రెడ్డి, అల్లుబెల్లి రామచంద్రా రెడ్డి, దొడ్డి రామ్తూర్తి, కట్టా భగవంతరెడ్డి, పులిజాల మంజుల, నిమ్మల భీమార్జున్ రెడ్డి, బెల్లి యాదయ్య, కొల్లోజు కనకాచారి తదితరులు పొల్గొన్నారు. శ్రీనివాస్, నాగేశ్వరరావులు పల్లెపాటలను గానం చేశారు.



