పాటలు సోయి | 07 జూన్ 2007 06:31 pm
తెలంగాణ నా జన్మహక్కు
- అలీ
నా యాబదేండ్ల కోషీష్‌కి
తెలంగాణ సాధన చైతన్యంలో
తోవనిండా పల్లేరు కాయల తోటలే
నా అరికాళ్ళల్లో మంటలే మంటలు
నా వీపుకి నకిలి అభివృద్ధి
రేగ్గంప అంటించి
నన్నో జోకరును జేసి గారడి ఆటలు
మాదిగ సందుల్లో తుర్క గల్లీల్లో
ఇంకా పీతిరి కుంటలు మురుగ కాల్వలు
కెసిఆర్ ఐనా వైఎస్‌ఆర్ ఐనా ఎమ్మెస్‌ఆర్ ఐనా
ఏ రాజకీయ రంగు పూసుకున్న
పదవి దురద బొమ్మైనా
తెలంగాణకు యస్‌సార్ అనవలసిందే!!?
కాదన్నోడికి ఊరి పొలిమేర దాటిస్తాం
ఈ గడ్డమీద పుట్టి
ఈ మట్టిలో పొర్లాడి
మన్నులో బువ్వైనోడు నావాడే
తెలంగాణ వ్యతిరేక దిష్టిబొమ్మలకు
ఇక సున్నం బొట్లు గాడిద సవారీలు
తెలంగాణ ద్రోహుల్లార కండ్లు తెరవండిక
కన్నగడ్డకు గౌరవంగా గుడ్డలు తొడుగుదాం
స్వేచ్ఛా వాయువులు నింపుదాం రాండ్రి
తెలంగాణ వాకిలి పొక్కిలి పొక్కిలై
కరీంనగర్ మత్తడిలో తేలుతుంది
కేకే గాని చివరికి
నా నోట్లోంని పీకగాని
తెలంగాణ వచ్చేవరకు
కేంద్రం ఇచ్చే వరకు
అందరూ తెలంగాణ రాగం ఊదవలసిందే!!!
కన్న పేగుకు పట్టెడన్న పెట్టలేని
ఖద్దరు చొక్కాలు ధరించిన దేహాలే
నా తెలంగాణకు అసలు సిసలైన ద్రోహులు
ఆంధ్రాకు ఊడిగం ఇంకా ఎన్నాళ్ళు?
తెలంగాణ సెంటిమెంటు కాదుర భాయి
తెలంగాణ నా ఆత్మబలం
తెలంగాణ నా ఆత్మగౌరవం
తెలంగాణ నా జన్మహక్కు



