పోస్టులు అభిప్రాయాలు 10 March 2010

కథలు సోయి | 01 సెప్టెంబర్ 2007 04:44 pm

ఏకు - మేకు

-నల్ల భూమయ్య

మా ఊర్లె మేం సిన్నగున్నప్పటి సందే సిటీ మున్సిపాలిటి ఉండేటిది. మా వూర్లె కంపిన్ల ఆఫీసర్ల పోరగండ్లకోసం యింగ్లీషు మీడియం బడి, కంపినోని మనుసుల పొరగండ్ల కోసం హిందీ మీడియం బడి వుండేవి. మాది సర్కారు బడి, గిదీంట్ల తెలుగు, తురుకం మీడియంలు వుండేటియి.
ఏ గోంతమందో పల్లెల్లల్ల కెల్లి అచ్చే పోరగండ్లు తప్పిస్తె కడుమ అందరు గూడ నగురంల పుట్టి పెరిగి నోళ్ళు, ఏరే ఏరే ‘దేశాల’ నుంచి, ఎక్కడెక్కన్నుంచో అచ్చిన కంపిన్ల జీతగాళ్ళ పోరగండ్లు వుండెటోళ్ళు.

మావూర్లె సీన్మథేటర్లల్ల అన్ని బాసల సీన్మలు అస్తుండేటియి. ఇంగ్లీషు, హింది, తమిళం, మళయాళం, తెలుగు… గందుకని పోరగండ్లు ‘మా చాలు’ గాండ్లు! తీరు తీరు సోకులు. ఒక కిరస్తానపు పోరడు ఆని ‘బాలు’ (తలెంట్రికలు) సోకు, తీరు ఏరేనే, పల్లెటూరోళ్ళు తలెంట్రికలు ముందు సగానికి నున్నగ గుండు జేసుకోని, ఎనుక సగం కురుసగ ఎంట్రికలుంచుకోని, జుట్టు (పిలుక) పెట్టుకోని, గాజుట్టును ముడేసుకునెటోళ్ళు. గాళ్ళ ఎంట్రికల తీరు గట్లైతే, గీ పోరని ఎంట్రికల తీరు గవీటికి వుల్టా వుండేటిది. ముందు జూడ కనిపిచ్చుటానికి బాలుకు బుగ్గలు గా బుగ్గల మందం ముందు ఎంట్రికలు తప్ప యిగ కడుమ పుర్రె అంత గూడ నున్నగ గుండు. ముందు నుంచి జూసెటోళ్ళకు అందరి సదువుకునే పోరగండ్ల వారమే (వలెనే) ఆనికి గూడ బాలు వున్నదనుకుంటరు. గది ఆని సోకు! గసుంటి సోకులమారి పోరగండ్లు గప్పటి సందేవున్నరు మా వూర్లె.

సిన్న తరగతుల పోరగండ్లు నెక్కర్లు, అంగీలు తొడుక్కుంటె, పెద్ద తరగతులోల్లు పైంట్లు, బుస్కోట్లు,తొడుక్కునేది.

మా బళ్ళె, ‘కాశినాథ్‌’ సార్‌ హింది జెప్పెటోడు. గప్పుడు గూడ బళ్ళె సార్లకు ఎల్తే. అన్ని సబ్జెక్టులకు సగపడ సార్లు వుండెటోళ్ళుగాదు. గసుంటప్పుడు ‘కాశినాథ్‌’ సారుని హింది ‘మాస్టరు’ గ ఎందుకు పెట్టిండ్లంటే అయనకు హింది అక్షరాలు సదువుడు, రాసుడు మా బాగనే అస్తయి, తట్టుకునుడు గిట్ట ఏం లేకుంటనే. పుస్తకాన్ని గడ గడ మా జదువుతడు- గండ్ల వున్న దున్నట్టుగనే మా జెప్పుతడు. గని, గదీంట్ల వున్న గొట్టు, సెడగొట్టు పదాలకు అర్థం ఆయనకు గూడ సమజు అయ్యేటిది గాదు. గందుకని హింది గైడుల వున్నదున్నట్టుగ, సూసుకుంట బోర్డుమీది కెక్కిచ్చెటోడు, బోర్డుమీదున్న గదీన్ని మేముగూడ వున్నదున్నట్టుగనే కితాబులల్ల దించుకునెటోళ్ళం! గంతకు దప్ప గవీటి అర్థం మాకు దెలువది, సారుకు తెలువది.

గని, కాశినాథ్‌ సారు, పాపం, ఎప్పుడు గూడ, ఎవళ్ళని గూడ గింత కొట్టిండన్నది లేదు. గని, ఆయిన బతికున్నంతల, మేం జూసినంతల మట్టుకు ఒక యిద్దర్నంటె యిద్దర్నే, గది గూడ ఒక్కొక్కపారే కొట్టిండు. మా బడి మొత్తానికి గూడ, ఐదో తరుగతి మొదలు, పదకొండో తరుగతి దనుక హింది జెప్పగల మొనగాడు గా కాశినాథ్‌ సార్‌ ఒక్కడే. ఇంకేసారుకూ హింది రాదు. కాశినాథ్‌ సారుకు ఎవళ్ళకు లేని గొప్ప గుణమున్నది గిది ఒక్కటే గాదు. ఇంకొకటి గూడ వున్నది. మా వూర్లె బడి పుస్తకాలు అమ్మే దుకాణం ఒకటి వున్నదంటె, గా ఒక్కటి గూడ, గది కాశినాథ్‌ సారు దుకాణమే. ఏటేట, కొత్త పుస్తకాలు కాశినాథ్‌ సారు ఎప్పుడు తెప్పిస్తడో, ఎప్పుడు వొడగొడ్తడో ఎవ్వలకు తెలువది. ఎవ్వరికి దొరుకుతయో, ఎవ్వరికి దొరుకయో గూడ తెలువదాయె. గందుకని కాశినాథ్‌ సారు దుకాండ్లకు కొత్త తరగతుల పుస్తకాలు దిగినయని తెలువంగనే యిగలైను. ‘లవకుశ’ సీన్మకు గద సీన్మథేటరు టికెట్ల కాడ తొక్కులాట వారం. పోరగండ్లుగా పుస్తకాల్ని సదివిపోసినా, పొయ్యకపోయినా పుస్తకాలు మట్టుకైతే వుండా లెగద, మోసుటానికి - ఏడాదంత. పోరగండ్లంత, ఎదిగిన తరుగతుల కొత్తపుస్తకాల కోసం, దేవేంద్రుని వారం పెయ్యంత కండ్లు వెట్టుకోని ఎదురు సూస్తంటరు. రోజూ బడికి రాంగ, పోంగ గా దుకాణం ముందటి తొవ్వనే తొక్కుతాంటరు. పుస్తకాలు అచ్చినయా అని అర్సుకునేటానికి.

పోరగండ్లకున్న గీ ‘కమ్‌జోరు’ ను ఆపేసి జూసి, నాడిని దొరుక పట్టుకున్నదంటె గా ఒక్క ‘భాస్కరు’ గాడే! పోరగండ్ల గా ‘నాదాను’ తనాన్ని బగ్గ జదివి తెల్సుకున్నడంటే గా భాస్కరు ఒక్కడే. భాస్కరుగాడు వుండుటానికి నాల్గుపూట్ల ఎత్తే వుంటడు. (ఆని ఎత్తేగంత-నాటికీ, నేటికి గూడ) గని, ఆని తలుకాయ మట్టుకు రాసగుమ్మడి పండంత వుంటది. ఇగ గదీంట్ల మెదడు గూడ గంతంత కుదిచ్చి కుదిచ్చి వుంటదన్నట్లే గద! కాశినాథ్‌ సారు పుస్తకాలని తెప్పిచ్చుటానికన్న ముందుగాల్నే, భాస్కరుగాడు ఇరువై, ముప్ఫై మైళ్ళ పెట్టున వున్నపక్క కాలేర్లకు పొయ్యి, యిన్నన్ని పుస్తకాల్ని కొనుక్కోని వచ్చి మునాఫా మీద పోరగండ్లకు అమ్మెటోడు! గీ సంగతులు కాశినాథ్‌ సారుకు తెల్సినై. అంటే భాస్కరుగాడు తన మునాఫాలకు సిల్లి పడేస్తున్నడన్న మాటే గద! భాస్కరుగాడు సారుకు పెట్టిన గీ ఎసరుకు సారు కుత కుత వుడికిపొయ్యిండు. ‘భాస్కరుగా! సొంత లాభము బగ్గ జూసుక - ఎదుటివాడికి కీడు తలపెడ్తావోయ్‌! సరే! సరే! సూస్త గద నీ సంగతి! గురువుకు పంగనామాలు పెట్టుడంటే గిదేనారా, బిడ్డ! నువ్వు గురువుకే పాఠం జెప్పవడ్తివి గదరా, ‘ప్రొలాదుని’ వారం. సరే! నీ సంగతి మంచిగనే జెప్పుత…’ అనుకున్నడు మనసుల… తెల్లారంగ క్లాసులకు అస్తె అస్తెనే కాశినాథ్‌ సార్‌ “అరేయ్‌, భాస్కరుగా! నిన్న జెప్పిన పద్యాన్ని (హింది కవిత) పురాగ నోటికి జేసిన వారా? కవితని యిగ అప్పజెప్పు గిప్పుడు” అన్నడు!

భాస్కరుగాడు లేసి నిలబడి
“పద్యాన్నా సార్‌!… సెయ్యలేదు సార్‌… రాదు సార్‌…” అన్నడు.
“రాదా! పద్యం రాదా! రాదారా పద్యం?” సారు
“రాదు సార్‌!” భాస్కర్‌

“అర్రాం పొట్టే కాంకే… జెప్ప జెప్పన వురుక్కుంట బండెక్కి పక్క కాలేర్లకు పొయ్యి పుస్తకాలు కొనుక్కదెచ్చి మునాఫాల మీద పోరగండ్లకు అమ్ముడస్తదిగని, నిన్న జెప్పిన పద్యం గియ్యాల రాదారా!… ఇటు, నా దగ్గరికి రా బేట!” అన్నడు సార్‌.

భాస్కర్‌ బయపడుకుంట సార్‌ టేబుల్‌ దగ్గరికి పోంగనే, సారు భాస్కర్‌ను సెంపలమీద అరిచేతుల తోటి సర్సిండు అట్లు దేలెటట్టు! కొట్టి “సమజ్‌ లేవ్‌ బేటా! యింకెప్పుడన్న గిట్లని తెల్సిందా, యిగ గప్పుడు జూడు- వట్టి పద్యాలను కాదు గద, ‘పద్య్‌ ఔర్‌ గద్య్‌’ అన్నీటిని గలిపి పురాగ కితాబ్‌కు కితాబ్‌నే నోటికి అప్పజెప్పుమంట! తెల్సిందిగద!” అన్నడు సారు…
ఒగనాడు…

కాశినాథ్‌ సారు గంతకు ముందు ఎప్పుడు గూడ నవ్వినట్టుగ మేం మట్టుకు సూడలేదు. ఎందుకో గని, గానాడు సారు నువ్వు మొకంతోటి ఆనందంగ కన్పియ్య వట్టిండు. ఆయన నవ్వు మొకం తోటి ఆనందంగ వుండుడే గాదు, సారు, మజాకు మాటలు గూడ పెట్టవట్టిండు. మమ్ములను గూడ నవ్వియ్యవట్టిండు! సారు గా మజాకు మాటలాడుకుంట దేనిమీదికెల్లో గని, ఒగ అంగ్రేజి మాటన్నడు- ‘లెక్చరర్‌’ను ‘లెక్చర్‌’ అన్నడు. గది ఇన్నంక ‘మాలక్ష్మి’ అరిసేతిని నోటికడ్డం పెట్టుకోని నవ్వవట్టింది. గంతే గాదు- “లెక్చర్‌ కాదు సార్‌, లెక్చరర్‌” అన్నది - నవ్వుకుంటనే - సారును తప్పు వట్టి అయిన తప్పును సవరిచ్చింది! గదీంతోటి కాశినాథ్‌ సార్‌కు గంతకు ముందు ఎప్పుడు రానంత కోపమొచ్చింది. ఊదు పొగేసిన పీరి వారం లేసిండు, తూలిండు.

“నన్నే తప్పువడ్తవానే, పోరికానా! (మాలక్ష్మి సారు అన్నట్టుగ మరీ గంత సిన్న పోరేంగాదు, పద్నాలుగు, పదిగేనేండ్లన్న మా వుంటై!) అర్రాం పొట్టీ కాంకే, యింట్ల వుంటే బోల్లుతోముడు, నీళ్ళు సేదుడు, బట్టలుతుకుడు, వంటజేసుడు గిట్ట సెయ్యవల్సి వుంటదని, గా పనులను తప్పిచ్చుకునుటానికి, బడికి రాకట, అచ్చి గిక్కడ కూకునుడు. గంతనే గని గీడికచ్చి సదివింది లేదు, పూసింది లేదు. మీదికెళ్ళి సారునే తప్పు పడ్తవా….” అనుకుంట సారు మా లక్ష్మి సెంపల మీద సెంపలమీద సర్సిండు- గంత పెద్ద ఆడపిల్ల సెంపల మీద - సారు కోపంల ఆయనను ఆయినే మర్సిపొయ్యి. పాపం, మా లక్ష్మి తెల్లటి రెండు సెంపలు ఎర్రగ అట్లు దేలినై. అందరి ముందు సారు తోటి - గీ ఈడు ఏ ఆడపిల్ల పడని దెబ్బలు తను తిన్నదిగదా అన్న సిన్నతనం, సిగ్గుతోటి ఆమె మొకం ఎర్రవడ్డది మందారపు పువ్వు వారం! ఏ యుగమందున, ఏ ఇల్లాలూ ఎరుగదు తల్లీ ఈ అవమానం! అన్నట్టు గైంది పాపం!

అగో, గీ రెండు తప్పిస్తే, కాశినాథ్‌ సార్‌ యింకెప్పుడు, ఎవ్వల్ని కొట్టిన పాపాన పోలేదు, పాపం!
లెక్కలకు ‘కేశవు రావు’ సార్‌ వుండెటోడు గీన మట్టుకు నువ్వద్దిగనే లెక్కల్నంటే లెక్కజేసెటోడే గాదు. ఏ లెక్కన్న గూడ ఆయినకు లెక్కేలేదు. గని, సెడ కోపగొండోడు. లెక్కలు రాకుంటే ఒకగపోరన్ని, కోపం అణుసుకోలేక డస్టరు సెక్కను వట్టి పోరని నెత్తిమీద లగాయించి వుతికిండు. గదీంతోటి పోరని నెత్తి నెర్రవాసి నెత్తురు గార పట్టింది.. గదీనికి ఆ పోరని తండ్రి సవారి లేసి సారుమీద పడటానికి అస్తే, సారు బడికి రాక తప్పిచ్చుకున్నడు. ఏడ తంతరో అని! హెడ్మాస్టరు పోరని తండ్రిని సమాదాన పర్సి, శాంత పర్సిండు. కేశవురావు సారుని పోరని తండ్రి తన్నంగ జూస్తామన్న పోరగండ్ల కోరిక తీరకుంటనే పొయ్యింది!

‘శివరాం’ సారు ‘తెలుగు’ జెప్పెటోడు. ఆయిన బోళ్ళ సెంకరుడు. ఆయిన పాఠం జెప్పుటానికి అస్తున్నడు అంటే పోరగండ్లు ఎగవడి ఎగవడి దగ్గెరి దగ్గెరికచ్చి కూకునెటోళ్ళు. ఆయిన పాఠం జెప్పుతున్నడంటె పోరగండ్లు - కిట్టమూర్తి పిల్లనగోయి వూదినప్పుడు గద లేళ్ళు సెవులు నిక్కవెట్టి నట్టుగ, నిక్కవెట్టుకునెటోళ్ళు. ఆయిన పాఠాన్ని మాటలతోటి సెప్పుడన్నది సానతక్కో. అంతగూడ ‘యాక్షన్‌’ తోటే అర్థం జేపిస్తడు. ‘కొట్లాడుటానికి సిద్ధమైండు’ అన్నదాన్ని నోటితోటి సెప్పడు - మల్సివున్న ఆయిన పొడుగు సేతుల అంగినిన, యింకింత మీదికి జరుపుకుంట సూపిస్తడు. ‘కయ్యానికి కాలుదువ్విండు’ అనడు, కాలును దువ్వి సూపిస్తడు….

ఆనెంక, కాశినాథ్‌ సార్‌ జాగల ఏరే సారు వచ్చిండు. ఆయినకు తెలుగు రాదు-హింది తప్ప. సోడబుడ్డి అద్దాలు. బగ్గ కంజూసోడు. పెండ్లాన్ని ఎంటవెట్టుకోని వుంటే రెండు కమురలకు కిరాయి పెట్టవల్సి వస్తదని పెండ్లాన్ని వూర్లనే యిడ్సి వుంటడు. పోరగండ్లకు సెప్పు తంటడు - “గింతకన్న గూడ తక్కో కిరాయికి దొరికే ఒక కమురను ఎతికి పెట్టుండ్లి” అని. దుకాండ్లు మూసేసే ఏళ్ళకే కాయకూరలు కొనుటానికి పోతడు- ఏరంగ మిగిలినయి అగ్గోల దొరుకుతాయని!… సారుకు తెలుగు రాదు గావట్టి యిగ పోరగండ్లకు దసుర పండుగు వారం! తుర్తి దీర సారును మజాకు వుడాయించవచ్చు! ఒగపోరడు బాగ జోరుతోటి “నమస్తే సార్‌!” అనెటోడు ధర్మరాజు గద అశ్వత్థామ హతః అన్నట్టుగ అని, గా తరువాత “గుడ్డి లంజకొడుక!” అనెటోడు పోరడు సారుని మెల్లగ “కుంజర” అన్నట్టుగ! సారుకు పోరగండ్లు తనని మజాకు వుడాయించుతన్నరు అని అనుమానమొచ్చి తన తోటి సార్లను అడిగిండు మతివెట్టుకోని “గుడ్డి లంజ కొడుక- కహే తో క్యా హై!?” అని. సారు వున్న ముచ్చట దెల్సుకున్నంక యిగ - గట్ల అన్న పోరగండ్లనే గాదు, అన నోళ్ళని గూడ యిరగ జోపుడు వెట్టిండు, రోజు గూడా. వట్టి జోపుడే గాదు రోజూ గని పరీక్ష పరీక్షకు గూడా అందర్ని ఫేలు చెయ్యవట్టిండు. గది తప్పించుకునటానికి గోంత మంది పోరగాండ్లు గాసారు దగ్గెరికి ప్రైవేటు ట్యూషనుకు పోవట్టిండ్రు. గీళ్లకి దెబ్బలు వుండయి, పరీక్షలల్ల పాసుగూడ. ప్రైవేటు ట్యూషన్‌కు పోనోల్ల గతి మట్టుకు యిగ గంటే - రోజూ తన్నులు - అన్ని పరీక్షలల్ల ఫేలు!

గిప్పుడు మా బడికి ‘ధర్మయ్య’ సారు వచ్చిండు తబాదులా మీద. గప్పటిదాన్క అన్ని పల్లెటూరు బడులల్ల సేసి వుంటడు. ఏరే ఏరే క్లాసులకు ఏరే ఏరే సబ్బెక్టులు సెప్పుతడు. అంటె, అన్ని సబ్జెక్టులు గూడ అస్తయన్న మాట! కడుమ సార్లు అందరు గూడ ఏదో ఒక్క సబ్జెక్టే జెప్పెటోళ్ళు. గాలెక్కన ధర్మయ్య సారు అందరికన్న గూడ మొనగాడు అన్నట్టే గద! గని సూసుటానికి మట్టుకు పిసోనివారం వుంటడు. కట్టుబొట్టు జూసి ఘనత జెప్పగ రాదు, కానరావు లోని ఘనతలెల్ల!.. పనసపండు ఘనత పైనేమి గలదురా అని తత్త్వం జెప్పినోడు గీ ధర్మయ్య సారుని సూడకుంటనే సెప్పివుంటడు! ధర్మయ్య సారు ఏసుకునే పైంటు, బుస్కోటు గిట్ట మంచి బారీ బట్టలే గని, ఆయిన మట్టుకు అచ్చం పల్లెటూరోడే. కుట్టిచ్చిన ముక్కు సెవుల సిల్లులు. సిన్నప్పుడు ముక్కుకు, సెవులకు పోగులు పెట్టుకోనేవుంటడు. సేతుల మీద పొడిపిచ్చుకున్న పచ్చబొట్లు… ధర్మయ్య సారు గట్ల ప్రత్యక్షమయ్యేటప్పటికి పోరగండ్లు ఆయనను సీపురు పుల్లంత గూడ ఖాతరు జేసుడు లేదు. తుడుసుక పోకట. మస్తు లొల్లి పెట్టుడు పోరగండ్లు. ఆ సారు క్లాసు అంటే యిగ పోరగండ్లకు లొల్లి అన్నట్టే. పోరగండ్లు-ఒకవైపు వుర్రూతలూగు కథనాలు, ఒక ప్రక్క వురికించు యుద్ధభేరీలు అన్నట్టుగ! కత్తులను ఘంటములు కదను తొక్కిన విచట! గా లొల్లికి సారు “లొల్లి పెట్టకుండ్లోయ్‌! నిశ్శబ్ధంగ వుండుండ్లోయ్‌” అనుకుంటు పచ్చి బరిగెను క్లాసురూము తలుపుమీద జోపుకుంట సొప్పజేసుడు..

మా హెడ్మాస్టరు మొకం సూసుటానికి గూడ పెద్దపులి మొకమే. ఆయిన ఎప్పుడన్న ఒగ పారి గస్తి దిరుగుటానికన్నట్టుగ ఎనుక సేతులు వెట్టుకోని మెల్లెగ, అడుగుల అడుగేసుకుంట ఒక్కొక్క క్లాసు రూంను ఎడుమకు, కుడికి జూసుకుంట, దాటేసుకుంటపొయ్యెటోడు. గంతదనుక తెగలొల్లి జేసిన క్లాసు రూములు గిప్పుడు పిల్లిని జూసిన ఎలుకల వారమే. సడెన్‌ బ్రేకు ఏసినట్లు లొల్లి ఒక్క పారే అణిగి పొయ్యేటిది- పాల పొంగు మీద నీళ్ళు పడ్డట్టుగ…

ధర్మయ్య సారు క్లాసుల పోరగండ్లు ఏగిడ్సి లొల్లి - వెడ్తున్నట్టుగ హెడ్మాస్టరుకు తెల్సింది. హెడ్మాస్టరు ధర్మయ్య సారుకు గురుబోధ జేసిండు. “తాళకంబెరుగవో, తగరంబునెరుగవో? ఉప్పుచింత పండు వూరిలో నుండగ కరువదేలవచ్చె? బరిగె సేతులవుండంగ పోరగండ్లు లొల్లి ఎందుకు మానుత లేరు? పుట్టమీద గొట్ట భుజగంబు జచ్చునా? నువ్వు తలుపు సెక్కల్ని యిరుగ సరిస్తె పోరగండ్లకు పెయ్యిఎట్ల నొస్తది? పాము మంత్రం గిట్ట నేరిస్తివా? యిక్కడ ఎవన్నో సెంపమీద జరిస్తే అక్కడెక్కడ్నో పాము కుట్టినోని విషం దిగినట్టుగ! తలుపు సెక్కల్ని సరుస్తుంటే పోరగండ్ల పెయ్యిల మీద వాతలు దేలుతున్నయా! నువ్వు బయపడితె కుట్టకుంట వుంటె కుమ్మరి పురుగంటరు- వాళ్ళు నిన్ను బయపెడతరు. కుట్టు, తేలు వారం! నువ్వు బయపెడితె ఆళ్ళు బయపడుతరు. గంత దనుక తనకెవ్వడు కపటిలేడు ధరలో అని పోరగండ్లు దుందు జేస్తరు. జీవులందే గాని శాలల ఏమున్నది? పోరగండ్ల పెయ్యిల మీద వున్నది గని, తలుపు సెక్కలల్ల ఏమున్నది? నోటి మాటలతోటి ఏమైతది పోరగండ్లకు? వానతోడ వచ్చు వడగండ్లు నిల్చునా? లొల్లి వెట్టకుండ్లోయ్‌ అనంటె పోరగండ్లు నిల్చునా? లొల్లి వెట్టకుండ్లోయ్‌ అనంటె పోరగండ్లు నోట్లె ఏలు వెట్టుకోనే వుంటరా? న్యూటన్‌ సూత్రాలన్నీ నూరుకోని తాగినోనివి! ధనం బలిమిలేని వాడ జనం బలం జూపవోయి అన్నట్టుగ జోపు మస్తుగ రాళ్ల వానను….” అన్నడు హెడ్మాస్టరు. పల్లెటూరు అబ్బాయిని పదునుపెట్టి, వెన్నుతట్టి- ఏమి రోజులచ్చెరో, ఎనుకటోలె లేవురో!

గప్పటి సంది యిగ జూసుకో ధర్మయ్య సారు!

“లొల్లి పెట్టకుండ్లోయ్‌” అన్న నోరు “లొల్లి వెడుతార్రా? అనవట్టింది. స్కేలు అంచులు పోరగండ్ల మట్టలమీద జోరుతోటి ఆడవట్టినై. లొల్లి దెంక పొయ్యింది. సారు ప్రశ్నలకు పోరగండ్లు జవాబు జెప్పకుంటె స్కేలు కొస్సటి దిక్కు అంచు మట్టలమీద బలంగ…. పోరగండ్లకు పొడి పొడి ప్రాణాలు పోవట్టినై… బుద్ధిజెప్పువాడు గుద్దిన నేమయా అన్నడు తత్త్వం జెప్పినోడు. గని, పురాగ గూత బందు అయ్యెటట్టు గుద్దుమన్నడా? గిప్పటి ధర్మయ్యసారు-పూవు మాటున ముల్లు పొంచిన చందంబు గిట్ల జేస్తె సదువస్తదా? మంచినీరు పోయ మల్లె పూయును గాని. పేరు ధర్మరాజు పెను వేప విత్తయా… పోరగండ్లు తల్లడిల్ల వట్టిండ్రు… గప్పుడు దీపాలు నీవే వెలిగించినావు. గిప్పుడు, గాఢాంధకారాన ముంచేందుకా! తారతమ్య మెరుగనేరని పశువువ.. పోరగండ్ల మట్టలు బూరెల వారం వుబ్బుడు.. మట్టల మీద నిమ్మకాయ రసం పూసుకుంటె గింతంత దెబ్బకే గంతంత వుబ్బుతై అని ఎవరో జెప్పుతె పోరగండ్లు నిమ్మకాయ రసం పూసుకోని రావట్టిండ్రు. పోరగండ్ల గా ‘యికుమతి’ సంగతి ధర్మయ్యసారు సెవున పడ్డది. గందుకని పోరగండ్ల మట్టలు ఎంత వుబ్బినా గూడ సగ్గి పోతున్నై అని యింకింత మట్టల మీద జోపుడు… గుండుకు బదులుగ గుండెను నిలిపి… కొన వూపిరులకు వూపిరులూది… తనువులోని ఈ బాధను పెదవి దాటనివ్వరు. నిప్పులు మింగి.. గడియ గడియ గండమాయె… ఉడుకెవనిదో వణుకెవనిదో.. ధర్మయ్యసారు పీరియడు అనంగనే పోరగండ్లు - దాని నూనగల్లు దార్డ్యంబులేకున్న - దాన్ని, యిడ్సిపెట్టి పోకటే దిక్కు. యుపముతోనె యుక్తి యున్నది గనవలె.. కత్తిని విసిరే వానిని ఆ కత్తితోనె గెలువాలని… ఒకనాటి వుద్యాన వనము! నేడు కనము! అదియె మరుభూమిగా నీవు మార్చేవులే!.. సారు బగ్గ నొప్పిస్తాంటే, తాము నొవ్వకుంట - తప్పించుక తిరుగువాడే ధన్యుడు- గందుకని ధర్మయ్య సారు పీరియడు అస్తున్నదనంగనే గదీనికి ముందే బాగ మంది పోరగండ్లుగా క్లాసు యిడ్సిపెట్టి కంట్లె పడకుంట పొయ్యి, గా పీరియడు అయిపొయ్యినంకనే వచ్చుడు వెట్టిండ్రు. తేలుకొండి గొట తేలేమిజేయురా? ధర్మయ్య సారు పీరియడునే ఎగ్గొడితే యిగ ధర్మయ్యసారు ఏం జేస్తడు? సచ్చి మళ్ళీ పుట్టంగాని, బ్రతికి మనం సావద్దు. నీరము తప్త లోహమున నిలిచి యనామకమై నశించు.. ధర్మయ్య సారు గీ పీడ, గీ తరుగతి దనుకనే వచ్చే ఏడు పై తరగతికి పోతె గీన పీడ పాసిపోతది గని…

ధర్మయ్య సారు దెబ్బలని తప్పించుకునుటానికి పోరగండ్లు ఎవరికి దొరికిన తొవ్వని గాళ్ళు అందుకున్నరు. గోంతమంది పోరగండ్లు వుడుత భక్తి వారం నమస్తేల తోటి సగవెట్టుకుంటె కొంతమంది వుషారు మంతులు మట్టుకు - విభీషణుని వారం సారు శెరణుజొచ్చిండ్రు. సారు కింక పెండ్లిగాలేదు. ఒక్కడే. ఒక కముర కిరాయికి తీసుకోని వుంటండు. పోరగండ్లు సారు యింటికి పొయ్యి సారుకు యింట్ల పనులల్ల, వంటపనులల్ల ఆసరా గావట్టిండ్రు. సారుకు నూతిలకెళ్ళి నీళ్ళుసేది, తోడి పెట్టుడు… గిదీంతోటి ఆళ్ళకు రెండు విధాల మునాఫా. దెబ్బలూ తప్పినై, పరీక్షలల్ల ఫేలు గాకట తప్పింది!..

హెడ్మాస్టరు మేనకోడలు గూడ గిక్కడ టీచరే. పోరగండ్లు ఆడి టీచర్లను గూడ యిడ్సెటోళ్ళు గాదు. ఆడి టీచర్లు పోరగండ్లు జేసే సేష్టలకు కక్కలేక మింగలేక వుండెటోళ్ళు.

ఒగ క్లాసుల ధర్మయ్య సారు పిర్యడు అయినంక ఎంటనే హెడ్మాస్టరు మేనకోడలు పిర్యడు వుంటది. గప్పుడు ధర్మయ్యసారు, ఆయిన పిర్యడు అయిపొయ్యినంక గా బెల్లు మెగినంక గూడ క్లాసు రూముని యిడ్సి - పెట్టెటోడే గాదు! కావాల్సుకుని! ఆడి టీచరు వచ్చి క్లాసు రూము తులుపు పక్కకు బైటనే నిల్సుండి పొయ్యేది మూజియంల పాలరాతి బొమ్మ వారం - సిగ్నలు పడని రైలుబండి ఒంటి సింగలు కాడ నిలవడి పొయ్యినట్టుగ… ధర్మయ్యసారు మనుసుల - పెరిగింది ఏదో మరో లోకం! ఎవరేమి అన్ననేమి, ఎగతాళి జేయనేమి? గని, క్లాసు రూమునే పట్టుకోని ఎల్లాడ వడెటోడు-మన లీడర్లు పద్దవతులను యిడువకుంట ఏళ్ళాడ వడ్తున్నట్టుగ..

క్లాసురూము లోపట ఆయన వుండంగ తను పోవద్దుగద! గట్లనే నిల్సుండి పొయ్యేటిది. ఆమె బగ్గ అందంగ వుంటది. యింక పెండ్లిగాలేదు. మరుమల్లెల, విరజాజుల సువాసనలు… తడిసిన వనుల గాలి నీ దారి తెల్పు అన్నట్టుగ ధర్మయ్య సారు ఆమె రాకను వాసన పట్టెటోడు. జిలుగు మెరుగుల చీరెశిల్పం. నడక సొబగులు, ఒడల మెరుగులు. ధర్మయ్యసారు ఆమె పదనోకుర నిస్వణాల్ని విని, కర కంకణ నిక్వణాల్ని వినుకుంట గట్లనే టైం పాసు జేసెటోడు! మగువలు కొలువగ దరిజేరగ మతి మాయుట యతులకు న్యాయమా? విడు విడుమా యిక నను విడుమా- నేను క్లాసు తీసుకొనుటానికి వస్తే నువ్వు విడువకుంట పట్టుకుంటవా, విడ్సిపో అన్నట్టుగ ఆమె.. నిలు నిలుమా చెలి నిలునిలుమా అన్నట్టుగా ఆయన! రుస రుస లాడుచు విసిరిన వాల్జడ ప్రేమ పాశమని తలిచితిలే అనుకుంటడు. నీ ప్రణయ వనిలోన నేనున్న చాలు అనుకుంటడు.. నీ జడలో గులాబినై వెలిశానా? అని ప్రశ్నించుకుంటడు! పడతి జూసినపుడె.. పై నాశ ఆమె, ఊర్వశి అందాలు జూపి వూరిస్తోంటే, వూరిస్తొంటే, ధర్మయ్యసారు గుటుకలు మింగుతాంటడు. బిందె తోటి నీళ్ళకెడితె సందు దాటి సైగ జేస్తడు! కన్పిచ్చిన కాడికి ఆమె కచముల, కుచముల, కటి జఘనమ్ముల సూడాల్ననుకుంటడు..

మా హెడ్మాస్టరు అంటే అసుంటి, యిసుంటోడు గాదు. గాయిన యింగ్లీషుని, గ్యానాన్ని జూసి ‘డీ ఈ వో’ కే పైంటు పచ్చిగైతది! అందరు - పిసోడు, పిసోడు పల్లెటూరోడు అనుకోంగ గంత గడుసుదేలుడే గాకుంట, గిప్పుడు గంతటి హెడ్మాష్టరు మేనగోడలు మీదికే ‘పోజులు’ యిసుర వట్టె ధర్మయ్య సారు!

ధర్మయ్య సారు గప్పుడు ఏకు వారం అచ్చినోడల్ల, గిప్పుడు మేకు వారం దిగవట్టె. మన దేశానికచ్చిన అంగ్రేజోని వారం - ఎలక్షన్ల గెల్సినంక మన లీడర్ల వారం!

Trackback This Post | Subscribe to the comments through RSS Feed

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో