సభలు-సమావేశాలు సోయి | 01 సెప్టెంబర్ 2007 04:00 pm
తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన తెలంగాణా కవితా వైతాళికులు
“తెలుగు సాహిత్యం గర్వించదగిన ఎందరో మహా కవులనూ, రచయితలనూ, తెలంగాణ సాహిత్యం సృష్టించుకున్నది. మట్టి మనషులు ఇక్కడ చైతన్యంతో మహా కవులుగా రూపొందారు. సామాన్యులు మాన్యులైన మహారచయితలుగా సాహిత్యాన్ని సృష్టించారు. మఖ్దుం, దాశరధి, కాళోజి, వానమాములై, సుద్దాల హనుమంతు, సి. నారాయణ రెడ్డి తదితర కవితా వైతాళికులను స్మరించటం స్ఫూర్తిదాయకం” అంటూ పలువురు వక్తలు విశ్లేషించారు.
14.09.2007 (శుక్రవారం) ఉదయం 10.30 గంటలకు ఉస్మానియా మహిళా కళాశాల, కోఠిలో “తెలంగాణా కవితా వైతాళికులు” అన్న అంశం పై జాతీయ సదస్సు జరిగింది. ప్రొఫెసర్ ననుమాస స్వామి అధ్యక్షతన జరిగిన ప్రారంభ సదస్సులో నల్గొండ విశ్వవిద్యాలయం వైస్ ఛాస్స్‌లర్ గంగాధర్ ముఖ్య అతిధిగా, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ముత్యం రెడ్డి విశిష్ట అతిధిగా ప్రొఫెసర్ జుబైదా అజీమ్ ఆత్మీయ అతిధిగా పాల్గొన్నారు.
“తెలంగాణా మహాకవుల కవిత్వంపై ప్రత్యేకంగా ఒక జాతీయ సదస్సు జరపడం అభినందనీయం. ఇక్కడ ఇతర సహిత్య ప్రక్రియలపై కూడా మున్ముందు మరిన్ని పరిశోధనలు జకగాల్సిఉంది” అన్నారు ప్రొఫెసర్ గంగాధర్. సదస్సు ఉద్ధేశ్యాన్నీ, నేపథ్యాన్నీ డా|| ఎస్వీ వివరించారు. డా|| వారిజారాణి ప్రారంభ సదస్సుకు సమన్వయకర్తగా వ్యవహరించారు.
ప్రొఫెసర్ మాదిరెడ్డి అండమ్మ అధ్యక్షతన జరిగిన మొదటి సదస్సులో ప్రధాన వక్తగా పాల్గొన్న సీనియర్ జర్నలిస్టు డా|| కె. శ్రీనివాస్ మాట్లాడుతూ - “వేలాది సంవత్సరాలుగా చరిత్ర నుండి తెలంగాణా అస్తిత్వానికి మూలాలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణా ప్రత్యేకత ఈ నాటిదే మాత్రమే కాదు వేలాది సంవత్సరాలది. తక్కిన తెలుగు ప్రజల కంటే తెలంగాణా ప్రజలు ఎందుకు ప్రత్యేకం? ఇక్కడ చరిత్ర, సంస్కృతి,వాజ్ఞయం ఎలా విలక్షణమైంది? ఎందుకు విశిష్టమైంది? అన్న అంశాలపై ప్రత్యేకమైన అధ్యయనం జరగాలి. ఒకప్పుడు తెలంగాణ చైతన్యం కొంత అస్పష్టంగా వుండేది. ఇప్పుడు రాజకీయ, సాంఘిక, సాహిత్య రంగాలలో తెలంగాణా అస్తిత్వ చైతన్యం చాలా స్పష్టంగా ప్రతిఫలిస్తున్నది” అని విశ్లేషించారు.
‘ఉద్యమ కవి దాశరధి కృష్ణమాచార్య. అన్న అంశం పై డా|| డి. నర్సయ్య మాట్లాడూతూ - ఆధునిక తెలంగాణా నేపథ్యాన్నీ, దాశరధి కవిత్వానికున్న పూర్వ రంగాన్ని వివరించారు. “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని ప్రకటించిన చైతన్య శీలి దాశరధి. తెలంగాణా విమోచనోద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న దాశరధి తన కవిత్వాన్ని ప్రజల ఉద్యమానికి వాహికగా మలిచాడన్నారు.
“ తెలంగాణా సంప్రాదాయ కవి వానమామలై వరదాచార్యులు” అన్న అంశం పై మాట్లాడిన డా|| జి. బాలశ్రీనివాస మూర్తి “తింటే మదీనా బిర్యానీ తినాలి - వింటే వరదన్న కవిత్వమే వినాలని దాశరధి ప్రశంసలు పొందిన కవి, ఉర్దూ కవుల అభినందనలు పొందిన గొప్పకవి వరదాచార్యులు. తెలంగాణా ఆత్మాభిమాన చైతన్యానికి ప్రతీక అతడు. కావ్యగాన సంస్కృతిని ప్రచారం చేసిన వాడు. తెలంగాణా రచయితల సంఘానికి పునాది రాళ్ళు వేసిన వైతాళికుడు” అంటూ వానమామలై కవితాతత్వాన్ని విశ్లేషించారు. శ్రీమతి పి. అనూరాధ సదస్సును సమన్వయనం చేశారు.
డా|| ఎం. చెన్నప్ప అధ్యక్షతన జరిగిన రెండవ సదస్సులో సీనియర్ జర్నలిస్టు శ్రీ పాశం యాదగిరి మాట్లాడుతూ - “అపారమైన ఖనిజ సంపద, భూ సంపద, వనసంపద, జలసంపద, మేధో సంపద గల ప్రాంతం తెలంగాణ. పాలక వర్గ దోపిడికి గురయిపోయి దుర్భల దారిద్రాన్ని అనుభవిస్తున్న ప్రాంతం కూడా తెలంగాణ. ఇక్కడి సంపదలను దోచుకుంటూ, ఇక్కడి భాషపై, సంస్కృతిపై, నాగరికతపై దాడి చేస్తున్న శక్తులను ప్రతిఘటించాలనీ, వీరోచితమైన తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుకోవాలనీ” పిలుపు నిచ్చారు
డా|| చెన్నప్ప అధ్యక్షోపన్యాసంలో తెలంగాణా ప్రాంత విశిష్టతనూ, భాష గొప్పదనాన్నీ, సంస్కృతి ప్రాధాన్యతను వివరించారు.
“శ్రామికోద్యమ కవి - మఖ్దూం” అన్న అంశం పై ప్రసంగించిన డా|| వేణూసంకోజ్ ప్రసంగిస్తూ, కవిగా, అధ్యాపకుడిగా, కాల్పనిక విప్లవకారుడిగా, కమ్యూనిస్టు యోధుడుగా ముఖ్దూం చేసిన బహుముఖీనమైన కృషిని విశ్లేషించారు. ‘కవిత్వమూ, ఉద్యమమూ, కలగలిసిన తావి - ఎర్రని పావురమై ఎగిరిన శ్రామికోద్యమ జీవి మఖ్దూం” అని వివరించారు.
“ప్రజాకవి కాళోజీ” అన్న అంశం పై డా|| నందిని సిధా రెడ్డి మాట్లాడుతూ - “పద్మవిభూషణ్ అన్న బిరుదును కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కానీ, ప్రజలు ప్రేమగా అతడ్ని ప్రజాకవిగానే ఆదరించారు. ప్రజల జీవితం, ప్రజల భావన, ప్రజల భాష, ప్రజల శిల్పం కాశోజీ కవిత్వానికి ప్రాణవాయువులు. తెలంగాణా తత్వానికీ, స్వభావానికీ నిలువుటద్దం కాళోజీ” అంటూ సోదాహరణ పూర్వకంగా వివరించారు.
“తెలంగాణ సాయుధ పోరాట కవి సుద్దాల హనుమంతు - తదితర పోరాట కవులు” అన్న అంశం పై ప్రసంగించిన శ్రీ గుడిపాటి - “తెలంగాణా ప్రజల ఉద్యమాలు ఇక్కడి కవులనూ, కళాకారులనూ, గాయకులను, నాయకులను రూపొందించుకున్నాయి. కవుల కవిత్వము, పాటలు, కళారూపాలు, ఉద్యమాలను ఉత్తేజ పరిచాయి. ఉద్యమం - కవిత్వం అన్నవి రెండు పరస్పర ప్రేరకాలుగా, పరస్పర ప్రభావితులుగా పెరిగాయి. పాటలు, బుర్ర కథలు, యక్షగానాలూ మొదలైన విభిన్న సాహిత్య ప్రక్రియలనూ, కళారూపాలనూ సుద్దాల హనుమంతు రచించారు. యాదగిరి, తిరునగరి, రామాంజనేయులు, హీరాలాల్ మోరియా తదితరులు విశిష్టమైన సాహిత్యాన్ని సృష్టించారు. అంటూ తెలంగాణా విమోచనోద్యమ కవుల కవిత్వాన్ని విశ్లేషించారు.
సమాపన సదస్సుకు ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్, డా|| ఆవుల మంజులత గారు మాట్లాడుతూ - “తెలంగాణా విమోచనోద్యమ కవిత్వాన్ని సేకరించి, ఆంగ్లంలోకి అనువదింపజేసి, ఒక పుస్తకంగా వెలువరించే ప్రణాళికను రూపొందించాలనీ, దానికి తమ విశ్వవిద్యాలయం సహకారాన్ని అందిస్తుందనీ” సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. డా|| వారిజారాణి సదస్సుకు నివేదికను సమర్పించారు. ఆత్మీయ అతిధిగా పాల్గొన్న ఆచార్య టి. కిషన్ రావు మాట్లాడుతూ “తెలంగాణ కవితా వైతాళికులు ఒక్కొక్కరి సాహిత్య కృషిపై ఒక్కొక్క ప్రత్యేకమైన జాతీయ సదస్సును నిర్వహించాల్సిన అవసరముందనీ, తెలంగాణా మహాకవుల ప్రతిభను ఇతర ప్రాంతాలవారు గుర్తించాలనీ’ సూచించారు. గౌరవ అతిధిగా పాల్గొన్న ప్రొఫెసర్ మేరి ఇస్తర్ సింతియా తాను ఈ తెలంగాణ నేల తల్లి బిడ్డనైనందుకు గర్వపడుతున్నానని ఉద్వేగ భరితమైన స్వీయ కవితను వినిపించారు. డా|| తూర్పు మాల్లారెడ్డి తెలంగాణా కవితాతత్వాన్ని వివరించారు.
సదస్సులో సంచాలకులు ఆచార్య ననుమాస స్వామి వందన సమర్పణతో జాతీయ సదస్సు ఉత్సహపూరితమైన వాతావరణంలో ముగిసింది.



