పోస్టులు అభిప్రాయాలు 10 March 2010

కథలు సోయి | 01 సెప్టెంబర్ 2007 04:42 pm

పొద్దుమూకినంక

-భూపాల్‌

మెడికల్‌ కాలేజీ ముందలి సందుల బస్సు దిగింది పుష్పలత. ఆడికెళ్లి నడుచుకుంట కోఠి ఆంధ్ర బేంకు కాడికొచ్చి ఎవర్నో టైం అడిగితే ఆరున్నర అన్నరు. ఉప్పల్‌ నుంచి కోఠి కాడికొస్తందుకు రెండున్నర గంటలైంది. ఆమె భర్త ఆరున్నర ఏడునడుమ ఈడనే కలుస్తనన్నడు. ఒక గంట మొదాలొచ్చి గాజులు, టిక్లీ బొట్లు, చిన్న స్టీలు టిఫిన్‌ బాక్సు కొందామనుకుంది. బస్సు లేటుగొచ్చుడు తోటి ఇగ అవి గొనే టైం లేదనుకుంది. భర్త ఇప్పుడో ఇంకో నిమిషానికో రావొచ్చు. హిమాయత్‌ నగర్‌ నుంచి రెండు గొట్టేవరకే ఉప్పల్‌ కొచ్చింది పుష్పలత. ఆడ తన భర్త మేనమామ దగ్గర ఆయిన చెప్పినట్లు వెయ్యిన్నర రూపాయలు తీసుకుంది. పుష్పలత చిన్నాయిన బిడ్డె తన చెల్లెలు పెండ్లుంది. చెల్లెకు చీర, జాకెట్‌ కొని పెండ్లి పిల్లను చేద్దామని భర్తతో పదిసార్లంటే నిన్న ‘సరే’ అన్నడు. సరే అనుకుంటనే “నా తాన పైసలు లేవు. ఉప్పల్‌ మామ నడిగిన రేపు రమ్మన్నడు. నువ్వు ఉప్పల్‌ పొయ్యి, పైసలు దీస్కొని కోఠి కాడికి పొయ్యి వుండు. నేను నా పని జూసుకొని సక్కగ ఆడికే ఒస్త. బట్టలు కొందాం. బుజ్జిని పక్కింటి ఆంటి దగ్గరుంచిరా!” అన్నడు.

అదేమాట పొద్దున కొలువు కాడికి పోతున్నప్పుడు గూడ చెప్పిండు. “అట్లనే ఆరున్నరకు బేంకు కాడ నిలవడ్త” అన్నది పుష్పలత.

ఆ బస్సు పాడుగాను గీడికొస్తందుకే ఉప్పలకెళ్ళి రెండు మూడు గంటలా! “అనుకొని మళ్ల బస్సుదేముందీ రోడ్లు సక్కగుండవాయె అదీగాక ఉశికె జల్లినట్టు జనమైరి. ఈ జనమంత ఏడికెళ్లొస్తున్నరో? ఎక్కడ పోతున్నరో? పుట్లకు పుట్లు ఏడ జూసినా జనాలే. పట్నం నిండా జనాలే.” అనుకుంది.

పుష్పలత పొత్తి కడుపు నొప్పిగుంది. ఉప్పల్‌ నుంచి బైలెల్లెటప్పుడు బాత్‌రూంకు పోలేదు. ఇంట్ల ఎవరో కొత్త కొత్త మొగోళ్లున్నరని సిగ్గయ్యింది. బస్సు దబ్బునొస్తే భర్తతోటి కలిసిపొయ్యి బస్‌పాస్‌లిచ్చే బస్‌స్టాండుల బాత్‌రూం పోదామనుకుంది. ఇప్పుడేమో యీనా ఇంకా రాడాయె. పుష్పలతకు ఏం తోస్తలేదు. మళ్లీ ఐదు నిమిషాలు దాటినయి.

‘ఒస్తే నిలవడ్తడు. నేను మొదలు పొయ్యి బాత్‌రూం జేసొస్త..’ అనుకొని బస్‌స్టాండుకు గాకుండ కామత్‌ హోటళ్లకు మెట్టెక్కి పొయ్యింది. మొదాలు లోపట మావోళ్లు ఉన్నరా అన్నట్టు తొంగిచూసింది. ఉట్టిగనే.. టిఫిన్లు జేసెతాన అటెనుక అటూ ఇటూ నిలబడి మూడో నిమిషం బాత్‌రూంలకు జారింది. మల్ల బైటికొచ్చి ఎవరన్నా తనను జూస్తున్నరా అని అటిటు చూసి మెల్లగ మెట్లు దిగి కిందికొచ్చింది. ఒచ్చి మొదటిలెక్కనే ఆంధ్రబ్యాంకు దగ్గర పెద్ద దర్వాజ ముంగట నిలబడి ఎదురుసూడ వట్టింది.

ఇంతల మూడేండ్ల తన కూతురు గుర్తుకొచ్చి డబ్బా టెలిఫోన్‌ ఏడుందోనని అక్కడిక్కడ చూసింది. పొద్దున్నే స్కూలుకు పొయ్యేటప్పుడు పగటికి ఒచ్చినంక ఆంటి దగ్గర్నే వుండుమని చెప్పింది. ఆంటికి కూడా తను కోఠీకి పోతున్న సంగతీ, పెండ్లి పిల్లను చేస్తందుకు చీరె కొనుక్కొస్తున్న ముచ్చటా చెప్పింది. ఆంటీ అంటే ఆమెకు ఆమెంటె ఆంటీకి మంచి సోపతుంది. తాను తిరిగొచ్చే వరకు పాపను బాగానే సూసుకుంటదని తెలుసు. ఐనా ఒకసారి ఫోన్‌ జేస్తే ఆంటీ సంతోష పడ్తదనుకుంది. ఈయన రానీ వొచ్చినంక చేద్దాం.. ఐన టైమయ్యిందిగా..

భర్త హయత్‌నగర్‌ అవతల తారామతి పేటలున్న కోళ్ల ఫారంల పనిజేస్తడు. యాడాది కింద జీతం కుదిరిండు. ఆ తార్మాతి పేటల బస్‌ ఎక్కితే అది సక్కగొచ్చె కోఠీ దవాఖాన దగ్గర దించేస్తది. ఆడికెళ్లి ఆంధ్రబేంకు కాడికి ఏమంత దూరముంది. నిజంగా చెప్పాల్నంటే ఈ…. అన్ని పనులు తెల్వితోటి చేసి ఉంటే హీరో హోండ తీస్కోవలసి నోడే… అని, కొన్న రొండు టెల్లర్లు సా తియ్యలేదు. సెకెండుహాండువి ఎవరో మోసం జేసి ఇప్పిచ్చిండ్రు. అవి సక్కగ నడవలే.. ఎప్పుడూ పాడయ్యేవి. ‘అవ్వ ఒడికిన నూలు తాత మొల్దారానికే సరి’ అన్నట్టు… అవిటి మరమత్తులకే అవి తెచ్చిన కిరాయి సరిపొయ్యేది. ఇగ ఇసిగిపొయ్యి అవిటిను అడ్డికి పావుశేరు అమ్మేశిండు. ఒచ్చిన లక్షరూపాయలు దీస్కొని ముంబాయి పొయ్యి బట్టలు కొనుక్కొచ్చి ఇంట్లనే అమ్మి వ్యాపారం జేస్తననీ అవీ మునిగి సల్లవడ్డడు.

మొదాలొచ్చినవి ఎన్ని రూపాయలు. అవి తక్వ పైసలా! ఏంకతా!! తన పెండ్లైనంకనే గదా భూమి అమ్మింది. అత్తగారు శంషాబాద్‌. ఆడ ఐదెకరాల భూమి ఉన్నదంత అమ్మితే పదిలక్షలొచ్చినయి. చెల్లె పెండ్లిజేసి ఇంత, అయ్యరోగానికి ఇంత ఖర్చు జేస్తే చెల్లె మంచిగనే ఎళ్లిపోయిందిగాని, తండ్రికి మందులు పడలేదు కాలంజేశిండు. భూమి అద్దాల పోలీసు సారు గుంటూరాయనకు అమ్మినంక ఒక్క యాడాదిలనే ధర ఎక్కడలేనంత పెర్గిపోయింది. ఆ ఐదెకరాలను ఆనుకొని అప్పుడే ఇంకో నలభై ఎకరాలు కొన్నడు ఆ సారు. ఆ భూమిల పనికోసం పదిమందిని పిలిస్తే దాంట్లకే పొయ్యిండు భర్త. గుంటూరు సారు భూమంతటికి ఫెన్సింగు ఏపిచ్చి టాక్టర్లు తెప్పిచ్చి దున్నిపిచ్చె. ఇంకా తోటలకోసం ఇంకేదో చిన్న ఫ్యాక్టరీ పెడ్తనని షెడ్డులు ఏపిచ్చె. భూమి అమ్మినంక యాడాదిలనే అరవై లక్షలకు ఎకరమైన తీరు జూసి అమ్మిన రైతులందరూ లబ్బలబ్బ మొత్తుకున్నరు. చేతులు గాలినంక ఆకులు పట్టుకుంటె ఏమొస్తది? ఐనా ఇద్దరు ముగ్గురు భూమి అమ్మినోళ్లు పొయ్యి సారూ మాకేమన్న పైసలియ్యరాదుండ్రి. అమ్మి మేం ఆగమైనం’ అందామనుకున్నదరు.. గని, అడగలేదు. పులి దగ్గరికి మేకపిల్ల పోతాది. ఐనా ఆ భూమిల్నే …….. కూలిపని జేస్కుంటుంది పుష్పలత. ధైర్నమే జేసింది. ఒకనాడు పొద్దూకంగ ఆ గుంటూరు సారు కారొచ్చింది జూసి ఆయన కూసునే ఆఫీసులకు పొయ్యి.. “సారూ! ఏదో బాధల భూమి అమ్ముకున్నం గని అది అమ్మవలసింది గాదు. ఇప్పుడు ఇచారించి ఫాయిదలేదుగనీ, ఇంతగనం ధర పెరిగిందిగదా! రైతులు మస్తు బాధ పడ్తుండ్రు. ఆళ్లు కుదార్తెం గుండాలని ఇన్ని పైసలియ్యజూపుండ్రి!” అన్నది.

గుంటూరు పోలీసు సారు నల్ల అద్దాలు దీసిండు. పుష్పలత దిక్కు సూసుకుంటనే జేబులకెళ్లి దస్తి దీస్కొని అద్దాలు తుడ్సిండు. చిరునవ్వు చిందజేసి పక్క కున్న మేనేజరు దిక్కు జూసిండు.
పుష్పలతమ్మా! ఎట్ల తోసిందమ్మా నీగీ ఇగురమూ? ఎవరన్న జెప్పిండ్రా? మీ మొగడు పంపిండా? పిడికెడు పిడికెడు మీసాలున్న మొగోళ్లు గూడ సారు దగ్గరికొచ్చి అడజాల్లెడు. నువ్వు మంచి ధైర్యమే జేసినవ్‌. ఐతే ఒకపని జెయ్యి నీయమ్మ కడుపులకు మల్లపొయ్యి, ఇంకో బాగ పైసలున్న తల్లికి పుట్టు పో..”

నువ్వేం మాట్లాడుతున్నవయ్యా, దున్యలలేని మాట చెప్పపడ్తవి. అంత ఎచ్చిడెందుకూ? రైతులం అడుగుతం. ఎట్ల వోతరు అమ్మ కడుపులకూ? నన్ను గన్నది ఎప్పుడో కండ్లు మూసింది. నీకమ్ముందిగా జెర్రపొయ్యి సూపరాదు. సిగ్గులేదు ఏది పడ్తె అది అనెటందుకు. ఐనా నడుమ నువ్వెవరు? నీతోటిగాదు నేను సారుతోటి మాట్లాడ్తందుకొచ్చిన” అన్నది.

సారు చిరునువ్వులే ఒల్కపోస్కుంట పుష్పతను కొంటెగ జూస్కుంట.. కన్ను గొట్టిండు. పుష్పలత ఇంకో సెకెండు ఆడ నిలవడలేదు. బైటికొచ్చి ఎడమకాలు చెప్పుతీసి గుంటూరు సారుమీదికి ఇసిరింది. నోటికొచ్చింది తిట్టుకుంట ఆ సారు భూమంత దాటి బైటపడ్డది. అటెంకాళ్ల ఇక మళ్ళీ పోలేదు. ఆమె భర్త గూడ పని ఇడ్సిపెట్టిండు. తన చేతులున్న మూడు లక్షలు పట్టుకోని హయత్‌నగర్‌ ఒచ్చిండు. అటెన్క టిల్లర్లు కొన్నడు. మునిగిపోయిండు.

పుష్పలత తల్లిగారూరు చేవెళ్ల. పదో తరగతి ఎప్పుడో పాసైంది. సదువిడిసి పెట్టి కలువకొమ్య పొయ్యేది. ఇంకా సదువాలె అనుకున్నా చదివిచ్చే తాహతు తండ్రికి లేక మానుకుంది. ఐనా పుస్తకాలంటే పడిసస్తది. ఏ పుస్తకం దొరికినా చదివేసే అలవాటు. అందుట్ల జెర్రన్ని మంచి పుస్తకాలూ చదివే వుంటది. అందుకేనేమో ఏ ముచ్చటకాముచ్చట ఇట్టె చెప్పుడు అలువాటైంది. లోకం తీరు తెలుసుకుంటందుకు గా సదువు పనికొచ్చింది గావొచ్చు.

బ్యాంకు ముంగట దిక్కులు చూస్త నిలవడ్డ పుష్పలతకు ఏడున్నర కాఒస్తున్నా పెనిమిటి రాలేదు. ఏమైందో? బస్సులున్నయోలేవో.. అనుకుంటుండంగనే పెద్ద సప్పుడైంది. ఏందో పేలినట్టు.. ఇంతలనే ఏడ్పులు.. మొత్తుకోళ్లు… అంతా గడ్‌బడ్‌… తను నిలవడతానికెళ్లి ఎడమ దిక్కు చూస్తే ఒకటే లొల్లి. అందరూ అటు దిక్కు ఉర్కుతుండ్రు. హోటల్ల గానీ సిలిండర్‌ పేలిపోయిందని అనుకుంట ఎవరో పోతున్నరు. తన భర్త వొచ్చే తొవ్వ అదే అక్కడనైతే లేడు గదా! నేనేం జేతునబ్బా?? అనుకుంట పుష్పలత ఆ హోటల్‌ దిక్కు పోవట్టింది. కాలుగాలిన పిల్లిలా తొక్కులాట. గుండెల్ల బుగులు బుగులు గుంది.

“గోకుల్‌ ఛాట్‌కే పాస్‌ బాంబ్‌ పేలీ… బోత్‌ ఆద్మీ మర్‌గయే” ఎవరో ఒర్లుతుండ్రు.. ఏడ్పులు.. హాహా కారాలు.. అయ్యే గోస. జెర్రంత దూరం బోయిన పుష్పలతకు దూరంగ తెగిపడ్డ కాళ్లు చేతులు జనం నడిమికెళ్లి కనపడ్తున్నయి.. అది జూసి అట్లే బీరిపోయింది. నోట మాటొస్తలేదు. “అయ్యో ఇదేం ఘోరం…” అనుకుంట “నువ్వేడున్నవయ్యా” అంటుంది గాని మాటొస్తలేదు. పదినిమిసాలు దాటినయి. పావుగంటైంది. అంతా లొల్లి లొల్లి. పుష్పలత నిలవడ్డతాన్నే రాయిలెక్క నిలవడి ఏడుస్తుంది. ఆయిన రాలేదు. పోలీసొచ్చింది.అందర్నీ తరుముతున్నరు. బస్సులు, కార్లు, ఆటోలు, స్కూటర్లు ఏవీ అటు దిక్కు పోతలేవు, ఏవీ ఒస్తలేవు. “ఓ అమ్మా… ఎళ్లిపో ఈడ నిలవడకు” అని పోలీసొకాయన బెదిరిచ్చిండు.

ఎటు పోవాలె?! ఏం జెయ్యాలె? భర్త రాలేదు. ఒచ్చే జాడకనపడ్తలేదు. ఎటు పొవాల్నో తెలుస్తలేదు. కోఠీ ఉమెన్స్‌ కాలేజి గోడపొంటి గోడపొంటి హరిద్వార్‌ హోటల్‌ దిక్కు రావట్టింది. గోకుల్‌ ఛాట్‌ దగ్గరంతా పీన్గలు అక్కడిక్కడ వున్నయి. అక్కడొక్కరు ఇక్కడొకరు ఏడుస్తూ మూల్గుతు కనపడ్డరు. ఈన గిట్ట అందుట్ల లేడుగదా. అదే యాల్లకు అట్లకెళ్లే ఒచ్చైనా ఏమి? అంబులెన్సు ఒచ్చింది. దెబ్బలు తాకినోళ్లను, సచ్చినోళ్లను దాంట్లేసుకొని పొయ్యింది కొంతమందిని. దాంట్లె గిట్ల ఉన్నడా ఏంది?! నేనేం జేతు? ఎవర్నడుగుదు? ఆడికి పొయ్యి తొంగి సూద్దామన్నా పోలీసులు, జనం తొక్కులాట.. ఐనా అందర్నీ నూకేసుకుంట గోకుల్‌ఛాట్‌ దగ్గరి దాన్క పొయ్యింది. ఆడ ఉన్నోళ్లల్ల తన భర్త జాడలేదు. ఊపిరి పీల్చుకుంది. ఐనా భయం. ఏడ్సుకుంట ‘ఈన’ ఏడికి పోయినట్టూ’ అనుకుంట చాదర్‌ఘాట్‌ బిడ్జీ దిక్కు నడిసింది. దాన్ని దాటి మలక్‌పేట్‌కొచ్చింది. తొవ్వ పొంటంతా రకరకాల మాటలు. ఐ.ఎస్‌.ఐ. టెర్రరిస్టుల పనే ఇది. మొన్న మక్కామశీదు ఇయ్యాల గోకుల్‌ఛాట్‌.. ఇప్పుడే తెలిసింది లుంబినీ పార్కుల గూడ బాంబు పేలిందంట ఎంతోమంది జచ్చిండ్రట. ఒకరు ముప్ఫైమందంటే ఇంకొకరు యాభైమంది అంటున్నరు. నూరుమందికి దెబ్బలు తాకిన యంటన్నరు.

“ఆ టెర్రరిస్టులకు దీంతోటి ఏమొస్తది? దేనికాశపడి ఇవ్వి జేస్తున్నరు? మనుషుల్ని సంపితే ఏమన్నా ఫాయిదుందా? ఇది మనుషులు చేసే పనిగాదు. పోలీసోళ్లు ఏం పీకుతుండ్రు? గవర్నమెంటేం జేస్తుంది? ఇట్ల ఇంకెన్ని జర్గుతయో! ఇంట్లకెళ్లి వెళ్లితే మల్ల ఇంటికి ఒయ్యే భరోసలేదు. ఏం కాలమొచ్చింది నాయనా” ఎక్కడ ఇన్నా ఇవేమాటలు.

‘ఇది భయంకరమైన భరించరాని అరాచక వాదం, ఈ అరాచక వాదాన్ని కూడా పరోక్షంగా ప్రభుత్వాలే పెంచి పోషిస్తయి. ఇది పిచ్చికుక్కల వ్యవహారం. దానికి మూలం ఇప్పుడున్న దేశ పరిస్థితి. మనుషుల నడుమ తారతమ్యం.. మూఢనమ్మకం, మతం, మూర్ఖత్వం సాగుజెయ్యని భూమిలో పిచ్చి మొక్కలు మొలిసినట్టు, కలుపుతీయని మడిలో పనికి రాని మొక్కలు బలిసిపోయినట్టు ఉన్న రోజులివి. ఇట్ల జరుగొద్దంటే ప్రభుత్వాలు మంచివై వుండాలె. కోటీశ్వరులు వాళ్ల స్వార్థం కోసం జనాలను బలిజేస్తరు. ఇక్కడ చచ్చింది అంతా మామూలు ప్రజలే. ఇది ఒక్క మనిషి చేసిన పనిగాదు. దీని వెన్క శానా పెద్ద బలగముంటది. అది బైటికి రాదు. నాల్గు రోజులే ఈగడబడంతా.. ఎన్కశిరి అంతా మర్సిపోతరు. మల్లా మామూలైతది” పుష్పలత తనకు తోచింది అనుకుంటుంది. తనల తనే మల్ల మల్ల మననం జేసుకుంట.. భర్తకోసం కండ్లతోటి లెంకుటాడుకుంట… రాత్రి పదిగంటలైనంక హయత్‌నగర్‌ ఇల్లు చేరింది. ఐనా భర్త ఇంటికి రాలేదు. ఆమె భయం రొండింతలైంది. ఏమైయ్యుంటడు? ఇప్పుడేం జేద్దు? అనుకుంట పెద్దగ ఏడుస్తు కూలపడ్డది. సుట్టు పక్కలోల్లంత గుమ్మిగూడిండ్రు.

2 అభిప్రాయాలు

  1. on 09 జులై 2008 at 4:50 am 1.Rajashekar

    ఇ కద చాలా బాగు0ది నాది నల్గొ0డ

  2. on 26 ఏప్రిల్ 2009 at 3:49 am 2.kiran reddy

    మంచిగ ఉంది. న్నకు ఈలాంతి కతలు కావాలి

Trackback This Post | Subscribe to the comments through RSS Feed

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో