పోస్టులు అభిప్రాయాలు 03 September 2010

కథలు సోయి | 01 సెప్టెంబర్ 2007 04:34 pm

బతుకు

-బి.వేణుగోపాల్‌

చిగురులు తొడిగిన అడివి పచ్చగా కళకళలాడుతున్నది. గ్రీష్మ తాపాన్ని తీర్చడానికి వసంతం హరితాన్ని పులిమి వెళ్ళినట్లున్నది. సూర్యుడు నడినెత్తి మీదున్నడు.అప్పటి వరకు విస్తరించిన చెట్ల నీడ చెట్టు మొదలువరకే వచ్చింది. బుగబుగమని మండుతున్న ఎండను సైతం లెక్కచేయక అడవితో యుద్ధానికి వచ్చినట్లు తునికి పొదలను వెతుక్కున్న గుంపు అటు ఇటు కదలాడతున్నది. చిన్న,పెద్ద తేడా లేకుండా తునికాకు (చుట్టాకు) లను టిక్‌ టిక్‌ మని తెంపుతున్నారు.కాళ్ళు చేతులు యంత్రంలా ఆడుతున్నాయి.

ఎండకు నేనుసై అంటూ అపుడే వచ్చిన ఎర్రటి లేత చిగురుటాకును స్పర్శిస్తూ, దాని క్రిందున్న ఆకును తెంపుతూ మట్టిలో పడిన మనుబోతు అడుగులను చూసి “ఓరి మల్లిగా….. మనుబోతు అడుగులు జూసినావురా………. ఇట్లా ఆ లొద్దిలకు పోయినట్లున్నయి.” అని బుచ్చయ్య పరిశీలనగా అడుగుల వంకనే చూస్తూ, చుట్టాకులను తెంపుతూ బుడ్డగా చెక్కుకున్న దోతిలో వేస్తున్న మల్లయ్య తో అన్నాడు.

“ఏదే… అవు సయే… నిన్న పొద్దుగూకి కట్టెలకచ్చినోళ్లకు కనిపించినానయట. ఏడనే రెండే వున్నయట. ఎన్నో మందలకు మందలుండేడిది. అవురా…. మునుపటి లెక్క జీవరాశి ఎక్కడిది?”
“అందరు శికారి చేయవట్టిరి. చూడు అని చుట్టూచూపిస్తూ,” అడవి ఏమన్న ఉన్నదా…. సాఫ్‌ సత్తెనాష్‌ బట్టిచ్చిండ్రు. పెద్ద పెద్ద చెట్లు లేనే లేవు. టేకు చెట్లయితే బంగారమైనయి.” అని అనగానే పక్కనే ఉన్న తుర్పిబాయి తన కొంగును నడుముకు చుట్టుకొని ఏర్పడిన సంచిలో వేగంగా తెంపుతున్న ఆకులను వేస్తూ,” అంటే కోపాలస్తయి. గని, అడివిని కాపాడదల్గి సంఘం సంఘం అని ఓ…. ఎగిరితిరి.గిపుడేమైంది? సంఘం లేనపుడు, ఆఫీసర్లు లేనపుడు జంగలే మంచిగుండే,

ఇంటికీ,యగుసంకు కట్టె తెచ్చుకునా జంగల్‌కు ఏమికాలే, గిపుడు అందరూదొంగలే, ఉత్త బంగిమంది. దానిచ్చి అదే మొలిచి పెర్గే అడివికి సంఘాలెందుకు? ఆఫీసర్లెందుకు?” అని సహజంగా మారిన వ్యవస్థపై గల ఏహ్యా భావం వల్ల కోపంతో అన్నది. ఇరువులు మొదట నొచ్చుకున్న ఆమె చెప్పిన సత్యానికి తలలూపారు. ఎందుకంటే మొదట సంఘాలచ్చినపుడు చొరవతో ముందుకు నడిచారు. “అవు… సయే” అంటూ బుచ్చయ్య ఎండతీవ్రత ఎక్కువగావడం వల్ల, పక్కనే గల పూసుగు చెట్టు నీడలోకి వెళ్ళాడు. అడవిలో జంతుజాలం ఇష్టంతో సేదతీరే నీడ ‘పూసుగుచెట్టు’ నీడ. అంత చల్లని దట్టమైన నీడ ఏ చెట్టు ఇవ్వదు.

మళ్ళీ తుర్పిబాయే. “ఆఫీసర్లయితే బట్టే బాజిగాండ్లు.ఈళ్ళకు సై అనేటోళ్ళు గావాలె బుచ్చి మామ. ఒళ్ళుసై అంటరు దొంగలు. ఈళ్ళు దొంగలే ఆళ్ళు దొంగలే. ఇగ రక్షణ ఏడిది?” అని కుండ బద్దలుగొట్టినట్లు మాట్లాడుతున్న తుర్పిబాయి ఎవరి తప్పులైనా గిట్లనే కడిగిపారేస్తది.
“అవు… ఆ…ఆ.. “ అని నగుతూ బుచ్చయ్య, మల్లయ్య ఒకరికొకరు బీడి వెలిగించుకున్నారు.
“తుర్పక్కా… ఒక్క అడివే కాదే ఊరుసుక గట్లనే అయింది. అంత ఆగమైంది. మునుపటి లెక్క ప్రేమలు లేనేలేవు.” అని చెమర్చిన కళ్ళతో మల్లయ్య అంటుంటే.

“‘అంత లంగలయిండ్లు. మునుపటి లెక్క ఏడున్నరు. బుచ్చిమామ మీ నారిగాడైతే బామ్టయిండు. నిత్తె తాగి గుసలాడుతున్నడు. తాగి గా జనిగి పోషిని పొట్టు పొట్టు తిట్టిండట. అది కేసు బెడ్తనంటున్నది.”

“అరె… ఇడు గాళ్ళ జోలికి పోవుడేంది. ఆళ్ళు జంగల్‌ సంఘం అనుకుంట ఎట్ల జేస్తున్నరో ఎరుకనే గదా! లమ్డికొడుక్కి ఎంత చెప్పిన గంతే ఎప్పుడు గుసలాడుతడు.

నారాయణ బుచ్చయ్య రెండో కొడుకు తాగుబోతుగా మారిండు. బుచ్చయ్యకు అదే బాధ.
“ఎందుకు గుసలాడడే మామ తాగినంత కల్లు ఊర్ల దొరుకుతున్నది. గా గుల్‌ఫారం కల్లు తాగి పతి ఒక్కడు సాతగాకుంటయిండ్లు. ఉత్తమబ్బు తయారవుతున్నారు. ఇంక పనేం జేస్తారు” అని మల్లయ్య అంటుంటే మత్తులో జోగుతున్న పల్లె కళ్ళెదుట కనిపించింది బుచ్చయ్యకు. గుండెను ఒకేసారి పెకిలించినట్లయింది. పక్కనే ఉన్న భీమలింగు “మీ నారిగాడి కంటె మా సూరిగాడు దండికడ్డు తయారయిండు. ఆనికి పోటి చెవిటి గంగడు. పే కొడుకులు ఒక్కొన్నిమించి ఒక్కోడు తయారయిండ్లు. తాగుడు గుసలాడుడు. నిత్తె ఇదే పని.”

కోపం దిగమింగిన గొంతుతో “అవురా… దరిద్రం కల్లు యాడనుంచి అచ్చెరా! అంత ఎద్దు కష్టం గీల్లే జేస్తున్నరు. పండుగ లేదు. పబ్బం లేదు. నిత్తె తాగుడే. యాడ్నుంచి పైసలస్తున్నయి.” అంటూ విచారంలో పడిపోయాడు బుచ్చయ్య.

“మొత్తం ఊరే అట్ల తయారయిందే. ఒక్కడు పని సక్కగ జెస్తలేడు. ఎప్పుడు కొట్లాటలే. ఉన్న భూమిని దున్నుకోక, కైకిలి సాతగాక, లచ్చిగాడు తాగి తాగి సావలేదా నిరుడు.” అని తుర్పిబాయి, ముగించింది.
తుర్పి మాటలు విన్న బుచ్చయ్యకు గుండెలో రాయి పడ్డట్టయింది.

అంతలో “నడుండ్రి.. నడుండ్రి ..” అంటూ గుంపులోని కొందరూ అంటుంటే మల్లయ్య లేచి “పదవే బుచ్చయ్య మామ బగ్గయాల్లైంది.” అంటూ తన చేతిని బుచ్చయ్యకు ఆసరాగా అందించాడు.
జమ చేసిన చుట్టూకును పెద్ద సైజు ముల్లెలాగ కట్టుకొని ఎవరికి వారు నెత్తిమీద ఎత్తుకొని పల్లెదారి పట్టారు. యుద్ధం ముగిసిన సైనికుల్లా. చుట్టాకుకు సాధారణంగా పొద్దునే పోయి మధ్యాహ్నం కల్ల తిరి గివస్తారు.

ఒకరి వెనుక ఒకరు వడివడిగా నడుస్తున్నారు. పిల్లలేమో నేను ముందంటే నేనంటూ ఒకరినొకరు దాటవేయాలనే ప్రయత్నంలో వేగంగా నడుస్తున్నారు. పిల్లబాట వెంబడి మార్చ్‌ఫాస్ట్‌ చేస్తున్నరు.
బుచ్చయ్య విచారం నుంచి తేరుకొనేలేదు. పిల్లగాండ్లు యారవడి ఐదేండ్లు అయింది. వేరుపడతామని కోట్లాట బెట్టిండ్లు. ఆళ్ళన్నట్లే కోరుకున్నదే పంచిచ్చిన్న. గని,ఒక్కడు సక్కగ బతుకత లేడు. నిత్తె ఏదొక కోట్లాట. ముగ్గురికి మూడెకరాల దాక అచ్చింది. ఒక్కనాడు సక్కగ పంట పండలేదు. తగ్గ కష్టం జేస్తనేలేరు. కలిసి ఉన్నపుడు దేనికి లోటు లేకుండే. అన్ని కర్చులు పోంగ ఎంతో మిగులుతుండే. వట్టి అడ్లు, జొన్నలు, కొర్రెలు,సామలు, పెసల్లు, మినుములు, తొగళ్ళ, శెనగలు, బబ్బర్లు, అలసందలు, దనియాలు ఎన్నో తీర్లపంటలు. అన్ని గింజలు పండేడిది. బయట ఏమి కొనక పోతుంటమి. ఇంటోళ్లందరు కష్టం చేసేడిది. ఆ కష్టం ఇయ్యాళ్ళ ఎందుకు చేస్తలేరు. ఉన్న ఎనిమిది, పదిఎకరాలల్ల అందరు అనందంగా బతికిండ్లు. గిపుడు మంచికి మూడెకరాలల్ల చిన్న కుటుంబం ఎందుకు బతుకుతలేదు? గిప్పటోళ్ళు గిట్ల ఎందుకు అవుత్నురో సమజయితలేదు. అచ్చిన మూడెకరాల సాగుజేసుకోక అచ్చిన పైసలతోట తాగుకుంట తిర్గి, గిపుడేమో జీతం ఉంటున్న చిన్నోడు. ఎప్పుడు దురస్తవుతడో? పెద్దోడు సిస్తుగ జేసుకున్న ఈ నడుమ ఆడు గిట్లనే చేస్తున్నడు. ఇగ నారిగాడెమో గిట్ల అనుకుంటూ ఆలోచనలతో సాగుతున్న బుచ్చయ్య నడక భారమై దారి తప్పుతున్నడు.
ఇది చూసి మల్లయ్య “ఏం సోంచాయిస్తున్నవే మెల్లంగా… చూసినడు. దారి తప్పుతున్నవు” అని అనగానే బుచ్చయ్య తేరుకొని,

“ఊరే దారి తప్పింది నేనేం లెక్కరా?

“ఊరి గురించి గిపుడు బాధపడి ఏం ఫాయిద లేదే బుచ్చిమామ ఊర్లఅందరు పెద్దోలయిండు, నాపార్టీ నాపార్టీ అనుకుంట జెండను మొలకు చుట్టుకొని ఎగురుతున్నరు. పని చాత గాకుంటయిండ్లు. అన్ని పార్టీలోళ్ళు ఊర్ల ఉంటే ఎట్లుంటది బుచ్చయ్య మామ బింగి మంది అయిండ్లు.” అని తుర్పిబాయి ఆవేశంగా చెప్పింది.

మళ్ళీ తనే “కష్టమచ్చినా సుఖమచ్చినా కలిసి ఉన్న ఊర్ల కొట్లాటలు ఎక్కువాయే! కలిసి మెలిసి ఉన్నోళ్ళే పగదార్లు అవుత్నురు. ఇగ ఏడికెళ్ళి దురస్తవుతరు.” అని తుర్పిబాయి బాధతో చెపుతున్నది. వెంటనే మల్లయ్య “ఎప్పుడు ఒకటే తీరుండది. కాలం మారుతుంది.”
ఏమి మారుతది తమ్మి చేసి చేసి ఆడోళ్ళ రెక్కలన్ని పడిపోతున్నయి. ఇంకెన్ని రోజులు గిట్ల.”
“మీకు ఒక్కటి చెప్పుత సక్కగ ఇనుండ్రి.” అని మల్లయ్య అనగానే ఏంది అని చెవులు రిక్కించారు. ఎందుకంటే మల్లయ్య ఊర్ల సమాజ్‌దారు. అందరు ఇజ్జత్‌ ఇస్తరు.

“పుట్టింది యవుసంనే కని ఎన్నడు యవుసం సాతి ఇవ్వలేదు. ఎప్పుడు బాకీల బతుకే. పడ్డ కష్టంకు ఫలితం ఎన్నడులేదు. గీ బతుకులు గింతేనెమె అనుకున్నం. కని, పత్తికి పది వంకలు బెట్టి పదిపైసలు మిగలకుండ చేసిన సేటుకు గుంజి కొట్టినంగద అని అనగానే, తుర్పిబాయి అడ్డు తగులుతూ “హిమ్మత్‌ ఇచింది అడవిలో న్యాయమే కదా! భయపడి గీచుట్టూకు కట్టల ధర సుక పెంచిండ్లు.” అని అనగానే

“అయితే గిప్పడేం జేసుడు.” అని విసుగ్గా బుచ్చయ్య అన్నాడు. “గప్పటి హిమ్మత్‌ గిపుడు గావాల్నే బుచ్చయ్య మామ.

బయట శత్రువులు, ఇంట్ల శత్రువులు ఎన్నోద్దులు ఇట్ల”?
“‘ఆధైర్యం గిపుడు అస్తదా మల్లయ్య” అని భీమలింగు నిర్వేదంగా అన్నడు.
“ఎందుకు రాదు భీమలింగు బొప్పా.”

“ఏ ….ఈ కడ్లను దంచుతనే ఇంటరు.” అని గుంపులోని కొందరు ఆడవాళ్ళు కసిగా అంటున్నరు.
“చెడుతున్న ఊరు తరుగుతున్న అడివి మన చేతుల లేదురా! దొంగలకు వార్తలందించినోడు గదెదో అంటరు గద మల్లయ్య. ఆ….ఇన్‌ ఫార్మర్‌ గాళ్ళు జమైన ఊర్ల ఏమి చేయరాదు. ఆడికి భయపడి నోళ్ళకు తాళం వేసుకోలేదా! చావు మీదకు తెచ్చుకున్నోళ్ళు లేరా! మన తోటి ఏమైతది?” అని బుచ్చయ్య నిస్సహయత ఆవిరించియున్న గొంతుతో అన్నడు.

“నేను చెప్పిన గదనే బుచ్చయ్య మామ! కాలం ఒకటే తీరుండది. ఎండాకాలం అయినంక వానాకాలం ఎప్పుడు ఒక్కొళ్ళదే పై చేయి కాదు.” అని మల్లయ్య ఆశావాద దృక్పదంతో చెపుతున్నాడు. అదయితే నిజమే.

అంతలో ఊరి పోనాదికి వస్తుండగా ఊరికి పోలీసులు వచ్చారు. బుచ్చయ్య గుండె వేగంగా కొట్టుకుంటోంది.

ఎప్పుడో కబురు అందిన నారిగాడు ఎస్సైముందు ప్రత్యక్షమైనాడు. తాగిన నారిగాడు తుళ్ళుకుంట కంట్రోల్‌ చేసుకుంటూ నిల్చున్నాడు. అయినా తుళ్ళుతున్నాడు.
ఊరిలో సగం కంటె ఎక్కువ మంది తాగిఉన్నరు. అదే వింతలోకం.

ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న గుంపు అడివి నుండి ఊరిలోకి యుద్ధం ముగించిన సైనికుల్లా వచ్చేశారు. నెత్తిన ముల్లెలనుప్పుడే ఆలస్యం.

Trackback This Post | Subscribe to the comments through RSS Feed

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో