సభలు-సమావేశాలు సోయి | 01 సెప్టెంబర్ 2007 04:18 pm
సాహితీ చరిత్రలో ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం
సాహితీ చరిత్రలో ఆదిలాబాద్ జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని ప్రముఖ రచయిత, ప్రాచీన లిఖిత గ్రంథాల పరిశోదనాలయ సంస్థ డైరక్టర్ ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ 7న నిర్మల్‌లో మునిపంతులు రచించిన గోండిభారతం పుస్తక సంకలనాన్ని తిరుమలరావుతో బాటు ప్రముఖ సిని డైరక్టర్, మాభూమి ఫేమ్ బి.నర్సింగరావులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ జిల్లాలో కవులు, కళాకారులతో బాటు సాహిత్యన్ని రక్షించేందుకు కృషి జరగాల్సి ఉందన్నారు. ఇక్కడి కవుల వివరాలను వెలుగులోకి రాకుండా ప్రయత్నం జరిగిందని చెప్పారు. అలాగే వులకు ప్రచారంపై కాంక్షలేకపోవడం కూడా వారు వెలుగులోకి రాకపోవడానికి మరో కారణమన్నారు.
సాహిత్యం రోజు రోజుకు విస్తరిస్తున్నదని, ముఖ్యంగా ప్రజాసాహిత్యం వైపు చాలామంది మొగ్గుచూపుతున్నారని చెప్పారు. తమసంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాతపత్రులపై సర్వే నిర్వహింపజేశామని తెలిపారు. ఈ సర్వేద్వారా అన్ని ప్రాంతాల చారిత్రక వాస్తవాలు, కవితా ఖండాలు వెలుగుచూశాయని చెప్పారు. ఇందులో భాగంగానే మునిపంతులు రచించిన గోండిభారతం కూడా బయటప్రపంచానికి తెలిసివచ్చిందని వివరించారు. ఈ గోండి భారతాన్ని మునింగంటి కృష్ణమాచారి తెలుగులోకి అనువదించి సంకలనం చేశారని వివరించారు. సాహిత్య, సాంస్కృతిక రంగాలు పురోగమించినప్పుడే నాగరికత విస్తరిస్తుందని పేర్కొన్నారు. తెలుగులో ఉన్న పురాతన సాహిత్యాన్ని వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందన్నారు. సాహిత్య విలువలను మార్చి ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అట్టడుగువర్గాల ప్రజల వద్దకు సాహిత్యాన్ని తీసుకువెళ్ళినప్పుడే ఆశించిన లక్ష్యం నెరవేరుతుందన్నారు. జిల్లా గోండుప్రజల ఆచారవ్యవహరాల అద్యయనానికి వేదికను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రముఖ దర్శకుడు బి.నర్సింగరావు అభిప్రాయపడ్డారు. నిర్మల్‌లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కళ ఉందని దీనిని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రాంతంలోని కవులు, కళాకారులకు తగిన గుర్తింపు లభించే విధంగా తాను సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత సామల సదాశివ, పుస్తక సహయకుల కృష్ణమాచారి, స్థానిక కవులు డాక్టర్ అప్పాల చక్రధారి, మడిపెల్లి భద్రయ్య, డాక్టర్ దామెర రాములు,డాక్టర్ మురళీధర్, తుమ్మల దేవరావు, మునిమడుగుల రాజారావు, నేరెళ్ల హన్మంతు,పత్తి శివప్రసాద్, టి.ఎన్.జి.ఒ.అధ్యక్షుడు ఎం.సి.లింగన్న,ఎన్.బి.ఆర్.డైరక్టర్ నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు.



