పోస్టులు అభిప్రాయాలు 03 September 2010

కథలు సోయి | 01 సెప్టెంబర్ 2007 04:38 pm

కేసు

-వేణు సంకోజు

అందరూ అవాక్కయి వున్నారు.
అందరి ముఖాల్లోనూ ఒక పెద్ద విషాదఛ్చాయ.
‘మళ్ళీ ఏమై ఉంటుందా’ - అనుకుంటూ! వినకూడనిదేదో వినవలసి వస్తుందనుకుంటూ భయపడసాగింది సీతమ్మ.

ఫోను రిసీవరు పెట్టేసి మౌనంగా కూర్చున్నాడు పఠాభి.

సుధ కూడ ఏదో శంకిస్తూ, ఫోను ‘తన అత్తగారింటి వద్దనుండే కావచ్చుననుకుంటూనే అడిగింది - “ఎక్కడినుండి నాన్నా ఫోను?” ‘తనే చేశాడా?’ అని కూడ అడిగింది.

మౌనంగానే ఔనన్నట్టుగా తలూపాడు పఠాభి. అతని మౌనంతో సముద్రాలంతటి ఘోష. తుఫాన్లంతటి అలజడి, ప్రపంచయుద్ధాల్లోని అణుబాంబులంతటి విధ్వంసం. ఎన్నెన్నో వున్నాయి. అవ్యక్తమైన కసి. తనమీద తనకే అసహ్యం. ఏమీ చేయలేని తన అశక్తత మీద తనకే తెలియని ఉక్రోషం కలుగుతున్నాయి. తను ఒక ఆడకూతురును కన్నందుకే కదా తనకీ రంపపు కోత! ఫోనొస్తే భయం, ఉత్తరమొస్తేదడ, ఆ వూరి నుండి ఏవ్యక్తి వచ్చినా వణుకు. ఎన్నాళ్ళు-ఎన్నాళ్ళీ విధంగా? ఎన్నిసార్లు ప్రాధేయపడాలి? ఎంతమందిని బ్రతిమాలాలి? ఒకమారు వియ్యంపురాలిని, ఇంకొకమారు వియ్యంకుడిని, అనేకమార్లు అల్లుడుగారిని. ‘అల్లుడుగారిని’ ఆనుకోవాల్సి వచ్చినప్పుడు “గారిని” అనుకోబుద్ధికాలేదు పఠాభికి. ఎంత లోకువై పోయాడతడు! ఒక బిడ్డను కని గర్వంగా పెంచినందుకు - సంతోషంగా సాకినందుకు - డిగ్రీదాకా చదివించినందుకు, కంప్యూటర్‌ జ్ఞానం కూడ కలిగించినందుకు, అన్ని విధాలా- అవతలి వారు అడిగిన ప్రకారమే - ఉన్నంతలో అన్ని లాంఛనాలతో వైభవంగా పెళ్ళిచేసినందుకో- ఒక అయ్య - చఛ అయ్యకాదు రాక్షసుడు - పెనుభూతం - మానవమృగం చేతిలో పెట్టినందుకు - అందుకే కదా తాను అంతగా లోకువైంది. అంతగా మెత్తబడింది! తలచుకుని తలచుకుని, తనూ, తన భార్యా, వగచి-వగచి, బిడ్డముందు కన్నీళ్ళు కార్చలేకా, కళ్ళనీళ్ళు కళ్ళల్లోనే ఇంకించుకోలేకా-ఎంతటి నరకయాతన అనుభవించారు! ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఇలా? ఆలోచనలో పడిపోయాడు పఠాభి!

“ఏమైందండీ - ఏమిటిలా డీలా పడిపోయారు? ఎప్పుడూ వుండేదేకదా! కొత్తేముంది ఇందులో? అంతకుముందు ఉత్తరం రూపంలో ఒక నరక కూపం మన ఎదుట నిలిచింది. అంతకన్న పూర్వం ఒక మనిషే వచ్చి మన గుండెల్లో గునపం లాంటి వార్తను గుచ్చి మరీపోయాడు. అంతకంటే ఇదేమీ పెద్దది కొత్తది అయివుండదు కదా!…”

“లేదు సీతా ఇది పాతది కాదు. నిన్నూ-నన్నూ - మనకుటుంబమంతటినీ కుంగదీసే మాట, తలెత్తుకుని తిరగనీయబోని అభాండం, ఎవరితోనూ పంచుకోలేని, కనీసం చెప్పుకోలేని లజ్జాకరమైన విషయం.” పిడికిళ్ళు బిగించలేకా, వూరుకోనూ లేకా, ముఖాన్ని రెండుచేతుల్లోకి తీసుకుని, పిసుక్కుని-పిసుక్కుని, ఏడ్వలేకా, అణచుకోలేకా, చివరకు ఒక్క పెట్టున బోరున రోదించసాగాడు పఠాభి.

మళ్ళీ నిశ్శబ్ధం. సీతమ్మా, సుధా - ‘విషయం ఏమై వుంటుందా’ అని, పఠాభి ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూ వుండిపోయారు.
లేచి బయటకు నడిచాడు పఠాభి.

‘ఎక్కడికండి?” - భయం అధికమౌతుండగా అడిగింది సీతమ్మ.

“చావటానికైనా లేదు కదా!- తండ్రిని గనుక ఆపని చేయలేను” అన్నాడు పఠాభి. అందులో కసి వుందా అంటే వుండవచ్చు. బాధ, అసహ్యం, అసహనం, వుండవచ్చు. ఇవేవీ లేకపోవచ్చు కూడా. నిర్లిప్తత కాని ఉద్రేకం, ఉద్రేకమని స్పష్టంగా తోచని ఒక తెగింపు. మళ్ళీ కూతురు ముఖం చూసే ధైర్యం లేని ఒక అసహాయత అవమానం తాలూకు ఒక విధమైన జాలి… అన్నీ వుండవచ్చు.

సుధ ఇంట్లోనే వుండి పోయింది తన గదికి తాను పరిమితమౌతూ అపరిమితంగా కుమిలిపోతూ ఏకకాలంలో, తన అత్తవారింటిని ఎవరైనా తగులబెడితే బాగుండునని, తన తండ్రిని ఏ గంధర్వుడో వచ్చి కాపాడితే బాగుండుననీ అనిపించిందామెకు. ఉన్నపళంగా మృత్యుదేవత వచ్చి తన నుదుటిని ముద్దాడి మెత్తగా లాలించి తనని స్వర్గానికి కాకపోయినా నరకానికైనా సరే, కొనిపోతే బాగుండుననిపించింది. ఇక్కడి నరకం కన్న పరలోకం అనబడే నరకం అంత నరకంగా ఏమీ వుండకపోవచ్చునని కూడ ఆ క్షణంలో ఆమెకు అనిపించింది. అప్పుడే నిద్రలోంచి లేచి, గుక్కపట్టి ఏడుస్తున్న తన రెండవ పాప హర్ష-తిరిగి తననీ లోకంలోకి పడద్రోసినట్లుగా ఆమె తేరుకుంది- తేరుకోవడమేమిటి? తిరిగి దుఃఖంలోకి, యమయాతనల్లోకి కూరుకుపోయింది!
తమ గదిలో గుస-గుసగా మాట్లాడుకున్నారు సీతమ్మా- పఠాభి కొన్ని నిమిషాలు. ఏమి చేయాలో తోచడం లేదు వారికి. ఒక పెద్ద గండంగానూ, తమ పరిస్థితి ప్రస్తుతానికి ఒక అగ్నిగుండమే అన్నట్టుగానూ వుంది - వారికి.

“పోలీసులకు చెప్తే యింకేమైనా వుందా!” విచారిస్తాం మీ అమ్మాయిని స్టేషనుకి పంపించండంటూ ఇంటికి వస్తారు. వీధికి వున్న కళ్ళు చాలక ఒక్కొక్కరికీ వెయ్యేసి కొత్త కళ్ళ చొప్పున ఊరంతా కళ్ళ పర్యంతమై చూపుల గాయాలు చేసి రక్కి చంపుతుంది. లక్షల నోళ్ళుగా తెరచుకొని, గూబలు పగిలిపోతుంటే దిక్కులు పిక్కటిల్లేట్టుగా కాకపోయినా, అనునయిస్తూనే అన్నట్టుగా, సానుభూతిని కూడ ప్రకటిస్తూ వున్నట్టుగా - ప్రశ్నల వర్షం కురిపించి, పిడుగు పాటుకు గురిచేసినంత పనిచేసి విడుస్తుంది. ఎన్నికళ్ళకు - ఎన్నెన్ని నోళ్ళకు, ఎంతటెంతటి ఎకసెక్కలకు జవాబివ్వాలి! ఎందుకు తనూ, తన భార్యా, తన కూతురూ - చేయని నేరానికి దోషుల్లా నిలబడాలి? ఎంతకని ఓపిక వహించాలి? ఎందుకని మంద్రస్వరంతో బలహీనంగా మాట్లాడాలి? ఎవరేమన్నా, దెప్పి పొడిచినా, అంతా తమ తప్పేనంటూ, తమ కూతురే దోషురాలన్నట్టుగా ప్రవర్తిస్తూ - సర్వం తెలిసినట్టుగా, ప్రత్యక్ష సాక్షులైనట్టుగా మాట్లాడే వారి ముందు, కలగ జేసుకుని మరీ వ్యవహారాన్ని మరింత వ్యయం చేయజూస్తున్న వారి ముందు తలదించుకొనవలసి రావాలెందుకు? అనుకోసాగారు పఠాభి దంపతులు.

“పోలీసులకు కంప్లెయింట్‌ చేశానన్నాడా- చేయబోతున్నానన్నాడా?” కన్‌ఫర్మ్‌ చేసుకోవడం కోసం అడిగింది సీతమ్మ.
‘చేశానన్నట్టే చెప్పాడు’-పఠాభి జవాబు.

“ఇట్లా ఎన్నిసార్లు బెదిరించలేదూ?”-సీతమ్మ ప్రశ్న.
“ఈసారి నిజంగానే చేశానని, పోలీసుల రాకకోసం ఎదురుచూస్తూ వుండండంటూ ఫోను పెట్టేశాడు” అన్నాడు పఠాభి.

భయం, అసహ్యం, అసహాయత, ఆక్రోశం అన్నింటికీ గుర్తుగా రెండు మూడు కన్నీటి బిందువులు రాలిపడ్డాయి సీతమ్మ కళ్ళనుండి. కుప్పగూలినంత పనైందామెకు. ‘పరమేశ్వరా’ అనే పదం కూడా ఆమె నోటి వెంట రాలింది.

“నాన్నా - ఆయనేదో ఉపద్రవం కొత్తగా తెచ్చిపెట్టవచ్చు. కానీయండి. కానున్నది కాకమానదు. నేనింకా మునుపటి లాగా భయాన్ని భరిస్తూ, అతడిని సహిస్తూ, ఒంటిమీద ఎప్పటికప్పుడొక సరికొత్త నరకాన్ని అంటించుకుని తిరగలేను. నేనిప్పుడు దేనికైనా సిద్ధపడివచ్చాను. మీరు కూడా అలాగే సిద్ధంకండి” ఆవేశంగా అన్నది సుధ!

“ఎట్లా సిద్ధం కాగలమమ్మా? ఏమని చెప్పాలి నీకు?” మనిషి ముక్కలై పోతున్నట్టుగా, గాలితో మాట్లాడుతున్నట్టుగా అన్నాడు పఠాభి.

“విడాకులు అనే కదా నాన్నా అని వుంటాడు- నేను కోరుకున్నది అదే కదా! ఇప్పటిదాకా అది నెరవేరలేదు. ఇప్పుడు వాళ్ళే కోరుతున్నారు. నేనందుకు సిద్ధమే”- తెగేసి చెప్పింది సుధ.

“విడాకులు తనుకాదు మనమే కోరుతున్నామనీ, తాము కలసివుందా మన్నందుకే నీవు హత్యాప్రయత్నం చేశావని, అతడు తప్పించుకోగా, పారిపోయివచ్చావని కంప్లెయింటిచ్చాడటమ్మా పోలీసులకు”- గాద్గదికంగా అన్నాడు పఠాభి.

“అబద్ధం ఆ పనిచేసింది అతడు”. చావును తప్పించుకొని వచ్చింది నేను. ఈ విషయం పక్కవారిని అడిగితే అక్కడికక్కడే తేలిపోతుంది” డిఫెన్సులో పడినట్టుగా చెప్పింది సుధ.

“తేలిపోతుంది! ఎంత బాగా నమ్ముతున్నావమ్మా! మనమూ మనమూ విచారించబోతే ఎవరైనా ముందుకొచ్చి విషయం మాట్లాడవచ్చు. చొరవ చేసుకుని అతడిని మందలించనూ వచ్చు. పోలీసులదాకా వెళ్ళిందంటే ఎవరు ముందు కొస్తారమ్మా - నీ అమాయకత్వం గాని! చూసినా, విన్నా- ఏమీ చూడనట్టు, ఏదీ విననట్టు వుండిపోవడం కన్న వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? మనకోసం స్టేషను మెట్లెక్కుతారా? సాక్షి సంతకాలు చేస్తారా? బెదిరింపులకో - ప్రలోభాలకో ప్రయత్నించకుండా వుంటారా మోసం, దగా చేయబూనినవాళ్ళు? ఇవన్నీ తట్టుకోవడానికి ఎవళ్ళు మాత్రం సంసిద్ధులౌతారు? వాళ్ళకు మాత్రం వాళ్ళ సంసారాలూ - బాగోగులూ వుండవా? వాళ్ళను మాత్రం ఇబ్బంది పెట్టే హక్కు ఏమైనా వుందా మనకు? ఏం చేయగలం తల్లీ” - జాలిగా బిడ్డ తల నిమురుతూ అడిగాడు పఠాభి.

సుధ అప్పటిదాకా గుండె దిటవు కలదానిగా నిలబడింది కాస్తా, టపటపా కన్నీరు కారుస్తూ, ఇద్దరు బిడ్డల వంక దీనంగా చూస్తుండి పోయింది. వర్ష- తల్లి కన్నీరు తుడిచే ప్రయత్నం చేస్తుంటే, హర్ష-కేరింతలు కొడుతూ తన తల్లితో ఏదో ముచ్చట్లాడబోతున్నది. అసలు విషయం తల్లి ద్వారా చూచాయగా తెలుసుకుంది సుధ.

తాను వున్నదానికన్న ఎక్కువ ఇంట్రోవర్ట్‌గా అగుపిస్తాడు నిరంజన్‌. పి.ఎస్‌.సి. పరీక్ష రాశానని, రేపో మాపో ఫలితాలు వెల్లడవడం, ఇంటర్వ్యూలు జరిగి జూనియర్‌ లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరడమే తరువాయి అంటూ వివాహమాడాడు సుధను.

పెళ్ళిచూపులప్పుడు కట్నం వద్దని, బాహ్య సౌందర్యంకన్న ఆంతరిక అందమే తనకిష్టమని అందరి హృదయాలనూ చూరగొన్నాడు. ఎంతో కలివిడిగా అందరితో మాట్లాడి, హుందాగా వ్యవహరించాడు. పెళ్ళి అయింతరువాత ఒకటికి రెండుసార్లు, ఇంకా అనేక పర్యాయాలు - ఎప్పుడు వచ్చి వెళ్ళినా ఆనందంగా వుంటూ, అందరినీ ఆనంద పరుస్తూ వచ్చాడు.

పి.ఎస్‌.సి. లో సెలెక్షన్‌ వస్తుందని, లక్షరూపాయలు కావాలంటూ వచ్చి కూర్చున్నాడొకనాడు ఆకస్మికంగా. పఠాభికి పెళ్ళిచేయగల స్తోమత తప్ప కట్నకానుకలు ఇచ్చే తాహతు లేదని తెలుసు. ఆమాట అతడు వివాహానికి ముందే స్పష్టంగా చెప్పియున్నాడు. అయినా, అల్లుడు అనవసరంగా అడగలేదుకదా, ఉద్యోగం కోసమే కదాని, తన పి.ఎఫ్‌. లోంచి పార్ట్‌ఫైనల్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే యాభై ఐదు వేలు చేతికందాయి. అందులోంచి ఐదువేలు తన అవసరాలకోసం అట్టిపెట్టుకొని యాభై వేలు అల్లుడికి అందజేశాడు. “అంతా ఏర్పాటైతే బాగుండును” అన్నాడు నిరంజన్‌. ఎటువంటి మొహమాటమూ లేకుండా. చివుక్కుమన్నది పఠాభి మనస్సు. అయినా తమాయించుకుని, “అదికాదల్లుడూ, నా వల్ల అయ్యింది అంతే. అంతా ఇచ్చేశాను” - అని ప్రాధేయపూర్వకంగా చెప్పాడు. “అబద్ధమెందుకూ? ఐదువేలు అట్టిపెట్టుకున్నారటకదా!” నిలదీస్తున్నట్టుగా అన్నాడు నిరంజన్‌. అసహ్యంగా అనిపించింది పఠాభికి.

“సీతా - ఆ ఐదువేలు కూడా తెచ్చి అల్లుడుగారికివ్వు” అన్నాడు పఠాభి - ఏదో నేరస్తుడు నేరాన్ని అంగీకరిస్తూ, పోలీసుల ముందు వికారంగా నిలబడ్డట్టు.

‘వద్దు-వద్దు, ఆ ఐదువేలతో నా పని అవుతుందా? ఇంకా యాభైవేలకోసం నేనే ఎవడికాళ్ళో పట్టుకోవాలి తప్పదు అంటూ లేచి వెళ్ళాడు నిరంజన్‌. జరిగిందానికి పశ్చాత్తాప పడుతున్నట్టుగా వుండిపోయాడు పఠాభీ, సీతమ్మా.

* * *

“ఇట్లా ఎన్ని కాలేజీలని మారుస్తారో అల్లుడుగారూ- ఈ సంవత్సరంలోనే ఇది రెండవది. గత సంవత్సరం ఒక కాలేజీ. అంతకుముందొక రెండు కాలేజీలు. ఆ స్రవంతి కాలేజీలో తీసుకున్న అడ్వాన్సు ముప్పయివేలు తీరనేలేదు. ఇప్పుడు కాలేజీ కూడా మారుస్తానంటే ఇదో ఇరవై వేలూ, తీర్చేస్తోమత లేకుండా అప్పులు చేసుకుంటూ పోతే ఎట్లా?” కొంచెం అనునయంగా, బాధగా - అయిష్టంగా, అర్థింపుగా నన్నట్లు అడిగాడు పఠాభి.

“గమనిస్తున్నానండీ - మూడేళ్లకే నేను మురికి అల్లుడినై పోయాను. వద్దంటే ఇద్దరు ఆడపిల్లల్ని మీ బిడ్డ కన్నది కదూ - అందుకూ లోకువూ పోయాను. నేను ప్రభుత్వ కాలేజీ ఉద్యోగం సంపాదించలేకపోయాననే కదా ఈ చులకన భావం. దీనికి కారణం ఎవరంటారు? లక్ష రూపాయలివ్వమంటే మూల్గుతూ-ముక్కుతూ యాభైవేలిచ్చారు. అవతలివాడది నా మొహాన్నే విసిరి కొట్టాడు. అయితే, ఆడబ్బేదో అట్లాగే వుండి - పిల్లల్ని పొదుగుతూ వుంటుందనుకున్నారా? మాట్లాడితే డబ్బిచ్చానో - డబ్బిచ్చానో అని గుర్తుచేస్తుంటారు, నాకోసం - నా వాళ్ళకోసం కాకపోయినా, మీ కూతురుకోసం, మీ మనవరాళ్ళ కోసం ఒళ్ళంతా గొంతు చేసుకుని, అరిచి-అరిచి పాఠాలు చెప్పుకొస్తున్నాను. ప్రైవేటు కాలేజీల్లో. ఏవో రెండో- కాకపోతే మూడో క్లాసులు ఆరవ్వచ్చు రోజుకి - నాలుగో, ఐదో, ఆరంటే నా వల్లకాదు. నేనేం మీలాగా ఎస్టీటిని కాదు నోరెత్తకుండా పనిచేసుకుంటూ పోవడానికి. కాన్పులు చేయించాను. పురుళ్ళుపోయించాను. రక్తం ధార పోశాను. అందుకు ఇంతయింది. ఇందుకు అంతయిందంటారు. నాకేం కట్న కానుకలిచ్చారా? తులాభారం చేశారా? లోకంలో ఎవరూ ఏ అల్లుడికీ, కూతురికీ చేయంది చేస్తున్నారా? అడ్వాన్సుగా తీసుకున్నది కూడా అప్పే!” గట్టి - గట్టిగా అరిచాడు నిరంజన్‌.

“కొంచెం నిదానంగా మాట్లాడండల్లుడు గారూ, అడ్వాన్సయింది, అప్పయింది తేడా లేకుండా పోయేది తీర్చినప్పుడు కదా! మేం కట్నమిచ్చినట్టుగాని, ఆర్థికంగా తూగినట్టు గానీ ఎప్పుడైనా ఎవరితోనైనా అన్నామా?” సంజాయిషి చెప్పుకుంటున్నట్టుగా అన్నాడు పఠాభి.

“మీరుండండి. ఏమయ్యా - మేమేమీ చేయలేదా? ఏమీ అదనంగా ఇవ్వలేదా? యశోదా ఆస్పత్రిలో మీ అమ్మగారు చేరినప్పుడు అయిన ఇరవై నాలుగు వేల బిల్లు మీ మావయ్య కాదా కట్టింది? నిన్నగాక మొన్న మీ నాన్నాగారికి అపోలోలో చేయించిన వైద్యానికి అయిన పదిహేనువేలు ఎక్కడినుంచొచ్చాయి? నా చేతిగాజులూ, బంగారు గొలుసు ఎవరికి అర్పించామయ్యా?”- అవేశంగా, ఎన్నడూ లేనంతటి ఉచ్ఛస్వరంతో, సజల నేత్ర అయి అన్నది సీతమ్మ.

“సీతా నువ్వూరుకో. అల్లుడుగారి మనస్సులో వుండేదేదో అననీ. అయ్యా! పురుళ్ళు పోయించటం మా బాధ్యతే. బట్టలూ, బంగారం కొని పెట్టడం మావంతే. అదేదో ఆవేశంగా, బాధకొద్దీ అన్నమాటలను పట్టించుకోకు. మేం అదనంగా చేసిందేమీ లేకపోగా మీకొక దమ్మిడీ అయినా ఇచ్చిన వాళ్ళం కాము. పొరబాటున స్వతంత్రించి ఏదో చెప్పబోయాను. ఏమీ అనుకోకు నాయనా” అని పఠాభి అంటుండగానే కలుగజేసుకుని-

“స్వతంత్రం కాదు అలుసు. నేనంటే ఆలుసు మీకు. ఇదే చెప్తున్నాను. ఏ కాలేజీలోనూ నేను నా ప్రమేయంతో చేరలేదు. నాకు బయట పదివేలిస్తామంటున్నా, ఐదేసి వేలకు మీరే కుదిర్చారు. అడ్వాన్సులూ - రాద్దాంతాలూ నాకు తెలియవు. అవేవో, మీరు చూసుకోండి - మానండి, నాకనవసరం. ఈసారి ఎవరి ప్రమేయమూ లేకుండా ముఖ్యంగా మీ ప్రమేయం అస్సలు లేకుండా, నాకుగా నేను ఒక కాలేజీలో వెదుక్కుంటున్నాను. నాకు మీ కూతురూ వద్దు, మీ వ్యవహారమూ వద్దు. మీ సంబంధానికో నమస్కారం. ఇంతటితో మీ బాగోతం కట్టిపెట్టండి” అంటూ విసురుగా వెళ్ళిపోయాడు నిరంజన్‌.

చూపులకు నిరంజన్‌ చాలహుందాగా, అందంగా వుంటాడు. ఎవరితోనైనా తాపీగా మాట్లాడతాడు. అతనిలోని ఒక విధ్వంసుకుడు భూతద్దంలో కాదు గదా ఎక్స్‌రేలతో కూడ బయటపడడు. వివాహమైన రెండు మూడు నెలల నుండే అతనిలోని విధ్వంసకుడు కళ్ళు తెరిచాడు. కాళ్ళూ-చేతులూ-అన్నింటికీ పనిచెప్పాడు.

సుధ బక్కపల్చగా, నాజూకుగా, చలాకీగా, అందంగా, ప్రసన్నంగా వుంటుంది. ఆమె నవ్వు, అందమైన పలువరస - ఆమె అందాన్ని మరింత పెంచేట్టుగా వుంటాయి. అందంతోపాటు తెలివైన సుధకు చదువన్నా, ఏదైనా ఉద్యోగరంగంలోకి ప్రవేశించాలన్నా ఇష్టం. గోషాలో పెట్టడమనేది ఒకటీ తక్కువగాని సుధ ఎవరి ఎదుటపడ్డా. ఆఖరుకు ఆమె కన్నతండ్రితో చనువుగా వున్నా సహించేవాడు కాదు నిరంజన్‌. అటువంటప్పుడు ఆమెను ఉద్యోగం కోసం బయటకు పంపుతాడా? ససేమిరా అన్నాడు. ఏవో ఉద్యోగాలకోసమని ఎన్నెన్నో దరఖాస్తులు చేసిందామె. కొన్నింటికి రెస్పాన్స్‌ వచ్చింది. చిన్నవీ, చితకవీ అయినా సరే, ఉద్యోగాలన్న తరువాత చన్నీళ్ళకు వేన్నీళ్ళు తోడన్నట్టుగా, ఆర్థికంగా సహాయకారి కాగలదని ఎంత చెప్పినా నిరంజన్‌ వినిపించుకోలేదు. ఎంతో సఫకేషన్‌కి గురైంది సుధ. మానసికంగా చితికిపోయింది కొంతకాలం. ఇక వాటి జోలికి పోవడం మానేసింది.

ఇంట్లో సుధకు ప్రత్యక్ష నరకాన్ని చవి చూపిస్తుంటే నిరంజన్‌ని అతని తల్లిదండ్రులే వారింప జూశారు. కాని ఫలితం లేకపోయింది. తండ్రి పెంపకంలో కొంత స్వేచ్ఛగా పెరిగిన సుధకు పుస్తకాలంటే ఇష్టం. వాటికీ దూరం చేశాడు నిరంజన్‌. ఒంటరిగా కూర్చుని నిర్వ్యాపారంగా ఉండటమిష్టం నిరంజన్‌కి. పుస్తకాల్ని ఆమె చేతుల్లోంచి లాక్కుని విసిరికొట్టేవాడు. అదేమంటే తనమీద మోజు తీరిందని, తనను అవాయిడ్‌ చేయజూస్తుందని కొత్త నిందలు వేయబూనేవాడు. సుధకు వ్రాయడంలో కూడ కొంత ప్రవేశం వుంది. “ఎవడికోసమే ఈ రచనలు?” ఎవడిమీదనే నీ విరహం?” అంటూ గుడ్లురిమి, కనీసం ఆమె వ్రాసిందేదో చూడనైనా చూడకుండా చించేసేవాడు. ఒకనాడేదో తాపత్రయం కొద్ది తాను వ్రాసుకున్న వాక్యాలు తాత్వికంగానూ, కొంచెం లోతుగానూ వున్నాయనిపించి, భర్త చించేసిన కాయితాలను ఒకచోట చేర్చి, తిరిగి వాటిని అతికించి చదువుకోబోతుంటే గమనించిన నిరంజన్‌- పైశాచికంగా ప్రవర్తించి, చిరుగుకొకటి చొప్పున ఆమె శరీరాన్ని కొవ్వొత్తితో కాల్చాడు. బాధ భరించలేక నోట్లో గుడ్డలు కుక్కుకుని ఏడ్చింది సుధ. కాలిన గాయాలు మానేదాకా తన పుట్టింటికి వెళ్ళిపోయింది.

జరిగిందంతా తెలుసుకున్న తల్లిదండ్రులు కుమిలి - కుమిలి రోదించారు. సుధ జీవితాన్ని ఆమె నిర్ణయానికి వదిలేయటానికి అంగీకరించారు. విడాకులు కోరింది సుధ. ఏమీ చెప్పలేదు నిరంజన్‌. అవుననీ కాదనీ చెప్పక నాన్చుతూ వచ్చాడు. వారం, నెల, ఆరునెలలు గడిచాయి. ఉన్న ఉద్యోగం పోయి చివిరి గడ్డంతో వికారంగా, ఫకీరులాగా మారి వచ్చాడు. మళ్ళీ మొదటికొచ్చింది వ్యవహారం. ఏడ్పులూ - తీర్పులూ అయ్యాయి. బుద్ధొచ్చిందన్నాడు. ఎవ్వరూ నమ్మలేదు. నమ్మలేదన్న విషయం అతనికీ తెలుసును. కాని సుధకు తప్పింది కాదు. మనసూ, ఆత్మా అనేవాటినన్నింటిని చంపుకుని వెళ్ళింది. సంసార సాగరంలోకి - దుఃఖపు ఊబిలోకి - ఒక అలలాగ - ఒక పీడకల లాగ - రెక్కల్దెగిన పక్షిలాగ - గాయపడిన కూన లాగ - సుధ!

చిన్నపాటి పట్టు చిక్కింది గనుక ఇక విజృంభించాడు నిరంజన్‌. మెత్తగా అగుపిస్తూనే కన్పించని కత్తితో నిత్యం ఒక కొత్త విధంగా, ఏదోవొక నెపంతో కోస్తూ- వస్తున్నట్టుగా - విసిగిస్తూ - రాచి రంపాన పెడుతూ వచ్చాడు. ఉన్నట్టుండి ఉద్యోగం మానేశాడు. ఉన్నఫళంగా స్థలం మారుద్దామనేవాడు. ఆరునెలలకోచోటు మార్చి మార్చి విసిగించాడు. ఈ కాలేజీ బాగోలేదంటే- ఆ కాలేజీ సరిపడదని, చేజారిపోయిన ఉద్యోగానికల్లా పఠాభిదే కారణమంటూ వచ్చాడు.

ఈలోగా పఠాభి ఉద్యోగ విరమణ కూడా చేశాడు. ఆదాయం సగమైంది కాని అవస్థలు రెట్టింపయ్యాయి. ఒక్కగానొక్క కూతురనుకుంటే జీవితానికి సరిపడా నరకయాతనే మిగిలింది. ప్రభుత్వ చాకిరీ చేసి - చేసి వెన్నుపూస విరిగినంత పనైంది. అల్లుడి దయవల్ల పిడికెడు గుండె కాస్తా చిల్లు - చిల్లు అయ్యింది. కూతురు స్థితి చూస్తుంటే కడుపు తరుక్కుపోతావుంది. భార్య ముఖం చూస్తే మనస్సు ఉసూరుమంటా వుంది. వివాహ వ్యవస్తమీదా, సమాజంలో కొనసాగుతున్న అక్రమ తీరుమీదా రోత కలుగుతూ వుంది. అటువంటి స్థితిలో కూతురు ఆకస్మికంగా ఒకనాడు ఇంటికి రావడం, మరునాడు ఫోనురావడం - కలరావ్యాధి - చికున్‌ గున్యా, డెంగ్యూలు తగ్గకుండానే టైఫాయిడ్‌ మీద టైఫాయిడ్‌ మొదలైనట్టుగా పరిస్థితి దాపురించినట్లయింది. భయంకరమైన దిగులు ఎన్నడూ లేనంతగా ప్రారంభమైంది.

ఇదంతా గ్రహించిన సుధ - తండ్రి తెలియజేయలేని, తెలియజేయాలంటే నోరు రాని విషయాన్ని తన తల్లి ద్వారా తెలుసుకున్నది గనుక ఒక నిర్ణయానికి వచ్చింది. దుఃఖించి, శుష్కించి పోవడం వల్ల ప్రయోజనం లేదని, కన్నీళ్ళు కడిగేసుకుని ఇక బయలుదేరింది.
“అదేమిటమ్మా - ఎక్కడికీ ప్రయాణం?” - పఠాభీ, సీతమ్మా ఒక్కసారే అడిగారు సుధను.

“అత్తవారింటికి” - చాల కాన్ఫిడెంటుగా జవాబిచ్చింది సుధ.
“ఈ స్థితిలోనా? అందునా ఈ ఫోను వ్యవహారం”- అంటూ చెప్పలేకా, దాచలేకా సతమతమయ్యాడు పఠాభి.

“నాన్నా - అసలేం జరిగిందో, ఆయనేం మాట్లాడిందీ నాకు తెలియదు. తెలుసుకోవాలని కూడ నాకిప్పుడు లేదు. నా కాపురాన్ని నేను చక్కబెట్టుకోగలదో లేదో గాని, నాకుగా నేను నిలబడగలననే ధైర్యంవచ్చింది. అదిచాలు. నాకింక ఎటువంటి బెరుకూ లేదు. మీరేం బాధ పడకండి. భయం అంతకన్నా పెట్టుకోకండి. త్వరపడి నేను ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడను. నావెంట సైతం ఎవ్వరూ రాకండి. నేను ఒక్కదాన్నే ఈ వ్యవహారం తేల్చుకోదలచుకొన్నాను” అంటూ బిడ్డలనిద్దరినీ వెంటబెట్టుకుని బయలుదేరింది. కుడిచేతిలో ఒక చేసంచి, ఎడమ చేతిలో పెద్దమ్మాయి వర్షను పట్టుకుని, చిన్నపాప హర్షను చంకనెత్తుకొని, ఆమె అలాగుండె నిబ్బరంతో వెళ్ళుతుంటే, ఏమీ తోచక, అడ్డగించి ఆమెను ఆపనూ లేక చూస్తూ వుండిపోయారు. సీతమ్మా, పఠాభి.

* * *

“ఏం ఎందుకొచ్చినట్టు? ఎవడికోసమైతే వెదుక్కుంటూ వెళ్ళిపోయావో వాడి దర్శనం కాలేదా? అయినా, ఆశ్రయం ఇవ్వను పొమ్మని తన్ని తరిమేశాడా? అలా దిక్కు లేక పాతమొగుడే దిక్కని, సిగ్గూ లజ్జా లేక తిరిగి వచ్చావా?” రెచ్చగొడుతున్నట్టుగా అరిచాడు నిరంజన్‌.

మౌనంగా ఇంట్లోకి నడిచింది సుధ. అత్తగారు చేసంచిని తీసుకుని వర్షను అక్కున చేర్చుకుంటే, మావయ్య ఒళ్ళోకెళ్ళి వాలింది హర్ష. అలా అదే పనిగా అరుస్తూనే వుండిపోయాడు నిరంజన్‌. చేతికి ఏ వస్తువు అందితే అది నోటుబుక్కూ-పెన్నూ-పెన్సిలూ-కంపాస్‌ బాక్సు - టీ కప్పు - ఏవి తోస్తే దాన్ని తీసుకుని నేలకేసి కొడుతూ, విసిరేస్తూ, చిందులు తొక్కసాగాడు. ఏమీ జరగనట్టు, అసలింక తనకేదీ పట్టదన్నట్టు, లోపలికెళ్ళి తన పనేదో తను చేసుకుంటూ పోయింది సుధ. ‘నాన్నా’ అంటూ పిల్లలు సమీపిస్తే, కసిరి కొట్టాడు నిరంజన్‌.
“పిల్లలేమన్నారు?” అడిగారు తల్లిదండ్రులు.

“మీరు మాట్లాడకండి. మీరంతా వొకటే. ఆ పిల్లలంటే నాకసహ్యం. నాకిప్పుడు ఆడజాతంటేనే అసహ్యం కలుగుతున్నది” కేకలేస్తున్నట్టుగా అన్నాడు నిరంజన్‌.
“వీడి ఖర్మ” అన్నట్టుగా పసిపిల్లలను తీసుకుని పక్కకు తొలగి పోయారు తల్లిదండ్రులు.

పగలు కాస్తా సాయంత్రంలోకీ, సాయంత్రమేమో రాత్రిలోకీ జారుకున్నాయి. అంతసేపూ మౌనం. కాకుంటే ప్రేలాపన లాగా నిరంజన్‌ అరుపులు. మధ్య మధ్య ఆటలాడుకుంటూ అల్లరల్లరిగా తిరుగాడుతున్న పిల్లలమీద కసురుకోవడం. ఆ స్థితిని వింతగా గమినించి పిల్లలు దూరం తొలగిపోవడంతో సరిపోయింది.

“నా గదిలోకి రావద్దు” అంటుండగానే విసురుగా, బలంగా తలుపులు తీసుకుంటూ లోపలికి ప్రవేశించి పక్కలు పరిచింది సుధ.

అంతటి బలాన్ని, తెగువను తొలిసారి అనుభవ పూర్వకంగా తెలుసుకున్నానిపించింది నిరంజన్‌కి. నివ్వెరపోయాడు, కాని, ఆ ఫీిలింగుని వ్యక్తం చేయకుండా దాచుకునే విఫలయత్నం చేశాడు.

“ఎవడబ్బ సొమ్మో ఇక్కడ దాచినట్టు పీకలదాకా నొక్కొచ్చింది. కనీసం తినమనైనా అనలేదు. బరితెగించింది కదా” అన్నాడు సుధ నుద్దేశించి నిరంజన్‌.
ఆమె రోశపడలేదు.

చిరాకూ, అవమానం, కసితీరా ఆమెను కొట్టి చంపేస్తే బాగుండునన్న భావాలు కలిగినై నిరంజన్‌కి. కాని సాహసించలేదు.
లైట్లార్పేసింది సుధ.
తిరిగి వెలిగించాడు నిరంజన్‌.

మళ్ళీ ఆర్పేసే ముందు ఒక చూసు చూసింది సుధ-నిరంజన్‌ వైపు. ఏదో శక్తి ఆవహించినట్టుగా వుంది. కళ్ళు నిప్పుకణికల్లా ఎర్రబడి వున్నాయి. సూటిగా ఆమెకళ్లలోకి కాదు - కనీసం ఆమె ముఖం వైపు కూడా చూడలేకపోయాడు నిరంజన్‌. “మళ్ళీ లైట్లు వెలిగించావో…” అన్నట్టుగా ఆర్పేసింది. ఇక సాహసించలేకపోయాడు నిరంజన్‌.

ఇరువురూ నడుం వాల్చారు కాని ఎవ్వరూ నిద్రకు ఉపక్రమించలేదు. రెండు అగ్ని గుండాలుగా మండుతున్నారు లోలోపలే. కళ్ళు మూసుకునే ఎవరికివారు ఆవేశంతో వేగిపోతున్నారు. గది కూడా వేడెక్కినట్టుగా ఉక్కబోసి దిక్కుతోచక హైరాన పడుతున్నట్టుగా ఉంది. తన చుట్టూ వేడినే తిప్పుకుంటూ ఫాను సొమ్మసిల్లి పోతున్నట్టుగా వుంది. కాలం ఆగిపోయినట్టుగా కూడ వుంది. మౌనం మాత్రమే చోటుచేసుకుని పదిలంగా పరుచుకున్నట్టుగా వుంది.

గంట గడిచింది. రెండు గంటలు గడిచినవి. మూడుగంటలు…. సుధలేచి నిరంజన్‌ ఫ్యాంటును విప్పదీయడం ప్రారంభించింది. అతడు ముడుచుకుపోసాగాడు. బలంగా లాగేసింది.

‘ఏమిటిది లజ్జలేకుండా?’అని గద్దించబోయాడు. అండర్‌వేర్‌ని కూడ లాగి పారేసింది. లేచి చెంప చెళుమనిపించబోయాడు. చెయ్యి పట్టుకుని విరిచేసినంత పనిచేసింది. ‘కుయ్యో మొర్రో’ అని మొత్తుకుంటుంటే, తాను లేచి, అంతకుముందే సిద్ధం చేసుకున్నకత్తిని తీసి, లైటువేసి, ఎడమచేతిని అతని తొడల మధ్యకు పోనిచ్చి.. పట్టుకుని, కత్తిని ముందుకు తెచ్చింది- కోసేసేందుకన్నట్టుగా.

‘హోహో’ అంటూ పెద్దపెట్టున అతగాడు అరవబోతుంటే మూతి పగిలేట్టుగా చాచికొట్టి - “ఏరా ఈ పనిచేస్తే హత్యాయత్నానికి పూనుకున్నానని కంప్లెయింటు ఇచ్చావు కదా..”

“లేదు-లేదు, నేను కంప్లెయింటు ఇవ్వలేదు. ఇచ్చానని అబద్ధం చెప్పినాను” వణికిపోతూ, ఏడుస్తూ, చెమటలు కక్కుతూ, చేతులు జోడిస్తూ, మూతి పగిలిందేమోనని తడిమిచూసుకుంటూ, మొరపెట్టుకుంటున్నట్లుగా అన్నాడు నిరంజన్‌.

“ఏం ఫరవాలేదు. ఇప్పుడు చెయ్యరా పోలీసులకు ఫోను- నేను ఆపనే చేయబోతున్నాను” అంటూ, అంగీని కూడ విప్పదీయ సాగింది సుధ. నివారించే ధైర్యం చాలక, ఎక్కడ కత్తికి పనిచెప్తుందో నన్న భయంతో పిరికి-పిరికిగా, పిచ్చి-పిచ్చిగా, అతలా కుతలమైపోతూ, అంగీని తానే విప్పేసుకున్నాడు. అంతకుముందే బనియణ్‌లేదు.

“నాది తప్పే- నన్ను క్షమించు - నేనేమీ పోలీసులకు ఫోను చేయను. నిన్నింక హింసించను- నామానాన నన్నొదిలేయి. నీకు దండం పెడతాను. నీ జోలికి రాను. నీకాళ్ళు పట్టుకుంటా” నంటూ కాళ్ళవైపు సమీపించబోయాడు నిరంజన్‌. ఆమె దూరం తొలగుతూ ఒక మూలను చూపించి అక్కడ కూలబడమన్నట్టుగా సైగచేసింది. ఆ పనిచేయబోతూ ప్యాంటును చేతిలోకి తీసుకోబోయాడు.

“ఊఁ అదక్కడపెట్టు. అంతసీను లేదు నీకు. నీకిదే శాస్తి. తెల్లారేదాకా ఆ మూలనే పడి చావు. కదిల్తే నీ గతి అంతే” అంది మహోగ్రంగా.

లైటు ఆర్పేయబోయాడు నిరంజన్‌. తొలిసారి ఆరాత్రి అతనికి తన భార్యే ఒక పరాయి స్త్రీగా - ఒక మృత్యుదేవతగా, భయంకరంగా అగుపించింది. సిగ్గూ-బిడియం ఒక్కసారిగా అనిపించసాగాయి.

వెంటనే అతని ప్రయత్నాన్ని అడ్డగిస్తూ లైటు వెలిగించింది సుధ. “ఈ లైటు ఇట్లాగే వెలుగుతూ వుంటుంది తెల్లారేదాకా. నిద్రపోతావో-మేల్కొని చస్తావో నీ ఇష్టం. నేను మాత్రం నిద్రపోను” అంది సుధ.

“నేను కూడా నిద్రపోను. నా బుద్ధి తక్కువై ఇటువంటి అభాండం వేశాను. నా తప్పు కాయి” అంటూ చెంపలు చెళ్ళు చెళ్ళున వాయించుకోసాగాడు నిరంజన్‌.

“రేపటి నుంచి నా ప్రవర్తన మార్చుకుంటాను. నీకు అవమానం కలిగించే హాని కలిగించే ఏ పనీ చేయను. కాలేజీకి సరిగ్గా హాజరై అప్పుల పాలు కాకుండా చూసుకుంటాను. మీ తల్లిదండ్రులను నానా హింసలు పెట్టాను. అవన్నీ మనసులో పెట్టుకుని కత్తికి పనిచెప్పొద్దు. ప్రమాణం చేస్తున్నా”నంటూ మళ్ళీ రోదనం చేయసాగాడు.

ఆమె మాట్లాడలేదు. ఆమె మౌనం అతనికి మరింత వణుకు పుట్టించింది. తన వంటిని, తన దిగంబరత్వాన్ని - తన లజ్జాకరమైన పరిస్తితిని చూసుకుని తనకు తానే కుళ్ళిపోయినట్టుగా, కంపుగొడుతున్నట్టుగా భావించి, గతుక్కుమంటూ వుండిపోయాడు నిరంజన్‌.
తెల్లగా తెల్లారింది.

కాలేజీకి రెడీ అయిన వాడల్లా - యజమాని ముందు బానిసలాగా ఆమె అనుమతి కోసం అన్నట్టుగా చూస్తూ ఉండిపోయాడు నిరంజన్‌.
“పోయి చావు” అన్నట్టుగా చూసింది సుధ.
తోక ఆడించుకుంటున్నట్ట బయలుదేరాడు నిరంజన్‌.

పఠాభికి ఫోను చేసి - “నాన్నా రాత్రికి రాత్రే పోలీసు కేసు సెటిల్‌ చేసినాను. నిశ్చింతగా వుండండి. ఇక ఏ ఇబ్బందీ లేదు” అంటూ ఫోను పెట్టేసింది సుధ.

Trackback This Post | Subscribe to the comments through RSS Feed

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో