సభలు-సమావేశాలు సోయి | 07 జూన్ 2007 04:00 pm
సూరత్‌లో తెలంగాణ అవగాహనా సదస్సు
గుజరాత్ రాష్ట్రంలో సూరత్ పట్టణములో నివసిస్తున్న తెలంగాణీయులు ఫిబ్రవరి 26వ తేదీన ‘తెలుగు వికాస మండలి’ ఆధ్వర్యంలో తెలంగాణ అవగాహనా సదస్సును నిర్వహించారు. రాత్రి 8 గంటలనుండి 12.00 గంటల వరకు దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ అవగాహనా సదస్సు సభికులను ఉర్రూతలూగించింది. తెలంగాణ తల్లికోసం ప్రవాస తెలంగాణీయులు చూపిస్తున్న ఆర్తికి అద్దం పట్టింది. ఈ సదస్సుకు తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, ప్రముఖ తెలంగాణ కవిగాయకుడు దేశపతి శ్రీనివాస్‌లు ముఖ్య అతిధులుగా హాజరై ప్రసంగించినారు. వివిధ తెలంగాణా జిల్లాల నుండి సూరత్‌కు వలస వచ్చిన 500 మంది హాజరై సదస్సును విజయవంతం చేసినారు.
తెరవే అధ్యక్షులు ప్రసంగిస్తూ తెలంగాణ అన్ని జిల్లాల నుండి ప్రజలు దూర ప్రాంతాలకు బతుకు తెరువు వెతుక్కుంటూ వలస పోవటానికి ప్రధాన కారణం వ్యవసాయం సంక్షోభంలోకి పడిపోవడం, ప్రజలు భూమినుండి దూరం కావడంతో వలస పోవాల్సిన పరిస్థితి ఏర్పండింది. చదువుకున్న యువకులకు ఉద్యోగాలు దొరకడం లేదు. తెలంగాణ యువకులకు దక్కవల్సిన ఉద్యోగాలను ఆంధ్రులు తన్నుకు పోయినారు. అందువల్ల అటు వ్యవసాయంపై ఆధారపడిన పేద జనం ఇటు చదువుకున్న యువజనులు దేశాలుపట్లి వలసబోతున్నారు. అందులో భాగంగానే మీరంతా సూరత్‌కు బతువచ్చినారు. తెలంగాణ ప్రజలు తమ ఊళ్ళని విడిచి దేశాలు పట్టి పోతుంటే ఆంధ్రులు తెలంగాణని ఆక్రమించి కోట్లకు పడగలెత్తుతున్నారు. ఎక్కడ నల్లరేగడి భూములుంటే, ఎక్కడ కాలువ పారుతుంటే అక్కడ తిష్ఠవేసి నేలవాసులను భూమి నుండి బేదకలు చేస్తున్నారు. ఉద్యోగాల్లో ఎక్కడ చూసిన వాళ్లే, ప్రభుత్వ కార్యాలయాల్లో, గనుల్లో, ఫాక్టరీలలో అంతా వాళ్లే. నిధులు, నీళ్లు నియామకాలు దోపిడీకి గురి అవుతున్నాయి. ఈ దోపిడీ అంతం కావాలంటే, మన నీళ్ళు, మన నిధులు, మన ఉద్యోగాలు మనకు దక్కాలంటే తెలంగాణ రాష్ట్రమే పరిష్కారం అని ఆయన సోదాహరణంగా వివరించినారు.
కవిగాయకుడు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎందరో మేధావులు, కవులు, రచయితలు, కళాకారులు, విద్యార్థులు, ఉద్యోగులు, జర్నలిస్టులు పాల్గొంటున్నారు. ఇవ్వాళ సూరత్‌లో ప్రవాస తెలంగాణీయులు ఏర్పాటు చేసిన ఈ సదస్సులో ప్రసంగించడం నాకు సంతోషంగా ఉంది. ఆంధ్రులు మనమంతా ఒక్కటే. మనం అన్నదమ్ములం. కలిసి ఉందాం అంటున్నారు. మరి వారంతా సుఖంగా ఉంటే మనమెందుకు ఇట్లా వలస పోయి బతుకుతున్నాం. మనది అన్నదమ్ముల సంబంధం కాదు. మనది దోపిడీ చేసేవాడికి, దోపిడీ చేయబడేవాడికి ఉన్న సంబంధం. పాటలు, మాటలుగా సాగిన దేశపతి శ్రీనివాస్ ప్రసంగం సభికులను ఉర్రూతలూగించింది. కన్నీళ్లు పెట్టించింది. తెలంగాణ తల్లి విముక్తి కోసం ఆలోచించేలా చేసింది. తెలంగాణ పట్ల అమలవుతున్న భాషా సంస్కృతిక అణిచివేతను పాటలతో సోదాహరణంగా వివరించారు.
ఈ సదస్సులో సూరత్ నగరంలోని మాన్‌దర్వాజ, లింబాయత్, గొట్టాలవాడి, ప్రతాప్‌నగర్, డుంబాల్, కృష్ణ కృప సొసైటీ, నిలిగిరి, ఎక్తానగర్ మొదలైన ప్రాంతాల నుండి ప్రాంతీయ సమాజం ప్రముఖులు, కుల సంఘాలు, యువకులు, కార్మికులు, స్త్రీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మండలి అధ్యక్షులు మస్నకుమార్ అధ్య్షత వహించారు.



