సభలు-సమావేశాలు సోయి | 01 సెప్టెంబర్ 2007 03:51 pm
పెండ్యాల రాఘవరావు “నా ప్రజాజీవితం” పుస్తకావిష్కరణ సభ
ప్రజల కోసం జీవించి వారి బాధలను తమ బాధలుగా భావించి ప్రజా పోరాటం చేసిన మహానీయుల ఆదర్శమే స్వచ్చమైన ప్రజాస్వామ్యానికి పునాదిగా పలువురు వక్తలు అభివర్ణించారు. స్వాతంత్య్ర యోధుడు పెండ్యాల రాఘవరావు 20వ వర్ధంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ 10న ఆయన ఆత్మకథ ‘నా ప్రజా జీవితం’ పుస్తకావిష్కరణ వరంగల్ జిల్లా పరిషత్ హాల్‌లో జరిగింది. మా భూమి సంధ్య పాడిన గీతంతో సభ ప్రారంభం కాగా ఎంపీ వినోద్ పెండ్యాల చిత్రపటాన్ని ఆవిష్కరించారు. అనంతరం విరసం నేత వరవరరావు పుస్తకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా విశిష్ట అతిధిగా విచ్చేసిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఎంఎస్ రాజలింగం మాట్లాడుతూ స్పందనతో వచ్చే నాయకత్వం వల్ల నాయకుడు ఆవిర్భవిస్తాడని జిల్లాలో ప్రధమ విద్యార్ధి సంఘ స్థాపకుడిగా రాఘవరావు ప్రసిద్దుడన్నారు. భాషా పరిరక్షణకు ప్రజల్లో చైతన్యం తెచ్చే దిశగా ఆయన సేవలు శ్లాఘనీయమని రాజలింగం కొనియాడారు.
ఎమ్యెల్యే చెన్నమనేని రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ సమాజం ఉన్నంత కాలం మహానీయుల ఆదర్శం చిరస్థాయిగా నిలిచిపోతుందని, కమ్యూనిస్టు పోరాటంలో రాఘవరావు ఆగ్రగణ్యుడన్నారు. ఈ సందర్భంగా వీరిరువురూ రాఘవరావుతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం వరవరరావు మాట్లాడుతూ ప్రజల బాధలను తన వ్యథలుగా భావించి కుటుంబ సభ్యుల్లో సైతం పోరాట స్పృహను కలిగించిన చైతన్యశీలి రాఘవరావుగా పేర్కొన్నారు. ఎంపీ వినోద్ మాట్లాడుతూ తన జీవితంలో ఎంపీగా ఎన్నికైన దానికంటే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన సభలో పాలుపంచుకోవటం మరుపురాని విషయమన్నారు. కార్యక్రమానికి ఎన్. వేణుగోపాల్ అధ్యక్షత వహించగా ప్రముఖ జర్నలిస్టు సి. రాఘవాచారి, సీపీఐ కంట్రోల్ కమిటీ సభ్యుడు మడత కాళీదాసు, ఆచార్య కె. జయశంకర్, రాఘవరావు సతీమణి కౌసల్య, పుస్తక రూపకర్త నీహారిని, డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్, గంట రామారెడ్డి, కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి, రాఘవరావు కుటుంబసభ్యులు పాల్గొన్నారు.



