సభలు-సమావేశాలు సోయి | 01 సెప్టెంబర్ 2007 04:24 pm
“ఎన్నాద్రి” ఆవిష్కరణ
ప్రముఖ కవి డాక్టర్ కాసుల లింగారెడ్డి రచించిన “ఎన్నాద్రి” కవితా సంకలనాన్ని హైదరాబాద్‌లోని బషీర్‌బాగు ప్రెస్ క్లబ్‌లో జూలై 7,2007 రాత్రి వరవరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహిత కె. శివారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో వరవరరావు మాట్లాడుతూ తెలంగాణ గ్రామీణ సౌందార్యాన్ని, తండ్లాటతోపాటు, అంతర్జాతీయ రాజకీయాల్ని చాలా లోతుగా అవాగాహన చేసుకొని కవి “ఎన్నాద్రి” రచించాడని, తెలంగాణ పలుకుబడిని, తాను నేర్చుకున్న బడి పలుకులను సందర్భాను సారంగా ఉపయోగించటంలో పరిణితి సాధించాడని అన్నారు. అలెండీ హత్యగావించబడ్డ సెప్టెంబర్ 11,, ఛావెజ్, ప్రఛండల గురించి సాహిత్యంలో ప్రస్తావించిన వాడు లింగారెడ్డి ఒక్కడేనని, వయస్సు రీత్యా, తనున్న స్ధలంరీత్యా చూసినప్పుడు అతడు ప్రదర్శించిన అవగాహనలోని మెట్యూరటీ ఆశ్చర్యపరిచిందని అన్నారు. శివారెడ్డి, మాట్లాడుతూ దందహ్యమాన దశాబ్ద కవి డా|| కాసుల లింగారెడ్డితో తనకున్న అనుబంధాన్ని తెలుపూతూ ఈనాటి బలమైన పది,పదిహైను మంది కవుల్లో లింగారెడ్డి ఒకడని, ఆంగ్ల సాహిత్యంలో తప్ప వైద్యవృత్తిలో వుండి బలమైన కవులుగా ఎదిగినవారు తెలుగులో లేరని ఆ లోటునుభర్తి చేశాడని అన్నారు. ప్రముఖ కవి నందిని సిధ్దారెడ్డి పుస్తకాన్ని సమీక్షిస్తూ సంకలనానికి ఎన్నాద్రి అని పెట్టడంలోనే లింగారెడ్డి తన తాత్విక ధృక్ఫథాన్ని వ్యక్తీకరించాడని, ప్రంపచీకరణని వ్యతిరేకించడమంటే స్ధానిక సంస్కృతి, భాషలను పరిరక్షిచడమేనని, ఆపని లింగారెడ్డి దిగ్విజయంగా నిర్వహించాడని అన్నారు. పాపినేని శివశంకర్ మాట్లాడుతూ లింగారెడ్డి తనకింతకుముందు తెలియదని, అయితే ఎన్నాద్రి చదివిన తరువాత ఎంతో కాలంగా పరిచయమున్నట్టుగా అనిపించిందని, దానికి కారణం వ్యవసాయ కుటుంబాల్లోంచి వచ్చిన తనకు లింగారెడ్డి కవిత్వం గొప్ప సహానుభూతిని తలగించిదని, అట్లా కలిగించడం ఉత్తమ కవిత్వ లక్షణమని, అందువల్ల కవి అభినందనీయుడని పేర్కోన్నరు. ఈ సందర్భంగా ఆలేరు చెందిన తేజ ఆర్ట్ క్రియేషన్స్ 2007 విశిష్ట పురస్కారంతో కవి డా|| కాసుల లింగారెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సభకు ప్రముఖ రచయిత కలిసుల ప్రతాపరెడ్డి స్వాగతం పలుకగా, రత్నకర్ వందన సమర్పణ చేశారు. ముదగంటి సుజాచారెడ్డి, సుంకిరెడ్డి, నారాయణరెడ్డి, నాళేశ్వరం, శంకరం, కందకూరి శ్రీరాములు, యస్. వేణుగోపాల్ మరియు ఇతర లబ్దప్రతిష్టులైన కవులు,రచయితలు పాల్గొన్నారు.



