పాటలు సోయి | 07 జూన్ 2007 06:35 pm
సంకురాత్రి పండుగ మానువ్వు
-దామరకుంట శంకరయ్య
పల్లవి: ప్రభుత్వమేదైన నాయకులెవరైన
పట్టదూ నీగోడు ఓరంన్నా
ఏది ఏమైనా ఎవ్వరెట్లున్నా
పట్టెడన్న పెట్టెరైతన్నా
చరణం: భూమిని పరపరాదున్నీ
నాటితివి పంటలూ కొన్నీ
చేతనంత చెమటతో తడిపి
ఆశతో కాలమూ గడిపి
దిగుబడి రాకనువు చెందిన గాని
పంటకాలువ నీరు మా నువ్వు
జొన్నచేలో కంకి మానువ్వు
కల్లంలో వరికుప్ప మానువ్వు
ఇంట నిండిన గాదె మానువ్వు ||ప్రభు||
చరణం: పురుగుమందు దుకాణం
సేటు చేసెను ఘనమోసం
కాత కాయని విత్తనాలు
పురుగు చంపని కల్తి మందులు
ప్రతిసారి నీవంతు మోసపోవుడైనా
చెరుకు గడలో బెల్లం మానువ్వు
తీయమామిడి పండు మానువ్వు
గేదె జున్నుపాలు మానువ్వు
పెరుగు సద్దిబువ్వ మానువ్వు ||ప్రభు||
చరణం: పంటచేనుకు పురుగు తాకీ
పెంచింది ఇంకొంచెం బాకీ
పత్తిచేనుకు చేసినప్పు
తెచ్చింది నీకు పెనుముప్పు
దాని మిత్తి నీ పాలిట మితై పోయినా
జోడెద్దుల కాని మానువ్వు
ఇంటి పాడిఆవు మానువ్వు
పిల్ల పాపల ఇల్లు మానువ్వు
వెచ్చని దుప్పటి మానువ్వు ||ప్రభు||
చరణం: అంతో ఇంతో చేతికందిన పంట
అమ్ముదామనిపోతే దళారీల తంట
మద్దతు ధరయిస్తమండు
మంత్రి మాటలైతె చెప్పిండు
మార్కెట్టుకు పోయి మూర్చచ్చి నువుపడ్డా
పున్నమి వెన్నెల మానువ్వు
సూరీడి వెలుగు మానువ్వు
సంకురాత్రి పండుగ మానువ్వు
సృష్టికే భుక్తి మానువ్వు ||ప్రభు||



