సభలు-సమావేశాలు సోయి | 01 సెప్టెంబర్ 2007 04:21 pm
అందరినోట … అదే మాట తెలంగాణ
జాతీయ సదస్సులో వెల్లివిరిసిన చైతన్యం - ప్రత్యేక రాష్ట్రంపై సాహితీ పోరు
‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం… ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం” అంటూ అందెశ్రీ ఆలపించిన ప్రారంభ గీతం జూలై 19న భువనగిరిలో జరిగిన తెలంగాణ సాహిత్య సదస్సుకు సరికొత్త ఉత్సాహోన్ని ఇచ్చింది. దశాబ్దాలుగా వివక్షకు గురవుతున్న ఈ ప్రాంత సాహిత్య కళారూపాలను ప్రజల చెంత చేర్చాలనే తలంపుతో ‘తెలంగాణ సాహిత్యం- జీవిత చిత్రణం పేరిట ఏర్పాటు చేసిన జాతీయ సదస్సు తెలంగాణ అభిమానుల గుండెలను హత్తుకుంది. గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో తెలంగాణ అభిమానుల గుండెలను హత్తుకుంది. గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో తెలంగాణ నినాదాన్ని ఓలలాడించాలంటే కేవలం వులు, రచయితలు, గాయకులవల్లే సాధ్యమని సదస్సులో పలువురు అభిప్రాయపడ్డారు. అటు ముస్లింల పాలనలో ఇటు ఆంధ్రుల చెరలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని వక్తలు పేర్కొన్నారు. భువనగిరిలో లక్ష్మినర్సింహ స్వామి కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ జయశంకర్ హజరై తనదైన శైలిలో ప్రసగించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల భాషల నడుమ వున్న తారతమ్యాన్ని ఆయన తేటతెల్లం చేశారు. తెలుగు భాష తెలంగాణకే సొంతమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన తెలుగు వుంటుందని చెప్పారు. కవులు, రచయితల అంతిమ పోరు తెలంగాణ కొరకేనని సందేశమిచ్చారు.
కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు రవ్వా శ్రీహరి మాట్లాడుతూ ఆంధ్రప్రాంత వాసులే కాక వివిధ ప్రాంతాల నుండి హైదరాబాద్‌లో స్థిరపడిన కారణంగా తెలుగుభాష సంకర భాషగా మారిందన్నారు. తెలంగాణ వాసులు మాట్లాడే స్వచ్ఛమైన తెలుగు భాషను ఆంధ్రప్రాంత వాసులు ఎద్దేవ చేస్తున్న కారణం చేత భాష మాట్లాడాడినికే భయపడుతూ భాషలో తేడాలు వస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రాంతంలో కవులే లేరనడం హస్యస్పదమన్నారు. తెలంగాణ ప్రాచీన కవిత్వం అనే అంశంపై. తెలుగు శాఖ రీడర్ డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాహిత్యం ఉందా లేదా అనే అంధకారంలో ఉన్నామని, 14 వ శతాబ్దినుంచే తూర్పు చాణుక్యుల కాలంలో ఎన్నో ఖండకావ్యాలు వచ్చాయని, 19వ శతాబ్దంలో పాండితీ యుద్ధంలో తిరుపతి వెంకట కవులు పోరాడి ఓడారని గుర్తుచేశారు. తెలంగాణ ఆధునిక కవిత్వంపై ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎస్.వి.రామారావు మాట్లాడుతూ భావ సాహిత్యం ఊసేలేదు, అనుభవ సాహిత్యం రాజ్యమేలుతుందని ఆంధ్ర సాహితీ వేత్తలను ఎద్దేవ చేశారు. విశ్వ విద్యాలయంలో పాఠ్యాంశాలను తెలంగాణ భాషలోకి మార్చినపుడే నిజమైన మార్పు వస్తుందని, అప్పటి వరకు ఎన్ని చెప్పుకున్నా వృధా అన్నారు. తెలంగాణ చరిత్రపై కవి, రీడర్ వేణు సంకోజు ప్రసంగిస్తూ కవితల మాగాణం తెలంగాణం అంటూ సాహితీ చరిత్రపై అనర్గళంగా మాట్లాడారు. కోస్తాంధ్రలో చేపట్టే శంఖస్థాపనంకు సంబంధించి శిలాఫలంపై కేవలం ఆంధ్ర అనే వుంటుందని, ఇక్కడైతే ఆంధ్రప్రదేశ్ అని వుంటుందని అన్నారు. తెలంగాణ అస్తిత్వవాద కవిత్వంపై తెలుగు రీడర్ డాక్టర్ నాళేశ్వరం శంకరం, ప్రతాప్‌రెడ్డి, తెలంగాణ తొలితరం కథలు అనే అంశంపై డాక్టర్ ముదిగంటి సుజాతరెడ్డి, మలితరం కథలపై ఆచార్యకాత్యాయని విద్మహే, తెలంగాణ భాషపై డాక్టర్ నలిమెల భాస్కర్, తెలంగాణ సంస్కృతిపై డాక్టర్ నందిని సిద్దారెడ్డి, తెలంగాణ సాహిత్యం అనే అంశంపై డాక్టర్ కె.శ్రీనివాస్, తెలంగాణ పత్రికల గురించి సంగిశెట్టి శ్రీనివాస్, జానపద సాహిత్యంపై ఆచార్య జిఎస్ మోహన్, తెలంగాణ ప్రజాకళారూపాలపై మల్లేపల్లి లక్ష్మయ్య, తెలంగాణ స్త్రీల పాటలపై డాక్టర్ ఆర్.కమలలు ప్రసంగించారు. నాలుగు విభాగాలుగా సాగిన ఈ సదస్సులో డాక్టర్ తూర్పు మల్లారెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ ఎ.కృష్ణమూర్తి, గౌరవ అధ్యక్షులు రంగారావు, ఆచార్య టి.కిషన్‌రావు, డాక్టర్ మట్ట శోభ, ఎస్. శ్రీనివాసరావు, ఆర్.జయరాంరెడ్డి, ఎ.రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సులో ప్రముఖ తెలంగాణ గేయ రచయిత అందెశ్రీ, మా భూమి సంధ్య తమ పాటలతో సభికులను ఉత్తేజపరిచారు.
* * *
2007 ఆగస్టు 17న హైదరాబాదు కళాసుబ్బారావు కళావేదికలో మానస ఆర్ట్ థియేటర్స్, శ్రీ త్యాగరాజు గానసభ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సభలో సుప్రసిద్ధ సాహితీ వేత్త డా. దేవరాజు మహారాజు రచించిన వైజ్ఞానిక నాటికల సంపుటి ‘లైఫ్‌టానిక్’ ఆవిష్కరింపబడ్డ సందర్భంలో కేంద్రసాహిత్య అకాడమీ తెలుగు సంఘం కన్వీనర్ డా|| పోరంకి దక్షిణామూర్తి ప్రసంగిస్తున్న దృశ్యం. వేదిక మీద రఘుశ్రీ, నాటిక ప్రయోక్త చాట్ల శ్రీరాములు, గ్రంథ రచయిత, హాస్యరచయిత ఆదివిష్ణు, దీక్షితులు, ప్రముఖ సాహిత్య విశ్లేషకుడు కె.పి. అశోక్‌కుమార్ ఉన్నారు.



