సభలు-సమావేశాలు సోయి | 01 సెప్టెంబర్ 2007 04:15 pm
తెలంగాణ కవిత - 2007 ఆవిష్కరణ
తెలంగాణ కవుల నిరసన, ధిక్కారం, ఆగ్రహం, ఆవేదన, గోసలతో కూడిన ఆత్మగల్ల కవిత్వం “తెలంగాణ రాష్ట్ర అవతరణని బలంగా కాంక్షిస్తున్న ‘ఓ అవ్వ’ చేతుల మీదుగా తెలంగాణ విమోచన దినోత్సవం రోజున ఆదిలాబాద్ స్థానిక అమరవీరుల స్థూపం వద్ద యువకవి వేణుగోపాల్ రెడ్డి నినాదాల మధ్య ఆవిష్కరణ జరిగింది.
తెలంగాణ కావాలె, తెలంగాణ రావాలె అని ఇంతమంది కవులు, గాయకులు, ప్రతి ఒక్కరు లొల్లి బెడ్తానా కూడా ఇయ్యకుంట అరిగోస పెడుతాండ్లు అని కవితా సంకాలనాన్ని ఆవిష్కరించిన ‘అవ్వ’ ఆవేదన చెందినది.
కష్టాలు, కన్నీళ్ళు, నిలువెత్తు గాయాలు, ఇవ్వాళ తెలంగాణ కవిత్వం నిండా జీవం నింపుకొని చైతన్యంతో ఉద్యమ స్ఫూర్తినిచ్చే విధంగా తెలంగాణ జిల్లాల నుంచే ఇవ్వాళ బలమైన కవిత్వం వస్తోందని ‘కవుల కనుపాపల్లో కదలాడే తెలంగాణా’ ఈ కవిత్వంలో ఉందని తెలంగాణా విమోచనాదినోత్సవాలు కాదు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల కోసం ఉద్యమించాలని సంపాదుకుల్లో ఒకరైన అన్వర్ తెలిపారు. ‘తెలంగాణ కవితా - 2007’లో కవిత్వం బలంగా ఉందని, ఈ కవిత్వం ప్రజలకు మార్గదర్శకంగా పనిచేస్తోందని డా|| ఉదారి నారాయణ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో కవులు జి.ఆర్ కుర్మే, వేణుగోపాల్ రెడ్డి, జానాపోశెట్టి, మామిడి నారాయణ, తెలంగాణ అభిమానులు, కళాకారులు, గాయకులు పాల్గొన్నారు.



